
సాక్షి,హైదరాబాద్: రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదరుదెబ్బ తగిలింది. డిపాజిట్ల సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) యాక్ట్ తమకు వర్తించదని మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ ప్రస్తతం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. అయితే..
తమపై అక్రమ డిపాజిట్ల సేకరణ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్‌కు ఆర్బీఐ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిపాజిట్లు సేకరించడంపై విచారణ కొనసాగించాల్సిందేనని అఫిడవిట్‌లో ఆర్బీఐ స్పష్టం చేసింది.
మార్గదర్శికి ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్-45 వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంకు తన కౌంటర్‌లో హైకోర్టుకు తెలిపింది. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించడం చట్టవ్యతిరేకమని ఆర్బీఐ కుండబద్దలు కొట్టింది. మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆర్బీఐ కోరింది.

అక్రమంగా డిపాజిట్లు సేకరణ విషయంలో నేరం రుజువైతే మార్గదర్శి డైరెక్టర్లకు 2 నుంచి 5 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అక్రమ డిపాజిట్ల సేకరణకు సంబంధించి మార్గదర్శిపై 2008లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ఆర్బీఐ యాక్ట్‌కు విరుద్ధంగా మార్గదర్శి వేల మంది నుంచి సంవత్సరాల తరబడి అక్రమ డిపాజిట్లు సేకరిస్తోందని, దానిపై చర్యలు తీసుకోవాలనేది ఉండవల్లి కేసు సారాంశం.