ఐఐటీల్లో సీట్లు పెరుగుతున్నాయ్‌! | Proposals to the Center for increasing seats in new courses in IITs | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో సీట్లు పెరుగుతున్నాయ్‌!

Published Fri, Apr 25 2025 3:33 AM | Last Updated on Fri, Apr 25 2025 3:33 AM

Proposals to the Center for increasing seats in new courses in IITs

ఐఐటీల్లో 500, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో 900 సీట్లు పెరిగే చాన్స్‌

కొత్త కోర్సుల్లో సీట్ల పెంపునకు కేంద్రానికి ప్రతిపాదనలు 

కేంద్రం సూత్రప్రాయ ఆమోదం 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలుగా పేరున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఈసారి సీట్లు పెరగబోతున్నాయి. వీటితోపాటు జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీ (ఎన్‌ఐటీ)ల్లో కూడా సీట్లు పెరిగే అవకాశం కన్పిస్తోంది. సీట్ల పెంపుపై ఇప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. డిమాండ్, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సీట్ల పెంపు అనివార్యమని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ శరవేగంగా విస్తరిస్తోందని, ఈ పోటీని తట్టుకోవాలంటే కొన్ని కొత్త కోర్సుల అవసరం ఉందన్నాయి. 

ఇప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలు అవసరమైన మౌలిక వసతుల దిశగా అడుగులేస్తున్నాయి. కాబట్టి అదనపు సీట్లు అవసరమని కేంద్రాన్ని కోరాయి. ఐఐటీల్లో గరిష్టంగా 500 వరకూ సీట్లు పెంచే ఆలోచన ఉన్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ఇంకో 900 సీట్లు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. సూత్రప్రాయంగా కేంద్రం ఆమోదం తెలిపిందని, దీనిపై అధికారిక అనుమతి రావాల్సి ఉందని ఓ సీనియర్‌ ఐఐటీ అధికారి తెలిపారు.

జోసా కౌన్సెలింగ్‌ నాటికి..
మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 2.50 లక్షల మందిని ఎంపిక చేశారు. ఇది పూర్తయి, ఫలితాలు వెల్లడించిన వెంటనే జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ మొదలుపెడుతుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో (కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థ) సీట్లను భర్తీ చేస్తారు. ఇది మొదలయ్యే నాటికి కొత్త సీట్లపై స్పష్టత వచ్చే వీలుంది. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ప్రస్తుతం 17,740 బీటెక్‌ సీట్లున్నాయి. 

గత ఏడాది కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో 355 సీట్లు పెరిగాయి. ఐఐటీ తిరుపతిలో 244 సీట్లుంటే, మరో పది పెంచారు. వరంగల్‌ ఎన్‌ఐటీలో 989గా ఉన్న సీట్లను 1049కు పెంచారు. కొత్తగా 60 సీట్లతో సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ డేటా సైన్స్‌) కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 40 నుంచి 110 సీట్లకు పెంచారు. ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ సీఎస్‌ఈలో సీట్లు పెంచారు. 

ఇక్కడే గత ఏడాది అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌) బ్రాంచీని 60 సీట్లతో కొత్తగా ప్రవేశపెట్టారు. ఇందులో ఈసారి మరికొన్ని సీట్లు పెరిగే వీలుంది. ఐఐటీ–గాంధీనగర్, ఐఐటీ–బాంబే, ధార్వాడ్, భిలాయ్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, గువాహటిలో సీట్ల పెంపు ప్రతిపాదనలు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement