ఓటీపీ స్థానంలో పిన్, పాస్‌వర్డ్, బయోమెట్రిక్ పద్ధతులు
సైబర్ నేరాల అడ్డుకట్టే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం
అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ విధానాలకు ఆమోదం
‘మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యింది.. మీ ఫోన్‌కు ఓటీపీ పంపాం.. అది చెప్పండి.. వెంటనే ఖాతాను పునరుద్ధరిస్తాం’.. ఈ మాటలు నమ్మి ఎవరైనా ఓటీపీ నంబర్ చెప్పారో అంతే.. వారి ఖాతా ఖాళీ. కొన్నేళ్లుగా బెంబేలెత్తిస్తున్న సైబర్ నేరాల తీరిది.
దాదాపు 65 శాతం సైబర్ నేరాలకు ప్రధాన కారణం అవాంఛనీయమైన వ్యక్తులకు ఓటీపీ నంబర్ చెప్పేయడమేనని తేలింది. వేగం పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా పెరుగుతున్న ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో డిజిటల్ చెల్లింపులు అమాంతంగా పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ సైబర్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. అందుకే సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్ చెల్లింపుల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఓటీపీ నంబరుకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని విధానాలను అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. – సాక్షి, అమరావతి
మూడు ప్రత్యామ్నాయ విధానాలు..
డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు ఆర్బీఐ ‘అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్‌ఏ) విధానాలను ఆమోదించింది. అంటే ఓటీపీతోపాటు ఈ అదనపు అథంటికేషన్‌ను కూడా కచ్చితంగా పరిశీలించిన అనంతరమే డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది. ఆ అదనపు అథంటికేషన్ డైనమిక్‌గా ఉంటుంది. చెల్లింపు లావాదేవీ మొదలైన తరువాత అది జనరేట్ అవుతుంది. అది కూడా ఆ ఒక్క లావాదేవీకే పరిమితమవుతుంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ కొత్త మార్గదర్శకాల్లో మూడు ప్రత్యామ్నాయ విధానాలను పొందుపరిచింది. అవి..
నాలెడ్జ్ బేస్డ్: ఖాతాదారుడు (చెల్లింపుదారుడు)కు మాత్రమే తెలిసిన సమాచారాన్ని తెలపాల్సి ఉంటుంది. ఆ ఖాతాదారుడు ముందుగా నిర్ణయించుకున్న పాస్‌వర్డ్, పాస్‌ఫ్రేజ్, పిన్ నంబర్‌లలో ఒకదాన్ని ఎంటర్‌చేస్తేనే డిజిటల్ చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.
పొసెషన్ బేస్డ్: ఖాతాదారుడు (చెల్లింపుదారుడు) తాను వ్యక్తిగతంగా కలిగి ఉన్నవాటి సమాచారాన్ని తెలపాల్సి ఉంటుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లకు టోకెన్ల వంటి తనకు మాత్రమే తెలిసిన సమాచారాన్ని ఎంటర్‌చేస్తేనే డిజిటల్ చెల్లింపు పూర్తవుతుంది.
బయోమెట్రిక్ బేస్డ్: వేలిముద్రలు, ఐరీస్, ముఖ గుర్తింపు వంటివి. అవి సరిపోలితేనే డిజిటల్ చెల్లింపు సాధ్యపడుతుంది.
వీటికి మినహాయింపులు..
తాజా మార్గదర్శకాల పేరుతో రోజువారీ సాధారణ లావాదేవీలు, తక్కువ మొత్తం చెల్లింపుల ప్రక్రియకు ప్రతిబంధకం కాకుండా ఆర్బీఐ జాగ్రత్తలు కూడా తీసుకుంది. అందుకే ఈ కొత్త విధానం నుంచి కొన్నింటికి మినహాయింపులిచ్చింది. మినహాయింపులు ఇచ్చిన డిజిటల్ చెల్లింపులు ఏమిటంటే..
» దుకాణాలు, వాణిజ్య కేంద్రాలు, ఇతర కేంద్రాల్లో రూ.5వేల లోపు చెల్లింపులు..
» బ్యాంకుల ద్వారా రికరింగ్ చెల్లింపుల (నియమిత కాలంలో ఆటోమెటిగ్గా బ్యాంకు ఖాతాల నుంచి చెల్లింపులు) కోసం ముందుగానే ఆమోదించి బ్యాంకుకు తెలిపిన లావాదేవీలు..
» రూ.లక్షలోపు మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులు..
» బీమా ప్రీమియంల చెల్లింపులు..
» క్రెడిట్ కార్డు చెల్లింపులు..
» రూ.15వేల వరకు ఇ–మ్యాండేట్ చెల్లింపులు..
» టోల్‌గేట్ల వద్ద చెల్లింపులు.
Comments
Please login to add a commentAdd a comment