IITs
-
ఐఐటీలు, ఎన్ఐటీల్లో మరో 15,000 సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీల్లో 5 వేలు, ఎన్ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు (IITs) యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్ (ఆర్టిటఫిషియల్ ఇంటెలిజెన్స్/మిషన్ లెర్టినంగ్), డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి. సీటు అక్కడే కావాలి... జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి (IIT Bombay) మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ (IIT Hyderabad) నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. ఎన్ఐటీల్లో... ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎ¯న్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్‌కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది. తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్‌ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. చదవండి: ఊరంతా ఉద్యోగులే.. ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి..ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
ఐఐటీ ప్లేస్మెంట్లలో క్షీణత
సాక్షి, అమరావతి: దేశంలో ఇంజనీరింగ్ విద్యకు అత్యుత్తమ విద్యా సంస్థలుగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల క్యాంపస్ ప్లేస్మెంట్లలో క్షీణత కనిపిస్తోంది. సాంకేతిక రంగంలో మారుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, జాబ్ మార్కెట్లో పోటీ పడుతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దేశంలోని తొలి తరం ఐఐటీల్లో 2018–19 నుంచి 2023–24 వరకు ప్లేస్మెంట్ డేటాను విశ్లేషిస్తే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో ఉద్యోగ ఆఫర్లు పొందుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ ఐఐటీల్లో ఏకంగా 5 నుంచి 16 శాతం ప్లేస్మెంట్లు తగ్గాయి. ఐఐటీ ఢిల్లీ ఒక్కటే ప్లేస్మెంట్ల కల్పనలో నిలకడగా ఉంది. ఐఐటీల్లో చదువుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలను పొందుతున్నారు. కేవలం 1.6 శాతం మంది మాత్రమే స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు. దాదాపు 10 శాతం మంది ఉన్నత చదువుల కోసం, 5 శాతం మంది సివిల్ సర్వీసుల వైపు వెళుతున్నట్లు ఐఐటీ గౌహతి నిపుణులు వెల్లడించారు. ప్యాకేజీల్లోనూ తగ్గుదల... ఐఐటీ క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు పొందినవారికి ఇచ్చే ప్యాకేజీల్లో తగ్గుదల కూడా విద్యార్థులను కలవరపెడుతోంది. ఐఐటీ కాన్పూర్‌లో సగటు వార్షిక జీతం 2020–21లో రూ.22.10 లక్షల నుంచి 2022–23లో రూ.25.90 లక్షలకి పెరిగింది. అయితే 2023–24లో రూ.23.70 లక్షలకు తగ్గింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2020–21లో వార్షిక సగటు వేతనం రూ.14 లక్షల నుంచి 2022–23లో రూ.18 లక్షలకు పెరిగింది. అయితే, 2023–24లో మళ్లీ రూ.17 లక్షలకు తగ్గింది. అదే ఐఐటీ బాంబేలో 2021–22లో రూ.21.50 లక్షలు నుంచి 2022–23లో రూ. 21.82 లక్షలకు పెరిగింది. -
మూడు ఐఐటీలతో హ్యుందాయ్ ఒప్పందం.. భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుదీకరణ రంగాలలో సహకార పరిశోధనా వ్యవస్థను నెలకొల్పేందుకు మూడు ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండై మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం ఐదేళ్లలో 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ వీటిలో ఉన్నాయి.సహకారంలో భాగంగా హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఐఐటీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని, హ్యుండై మోటార్ గ్రూప్ నుండి స్పాన్సర్‌షిప్‌ల ద్వారా నిర్వహిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాటరీలు, విద్యుదీకరణలో పురోగతిని నడిపించడం హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాథమిక లక్ష్యం. ప్రధానంగా భారతీయ మార్కెట్ యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ సెంటర్ భారత విద్యా వ్యవస్థ నుండి ప్రతిభావంతులైన వ్యక్తులతో బలమైన నెట్‌వర్క్‌ను పెంపొందించగలదని నమ్ముతున్నామని, ఆవిష్కరణలు, భవిష్యత్తు వృద్ధిని ప్రోత్సహిస్తుందని హ్యుండై మోటార్ గ్రూప్ రిసర్చ్, డెవలప్మెంట్, ప్లానింగ్, కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ నక్సప్ సంగ్ వివరించారు. హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకడమిక్–పారిశ్రామిక సహకార ప్రాజెక్టులపై సంయుక్త పరిశోధనలను నిర్వహించడమే కాకుండా.. కొరియా, భారత్‌కు చెందిన బ్యాటరీ, విద్యుద్దీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ వనరుల మార్పిడిని సులభతరం చేస్తుందని సంస్థ తెలిపింది. -
మెయిన్‌లోనూ మనోళ్లు టాప్ గేర్‌లో
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో ఈ ఏడాది కూడా తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి 11 జాతీయ ర్యాంకుల్లో మూడింటిని తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన హందేకర్ విదిత్ ఐదో ర్యాంకు, ముత్తవరపు అనూప్ 6వ ర్యాంకు, వెంకట సాయితేజ మాదినేని 7వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, దేశంలో 56 మందికి వందశాతం పర్సంటైల్ వస్తే, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. అందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించగా, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మంది ఆ జాబితాలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో మూడో స్థానంలో తెలంగాణజేఈఈ మెయిన్‌లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఈ ఏడాది ఎక్కువ మంది జేఈఈ మెయిన్ రాయడంతో అన్ని కేటగిరీల్లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ పెరిగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో మే 10 వరకు గడువు ఉంది. మే 17 నుంచి 26 మధ్య అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీ చేస్తారు. వంద పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులుతెలంగాణ: హందేకర్ విదిత్(5), ముత్తవరపు అనూప్(6), వెంకట సాయితేజ మాదినేని(7), రెడ్డి అనిల్(9), రోహన్ సాయిబాబా(12), శ్రీయాశస్ మోహన్ కల్లూరి(13), కేసం చెన్నబసవరెడ్డి(14), మురికినాటి సాయి దివ్య తేజరెడ్డి(15), రిషి శేఖర్ శుక్లా(19), తవ్వ దినేశ్ రెడ్డి(24), గంగ శ్రేయాస్(35), పొలిశెట్టి రితిష్ బాలాజీ(39), తమటం జయదేవ్ రెడ్డి(43), మావూరు జస్విత్(49), దొరిసాల శ్రీనివాసరెడ్డి (52). ఆంధ్రప్రదేశ్: చింటు సతీష్ కుమార్ (8), షేక్ సూరజ్ (17), మాకినేని జిష్ణు సాయి(18), తోటంశెట్టి నిఖిలేష్(20), అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి(21), తోట సాయికార్తీక్ (23), మురసాని సాయి యశ్వంత్ రెడ్డి(36). ♦ ఈడబ్యూఎస్ విభాగంలో తొలి 6 స్థానాల్లో ఇద్దరు ఆంధ్రా, నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేసం చెన్నబసవరెడ్డి మొదటిస్థానంలో నిలవగా, తోటంశెట్టి నిఖిలేష్ మూడో స్థానంలో నిలిచాడు.♦ తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో మరువూరి జస్వంత్ వందశాతం, ఎస్టీ కోటాలో జగన్నాధం మోహిత్ 99 శాతం పర్సంటైల్ సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో చుంకిచర్ల శ్రీచరణ్ జాతీయ ర్యాంకర్‌గా నిలిచారు. ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: హందేకర్ విదిత్జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, తల్లి ప్రభుత్వ టీచర్. వారి చేయూతతోనే నేను ముందుకెళ్లాను. నాకు ఐఐటీ–బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని ఉంది. ఆ తర్వాత స్టార్టప్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్‌తోనే ఈ ర్యాంకు సాధించాను. -
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్‌కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్‌లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్‌్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
ఐఐటీల్లో ఆధునిక బోధన
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో బోధన విధానంలో మరిన్ని మార్పులను కేంద్రం సూచిస్తోంది. కోవిడ్ వ్యాప్తి తర్వాత ఐఐటీల వైపు చూసే విద్యార్థుల చదువుల పరిస్థితిపై గతేడాది కేంద్ర విద్యాశాఖ అంతర్గత అధ్యయనం చేసింది. రెండేళ్లుగా విద్యార్థులు అడ్వాన్స్డ్ అంటేనే భయపడుతున్నారని ఈ సర్వేలో తేలింది. మెయిన్స్ వరకే విద్యార్థులు పరిమితం కావడం వెనుక బలమైన కారణాలున్నాయని కేంద్రం గుర్తించింది. కోవిడ్ కాలంలో రెండేళ్లపాటు జరిగిన విద్యానష్టం వల్ల విద్యార్థుల్లో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అర్హత సాధించడం కష్టమనే భావన వచ్చిందని పరిశీలనలో తేలింది. అన్ని రాష్ట్రాల్లోనూ రెండేళ్లు 70 శాతమే సిలబస్ అమలు చేయడంతో కొన్ని చాప్టర్స్ విద్యార్థులకు అర్థంకాలేదని.. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఉన్న సిలబస్‌లో ఈ చాప్టర్లపట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నారని తేలింది. ఐఐటీల్లో సీట్లు పొందిన మొదటి సంవత్సరం చదవాలనే జిజ్ఞాస విద్యార్థుల్లో ఉండటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్ స్థాయి నుంచి నష్టపోయిన చాప్టర్స్‌ను ఆధునిక పద్ధతిలో వారికి బోధించే ఓ ప్రక్రియ ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కొత్త సిలబస్‌ను ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. అమ్మో ఐఐటీ... కోవిడ్ కాలంలో రాష్ట్రాలు సిలబస్ తగ్గించినా... జేఈఈ పరీక్షల్లో మాత్రం అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. జేఈఈ మెయిన్స్ వరకూ చాయిస్ వల్ల విద్యార్థులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. కానీ అడ్వాన్స్‌డ్‌కు వచ్చే సరికి కష్టంగా భావిస్తున్నారు. ఈ కారణంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినా.. పరీక్ష రాసే వారి సంఖ్య తగ్గుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వరకూ జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. వారిలో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తున్నారు. ఇలా అర్హత పొందే 2.50 లక్షల మందిలో పరీక్ష రాస్తున్న వారు మాత్రం 60 శాతం మించి ఉండటం లేదు. ఇలా రాసేవాళ్లలోనూ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులయ్యే వారు 30 శాతం కూడా ఉండటం లేదు. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి దారుణంగా ఉంటోంది. అర్హత సాధించాం కాబట్టి అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. 2022 జేఈఈ ఫలితాలను పరిశీలిస్తే అడ్వాన్స్డ్ ఉత్తీర్ణత 26.17 శాతంగానే నమోదైంది. 2021లో ఇది 29.54 శాతంగా ఉంది. 2022లో అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హత సాధిస్తే పరీక్ష రాసింది మాత్రం 1,55,538 మంది మాత్రమే కావడం గమనార్హం. వారిలో ఉత్తీర్ణులైంది 40,712 మంది. 2023లో 1.46 లక్షల మంది పరీక్ష రాస్తే 24.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కోవిడ్ వేళ అర్థంకాని ఆన్లైన్ కోచింగ్... 2019 నుంచి 2021 వరకూ కోచింగ్ తీసుకొనేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్ కోచింగ్ పెరిగింది. కానీ గ్రామీణ, ఒక మాదిరి పట్టణ కేంద్రాల్లో చదువుకున్న విద్యార్థులు స్థానికేతరులు చెప్పే ఆన్లైన్ కోచింగ్‌ను అర్థం చేసుకోలేకపోయారు. 2022లో కోచింగ్ కేంద్రాలు తిరిగి తెరుచుకున్నా, నాణ్యతలేని ఫ్యాకల్టీ చాలా చోట్ల ఉందనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు రెండేళ్లుగా చదువులో వెనుకబడటం కూడా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో శ్రద్ధ తగ్గడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే ఎస్సీ అభ్యర్థులు 31.67 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, ఎస్టీ అభ్యర్థులు 26.83 శాతం, ఓబీసీ అభ్యర్థులు 16.44 శాతం అర్హత పొందారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జేఈఈతోపాటు ఐఐటీల విద్యావిధానంలోనూ మార్పులు అనివార్యమని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. -
WeareHiring రూటు మార్చిన ఆటోమేకర్స్: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ సిబ్బందిని రిక్రూట్ చేసుకునే క్రమంలో ఆటోమొబైల్ కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. దీంతో గౌహతి, మండీ లాంటి ప్రాంతాల్లోని ఐఐటీల్లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఈసారి గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్ కార్ల మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులను మరింతగా నియమించు కోవడంపై దృష్టి సారిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్, ఎల్రక్టానిక్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో హైరింగ్‌ను పెంచుకుంటున్నట్లు వివరించాయి. అనలిటిక్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇండస్ట్రీ 5.0 నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. 2024 బ్యాచ్ నుంచి మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ట్రైనీలను తీసుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 15-20శాతం ఎక్కువమందిని తీసుకోబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్న వారికి కొత్త టెక్నాలజీలు, ప్లాట్‌ఫాంలపై తగు శిక్షణ ఇచ్చి భవిష్యత్ అవసరాల కోసం సిద్ధం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే డేటా అనలిటిక్స్ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించింది. డేటా మైనింగ్ తదితర సాంకేతికతలతో ఈ–కామర్స్ చానల్స్‌ను అభివృద్ధి చేసేందుకు, బ్యాక్–ఎండ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు వీరిని వినియోగించుకోవాలనేది కంపెఈ యోచన. మారుతీ కూడా.. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాల ఊతంతో భవిష్యత్ అవసరాల కోసం నియామకాలను మరింతగా పెంచుకునేందుకు మారుతీ సుజుకీ కూడా సన్నద్ధమవుతోంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా క్యాంపస్ నుంచి నియామకాలను కూడా పెంచుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది క్యాంపస్‌ల నుంచి 1,000 మంది వరకూ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. సంస్థలో అంతర్గతంగా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం, డిజిటల్ పరివర్తన మొదలైన వాటిని వేగంగా అమలు చేస్తున్నామని, ఇందుకోసం తత్సంబంధ నైపుణ్యాలున్న ప్రతిభావంతుల అవసరం చాలా ఉంటోందని వివరించాయి. (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇటీవలే తమ క్యాంపస్ హైరింగ్‌ల జాబితాలో మరిన్ని కొత్త ఐఐటీలు, ఎంబీయే సంస్థలను కూడా చేర్చింది. 2022లో దాదాపు 50 పైగా ఇంజినీరింగ్, ఎంబీఏ సంస్థల నుంచి మహీంద్రా ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకుంది. సగటున 500-600 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అటు హీరో మోటోకార్ప్ సంస్థ డిప్లొమా ఇంజినీర్ల నియామకం కోసం ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ యూనివర్సిటీతో జట్టు కట్టింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే తాము 40 శాతం ఎక్కువ మందిని క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. వీరిలో ఎక్కువగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, ఎంబీఏలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ భారత్‌లో తన కార్యకలాపాల కోసం వివిధ విభాగాల్లో, హోదాల్లో 1,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసే యత్నాల్లో ఉంది. క్యాంపస్‌ల విషయానికొస్తే.. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభించనుంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) క్యాంపస్‌లలోనూ ఆసక్తి.. ఆటోమొబైల్ కంపెనీల నియామకాల ప్రణాళికలపై క్యాంపస్‌లలో కూడా ఆసక్తి నెలకొంది. ఐఐటీ–గౌహతిలో గతేడాదితో పోలిస్తే ఈసారి కోర్ ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారికి ఆఫర్లు గణనీయంగా పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోర్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితరుల కోసం డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి తమ దగ్గర నుంచి రిక్రూట్ చేసుకునే ఆటోమొబైల్ కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఐఐటీ-మండీ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌పరమైన మందగమనం ప్రభావం తగ్గడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు వివరించాయి. -
ఐఐటీల్లో ఆత్మహత్యలు ఎందుకు?
పనిచేసే కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు వంటి సామూహిక సంస్థల్లో ప్రజల్లో ఉన్న సామాజిక వైవిధ్యం కనిపించాలంటారు పారిశ్రామిక దేశాల మేధావులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిదులు. ప్రజాప్రతినిధులు. సమాజంలోని అన్ని వర్గాలు, జాతులు, మతాలు, రంగుల మనుషులు ఉంటే మంచిదని చెబుతారు. విద్యనభ్యసించే స్కూళ్లు, కాలేజీల్లో అన్ని సామాజికవర్గాల విద్యార్థులు ఉంటే ఈ పిల్లల జ్ఞానం, వివేకం ఎక్కువ ఉంటాయని కూడా వారి అనుభవంలో తేలింది. అలాగే ఆఫీసులు, కర్మాగారాల్లో కూడా అన్ని జాతులు, వర్గాల ఉద్యోగులు ఉంటే వారి పనితీరు లేదా ఉత్పాదకత కాస్త ఎక్కువ ఉంటుందని అమెరికా, ఐరోపా దేశాల్లో రుజువైంది. అందుకే ‘అఫర్మేటివ్ యాక్షన్’, ‘పాజిటివ్ డిస్క్రిమినేషన్’ పేరిట పాశ్చాత్య దేశాల్లో (ఇండియాలో వివిధ స్థాయిల్లో కోటా లేదా రిజర్వేషన్ పేరుతో అమలు చేసే సామాజిక న్యాయ కార్యక్రమాల మాదిరిగా) అనేక పథకాలను ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాయి. ముఖ్యంగా ప్రభుత్వం నడిపే లేదా సర్కారీ నిధుల సాయంతో నడిచే విద్యాసంస్థల్లో బడుగు వర్గాల విద్యార్థులకు కొంత శాతం సీట్లు కేటాయించి, వారికి ప్రవేశం కల్పిస్తున్నారు. రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఓబీసీలకు కాస్త ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో 1990ల నుంచీ అమలవుతున్నాయి ఈ కోటాలు. (చదవండి: అసలు ఐఐటీలో ఏముంటుంది? ఎందుకు చేర్పించాలి? ఏం నేర్చుకుంటారు?) ఐఐటీలు, ఐఐఎంల సంఖ్యను గత పాతికేళ్లలో పెంచిన కేంద్ర ప్రభుత్వం అక్కడ అదివరకే ఎస్సీలు, ఎస్టీలకు ఉన్న కోటాలకు తోడుగా కొత్తగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. కోటాలు ఉన్న సామాజిక వర్గాలకు సైతం తీవ్ర ఒత్తిడికి లోను చేసే పోటీ పరీక్షల ద్వారా ర్యాంకులు సంపాదిస్తేనే ఈ అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు దొరుకుతాయి. ఈ క్రమంలో జేఈఈ, క్యాట్ వంటి తీవ్ర పోటీ ఉన్న ప్రవేశ పరీక్షలు రాసి కోటా ద్వారా ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించగానే సరిపోదు. అధ్యాపకవర్గంలో కూడా అన్నివర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆయా సంస్థల పాలకవర్గాల్లో బడుగువర్గాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల గత పది పదిహేనేళ్లుగా అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. డ్రాపవుట్లు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి! కోటాల ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బడుగువర్గాల విద్యార్థులు తమకు చదువు, పోటీతత్వానికి సంబంధించిన తగినంత కుటుంబ నేపథ్యం లేకపోవడం వల్ల అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలో చేరిన కొన్నేళ్లకే చదువులకు మధ్యలోనే స్వస్తి చెబుతూ ‘డ్రాపవుట్లు’గా మారుతున్నారు. 2018–2023 మధ్య ఇలా ఈ ఉన్నత విద్యాసంస్థల నుంచి కోర్సు మధ్యలోనే నిష్క్రమించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 19,000 దాటిపోయారని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ రాజ్యసభలో ఇటీవల సమాచారం అందించారు. అలాగే, 2014–2021 మధ్య అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లలో చదువుతున్న విద్యార్థుల్లో 122 మంది మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని పార్లమెంటుకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాము చేరిన విద్యాసంస్థల్లో రకరకాల ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న ఈ విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందినవారు కావడం విషాదకర వాస్తవం. కోటాల ద్వారా ప్రవేశం పొందిన బలహీనవర్గాల విద్యార్థులను ఆయా విద్యాసంస్థల్లో అన్ని విధాలుగా ఆదుకుంటూ, ఆసరగా ఉండే వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పార్లమెంటు ఉభయసభల సభ్యుల దృష్టికి వచ్చాక ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే మనసు పెట్టి పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. (చదవండి: ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు.. ఐఐటీ చెన్నైలో ఏం జరుగుతోంది?) -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ -
ఐఐటీల్లో స్టార్టప్స్‌పైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బోధనావిధానం వినూత్న ఆలోచనలకు పదును పెట్టేవిధంగా మారుతోంది. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేవిధంగా, విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు ఆలంబనగా ఉంటోంది.కోర్సు ప్రారంభం నుంచే భిన్నమైన ఆలోచనాధోరణికి పదును పెటాల్సిన అవసరం ఉందని సరికొత్త బోధనావిధానంలో కేంద్రం పొందుపర్చింది. ఐఐటీ విద్యావిధానంపై నాలుగేళ్ల క్రితమే కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే ఐఐటీలు మార్పులు చేస్తున్నాయి. ఐఐటీ విద్యార్థులకు మంచివేతనంతో ఉద్యోగం రావడం పెద్ద విషయమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు భిన్నంగా వాళ్లే సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నా రు. కోవిడ్‌కు ముందువరకూ ఈ తరహా ప్రయోగాలపై దృష్టి పెట్టారు. హార్డ్‌వేర్‌లోనూ విద్యార్థులు గణనీయమైన స్టార్టప్స్ తయారు చేశారు. ఆన్లైన్ తోడుగా... వినియోగదారుల అభిరుచి, మార్కెట్ పురోగతి వాస్తవ పరిస్థితి, కొత్తగా అన్పించే వస్తువుల రూపకల్పన ఇవన్నీ ఆన్లైన్ ద్వారా తేలికగా తెలుసుకునే చాన్స్ కన్పిస్తోందని హైదరా బాద్ ఐఐటీ విద్యార్థి శశాంక్ తెలిపారు. ఈ–కామర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉన్న సాఫ్ట్‌వేర్‌ను వాడుకుంటూ కొత్తవి కనుక్కోవడంపై ఐఐటీల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమ ర్ పద్ధతిలో స్టార్టప్స్ నెలకొల్పేందుకు ఐఐటీ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. హైదరాబాద్ ఐఐటీలో ఇదీ పురోగతి హైదరాబాద్ ఐఐటీలో 2017, 18లో కేవలం ఏడు మాత్రమే ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ నమోదయ్యాయి. 2019లో ఇవి 8కి చేరితే, 2020లో 38 నమోదయ్యాయి. 2021లో 23 ఉంటే, 2022లో 18 నమోదయ్యాయి. కోవిడ్ ప్రభావమే స్టార్టప్స్ తగ్గడానికి కారణమని హైదరాబాద్ ఐఐటీలో చదివిన నివేశ్ తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఐఐటీ హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ సంబంధిత స్టార్టప్స్ 43, సాఫ్ట్వేర్ 34, హైబ్రిడ్ 24 తయారయ్యాయి. పదును పెట్టాల్సిందే ఐఐటీ విద్యార్థుల ఆలోచనాశక్తిని పరిశోధనల వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ల నుంచి సరికొత్త విప్లవాన్ని సృష్టించే అవకాశాలున్నాయి. సృజనాత్మకతకు పదును పెడితే, భారత్ మంచి ఉత్పాదక శక్తిగా ఎదుగుతుంది. – వైఎన్ సింఘాల్, ఐఐటీ నిపుణులు, ముంబై ఐఐటీ పలు వర్సిటీల్లో నమోదైన స్టార్టప్స్ ►ముంబై ఐఐటీ విద్యార్థులు 2020లో 4కే కెమెరాతో సరికొత్త డ్రోన్ రూపొందించారు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్పష్టమైన చిత్రాలను ఫొటోటైప్ సాంకేతికతతో అందించేలా తయారు చేశారు. భౌగోళిక, వ్యవసాయపరమైన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని మరింత ఆధునీకరిస్తే రక్షణ విభాగంలోనూ ఉపయోగించే వీలుంది. వాస్తవానికి భారత్ ఇప్పటి వరకూ చైనా డ్రోన్స్పైనే ఆధారపడింది. భద్రత కారణాల రీత్యా వీటిని నిషేధించారు. ఐఐటీ విద్యార్థుల టెక్నాలజీని వీటికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ►పంటపొలాల్లో కలుపుమొక్కల నివారణకు ప్రస్తుతం కొన్ని రసాయనాలు వాడుతున్నారు. వీటి అవశేషాలు అత్యంత ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఒకరు మోనోవీల్తో నడిచే కలుపుమొక్కల నివారణ యంత్రాన్ని సృష్టించాడు. అయితే, ఇది కలుపుమొక్కల్నే కాకుండా పంటకు కూడా నష్టం చేస్తోందని గుర్తించారు. కొన్ని మార్పులు చేస్తే మిర్చి, పత్తి పంటల్లో విజయవంతంగా కలుపు నివారణ చేపట్టడానికి వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దిశగా మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. ►వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డేటాను క్షణాల్లో ప్రాసెస్ చేసి, సమగ్ర సమాచారం ఇవ్వగల ఓ సాప్ట్‌వేర్‌పై ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి పరిశోధన చేసి పురోగతి సాధించాడు. కోవిడ్ సమయంలో ఈ పరిశోధన ముందుకు వెళ్లలేదు. వ్యాధి నిర్ధారణలో ప్రాథమిక సమాచారంతోపాటు అవసరమైన వైద్యవిధానం ఏ దేశంలో ఎలా ఉందనేది తెలియజేయడమే ఈ స్టార్టప్ విధానం. -
ఊహించనివిధంగా సీఎస్సీ కటాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సులో చేరడానికి ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నారు. తాజాగా ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో జోసా నిర్వహించిన ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టమైంది. ప్రధాన ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల కటాఫ్ ర్యాంకులు ఊహించని విధంగా ఉన్నాయి. బాలికలకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించడంతో వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఓపెన్ కేటగిరీలో కొన్ని సంస్థల్లో వందలోపు ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కలేదు. ముంబై, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలలో పోటీ ఈసారి తీవ్రంగా ఉంది. పాలక్కడ్, భిలాయ్ ఐఐటీల్లో 5 వేల పైన ర్యాంకు వచ్చిన వారికీ సీటు దక్కడం విద్యార్థులకు కాస్తా ఊరటనిచ్చింది. ఎన్ఐటీల్లోనూ అదే జోరు.. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో (ఎన్ఐటీలు) ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకే డిమాండ్ కొనసాగింది. ఇతర బ్రాంచీలకన్నా సీఎస్సీ కోర్సులకు విద్యార్థులు 10 రెట్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. అందులోనూ ఎన్ఐటీలను మొదటి ఐచ్చికంగా ఎంచుకున్నారు. దీంతో వరంగల్ నిట్‌లో ఓపెన్ కేటగిరీలో బాలురకు 2 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు దక్కాయి. తిరుచనాపల్లిలో వెయ్యిలోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఏపీ, కాలికట్, జలంధర్, సిక్కిం, హమీర్పూర్ ఎన్ఐటీల్లో 10 వేల పైబడ్డ ర్యాంకుల వరకు సీట్లు లభించాయి. బాలికలకు కొంత మెరుగు తాజాగా ఐఐటీ, ఎన్ఐటీలలో కటాఫ్ తీరును పరిశీలిస్తే బాలురకన్నా, బాలికల పరిస్థితి కాస్తా మెరుగ్గా కనిపించింది. ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తర్వాత ముంబై ఐఐటీలో బాలికలకు 305 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరుపతిలో 5,901 వరకూ, భిలాయ్‌లో 7,176 వరకూ సీటు వచ్చింది. ఎన్ఐటీల విషయానికి వస్తే హమీర్పూర్ ఎన్ఐటీలో 18 వేల వరకూ కటాఫ్ ఉంటే, తిరుచనాపల్లిలో 1,852 బాలికల కటాఫ్‌గా ఉంది. దీంతో ఓపెన్ కేటగిరీలో బాలికలు సాధారణ పోటీతో సీట్లు దక్కించుకోవడం సాధ్యమైందని విశ్లేషకులు అంటున్నారు. కోవిడ్ తర్వాత జరిగిన జేఈఈ మెయిన్స్ పేపర్లు కఠినంగానే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ర్యాంకుల సాధనలోనూ ఈసారి పోటీ వాతావరణం కనిపించింది. -
ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐ టీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఆరు దశల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు చేపట్టింది. విద్యార్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా ఏ సంస్థలో, ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చిందనేది తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఐఐటీల్లో దాదాపు సీట్ల కేటాయింపు పూర్తయినప్పటికీ, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టి, మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసే వీలుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌కు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8 లక్షల మందికిపైగా పరీక్ష రాశారు. ఇందులో ఐఐటీ సీటు కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హులైనప్పటికీ పరీక్ష రాసింది మాత్రం కేవలం1.60 లక్షల మందే ఉన్నారు. వీరిలో 42 వేల మంది అర్హులుగా ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీ, ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్లు కేటాయించారు. ఆ సంస్థల్లో 54,477 ఇంజనీరింగ్ సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్ఐటీల్లో 54477 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీరిలో 2,971 సీట్లు మహిళలకు సూపర్ న్యూమరరీ పోస్టులుగా కేటాయించారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి 16,598 సీట్ల లభ్యత ఉంది. ఇందులో మహిళ లకు 1,567 సీట్లున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐఐటీల్లో మొత్తంగా 500 సీట్ల వరకూ పెరిగాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈ పెంపు అనివార్యమైంది. ఎన్ఐటీలో 23, 994 సీట్లు ఉంటే, ఇందులో మహిళలకు 749 సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 7,126 ఇంజనీరింగ్ సీట్లు (మహిళలకు 625), జీఎఫ్ఐ టీల్లో 6,759 (మహిళలకు 30) సీట్లున్నాయి. -
నవంబర్ నుంచే.. ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కాలపట్టికను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 25 నుంచే 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వలేదు. మొదటి దశ సీట్ల భర్తీ జరిగినా రెండో దశను గత నెల 27న పూర్తి చేయాలని తొలుత భావించారు. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలో ఎఫ్ఆర్సీ ఎటూ తేల్చకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 11 నుంచి మొదలు పెట్టారు. ఈ నెల 16వ తేదీన సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ దశలో కూడా మిగిలిపోయిన సీట్లకు నెలాఖరులోగా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ఈ నెల 25లోగా పూర్తి చేసి. ఆ తర్వాత కాలేజీల్లో ఐదు రోజుల పాటు పరిచయ కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్ 1 నుంచి బోధన చేపట్టాలని భావిçÜ్తున్నారు. జాతీయ స్థాయిలోనూ... ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో కూడా ఈ నెల 16తో సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తవుతుంది. దీంతో జాతీయ స్థాయిలో కూడా నవంబర్ మొదటి వారంలోనే క్లాసులు మొదలయ్యే వీలుంది. జోసా కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ముగించాలని ఉన్నత విద్య మండలి రెండేళ్ళుగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. జేఈఈ ర్యాంకు ద్వారా జాతీయ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈలోగానే సీట్ల భర్తీ ముగిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాస్త ఆలస్యంగానే ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇతర కోర్సులూ నవంబర్లోనే ఎంటెక్, ఎంబీఏ, బీఈడీ, న్యాయవాద కోర్సుల్లో కామన్ పరీక్ష ఫలితాలు ఇప్పటికే వెల్లడించారు. ఎంటెక్, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది మరో పది రోజుల్లో ముగిసే వీలుంది. బీఈడీ సీట్ల భర్తీ కూడా త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాసెట్ ముగిసినప్పటికీ నేషనల్ బార్ కౌన్సిల్ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కారణంగా లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం ఉండొచ్చని భావిస్తున్నారు. దోస్త్ ద్వారా డిగ్రీ సీట్ల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లక్షన్నర మంది డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ తర్వాత మరో 50 వేల మంది డిగ్రీ కోర్సుల్లో చేరే వీలుందని భావిస్తున్నారు. మొత్తం మీద నవంబర్ మొదటి వారంలో ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కోర్సులు మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలో షెడ్యూల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధనకు సంబంధించిన కాలపట్టికను త్వరలోనే విడుదల చేస్తాం. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాం. జోసా కౌన్సెలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ చేపడుతున్నాం. – ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
కలలు కల్లలు.. కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో పెరిగిçపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఈ సంస్థలు బ్రిలియంట్ విద్యార్థుల బలవన్మరణాలతో వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ సంస్థల్లో ప్రవేశించిన విద్యార్థులు, వారి తల్లితండ్రుల కలలు కల్లలు చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తును ఊహించుకుని ఆ సంస్థల్లో అడుగిడుతున్న విద్యార్థులు అక్కడ ఒత్తిడి, వివక్ష, బెదిరింపులు, సరైన మార్గదర్శనం లేక బలవంతంగా తనువులు చాలిస్తున్నారు. కట్టడి నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇక్కడ విజయం సాధించకపోతే భవిష్యత్తు లేదన్నట్లుగా కుంగిపోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతోపాటు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రాత్రింబవళ్లు కష్టపడితే గానీ సీటు రాదు. మంచి ర్యాంకులతో చేరుతున్న విద్యార్థులు అక్కడికెళ్లిన తరువాత సామాజిక పరిస్థితులు, విద్యా విధానం పూర్తి భిన్నంగా ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. సహచరæ విద్యార్థులతో పోల్చుకుని కూడా నిరాశా నిస్పృహల్లోకి వెళ్తున్నారు. దీంతో వారు ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారు. ఏనిమిదేళ్లలో 130 మంది దేశవ్యాప్తంగా గత ఎనిమిదేళ్లలో 130 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల బాగోగులను చూడాల్సిన ఆయా సంస్థల్లోని అధ్యాపకుల సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇలా బలవన్మరణాలు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇంటర్మీడియెట్ వరకు అధ్యాపకులు పూర్తిస్థాయిలో వారికి ప్రతీ అంశంలో సహకారం అందిస్తారు. అయితే, ప్రీమియర్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు అవసరమైన మానసిక ధైర్యం, అక్కడ ఎలా మసలుకోవాలి లాంటి వాటి గురించి వివరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారు ఈ సంస్థల్లో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటివరకు ఐఐటీల్లో 38 మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 39 మంది, ఎన్ఐటీల్లో 32 మంది, ఐఐఎంలలో ఐదుగురు, ఐఐ ఎస్సీ అండ్ ఐఐఎస్ఈఆర్లో తొమ్మిది మంది, ట్రిపుల్ ఐటీల్లో నలుగురు, కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే విద్యాసంస్థల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవలే ఐఐటీ హైదరాబాద్‌లో... ఇటీవలే హైదరాబాద్ ఐఐటీకి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విదితమే. ఇక్కడ ఎంటెక్ చదువుతున్న రాహుల్ హాస్టల్ గదిలోనే మంచానికి ఉరేసుకోగా.. ఈ మధ్యనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థి సంగారెడ్డిలో లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి చెందిన మరో ఐఐటీ విద్యార్థి కూడా హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్ష నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని ఘటనలు సంచలనంగా మారుతుంటే.. మరికొన్ని కేసులు పెద్దగా పట్టించుకోకుండానే ముగిసిపోతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులుగా గుర్తించిన వారిపై చర్యలు లేకుండా ముగుస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ఖరగ్‌పూర్ ఐఐటీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బోధించే ప్రొఫెసర్ దళితులను, ఆదివాసీ విద్యార్థులను అవమానించేలా మాట్లాడటంతో పెద్దఎత్తున నిరసన పెల్లుబుకడంతో ఆ ప్రొఫెసర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. సాధారణ విద్యార్థుల ఆత్మహత్యలూ ఎక్కువే.. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2017లో 9,905 మంది, 2020లో 12,526 మంది, 2021లో 13,089 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. గతేడాది 18 ఏళ్లలోపు వయసున్నవారు 10,732 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారే ఇందులో అధికంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల ఆత్మహత్యలు మహారాష్ట్ర (1,834)లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (1,308), తమిళనాడు (1,246), కర్ణాటక (855), ఒడిశా (834) నిలిచాయి. మొత్తం విద్యార్థుల బలవన్మరణాల్లో గ్రాడ్యుయేట్, ఆపైస్థాయి వారి శాతం 4.6గా ఉంది. మరో విద్యార్థి ఇలా కావొద్దు బలవన్మరణం వల్ల తల్లిదండ్రులకు శోకం మిగల్చడం తప్ప... సాధించేది ఏమీ ఉండదు. ప్రతిభ ఉన్న విద్యార్థులే ఇలాంటి విద్యాసంస్థల్లో చేరుతారు. వారికి సరైన మార్గదర్శనం ప్రొఫెసర్లు చేయాలి. మా అబ్బాయి రాహుల్ ఆత్మహత్య చేసుకునే రకం కాదు. అంతకు ముందే పుట్టిన రోజు జరుపుకున్నాడు. షిర్డి వెళ్లి వచ్చాం. ఎక్కడా డిప్రెషన్‌కు గురైనట్లు కనిపించలేదు. ప్రొఫెసర్ల ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నా. ఏదైనా లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీని కోరా. ల్యాప్‌టాప్ ఇప్పటి వరకు మాకు ఇవ్వనేలేదు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దు. ఇది లేకపోతే భవిష్యత్తు లేదనే భావన విరమించుకోండి. –ఐఐటీ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తండ్రి మధుసూధన్‌రావు మానసిక ధైర్యం ప్రధానం విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి. ఇంటర్ వరకు ఉన్న వాతావరణానికి æఐఐటీ, ఎన్ఐటీల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. విద్యా బోధనలో మార్పులు ఉంటాయి. స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎప్పుడూ చదువు కోసమేకాకుండా.. వారు మానసికంగా దృఢంగా ఉండేలా ధైర్యం చెప్పాలి. సహచర విద్యార్థులు కూడా తోటి విద్యార్థులు డిప్రెషన్లో ఉన్నట్టు తెలియగానే ధైర్యం చెప్పాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. అప్పుడు సరైన కౌన్సెలింగ్ తీసుకుని ధైర్యం నింపేందుకు వీలవుతుంది. – ఎన్వీ రమణారావు, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపులు అవసరం వివిధ సాంస్కృతిక నేపథ్యాల్లో పెరిగిన వాతావరణానికి.. ఐఐటీల్లోని వాతావరణం పూర్తిభిన్నంగా ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇతర నేపథ్యం నుంచి వచి్చన సహచర విద్యార్థులతో కలవలేకపోవడం, వారితో పోల్చుకుని కుంగుబాటుకు గురికావడం, తక్కువ మార్కులొస్తే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సరైన ప్లేస్మెంట్లు రావనే భయాలు, బాగా మార్కులు తెచ్చుకుని పెద్ద పెద్ద ప్యాకేజీలు తెచ్చుకోవాలనే తల్లితండ్రుల అంచనాలు చేరుకోకపోవడం వంటివి ప్రభావం చూపిస్తున్నాయి. ఉన్నత చదువు, సంబంధిత అంశాల ఒత్తిళ్లతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అన్ని విద్యాసంస్థల్లో ‘మెంటల్ హెల్త్ అవేర్నెస్’క్యాంపులు నిర్వహించాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనైనప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? సహ విద్యార్థులు, ఇతరుల ద్వారా ఆయా దశలను ఎలా గుర్తించాలనే దానిపై పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలి. ఐఐటీలు, ఎన్ఐటీల వంటి చోట్ల సైకాలజిస్టులను పెట్టినా.. ఒత్తిళ్లు, ఇతర అంశాలపై సరైన అవగాహన కలి్పంచడం లేదు. క్లాస్‌లు జరిగేప్పుడు, డైనింగ్, టీవీ హాల్ తదితర చోట్ల జనరల్ అంశాలపైనా అవగాహన కల్పించాలి. –వీరేందర్, సైకాలజిస్ట్ చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
‘గేట్’ మనోళ్లదే! ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సొంతం
సాక్షి, హైదరాబాద్/కాజీపేట అర్బన్/మధిర: ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లోని మాస్టర్ డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్(గేట్)–2022 ఫలితాలను గురువారం ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాచర్ల ప్రణీత్ కుమార్, మణి సందీప్‌రెడ్డి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. గేట్ కోసం దేశవ్యాప్తంగా 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 7,11,542 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికిపైగా గేట్ రాశారు. దేశవ్యాప్తంగా 1,26,813 (17.82 శాతం) మంది అర్హత పొందారు. మొత్తం 100 మార్కులుండే ఈ పరీక్షకు ఈసారి 25 మా ర్కులు అర్హత(కటాఫ్)గా నిర్ణయించారు. ర్యాంకుల వివరాలు, డౌన్లోడ్ కోసం gate.iitkgp.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలని ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది. గేట్లో మొదటి ర్యాంకు సాధించిన వరంగల్ నిట్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఫైనలియర్ విద్యార్థి మణి సందీప్‌రెడ్డికి ఆ సంస్థ డైరెక్టర్ ఎన్వీ రమణారావు గురువారం మొక్కను బహూకరించి అభినందించారు. అదేవిధంగా నిట్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హర్దీప్ 42వ ర్యాంకు సాధించాడు. స్వీయశిక్షణతోనే టాప్‌ర్యాంక్:మణి సందీప్‌రెడ్డి గేట్లో మొదటిర్యాంకు పొందడం సంతోషంగా ఉంది. రాజమండ్రికి సమీపంలోని వెదురుపాక సొంతూరు అయినప్పటికీ, టెన్త్, ఇంటర్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. మా నాన్న రామగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌తోపాటు షాపు నిర్వహిస్తాడు. అమ్మ ఐశ్వర్య భాగ్యలక్ష్మి గృహిణి. ఇంజనీరింగ్ చేస్తూనే సొంతంగా గేట్‌కు ఆరునెలలపాటు తర్ఫీదు అయ్యాను. మార్కెట్లో దొరికే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్‌తో నా ప్రిపరేషన్ అయ్యాను. పేద కుటుంబంలో విద్యాకుసుమం ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మాచర్ల శ్రీనివాసరావు– రమామణి దంపతుల కుమారుడు ప్రణీత్‌కుమార్ అలహాబాద్ నిట్‌లో బీటెక్(ఈఈఈ) పూర్తిచేశారు. శ్రీనివాసరావు స్థానిక సీపీఎస్ రోడ్డులో బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకుని దారాలు, గుండీలు వంటి టైలరింగ్ మెటీరియల్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పేద కుటుంబమే అయినా కష్టపడుతూ కుమారుడిని చదివించారు. మాచర్ల శ్రీనివాసరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ రేయింబవళ్లు కష్టపడి చదివిన ప్రణీత్ జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించటం సంతోషంగా ఉందన్నారు. ప్రణీత్‌కుమార్ ఫోన్లో మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసే తన తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన పట్టుదలతో చదివినట్లు తెలిపారు. తెనాలి యువకుడికి 21వ ర్యాంకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ఆళ్ల శేషసాయిరెడ్డి 21వ ర్యాంకు సాధించారు. ఈయన ప్రస్తుతం కోల్ ఇండియాలో డిప్యూటీ మేనేజరుగా పనిచేస్తున్నారు. మరోవైపు యూపీఎస్సీ నిర్వహిం చిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. ఈయన తల్లి దీపలత సెకండరీ గ్రేడ్ టీచరు కాగా.. తండ్రి ఆళ్ల రవీంద్రారెడ్డి రైతు. శేషసాయిరెడ్డి నాగపూర్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివా రు. బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సీటు.. ఎంటెక్ చేయటం, తర్వాత పీహెచ్డీ పూర్తిచేయాలని ఉందని ఆయన చెప్పారు. ఐఈఎస్‌లో జాబ్ వస్తే మరింత సంతోషమన్నారు. -
ఐఐటీల్లో తగ్గుతున్న విదేశీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎంపికయ్యే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నుంచి వారికి మినహాయింపునిచ్చారు. నేరుగా జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ఎంపిక అవకాశం కల్పించారు. అయినా అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. పరీక్షకు హాజరవుతున్నవారిలోనూ ఒక శాతానికి మించి ఉత్తీర్ణులు కావడం లేదు. అర్హత సాధిస్తున్నవారు తక్కువే.. గతేడాది (2020) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 209 మంది ప్రవాస భారతీయులు (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా–ఓసీఐ), 23 మంది పీఐవోలు (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్), 23 విదేశీ జాతి కేటగిరీ అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాశారు. వీరిలో విదేశీ జాతి కేటగిరీ కింద నలుగురు, పీఐవో కేటగిరీలో 16 మంది, ఓసీఐ కేటగిరీలో 133 మంది అర్హత సాధించారు. అర్హత సాధించకపోవడానికి కారణం ఇదే.. దేశంలోని విద్యార్థులు జేఈఈకి ఇంటర్మీడియెట్ ఆరంభం నుంచే సన్నాహాల్లో ఉంటున్నారు. విదేశీ విద్యార్థులు కేవలం పరీక్షకు ముందు మాత్రమే సిద్ధమవుతున్నారు. పైగా వారి విద్యలోని అంశాలకు, అడ్వాన్స్డ్ సిలబస్‌లోని అంశాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. దీంతో వారు అర్హత మార్కులను సాధించలేకపోతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అర్హత సాధించినవారిలోనూ ఐఐటీల్లో చేరుతున్నవారు తక్కువగానే ఉంటున్నారు. పొరుగు దేశాల విద్యార్థులే అధికం.. ఐఐటీల్లో యూజీ కోర్సుల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మనదేశానికి చుట్టుపక్కల ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు దేశస్తులే. ఇతర దేశస్తులు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో యూజీ కోర్సులు చేయడానికి వెళ్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. మనదేశంలో యూజీ కోర్సుల్లో చేరేవారి కంటే పోస్ట్రుగాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. ఐఐటీ రూర్కీలో 144 మంది విదేశీ విద్యార్థులుండగా వారంతా పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరినవారే. ఇక ఢిల్లీ ఐఐటీలో 98 మంది విదేశీ విద్యార్థులుండగా వారు కూడా పీజీ, పీహెచ్డీ కోర్సులను అభ్యసిస్తున్నవారే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో విదేశాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఈసారి రద్దు చేశారు. అంతర్జాతీయ ర్యాంకింగ్‌పై ప్రభావం కాగా.. విదేశీ విద్యార్థుల తగ్గుదల ప్రభావం దేశంలోని విద్యా సంస్థలకు ప్రపంచ ర్యాంకింగ్‌పై పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయి ర్యాంకులు ప్రకటించే సంస్థలు ఆయా విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్ధుల సంఖ్యను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటాయని వివరిస్తున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుదల ఐఐటీలకు ప్రతికూలంగా మారుతోందని చెబుతున్నారు. -
1 నుంచి మెట్రో సర్వీసులు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్న అన్‌లాక్–4 ప్రక్రియలో మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీలను తెరిచే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని అధికారవర్గాలంటున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి వాటిని ప్రారంభించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇప్పటిదాకా మూతపడి ఉన్న బార్లు కూడా తెరుచుకోనున్నాయి. అయితే, కేవలం కౌంటర్‌పై మద్యం విక్రయాలను మాత్రమే అనుమతించేందుకు వీలుంది. బార్లో కూర్చుని మద్యం తాగేందుకు అవకాశం ఉండదు. మెట్రో రైళ్ల పునఃప్రారంభంపై వివిధ వర్గాలతో సంప్రదింపులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. టోకెన్లకు బదులు మెట్రో కార్డుల ద్వారానే ప్రయాణానికి అనుమతించడం, స్టేషన్లలో రైలు ఆగే సమయాన్ని పెంచడం వంటి మార్పులు ఉంటాయని సమాచారం. -
బోధనలో మన ఐఐటీలు మేటి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో బోధన భేష్ అని మరోసారి రుజువైంది. ఏటేటా బోధనను మెరుగుపరుచుకుం టూ ముందుకు సాగుతున్నట్లు తేలింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఈ విషయం స్పష్టమైంది. గురువారం వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్– 2019 నుంచి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,250 యూనివర్సిటీలకు వాటిల్లో బోధన, ప్రమాణాలను బట్టి ర్యాంకింగ్‌లను ఇచ్చింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన సర్వేలో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో బోధనకు ఈసారి 56.7 పాయింట్ల స్కోర్ లభించింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబేకు బోధనలో 44.3 పాయింట్ల స్కోర్ లభించింది. ఇలా మన ఐఐటీలు ఏటా బోధనను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడైంది. మళ్లీ ఐఐఎస్సీనే టాప్.. ఇక మన దేశానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,250 ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో మన దేశానికి చెందిన 49 విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఎప్పటిలాగే బెంగళూరులోని ఐఐఎస్సీ 251–300 ర్యాంకుతో మన దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఐఐఎస్సీనే అదే ర్యాంకుతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2018 ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న 351–400 ర్యాంకుతో రెండో స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే 2019 ర్యాంకింగ్‌లో మాత్రం కొంత వెనుకబడింది. 401–500 ర్యాంకుతో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి 351–400 ర్యాంకుతో ఐఐటీ ఇండోర్ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఆసియా యూనివర్సిటీల పరంగా చూస్తే ఐఐఎస్సీ 29వ స్థానంలో నిలిచింది. తొలిసారిగా ఈ జాబితాలో ఐఐటీ ఇండోర్ దేశంలో రెండో స్థానాన్ని దగ్గించుకుంది. ఈసారి ఐఐటీ హైదరాబాద్‌కు స్థానం.. వరల్డ్ యూనివర్సిటీల ర్యాకింగ్‌లో ఈసారి ఐఐటీ హైదరాబాద్‌కు స్థానం దక్కింది. 601–800 ర్యాంకుతో ఐఐటీ హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ గతేడాదిలాగే ఈసారి కూడా 801–1,000 ర్యాంకుతో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వీటితోపాటు ఐఐటీ భువనేశ్వర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుణే, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీలకు ఈ ఏడాది ర్యాంకింగ్ జాబితాలో చోటు లభించింది. -
ఐఐటీల్లో నయా జోష్..!
దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యకు దిక్సూచిలవి.. యావత్ యువతరం చోటు కోసం కలలుగనే, పోటీ పడే విద్యా కుసుమాలవి... విద్యార్థులను బట్టీ చదువులు, మార్కుల యంత్రాలుగా మార్చడంపై కాకుండా యువ మస్తిష్కాలను నూతన ఆవిష్కరణలవైపు నడిపించే ‘ఫ్యాక్టరీ’లవి... ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ‘గూగుల్’ సుందర్ పిచాయ్, ‘ఫ్లిప్‌కార్ట్’ సచిన్ బన్సల్, ‘సాఫ్ట్ బ్యాంక్’ నికేష్ అరోరా వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన కేంద్రాలవి... అవే...దేశ అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్న ఐఐటీలు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు). ఇప్పుడు ఈ సంస్థలు పూర్వ వైభవానికి మరిన్ని హంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశంలోని 23 ఐఐటీలలో ఉన్న సీట్లు దాదాపు ఏడు వేలు! కానీ పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం లక్షలకు లక్షలు! ఈ ఒక్క విషయం చాలు దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకునేందుకు. అయితే దశాబ్దాలుగా ఒకే రకమైన కోర్సులు, సిలబస్‌తో నడుస్తున్న ఈ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు అనుసరించే బోధనా పద్ధతులు పాటించడంతోపాటు వేర్వేరు సమస్యల పరిష్కారానికి వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పరిశోధనలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సైన్స్ ఇంజనీరింగ్‌లతోపాటు కళలు, హ్యుమానిటీస్ అంశాల్లోనూ కోర్సులు ప్రారంభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసే విషయంలో విద్యార్థులకు స్వేచ్ఛ, సౌలభ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. ఫలితంగా యువతరం మోసుకొచ్చే కొత్త ఆలోచనలు, పద్ధతులతో పరిశోధనలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రొఫెసర్లుగా యువతకు ప్రాధాన్యం... ఐఐటీ ప్రొఫెసర్లంటే తల నెరసిన వారే ఉంటారన్న పాతకాలపు ఆలోచనలకు తెరదించుతూ యాజమాన్యాలు యువతరానికి పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఐఐటీ అధ్యాపకుల సగటు వయసు 1980 ప్రాంతంలో 60 ఏళ్లు కాగా.. ఇప్పుడు అది 40కు తగ్గిపోయింది. గత ఐదేళ్లలో స్వదేశానికి తిరిగొచ్చిన యువ శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లలో చేరుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2007–12తో పోలిస్తే ఆ తరువాతి ఐదేళ్లలో విదేశాల నుంచి తిరిగొస్తున్న శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫెలోషిప్‌లు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కలివిడిగా.. వడివడిగా... పరిశోధనలంటే సామాన్యులకు ఉపయోగపడేవి కావన్న ఒకప్పటి అంచనాను తారుమారు చేస్తూ ఐఐటీ, ఐఐఎస్సీలు దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాజెక్టులతోపాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు, టెక్నాలజీతో సామాన్యుడి కష్టాలు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా మునుపటి కంటే వేగంగా ఐఐటీ కేంద్రంగా కొత్త స్టార్టప్‌లు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఐఐఎస్సీ గతంలోనే వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పనిచేసేలా వాతవరణ మార్పులపై ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇదే తరహాలో ఇంధనం, నీటి సమస్యల పరిష్కారానికీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే విమానాల కోసమూ ప్రత్యేక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్‌లోనూ 2014లో కంబషన్ (ఇంధనం మండే ప్రక్రియ)పై మొదలుపెట్టి.. నానో మెటీరియల్స్, కంప్యూటేషనల్ బ్రెయిన్ రీసెర్చ్, బయోలాజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, డేటా సైన్సెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరిన్ని కేంద్రాల ఏర్పాటు ఆలోచనలతో ముందుకొచ్చిన వారికి రూ. 2 కోట్ల నగదు బహుమతి కూడా ఇస్తోంది. ముందు వరుసలో ఐఐటీ బాంబే... ఐఐటీ బాంబే 2017లో తొలిసారి ఖగోళ శాస్త్రంలో కోర్సును ప్రారంభించింది. ఇదే సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఖగోళశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన వరుణ్ భలేరావును చదువు చెప్పేందుకు ఎంపిక చేసుకుంది. ఏడాది తిరిగేలోగా మరో నలుగురు మాజీ ఐఐటీయన్లు ఆయనకు జతకూడారు. వేర్వేరు అంశాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వీరు ఇప్పుడు ఖగోళశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేస్తున్నారు. లడాఖ్‌లోని 18 ఏళ్ల పురాతన ఆప్టికల్ టెలిస్కోప్ దానంతట అదే పనిచేసేలా సరికొత్త ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను వారు రూపొందిస్తున్నారు. అంతేకాదు... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలసి గురుత్వ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలూ చేపట్టారు. భలేరావు మాదిరిగానే.. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ చదివిన అనూష్ కపాడియా.. ఇప్పుడు ఐఐటీ బాంబేలో సామాజిక శాస్త్రాల్లో విద్య నేర్పుతున్నారు. ఐఐటీ, ఐఐఎస్సీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న వినూత్న పరిశోధనల్లో కొన్ని... ► మానవ మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్‌ల తయారీపై ఐఐటీ ఢిల్లీలో మనన్ సూరీ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తున్నారు. అతితక్కువ ఖర్చుతో సమాచారాన్ని దీర్ఘకాలంపాటు నిల్వ చేసుకోగల మెమరీని అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలపై ఫ్రాన్స్‌లో పీహెచ్డీ చేసిన మనన్ సూరికి మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గతేడాది 35 ఏళ్ల వయసులోపు ఉన్న అద్భుత శాస్త్రవేత్తగా అవార్డు అందించింది. ► జల విద్యుత్ తయారీలో కీలకమైన టర్బైన్లను ప్రస్తుత పరిమాణంకంటే పదిరెట్లు తక్కువ సైజులో, అది కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కార్బన్ డయాక్సైడ్తో పనిచేయించేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2012లో బెంగళూరులోని ఐఐఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ప్రమోద్ కుమార్ కార్బన్ డయాక్సైడ్ను ఒక ప్రత్యేక స్థితికి తీసుకెళ్లడం ద్వారా టర్బయిన్లలో వాడుకోవచ్చునని అంటున్నారు. ద్రవ, వాయు స్థితులకు మధ్యలో ఉండే ఈ ప్రత్యేక స్థితిలో కార్బన్ డయాక్సైడ్ను వాడినప్పుడు తక్కువ సైజున్న టర్బయిన్లతోనే సమర్థంగా విద్యుదుత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ టర్బయిన్ సంప్రదాయేతర ఇంధన వనరులతోపాటు అణు రియాక్టర్లలోనూ అత్యంత కీలక పాత్ర పోషించనుందని అంచనా. ► 2007లో ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడైన నిషాంత్ డోంగరి ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తూ క్షిపణి రక్షణ వ్యవస్థలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే వినూత్న సౌరశక్తి పరికరాల తయారీతోపాటు రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల సమర్థ వినియోగం వంటి అంశాల్లో సేవలందించేందుకు ‘ప్యూరెనర్జీ’ పేరుతో కంపెనీ స్థాపించారు. ► స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ వేగాన్ని పదుల రెట్లు ఎక్కువ చేసే 5జీ టెక్నాలజీకి తగిన ప్రమాణాలను రూపొందించే విషయంలో ఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కూచి కిరణ్ విజయం సాధించారు. గతేడాదే ఈ టెక్నాలజీపై పేటెంట్‌కు కిరణ్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు. — సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులకు రెట్టింపు జీతాలు
ముంబై: నాణ్యమైన విద్యార్థులను ఉద్యోగంలోనికి తీసుకోవడం కోసం కంపెనీలు ఎంత జీతాలివ్వడానికైనా ఏమాత్రం వెనకాడడం లేదని మరోసారి రుజువయింది. ఇలాంటి వారి కోసం ఐఐటీ, ఐఐఎమ్‌లను ఆశ్రయిస్తున్న కార్పొరేట్ కంపెనీలు... సాధారణ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఇచ్చే జీతాల కంటే రెట్టింపు స్థాయిలో వీరికి ఆఫర్ ఇస్తున్నాయి. ఇతర కాలేజీలలో చదివిన వారికంటే ఐఐటీ విద్యార్థుల జీతాలు 137 శాతం అధికంగా ఉండగా, ఐఐఎమ్‌లో చదివిన విద్యార్థుల జీతాలు 121 శాతం అధికంగా ఉన్నట్లు గ్లోబల్ ఆన్లైన్ టాలెంట్ మెజర్మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ సంస్థ ‘మెటిల్’ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయ్యింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జనవరి–జూన్ మధ్య కాలంలో ఈ సంస్థ 114 ఇంజనీరింగ్, 80 మేనేజ్మెంట్ కాలేజీలలో సర్వే నిర్వహించగా.. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్, ఐటీ చదివిన విద్యార్థులకు ఏడాదికి సగటున రూ.6.9 లక్షలు జీతం చెల్లిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఐఐఎమ్‌లో చదివిన టెక్నాలజీ డొమైన్ గ్రాడ్యుయేట్ల సగటు వార్షిక జీతం రూ.14.8 లక్షలుగా ఉన్నట్లు సర్వేలో వెల్లడయిందని మెటిల్ సంస్థ కో–ఫౌండర్ కేతన్ కపూర్ వెల్లడించారు. పశ్చిమ భారతదేశంలో చదివినవారి జీతాలు ఇతర ప్రాంతాలవారి కంటే 17 శాతం అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. నూతన తరం ప్రతిభను కలిగి ఉన్న విద్యార్థులకు పలు కంపెనీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలిందని అన్నారు. -
జియోకు స్టేటస్, కేంద్రం నవ్వుల పాలు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి నవ్వుల పాలైంది. జియో ఇన్స్టిట్యూట్ కనీసం ఏర్పాటు చేయనప్పటికీ ఈ విద్యాసంస్థకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను అందించింది. కనీసం ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఒక్క భవనం లేనప్పటికీ, ఒక్క విద్యార్థి కూడా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ పొందనప్పటికీ, ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను ఎలా కేటాయిస్తారంటూ విమర్శల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ఆరు ఇన్స్టిట్యూట్లకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను కేటాయించింది. వాటిలో రెండు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, బిట్స్ పిలానీ, మనిపాల్ ఉన్నత విద్యా అకాడమీతో పాటు జియో ఇన్స్టిట్యూట్ కూడా ఆ స్టేటస్‌ను దక్కించుకుంది. ‘వరల్డ్ క్లాస్’ ఇన్స్టిట్యూషన్లుగా మార్చడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. కానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఈ స్టేటస్ కేటగిరీలో చేర్చడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఇప్పటి వరకు ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేకుండా ఈ స్టేటస్‌ను అందించడం విడ్డూరంగా ఉందని హెచ్ఆర్డీపై మండిపడుతున్నారు. జియో ఇన్స్టిట్యూట్ దీనిలో చేర్చడం మరో బిగ్ స్కాం అని ట్విటర్ యూజర్లంటున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, కనీసం వెబ్సైట్ కూడా లేదని.. అలా ఎలా హెచ్ఆర్డీ ‘ప్రఖ్యాత సంస్థ’ ట్యాగ్‌ను జియో ఇన్స్టిట్యూట్కు ఇస్తుందని మండిపడుతున్నారు. కేవలం ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్టు మాత్రమే నీతా అంబానీ 2018 మార్చి 11న ప్రకటించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభం కావడానికి ఇంకా మూడేళ్లు పడుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు ఎంహెచ్ఆర్డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2018 ర్యాంకింగ్స్ జాబితాలోనే లిస్ట్ కాలేదని, ఎందుకు టాప్ ర్యాంక్ కలిగిన పబ్లిక్ ఇన్స్టిట్యూట్లకు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు పక్కన బెట్టి మరీ జియోకు ఈ స్టేటస్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌ల లాంటి పలు చరిత్రాత్మక ఇన్స్టిట్యూషన్ల కంటే జియో ఇన్స్టిట్యూటే మెరుగైనదని ఎలా నిర్ణయించారని మరో ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సిగ్గుచేటన్నారు. అయితే తమ ఈ నిర్ణయాన్ని హెచ్ఆర్డీ కార్యదర్శి(ఉన్నత విద్య) ఆర్ సుబ్రమణ్యం సమర్థించుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఈ ఇన్స్టిట్యూట్ను ఎంపిక చేశామని చెప్పారు. ఎలా టాప్-క్లాస్ ఇన్స్టిట్యూట్లగా మార్చుకుంటారో తెలుపుతూ వారి ప్లాన్ల వివరాలు అందించాలని కోరామని కూడా చెప్పారు. యూజీసీ(వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీస్) రెగ్యులేషన్స్ 2016 కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటుచేసే అధికార నిపుణుల కమిటీ ఈ ఇన్స్టిట్యూట్లను ఎంపిక చేసింది. -
టాప్ వర్సిటీల జాబితాలో ఐఐటీలు
న్యూఢిల్లీ : ప్రపంచ యూనివర్సిటీ ర్యాంక్‌ల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐఎస్ బెంగళూర్, ఐఐటీ ఢిల్లీలు టాప్ 200లో చోటుదక్కించుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే టాప్ 1000 వర్సిటీల జాబితాలో భారత యూనివర్సిటీల సంఖ్య 20 నుంచి 24కు పెరగడం గమనార్హం. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2019లో గత ఏడాదితో పోలిస్తే తాజా జాబితాలో ఐఐటీ బాంబే 17 స్ధానాలు మెరుగుపరుచుకుని 162వ ర్యాంక్‌లో నిలవడం ద్వారా దేశంలోనే టాప్ ఇనిస్టిట్యూట్‌గా పేరొందింది. ఐఐటీ ఢిల్లీ 172వ స్ధానంలో నిలిచింది. ఐఐసీ బెంగళూర్ సైతం ఐఐటీ ఢిల్లీని తోసిపుచ్చి 170వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంకింగ్ జాబితాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది. 15వ సారి ప్రకటించిన ఈ ర్యాంకింగస్లో వరుసగా ఏడవ సంవత్సరం సైతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ యూనివర్సిటీగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలకు చెందిన ప్రముఖ 1000 విశ్వవిద్యాలయాల ర్యాంకులను ఈ జాబితా వెల్లడిస్తుంది. ఈ జాబితాలో భారత్ నుంచి 24 యూనివర్సిటీలు చోటు దక్కించుకోగా, ఏడు వర్సిటీలు తమ ర్యాంకును మెరుగుపరుచకున్నాయని, 9 సంస్థలు నిలకడగా ఉండగా, 5 వర్సిటీలు కొత్తగా చోటు దక్కించుకున్నాయని క్యూఎస్ రీసెర్చి డైరెక్టర్ బెన్ సోటర్ పేర్కొన్నారు. -
ఐఐటీల్లో 34 శాతం అధ్యాపకుల కొరత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు. ఏడాదికేడాది ఆ సంస్థల్ని విస్తరిస్తూ పోతున్న కేంద్ర ప్రభుత్వం అందులో అధ్యాపకుల నియామకంపై దృష్టి పెడుతున్నట్టుగా లేదు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉంటే అన్ని సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒకే ఒక సమస్య అధ్యాపకుల కొరత. అన్ని సంస్థల్లో కలిపి మొత్తంగా చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 34 శాతం అధ్యాపకుల కొరత పట్టిపీడిస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థులకు పాఠం చెప్పేవాళ్లు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పాలక్కడ్, తిరుపతి, గోవా వంటి కొత్తగా ఏర్పాటైన ఐఐటీల్లోనే కాదు ఎంతో ఘనతవహించిన ముంబై, ఖరగపూర్, కాన్పూర్ వంటి సంస్థల్లోనూ ఇదే దుస్థితి. ఎప్పట్నుంచో ఉన్న ఈ పాత సంస్థల్లోనే అధ్యాపకుల కొరత 25 శాతం నుంచి 45శాతం వరకు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఏ ఐఐటీలో అధ్యాపకుల కొరత ఎంత? ఐఐటీ–గోవా 62 % ఐఐటీ–భిలాయ్ 58 % ఐఐటీ–ధర్వాడ్ 47 % ఐఐటీ–ఖర్గపూర్ 46 % ఐఐటీ–కాన్పూర్ 37 % ఐఐటీ–ఢిల్లీ 29 % ఐఐటీ–చెన్నై 28 % ఐఐటీ–ముంబై 27 % ఎందుకీ పరిస్థితి ? ఐఐటీల్లో ఫాకల్టీ కొరత కొత్త సమస్యేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకుల కొరత, సదుపాయాల లేమితో ఐఐటీల ప్రతిష్ట మసకబారుతోంది. ఐఐటీల్లో డిగ్రీలు తీసుకుంటున్న వారు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం కోసం వెళ్లిపోతున్నారే తప్ప, తిరిగి ఆ సంస్థల్లో ఫాకల్టీగా చేరుదామని అనుకోవడం లేదు. ఒకప్పుడు ఐఐటీలో విద్యాభ్యాసం చేసినవారిలో 15 శాతం మంది అదే సంస్థల్లో అధ్యాపకులగా చేరేవారు. కానీ ఇప్పుడది గణనీయంగా తగ్గిపోయింది. ఐఐటీ విద్యార్థుల్లో 50శాతం మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిపోతూ ఉంటే మిగిలిన వారిలో అత్యధిక శాతం భారత్‌లోని ప్రైవేటు కంపెనీల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు. అధ్యాపక వృత్తి పట్ల యువతరంలో ఆకర్షణ ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఐఐటీలను ఏర్పాటు చేస్తున్న కేంద్రప్రభుత్వం అందులో మౌలిక సదుపాయాలపై మాత్రం దృష్టి సారించడంలేదు. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఐఐటీలను మంజూరు చేస్తూ ఉండడంతో బోధనా నైపుణ్యం కలిగిన అధ్యాపకులెవరూ అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ‘కర్ణాటకలోని ధర్వాడ్ వంటి పట్టణాల్లో సదుపాయాలే ఉండవు. పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైనవి లేని పట్టణాలకు నైపుణ్యం కలిగిన బోధకులు ఎందుకు వస్తారు’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలి ? ఐఐటీల్లో అధ్యాపకుల కొరత అధిగమించడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీలో ఒక నియామకం జరగాలంటే ఆ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. దానిని తగ్గించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ‘ఐఐటీల సంఖ్యమాత్రమే పెంచితే సరిపోదు. అధ్యాపకుల్ని ఆకర్షించేలా వేతనాలు పెంచడం, గ్యాడ్యుయేషన్‌తో చదువు ఆపేయకుండా విద్యార్థులు పీహెచ్డీ చేసేలా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ కొరతని అధిగమించగలం’ అని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐటీల్లోకి ఫారెన్ ఫాకల్టీని కూడా తీసుకురావడానికి వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు పదవీవిరమణ చేసిన అధ్యాపకుల్ని తిరిగి తీసుకోవడం, ఉన్నవారికి మరి కొన్నేళ్లు పదవీకాలం పొడిగింపు వంటి చర్యలు కూడా తీసుకోనుంది. ఏదిఏమైనా ఐఐటీల ప్రతిష్ట మరింత మసకబారకుండా కేంద్రమే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భారత్ నుంచి కేవలం ఆరు యూనివర్సిటీలే!
న్యూఢిల్లీ : గ్లోబల్ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో మన యూనివర్సిటీలు చాలా తక్కువగా చోటు దక్కించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ 2018లో టాప్-400లో కేవలం భారత్ నుంచి కేవలం ఆరు యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఐదు ఐఐటీలే. కేవలం ఒక్క యూనివర్సిటీ మాత్రమే నాన్-ఐఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది కూడా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ). ర్యాంకింగ్స్‌లో టాప్ భారత యూనివర్సిటీగా ఉన్న ఐఐటీ-ఢిల్లీ, 172 స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది దీని ర్యాంక్ 185. జాబితాలో ఉన్న ఇతర యూనివర్సిటీలు ఐఐటీ-బొంబై 179వ ర్యాంకును, ఐఐఎస్సీ 190వ ర్యాంకును, ఐఐటీ-మద్రాసు 264 ర్యాంకును, ఐఐటీ-కాన్పూర్ 293 ర్యాంకును, ఐఐటీ ఖరగ్‌పూర్ 308 ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఐఐటీ-బొంబై ర్యాంకింగ్ గతేడాది కంటే దాదాపు 40 స్థానాలు పైకి ఎగబాకింది. అయితే రెండేళ్ల పాటు పైకి ఎగిసిన ఐఐటీ-మద్రాసు ర్యాంకింగ్ 2018లో 15 స్థానాలు పడిపోయింది. గతేడాది ఐఐటీ-మద్రాసు ర్యాంకింగ్ 249. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రతేడాది విడుదల అవుతాయి. మొత్తంగా ఈ ర్యాంకింగ్స్‌లో టాప్-3 బెస్ట్ వర్సిటీలుగా మసాచుసెట్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ యూనివర్సిటీలు మంచి ప్రదర్శన కనబర్చినట్టు తెలిసింది. -
ఐఐటీల్లో బాలికలకు 14 శాతం సీట్లు!
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీల్లో బాలికలకు 14 శాతం సీట్లను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) సూచన మేరకు ఐఐటీల కౌన్సిల్, జాయింట్ అడ్మిషన్ల బోర్డు బాలికలకు ప్రత్యేక సీట్లను కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఐఐటీల్లో చేరుతున్న వారిలో అత్యధికంగా బాలురే ఉంటున్నారు. బాలికలు 12 శాతం వరకే ఉంటున్నారు. గతేడాది ఐఐటీల్లో ప్రత్యేకంగా 4 శాతం సీట్లు బాలికలకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా జేఈఈ అడ్వాన్స్డ్ నుంచి ఎంపికయ్యే విద్యార్థుల్లో బాలికలకు ప్రత్యేక మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని సూచించింది. మొత్తంగా 2020 నాటికి బాలికలకు ఐఐటీల్లో 20 శాతం సీట్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సీట్లను పూర్తిగా సూపర్ న్యూమరీ కింద కేటాయించ నుంది. 2014–15 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన బాలికల్లో 8 శాతం మందికే ఐఐటీల్లో సీట్లు లభించాయి. 2015 –16లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 4,600 మంది బాలికలు అర్హత సాధించగా, వారిలో 850 మందికే ప్రవేశాలు లభించాయి. 2016–17లోనూ దాదాపు అదే పరిస్థితి. ఇక 2017–18 ప్రవేశాల లెక్కల ప్రకారం ఐఐటీల్లో ప్రతి వంద మంది విద్యార్థుల్లో బాలికలు ఆరుగురే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 2017–18 విద్యా సంవత్సరంలో బాలికల కోసం ప్రత్యేకంగా 4 శాతం సీట్లు పెంచారు. వచ్చే మూడేళ్ల పాటు కూడా ఇలాగే బాలికలకు సీట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
మైక్రోసాఫ్ట్ భారీ వేతనం : వారికి గుడ్‌న్యూస్
ముంబై : అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలకు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న తుది నియామక ప్రక్రియలో, మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు భారీ వేతనం ఆఫర్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. టాప్ ఐఐటీల క్యాంపస్ వర్గాల సమాచారం మేరకు కంపెనీ తన రెడ్మాండ్ ప్రధాన కార్యాలయంలో ఐఐటీలను నియమించుకోవడానికి ఏడాదికి రూ.1.39 కోట్లను ప్యాకేజీగా ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం ప్యాకేజీ 2,14,600 డాలర్లు కాగ, దానిలో బేసిక్ వేతనం 1,08,000 డాలర్లు, పనితీరు ఆధారిత బోనస్ 21,600 డాలర్లు, జాయినింగ్ బోనస్ 15,000 డాలర్లు, నియంత్రిత స్టాక్యూనిట్లు 70,000 డాలర్లు ఉన్నట్టు వెల్లడవుతోంది. గతేడాది కంటే ఈ వేతనాన్ని మైక్రోసాఫ్ట్ భారీగా పెంచేసింది. గతేడాది మైక్రోసాఫ్ట్ మొత్తం ప్యాకేజీగానే 1,36,000 డాలర్లను ఆఫర్ చేసింది. మైక్రోసాఫ్ట్ అనంతరం మరో టాప్ రిక్రూటర్‌గా అమెరికా ఆధారిత ఉబర్ టెక్నాలజీస్ ఉండబోతుందని సమాచారం. ఈ కంపెనీ కూడా బేసిక్ వేతనంగా 1,10,000 డాలర్లను ఆఫర్ చేయబోతున్నట్టు క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ బోనస్‌లు, స్టాక్ ఆప్షన్లు, మైక్రోసాఫ్ట్‌తో పోలిస్తే తక్కువగానే ఉండబోతున్నాయట. ఉబర్ టెక్నాలజీస్ ఆఫర్‌చేసే మొత్తం ప్యాకేజీ రూ.99.87 లక్షలుగా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ ప్యాకేజీలు కాన్పూర్, ముంబై, చెన్నై, బనారస్ హిందూ యూనివర్సిటీ, రూర్కే క్యాంపస్‌లకు ఆఫర్ చేయొచ్చని ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొన్నారు. కొన్ని సార్లు తుది వేతన ప్యాకేజీలు ఇంకా ఎక్కువ ఉండొచ్చని కూడా తెలిపాయి. దీనిపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు. ఉబర్ తను అందిస్తున్న వేతన వివరాలను తెలుపడానికి తిరస్కరించింది. ఈ ఏడాది ఎనిమిది ఐఐటీ క్యాంపస్‌లు- ఢిల్లీ, చెన్నై, ఖరగ్‌పూర్, రూర్కే, గౌహతి, బీహెచ్‌యూ, ముంబై, కాన్పూర్లలో ప్లేస్మెంట్లను చేపట్టనున్నట్టు ఉబర్ ఇండియా, దక్షిణాసియా చీఫ్ పీపుల్ ఆఫీస్ విశ్పాల్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఐఐటీలకు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లు పెరిగిపోయాయి. ఇది ఇన్స్టిట్యూట్లకు గుడ్‌న్యూస్. -
31 కంపెనీలపై నిషేధం ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ : నిబంధనలు ఉల్లంఘించి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న 31 కంపెనీలపై ఐఐటీలు గతేడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గతేడాది ఈ కంపెనీలపై విధించిన నిషేధాన్ని ఐఐటీలు ఈ ఏడాది ఎత్తివేశాయి. డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతున్న వార్షిక క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఈ కంపెనీలు పాల్గొనవచ్చని ఐఐటీలు పేర్కొన్నాయి. ఈ కంపెనీల్లో ఎక్కువగా స్టార్టప్‌లే ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను తిరస్కరించడమే కాకుండా, జాయినింగ్ తేదీల విషయంలో చేస్తున్న జాప్యాన్ని ఐఐటీలు తీవ్రంగా పరిగణించి, గతేడాది ఈ కంపెనీలపై నిషేధం విధించాయి. ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆల్-ఐఐటీ ప్లేస్మెంట్ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్లలో పాల్గొనే ముందు కంపెనీల ట్రాక్ రికార్డును ఐఐటీలు పరిగణనలోకి తీసుకోవాలని ప్లేస్మెంట్ సెల్‌కు కమిటీ సూచించింది. ఐఐటీ బొంబైలో జరిగిన ఏఐపీసీ 23వ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐపీసీ కోఆర్డినేటర్ తెలిపారు. ఏఐపీసీ బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ పోర్షియా మెడికల్, ఫుడ్ టెక్ కంపెనీ జుమాటో, ఆన్లైన్ సెల్లర్ బేబీ-కేర్ ప్రొడక్టస్ హాప్స్కాచ్లున్నాయి. నిషేధం విధించిన కొన్ని కంపెనీలు ఐఐటీ పూర్వ విద్యార్థులు నడుపుతున్నవే కావడం గమనార్హం. ఒక విద్యార్థి ఒకే ఉద్యోగం సూత్రాన్ని ఐఐటీలు పాటిస్తున్నాయి. ఆన్-క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఒక జాబ్ ఆఫర్ వస్తే, మరిన్ని ఇంటర్వ్యూలకు హాజరుకావడానికి వీలులేదు. -
ఐఐటీలు, ఐఐఎంలకు అక్రిడిటేషన్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, అక్రిడిటేషన్లను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు ఈ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంలను భాగస్వాములుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను యూజీసీ పర్యవేక్షణలో నడిచే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఒక్కటే చేపడుతున్నది. అయితే ప్రముఖ ప్రయివేట్ సంస్థలనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని నీతి అయోగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ వనరులను సమర్ధంగా ఉపయోగించుకుంటూ ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. అక్రిడిటేష్న్ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంల పాత్రను పెంచేందుకు త్వరలో ఎనిమిది ఐఐటీలు, ఐఐఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను పలువురు స్వాగతించగా, మరికొన్ని ఐఐటీలు, ఐఐఎంలు ఫ్యాకల్టీ కొరతను చూపి అదనపు బాధ్యతలపై నిరాసక్తత వ్యక్తం చేశాయి. -
ప్రపంచ శ్రేణికి ‘పది’
భారతీయ విద్యాసంస్థల్లో ఐఐఎంలు, ఐఐటీలు మినహా మిగిలినవి ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయి. ఈ లోటు తీర్చే దిశగా కృషి చేయాలి.. అన్న పలువురు విద్యావేత్తల అభిప్రాయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది చర్యలు ప్రారంభించింది. ‘ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్’ పేరిట వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ రంగంలోని పది, ప్రైవేటు రంగంలోని పది (మొత్తం 20) విద్యా సంస్థలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు, విధి విధానాలు రూపొందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. తెరపైకి.. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన యూజీసీ.. గత ఏడాది యూజీసీ గైడ్‌లైన్స్–2016 (డిక్లరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్) పేరుతో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం.. ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలుగా గుర్తింపు పొందాలనుకునే విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధన అత్యున్నత స్థాయిలో ఉండాలి. బహుళ సామర్థ్య (మల్టీ డిసిప్లినరీ) కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెగ్యులర్ ప్రోగ్రామ్స్‌తో పాటు అంతర్గత సామర్థ్య (ఇంటర్ డిసిప్లినరీ) ప్రోగ్రామ్స్‌కు సైతం సమ ప్రాధాన్యం ఇవ్వాలి. విదేశీ ఫ్యాకల్టీ లేదా విదేశీ విశ్వవిద్యాలయాల అర్హతలున్న వారు ఫ్యాకల్టీ సభ్యులుగా ఉండాలి. ఈ విశ్వవిద్యాలయాల్లో స్వదేశీ విద్యార్థులతో పాటు, విదేశీ విద్యార్థుల నిష్పత్తి కూడా బాగుండాలి. ఒక విద్యా సంస్థను ప్రపంచ శ్రేణి సంస్థగా నిర్ధారించిన తర్వాత మూడేళ్ల కాలంలోపు ఫ్యాకల్టీ– విద్యార్థి నిష్పత్తి 1:10 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇతర మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలల పరంగా అత్యున్నత ప్రమాణాలు, పరికరాలు ఉండాలి. ప్రపంచ శ్రేణికి మారాక పదిహేనేళ్ల కాలంలో కనీసం 20 వేల మంది విద్యార్థులు చదువుతుండాలి. మొదటి పదేళ్ల కాలంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–500 జాబితాలో నిలవాలి. తర్వాత కాలంలో టాప్–100 జాబితాలో ఉండేలా నాణ్యత పాటించాలి. ప్రత్యేక నిధులు.. పూర్తి స్వయం ప్రతిపత్తి ప్రపంచ శ్రేణివిగా పేరొందాలని దరఖాస్తు చేసుకునే విద్యా సంస్థల విషయంలో యూజీసీ కల్పించిన ప్రధాన వెసులుబాటు.. అవి పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం. విదేశీ విద్యార్థులకు, స్వదేశీ విద్యార్థులకు తమ విచక్షణ మేరకు ఫీజులను నిర్ణయించొచ్చు. అంతేకాక కరిక్యులం రూపకల్పన, కోర్సు స్వరూపం, డిగ్రీ వ్యవధిని నిర్ణయించే విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే అవి ఎప్పటికప్పుడు తమ నిర్ణయాలను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా తమ సంస్థలో విద్యా నైపుణ్యాల పెంపు కోసం.. విదేశీ విశ్వవిద్యాలయాలతో ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్ విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఆ దేశాలు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్న నిషేధిత దేశాల జాబితాలో ఉండకూడదు. ఆర్థిక చేయూత.. రూ.వేల కోట్లలో ప్రపంచ శ్రేణి విద్యా సంస్థగా.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంపికైన వాటికి ఆర్థిక చేయూత విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయిదేళ్ల వ్యవధిలో ఒక్కో ఇన్స్టిట్యూట్కు రూ.500 కోట్ల చొప్పున కేటాయించాలని ప్రతిపాదించారు. ప్రపంచ శ్రేణికి యూజీసీ నిర్దేశించిన అర్హత ప్రమాణాలు ఆ విద్యా సంస్థ ఎంహెచ్ఆర్డీ ర్యాంకింగ్స్‌లో టాప్–25 జాబితాలో నిలిచి ఉండాలి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో టాప్–500లో ఉండాలి. దరఖాస్తు ఇలా ప్రపంచ శ్రేణి కోసం విద్యా సంస్థను ఎంపిక చేసేందుకు దరఖాస్తు ప్రక్రియ పరంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తారు. వచ్చిన దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. విద్యా సంస్థలు పేర్కొన్న పదిహేనేళ్ల ప్రణాళిక, రూపొందించుకున్న వ్యూహాల ఆధారంగా 20 సంస్థలను ఎంపిక చేస్తుంది. యూజీసీ మార్గదర్శకాలకు మార్పులతో మంత్రివర్గ ఆమోదం ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలకు సంబంధించి గతేడాది యూజీసీ గైడ్‌లైన్స్–2016 (డిక్లరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్)కు హెచ్ఆర్డీ మార్పులు చేసింది. వాటితో కూడిన బిల్లుకు తాజాగా కేబినెట్ ఆమోదం కూడా లభించింది. ఈ మార్పుల్లో ముఖ్యంగా పేర్కొనాల్సినవి. వరల్డ్ క్లాస్ బదులుగా.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా పేరు మార్పు తొలుత 20 విద్యా సంస్థలను ప్రపంచ శ్రేణిగా రూపొందించే విధంగా ప్రతిపాదనలు చేయగా.. ఈ క్రమంలో హెచ్ఆర్డీ చేసిన మొట్టమొదటి చర్య వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ పేరుకు బదులు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా పేరు మార్చడం దీంతోపాటు హెచ్ఆర్డీ శాఖ మరికొన్ని మార్పులు చేసింది. అవి.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా ఎంపికైన సంస్థ తర్వాత పదేళ్ల కాలంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–500లోపు జాబితాలో నిలవాలి. ప్రారంభంలో ఫ్యాకల్టీ – స్టూడెంట్ నిష్పత్తి 1:20గా ఉన్నప్పటికీ సదరు ఇన్స్టిట్యూట్ దరఖాస్తును పరిశీలిస్తారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఆ నిష్పత్తి 1:10 కంటే ఎక్కువ ఉండకూడదు. పదిహేనేళ్ల కాలంలో పదిహేనువేల మంది విద్యార్థులు ఎన్రోల్ అవ్వాలి. విదేశీ ఫ్యాకల్టీ పరంగా గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో టాప్–500 జాబితాలో నిలిచిన యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రొఫెసర్ల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి ఫ్యాకల్టీ సభ్యుడు ఏటా కచ్చితంగా ఒక రీసెర్చ్ పబ్లికేషన్‌ను రూపొందించాలి. మూల నిధి పెంపు యూజీసీ ప్రతిపాదనలకు హెచ్ఆర్డీ చేసిన మార్పుల్లో అత్యంత ప్రధానమైంది మూల నిధి (కార్పస్ ఫండ్) రూపంలో ఇన్స్టిట్యూట్లకు అందించే ఆర్థిక చేయూత. వాస్తవానికి యూజీసీ తొలుత రూ. 500 కోట్లు ప్రతిపాదించగా.. తాజాగా ఆ మొత్తాన్ని రూ. వేయి కోట్లకు పెంచింది. ఇలా పది ఇన్స్టిట్యూట్లకు కలిపి రూ.10 వేల కోట్లు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని తొలి దశగా 50 శాతం, తర్వాత రెండు, మూడేళ్ల కాలంలో మిగతా శాతాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంలో వినిపిస్తున్న మరో మాట.. ప్రభుత్వం తొలుత ఇచ్చే 50 శాతం తీసుకునే ఇన్స్టిట్యూట్లు.., మిగతా మొత్తం పొందడంలో సొంతంగా సమకూర్చుకునే పరంగానూ ఆలోచించాలని సూచించనున్నట్లు సమాచారం. ప్రైవేటు ఇన్స్టిట్యూట్లకు కార్పస్‌లో కోత యూజీసీ ప్రతిపాదనకు.. హెచ్ఆర్డీ చేసిన మరో పెద్ద మార్పు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా ఎంపికయ్యే పది ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు/యూనివర్సిటీలకు కార్పస్ ఫండ్‌ను భారీగా తగ్గించడం. రూ.500 కోట్ల నుంచి రూ.60 కోట్లకు ఈ మొత్తాన్ని కుదించారు. ఎంపికకు ఈఈసీ నిర్దేశిత నిబంధనల ప్రకారం అర్హత జాబితాలో ఉండి.. ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఎమినెన్స్ హోదాకు దరఖాస్తు చేసుకునే ఇన్స్టిట్యూట్ల దరఖాస్తులను సాధికార నిపుణుల కమిటీ (ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ) పరిశీలిస్తుంది. వాటినుంచి 20 సంస్థలను ఎంపిక చేసి ఆ జాబితాను యూజీసీకి పంపుతుంది. దాన్ని యూజీసీ మరోసారి పరిశీలించి.. తన నిర్ణయాన్ని హెచ్ఆర్డీ శాఖకు తెలియజేస్తుంది. తర్వాత హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ.. ఆయా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం చేసుకుంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ను ఎంపిక చేసేందుకు.. అందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు త్వరలోనే ఈఈసీ పత్రికల ద్వారా ప్రకటనలు ఇవ్వనున్నట్లు సమాచారం. 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లనే ఈఈసీ పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ఐఐఎంలకు మినహాయింపు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ హోదాపరంగా దరఖాస్తు విషయంలో.. ఇన్‌స్టిట్యూట్స్‌కు ఆ హోదా కల్పించే విషయంలో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లకు మినహాయింపు కల్పించారు. ఇవి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఒక కారణమైతే.. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రకారం పదేళ్ల కాలంలో 15 వేల మంది విద్యార్థులకు ఒక్కో ఐఐఎం ప్రవేశం కల్పిస్తే వాటి నాణ్యత తగ్గుతుందనేది మరో కారణం. భిన్నాభిప్రాయాలు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ ప్రణాళిక, ప్రతిపాదనల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పదేళ్ల గరిష్ట వ్యవధి పాటు నిరంతర పర్యవేక్షణ కష్టమని విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తి స్వయంప్రతిపత్తి కారణంగా ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
గ్లోబల్ గా దూసుకెళ్తున్న ఐఐటీలు
భారత్ లో ఐఐటీ లకు ఎక్కడ లేని గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు మరింత రెట్టింపు చేస్తూ ప్రపంచంలోనే ఎక్కువగా యూనికార్న్ స్టార్టప్ అధిపతులను తయారుచేసేది ఐఐటీలేనని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. యూనికార్న్ స్టార్టప్ వ్యవస్థాపకులను తయారుచేయడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు)లు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్థానంలో ఉన్నాయట. 1 బిలియన్ డాలర్లు(రూ.6600కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్ లను యూనికార్న్ స్టార్టప్ అంటారు. యూకేకు చెందిన సాఫ్ట్ వేర్ సంస్థ సేజ్ గ్రూప్ ప్రకారం స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తర్వాత ఐఐటీలు యూనికార్న్ స్టార్టప్ వ్యవస్థాపకులను తయారుచేస్తున్న ఇన్స్టిట్యూట్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచినట్టు తెలిసింది. 1బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన ప్రపంచవ్యాప్త స్టార్టప్ ల్లో ఐఐటీల నుంచి 12 ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మిట్, కార్నెల్ వంటి ఇన్స్టిట్యూట్ లు కూడా ఐఐటీల తర్వాత స్థానంలోనే ఉన్నాయి. ఐఐటీల్లో చదువుకున్న యూనికార్న్ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఫ్లిప్ కార్ట్(సచిన్, బిన్నీ బన్సాల్), స్నాప్ డీల్(రోహిత్ బన్సాల్), షాప్ క్లూస్(సంజయ్ సేథి), ఓలా(భావిష్ అగర్వాల్, అంకిత్ భట్టి), జుమాటో(దీపేందర్ గోయల్, పంకజ్) వంటి వారున్నారు. యూనికార్న్ స్టార్టప్ ల జాబితాలోనూ ఇండియా మూడో అతిపెద్ద హబ్ గా నిలుస్తున్నట్టు తాజా అధ్యయనంలో తెలిసింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానాన్ని దక్కించుకుంది. -
ఐఐటీలో చదివినా.. ఆఫర్లు రావట్లేదు!
ఈసారి క్యాంపస్ రిక్రూట్మెంట్ల కోసం చాలా కంపెనీలు ఐఐటీలకు వెళ్లాయి. కానీ, గత సంవత్సరంతో పోలిస్తే ఆ కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు మాత్రం చాలా తగ్గిపోయాయి. ఐఐటీ బాంబేలో గోల్డ్‌మన్ సాక్స్ కంపెనీ గత సంవత్సరం 16 మందిని తీసుకోగా, ఈసారి 13 మందినే తీసుకుంది. అలాగే బీసీజీ అనే కన్సల్టింగ్ సంస్థ గత సంవత్సరం తొమ్మిది మందికి అవకాశం ఇస్తే, ఈసారి నలుగురినే ఎంచుకుంది. ఈసారి ఎనలిటిక్స్ రంగం నుంచి ఎక్కువ ఆఫర్లు వచ్చాయంటున్నారు. గోల్డ్‌మన్ సాక్స్, జేపీ మోర్గాన్ లాంటి కంపెనీలు సాధారణంగా కోర్ ఫైనాన్స్ ప్రొఫైల్స్ నుంచే ఎక్కువ మందిని తీసుకుంటాయి. కానీ, ఈసారి వాళ్లు కూడా ఎనలిటిక్స్‌లోకే ఎక్కువగా తీసుకున్నారు. డచ్ బ్యాంక్, ఫ్లో ట్రేడర్స్ లాంటి కంపెనీలు మాత్రమే కోర్ ఫైనాన్స్ ఉద్యోగాలు ఆఫర్ చేశాయని, మిగిలినవి తీసుకున్నవే తక్కువైనా, అవి కూడా ఎనలిటిక్స్‌లోకే తీసుకున్నాయని ఓ విద్యార్థి చెప్పాడు. ఈ తరహా కంపెనీలకు ఎక్కువగా ఫైనాన్స్ ఉద్యోగాల కోసమే వెళ్తారని, కానీ వాళ్లు కూడా సాఫ్ట్వేర్, కోడింగ్ విద్యార్థులను అడుగుతున్నారని మరో విద్యార్థి తెలిపాడు. ఏఎన్‌జడ్, యాక్సిస్, సిటీఫైనాన్స్ లాంటి బ్యాంకులు కూడా తమకు ఎక్కువగా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు అక్కర్లేదు గానీ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, స్టాటస్టికల్ మోడలింగ్ వచ్చినవాళ్లు కావాలంటున్నాయి. ఒక్కసారిగా ఆఫర్లు తగ్గిపోవడంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులు నీరసించిపోయారు. ఇక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కూడా బిగ్ డేటా ఎనలిటిక్స్ రంగంలో 10 శాతం వృద్ధి కనిపించింది. ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ఎక్కువగా డేటా ఎనలిటిక్స్ మీదే ఆధారపడుతున్నారని, నిర్ణయాలన్నింటికీ డేటాయే ఆధారమని ఓ ప్లేస్మెంట్ రిప్రజెంటేటివ్ తెలిపారు. ఇప్పుడు ఈ రంగంలో రిక్రూట్మెంట్లు బాగా పెరిగాయని, ఇంతకుముందు సాధారణ బిజినెస్ ఎనలిటిక్స్ రంగంలో మాత్రమే తీసుకునే సంస్థలు కూడా ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ నిపుణుల కోసం చూస్తున్నాయన్నారు. దాంతోపాటు కోడింగ్ కూడా వచ్చి ఉంటే బంపర్ చాన్సులు వస్తున్నాయట. సాధారణంగా జేపీ మోర్గాన్ సంస్థ ఇన్నాళ్లూ కేవలం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలోనే ఉద్యోగాలు ఇచ్చేది గానీ, ఇప్పుడు మాత్రం అది కేవలం డేటా రోల్స్‌లోకి మాత్రమే తీసుకుంటోంది. చాలా కంపెనీలు ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ ప్రొఫైల్స్ కావాలనే అడుగుతున్నాయని, అందువల్ల విద్యార్థులు ఈ రంగంలో ఎక్కువగా దృష్టిపెట్టాలని ఐఐటీ మద్రాస్‌లో ప్లేస్మెంట్ ఇన్చార్జి అయిన ప్రొఫెసర్ మను సంతానం తెలిపారు. కంపెనీలు డేటా ఎనలిటిక్స్ రోల్స్ అడుగుతున్నాయని, కానీ విద్యార్థులకు దాని గురించే తెలియపోవడంతో రిక్రూట్మెంట్లు తగ్గాయని వివరించారు. ఐఐటీ రూర్కీలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోయాయి. వస్తున్న కంపెనీల సంఖ్య బాగానే పెరిగింది గానీ, వాళ్లు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య మాత్రం బాగా తగ్గిందని అక్కడి ప్లేస్మెంట్ ఇన్చార్జి ప్రొఫెసర్ ఎన్పీ పాదీ చెప్పారు. -
ఐఐటీల్లో సీట్ల సంఖ్య లక్షకు పెంపు
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో సీట్ల సంఖ్యను 2020 నాటికి ఒక లక్ష వరకూ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే వెల్లడించారు. ప్రస్తుతం అన్ని ఐఐటీల్లోనూ కలిపి 82,604 సీట్లున్నాయని తెలిపారు. ఐఐటీల్లో విద్యా ప్రమాణాలు నానాటికి తగ్గి పోతుండటంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ... విద్యావసరాలకు తగినట్లుగా ప్రతిభ గల అధ్యాపకులను ఎందుకు ఎంపిక చేయలేకపోతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. వీరి ఎంపికకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ.. ఉత్తమ ప్రతిభగల అధ్యాపకులను ఆకర్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడాది పొడవునా ప్రకటనలు ఇస్తున్నామని, అలాగే ప్రతిభ ఉన్న వారిని ఐఐటీలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఐఐటీలు ఢమాల్
న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు) గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఢమాల్ మనిపించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ మంగళవారం విడుదలచేసిన 2016-17 ర్యాంకింగ్స్‌లో ఐఐటీలు తమ స్థానాలను కోల్పోయాయి. ఈ ర్యాంకింగ్‌లో వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచంలో బెస్ట్‌గా నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో ఇండియాలో అత్యున్నత సంస్థగా మళ్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూరే చోటు దక్కించుకుంది. కానీ టాప్ 150 స్థానం నుంచి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ పడిపోయిందని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. అయితే ఐఐటీ మద్రాసు మాత్రం టాప్ 250 స్థానాన్ని చేధించి, ఐదు స్థానాలు పైకి ఎగబాకినట్టు ర్యాంకింగ్ల్లో తెలిసింది. 10 ఇండియన్ యూనివర్సిటీలో తొమ్మిది 700 ర్యాంకింగ్‌లో నిలిచాయి. అయితే గతేడాది కంటే ఈ యూనివర్సిటీలు తమ ఈ ర్యాంక్‌లను కోల్పోయాయి. అకాడమిక్, ఎంప్లాయర్ రిప్యూటేషన్ రెండింటి ర్యాంకింగ్‌లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు పేలవమైన ప్రదర్శన కనబర్చినట్టు ర్యాంకింగ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్ నుంచి కేవలం నాలుగు ఇన్స్టిట్యూట్లు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. భారత్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సీ 11వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ర్యాంకింగ్‌లో పడిపోవడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయని క్యూఎస్ ఇంటిలిజెంట్ యూనిట్ రీసెర్చ్ హెడ్ బెన్ సౌటర్ తెలిపారు. పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లు తక్కువగా ఉండట, ఇతర దేశాలనుంచి పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లను ఇండియా నియమించుకోవడం ర్యాంకింగ్‌లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పోటీదారులను ఇండియా పెంచుకుని ఫర్ఫార్మెన్స్ను ఇండియా మెరుగుపరుచుకోవాలని ఈ ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్టు సౌటర్ తెలిపారు. 2004 నుంచి యూఎస్ ఇన్స్టిట్యూషన్సే ఈ ర్యాకింగ్‌లో టాప్ 3 స్థానాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాయి. -
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోనూ డ్రాప్ అవుట్స్
ముంబై: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎమ్) లలో సీటు సాధిస్తే చాలు జీవితం సెటిల్ అయిపోయినట్లే నని అందురూ భావిస్తుంటారు. ఇందు కోసం రేయింబవళ్లు తీవ్రంగా కష్టపడి చదువుతారు. తీవ్ర పోటీని తట్టుకొని సీటు సాధిస్తారు. కానీ సీటు సాధించిన వారు కోర్సు మధ్యలోనే మానేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు 2000 మంది ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులు కోర్సు మధ్యలోనే మానేశారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అధికంగా ఐఐటీ విద్యార్థులే ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఢిల్లీ ఐఐటీ కి చెందిన 699 మంది విద్యార్థులున్నారు. తర్వాత వరుసగా ఐఐటీ ఖరగ్ పూర్ 544 , బాంబే ఐఐటీ 143 మంది విద్యార్ధులతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. డ్రాప్ అవుట్స్ అవుతున్న వారిలో పీహెచ్ డీ చేస్తున్నవారు ఎక్కువగా ఉన్నారని బాంబే ఐఐటీ డైరెక్టర్ దేవంగ్ ఖఖర్ తెలిపారు. ఐఐఎమ్ లో గడిచిన రెండేళ్లలో 104 మంది విద్యార్థులు కోర్సును మానేశారని ఐఐఎమ్ కోల్ కతా ఫ్యాకల్టీ సభ్యుడొకరు తెలిపారు. ఇందులో రాయ్ పూర్ లోని ఐఐఎమ్ నుంచి అత్యధికంగా 20 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. విద్యార్ధుల మానసిక ఆహ్లాదం కోసం ప్రతీ ఐఐటీ, ఐఐఎమ్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కోర్సులు అత్యంత కఠినంగా ఉండటం కారణంగానే డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం 16 ఐఐటీలున్నాయి. -
ఐఐటీ, ఐఐఎమ్‌ల్లో డ్రాపవుట్లకు కారణాలు అవే
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలని లక్షలాది మంది విద్యార్థులు తెగ తాపత్రయపడుతుంటారు. అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ల్లో సీటు రావడమే కష్టమంటే.. వాటిల్లో కూడా మధ్యలోనే సీటును వదిలేసి వెళ్లేవారి సంఖ్య ఏమంత తక్కువగా లేదంట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీస్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్స్) ల్లో డ్రాపవుట్ రేట్ పెరుగుతుందని వెల్లడైంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్. మహేంద్ర నాథ్ పాండే సమర్పించిన గణాంకాల్లో 201-16మధ్యకాలంలో మొత్తం 16 ఐఐటీల్లో 1,782 మంది విద్యార్థులు ఇన్స్టిట్యూట్ నుంచి..13 ఐఐఎంల్లో 104 మంది విద్యార్థులు కోర్సును మధ్యలోనే వదిలేసి వెళ్లారని తెలిపారు. ఐఐఎం-బీలో 2015-16 ఏడాదిలో నలుగురు విద్యార్థులు డ్రాపవుట్ అయ్యారని తెలిసింది. ఈ డ్రాపవుట్లు పెరగడానికి అనేక పరిమాణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మరొక ఇన్స్టిట్యూట్కు మారే క్రమంలో డ్రాపవుట్ల సంఖ్య పెరుగుతుందని ఐఐటీ బెంగళూరు డైరెక్టర్, ప్రొఫెసర్ ఎస్ సదాగోపాన్ తెలిపారు. బెటర్ ఆప్షన్‌కు, బెటర్ ఇన్స్టిట్యూట్కు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల కంటే ముంబై, న్యూఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ల్లో స్టడీస్‌కే నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో సీటు పొందిన వారు, ఈ ఇన్స్టిట్యూట్లకు తరలి వెళ్తుంటారని వెల్లడించారు. విద్యార్థుల డ్రాపవుట్‌కు మరో కారణంగా బెటర్ బ్రాంచ్ పొందలేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఐఐటీలో ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌ను, ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్సు బ్రాంచ్‌ను విద్యార్థులు పొందినప్పుడు, ఎన్ఐటీ కోసం విద్యార్థులు ఐఐటీని పరిత్యజిస్తున్నారని వివరించారు. విద్యార్థులు ఐఐటీలో సీటును వదులుకునేటప్పుడు రూ.1000 కంటే ఎక్కువ లెవీ విధించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలతో, తరచూ ఇలా జంపింగ్‌లకు పాల్పడుతుంటారని వెల్లడిస్తున్నారు. అకాడమిక్ ఒత్తిడి కూడా విద్యార్థులు సీటును వదులుకోవడానికి కారణంగా ఐఐటీ బెంగళూరు విద్యార్థి శ్రీకాంత్ శ్రీధర్ స్పష్టంచేశారు. ఫైనాన్సియల్ స్టెప్ కూడా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లు వదులుకోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఇన్స్టిట్యూట్లు ఫైనాన్సియల్ సహకారం కల్పిస్తాయని, కానీ అప్పటికీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని విద్యార్థులు సీటు కోల్పోతున్నారని వెల్లడించారు. -
20 కంపెనీలపై ఐఐటీలు నిషేధం
న్యూఢిల్లీ : 20 స్టార్టప్, ఈ-కామర్స్ కంపెనీలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు) నిషేధం విధించనున్నాయి. కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా ఈ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నాయి. అధికవేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకోవడం వంటి ఘటనలపై సీరియస్‌గా స్పందించిన ఐఐటీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీల జాబితాను ఐఐటీల ప్లేస్మెంట్ కమిటీ(ఏఐసీసీ) ఇంకా వెల్లడించలేదు. బ్లాక్లిస్ట్తో పాటు ఆఫర్ లెటర్లు ఇచ్చి విత్ డ్రా చేసుకోవడం, ముందు ప్రకటించిన వేతనంలో కోత విధించడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి వరుస ఘటనల నేపథ్యంలో కంపెనీలు సీరియస్ వార్నింగ్ లెటర్లు కూడా అందుకోనున్నాయి. గతేడాది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడిచినా స్పందించకపోవడంతో, ఆ కంపెనీ కూడా వార్నింగ్ లెటర్‌ను అందుకోనుందని తెలుస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ జాబ్ ఆఫర్లను పూర్తిగా ఉపసంహరించుకోకపోవడం వల్ల బ్లాక్‌లిస్ట్ విధించిన జాబితాలో ఉండకపోవచ్చని ఏఐపీసీ కన్వినర్ కౌస్తుబా మోహంతి అన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా జూమోటో కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కంపెనీలు ఇంకా స్పందించలేదు. క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో కంపెనీలు చేస్తున్న నిర్లక్ష్యపూరితమైన అంశాలపై ఐఐటీలు సీరియస్‌గా స్పందించాయని, ఏకగ్రీవంగా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ పెట్టడానికి ఆమోదించాయని చెప్పారు. ఐఐటీ కాన్పూర్‌లో 12 ఐఐటీలతో నిర్వహించిన 2017 ప్లేస్మెంట్ మీటింగ్‌లో ఏఐపీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఐఐటీ బొంబై ఈ మీటింగ్‌కు హాజరుకాలేదని మోహంతి చెప్పారు. -
ఐఐటీల స్పెషల్ డ్రైవ్స్
న్యూఢిల్లీ : ఉద్యోగ ఆఫర్ పొందని విద్యార్థుల సంఖ్యను తగ్గించుకోవడానికి, ఉద్యోగవకాశాలను పెంపొందించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ టెక్నాలజీ(ఐఐటీలు) కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. ప్రీ ప్లేస్‌మెంట్‌గా వచ్చే ఇంటర్న్‌షిప్ ఆఫర్లను ఇంజనీరింగ్ విద్యార్థులు స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఫైనల్ ప్లేస్మెంట్ల ఒత్తిడిని ఐఐటీలు తగ్గించుకోవాలనుకుంటున్నాయని దీనికి సంబంధించిన ఓ అధికారి చెప్పారు. ఖరగ్‌పూర్, చెన్నై, కాన్పూర్, గౌహతి, రూర్కే, వారణాసి, హైదరాబాద్ ఐఐటీలు ఈ విధంగా ఓవర్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఎంప్లాయర్స్ నుంచి వచ్చే ఇంటర్న్‌షిప్‌లకు ఓకే చెప్పేలా విద్యార్థులను ఐఐటీలు సన్నద్ధం చేస్తున్నాయి. ఇంటర్న్‌షిప్, విద్యార్థులో విశ్వాసాన్ని మరింతగా నింపుతుందని ఐఐటీ రూర్కే ప్రొఫెసర్, ప్లేస్‌మెంట్స్ ఇన్ఛార్జ్ ఎన్పీ పాధే తెలిపారు. ఇంటర్న్‌షిప్ పొందిన 90 శాతం మంది ఐఐటీ విద్యార్థులు కంపెనీల్లోనే ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారని ఐఐటీ హైదరాబాద్ ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్, ట్రైనింగ్ సెల్ ఫ్యాకల్టీ మెంబర్ బీ వెంకటేశం చెప్పారు. చాలా ఐఐటీలు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నట్టు వెల్లడించారు. తమ విద్యార్థులకు ఆఫర్ చేసే ఇంటర్న్‌షిప్‌లపై ఇన్స్టిట్యూట్లు సీరియస్‌గా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జాబ్ ఆఫర్లపై సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ ఇంటర్న్‌షిప్ ఎక్కువగా దోహదం చేయనుందని, ఇటు కంపెనీలకు, అటు స్టూడెంట్లకు ఇది ఓ పునాది మార్గంగా ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతేడాది 5-15 శాతం విద్యార్థులు జాబ్ ఆఫర్లను పొందలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనేది ఐఐటీలకు సహజమైన అడుగని ఐఐటీ ఖరగ్ పూర్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చైర్మన్ దేవాసిస్ దేవ్ చెప్పారు. దీంతో పైనల్ ప్లేస్ మెంట్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. 300 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లను ఈ ఏడాది ఐఐటీ ఖరగ్‌పూర్ పొందిందని, గతేడాదితో పోలిస్తే ఇది డబుల్ అయిందని పేర్కొన్నారు. కొన్ని వారాల్లోనే ఐఐటీల్లో ప్రీప్లేస్‌మెంట్ ఆఫర్లు ప్రారంభంకాబోతున్నాయి. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో భాష్యం విజయకేతనం
హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చెప్పారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థి చుండూరు రాహుల్ ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకుతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీలో కల్లూరి హరిప్రసాద్ అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడని చెప్పారు. జేఈఈ లక్ష్యంగా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దుతూ ఏటా సంచలన విజయాలను నమోదు చేస్తున్నామన్నారు. నారాయణ శ్రీచైతన్య హవా హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ సత్తా చాటిందని ఆ విద్యాసంస్థల డెరైక్టర్లు పేర్కొన్నారు. అత్యధిక టాప్ ర్యాంకులతోదేశంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. విద్యా సంస్థల డెరైక్టర్లు డాక్టర్ బీయస్ రావు, డాక్టర్ పి.సింధూర నారాయణ, సుష్మ, శ్రీనిశిత్ విలేకరులతో మాట్లాడుతూ, ఓపెన్ కేటగిరీలో 50 శాతం టాప్ ర్యాంకులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముందు వరుసలో నిలిచారని చెప్పారు. దక్షిణ భారతదేశం నుంచి ఫస్ట్ ర్యాంక్‌తో పాటు ఆలిండియా 4, 5, 7, 8, 10.. ఇలా 50 శాతం టాప్ ర్యాంకులు కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో దక్షిణ భారతదేశం నుంచి తొలి ర్యాంకును, ఆలిండియా నాలుగో ర్యాంకులను జీవితేష్ దుగ్గాని, ఆలిండియా ఐదో ర్యాంకును సాయితేజ తాళ్లూరి, ఆలిండియా ఏడో ర్యాంకును జి.నిఖిల్ సామ్రాట్, 8వ ర్యాంకును సాయి ప్రణీత్ రెడ్డి, పదో ర్యాంకును విఘ్నేశ్వర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. శ్రీగాయత్రి విజయభేరి హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ గాయత్రి విద్యార్థులు ఆలిండియా టాప్ ర్యాంకుల సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ పీవీఆర్కే మూర్తి తెలిపారు. వివిధ కేటగిరీల్లో 1,000 లోపు 32 ఆలిండియా ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. శ్రీ గాయత్రి లక్ష్య, ఇంటెన్సివ్ ప్రోగ్రాం, ఐసీసీ ప్రోగ్రామ్ వల్లే తాము ఈ ఘన విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్స్ రికార్డు హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు సంచలనం సృష్టించారని విద్యాసంస్థల చైర్మన్ కేకేఆర్ తెలిపారు. తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 4, 13, 16, 25.. వంటి ఆలిండియా టాప్ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈ ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్రాంచీల విద్యార్థుల నుంచి సాధించినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేఈఈలో విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాభినందనలను తెలియజేశారు. ‘శశి’ ప్రభంజనం హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో మరోమారు సత్తా చాటారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రిన్స్ కమల్ తేజ జాతీయ స్థాయిలో 296 వ ర్యాంకు, టీ సుందర్ 389 వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. హాజరైన 92 మందిలో 51 మంది ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 5 వేల లోపు 19 ర్యాంకులు, 8 వేలలోపు 23 ర్యాంకుల సాధించారన్నారు. ‘విశ్వభారతి’ పూర్వ విద్యార్థికి 8వ ర్యాంకు హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గుడివాడ విశ్వభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ పూర్వ విద్యార్థి సుంకేశుల సాయి ప్రణీత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించాడని స్కూల్ చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ తెలిపారు. మరో పూర్వ విద్యార్థి వి.నిరంజన్ ఆలిండియా 12 వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ఆర్’ ప్రతిభ హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి తెలిపారు. జి.రవితేజ జాతీయ స్థాయిలో (రిజర్వేషన్ కేటగిరీ) 16వ ర్యాంకు, భూక్యా రాంనాయక్ 48వ ర్యాంకు సాధించారు. సన్నతి ప్రవీణ్ 50వ ర్యాంకు సాధించాడు. వీరితో పాటు మరో 61 మంది ఐఐటీలో ప్రవేశానికి అర్హత సాధించారని వరదారెడ్డి వివరించారు. వారిని డైరక్టర్లు మధుకర్, సంతోష్‌రెడ్డి తదితరులు అభినందించారు. -
ర్యాంకర్ల మనోగతం
బాంబే ఐఐటీలో సీఎస్ఈ: జీవితేశ్ ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయడమే తన లక్ష్యమని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా నాలుగో ర్యాంకు సాధించిన జీవితేశ్ చెప్పాడు. ఈయన తండ్రి శివకుమార్ వీటీపీఎస్‌లో ఏడీఈగా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు విజయవాడలో చదివిన జీవితేశ్.. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి 981 మార్కులు సాధించాడు. తెలంగాణ ఎంసెట్‌లో 35, ఏపీ ఎంసెట్‌లో 78వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతా: సాయితేజ ‘‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ ఫ్యాకల్టీ గెడైన్స్‌తోనే ఈ విజయం సాధ్యపడింది. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవడం నా లక్ష్యం. ఆ తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా’’ అని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐదో ర్యాంకు సాధించిన తాళ్లూరి సాయితేజ చెప్పాడు. టాప్-5లో స్థానం దక్కుతుందని ముందుగా ఊహించానన్నారు. గుంటూరు జిల్లా కూచిపూడికి చెందిన వీరి కుటుంబం చాలా సంవత్సరాల కిందట హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్థిరపడింది. నాన్న చలపతిరావు సివిల్ కాంట్రాక్టర్. తెలంగాణ ఎంసెట్‌లో సాయితేజ మొదటి ర్యాంకు సాధించగా... ఏపీ ఎంసెట్‌లో ఏడో ర్యాంకు పొందాడు. ఎంసెట్‌లో 3.. అడ్వాన్స్‌డ్‌లో 7 వరంగల్ జిల్లాకు చెందిన నిఖిల్ సామ్రాట్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. నిఖిల్ తండ్రి ప్రసాద్ విద్యాశాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. బాంబే ఐఐటీలో సీఎస్ఈ చేస్తానంటున్న నిఖిల్ తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో 54వ ర్యాంకు సాధించాడు. బాంబేలో చదువుతా: ప్రణీత్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి రాజగోపాల్ రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. అమ్మ శ్రీలత గృహిణి. చిన్నతనం నుంచే చదువులో ముందుండే ప్రణీత్... తెలంగాణ ఎంసెట్‌లో 31, ఏపీ ఎంసెట్‌లో 53వ ర్యాంకు పొందాడు. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తానని చెప్పాడు. స్పేస్ సైంటిస్ట్ అవుతా: విఘ్నేష్ రెడ్డి బాంబే ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తానని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు సాధించిన కొండా విఘ్నేష్ రెడ్డి చెప్పాడు. ఈయనది నెల్లూరు జిల్లా. నాన్న శ్రీనివాసులు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమ్మ సరళాదేవి గృహిణి. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్‌లోనే స్థిరపడింది. ‘‘నాకు అంతరిక్షం అంటే చిన్నప్పట్నుంచీ చాలా ఆసక్తి. స్పేస్ సైంటిస్ట్ కావడమే నా జీవిత లక్ష్యం. 2025 నాటికి ఇస్రో ప్రపంచాన్ని శాసిస్తుందని నా నమ్మకం. అప్పటికి ఇస్రోలో నా పాత్ర ఉండాలి’’ అని విఘ్నేష్‌రెడ్డి పేర్కొన్నాడు. -
23 ఐఐటీల్లో 10,575 సీట్లు
ఓపెన్ కేటగిరీలో 5187 స్థానాలు సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలి తాలు వెలువడడంతో అందులో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్ధులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో చేరేందుకు వీలుగా తదుపరి సన్నాహాల్లో నిమగ్నమవుతున్నారు. దేశంలో 23 ఐఐటీ సంస్థలుండగా తమకు ఏ ఐఐటీలో సీటు దక్కుతుందన్న అంశాలపై వారంతా దృష్టి సారించారు. దేశం మొత్తం మీద ఐఐటీల్లో 10,575 సీట్లు ఉన్నాయి. అందులో శారీరక అంగవికలుర కు మూడుశాతం కోటా వర్తిస్తుంది. మొత్తం సీట్లలో ఓపెన్ కేటగిరీలో 5187 ఉండగా తక్కినవన్నీ వివిధ రిజర్వుడ్ కేటగిరీల కింద కేటాయించారు. ఓపెన్ కేట గిరీలో వికలాంగులకు 150 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 1537, ఎస్సీ వికలాంగులకు 48, ఎస్టీలకు 773, ఎస్టీ వికలాంగులకు 31 సీట్లు కేటాయించారు. ఇక ఓబీసీలో నాన్ క్రిమీలేయర్‌కింద 2763, ఓబీసీ వికలాంగ అభ్యర్ధులకు 86 సీట్లు కేటాయించారు. అత్యధిక సీట్లు ఖరగ్‌పూర్ ఐఐటీలో (1341) ఉన్నాయి. రెండో స్థానంలో వారణాసి ఐఐటీ (1090 సీట్లు) ఉంది. 20 నుంచి ఐఐటీల్లో సీట్లు కేటాయింపు 15న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు వెలువడిన నేపథ్యంలో ఐఐటీల్లో ఈ నెల 20 నుంచి సీట్ల కేటాయింపు చేపట్టేందుకు ఐఐటీల సంయుక్త కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీలో ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)ను ఈ నెల 15న నిర్వహించేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం నుంచే ఏఏటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆర్కిటెక్చర్ ప్రవేశ పరీక్షను ఈ నెల 15న ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు జోనల్ ఐఐటీల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వీటి ఫలితాలను ఈ నెల 19న ప్రకటించనుంది. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 19లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. -
ఐఐటీ ప్లేస్ మెంట్ కమిటీ బ్లాక్ లిస్ట్ లో ఆరు కంపెనీలు
ముంబై : అధిక వేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... ఉద్యోగాల్లో చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్న కంపెనీలపై ఐఐటీల ప్లేస్ మెంట్ కమిటీ(ఏఐపీసీ) సీరియస్ అయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో ఇటీవల నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) స్పందించింది. ఇకమీదట కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా అరు కంపెనీలను ఈ ఏడాది బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కంపెనీల్లో ఉద్యోగాల నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి వరుస ఘటనల నేపథ్యంలో ఏఐపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో శుక్రవారం భేటీ అయిన కమిటీ అరడజను కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్టు ప్రకటించింది. ఆఫర్ లెటర్లు ఇచ్చి విత్ డ్రా చేసుకోవడం, ముందు ప్రకటించిన వేతనంలో కోత విధించడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి మూడు కారణాలను పరిగణలోకి తీసుకుని ఈ బ్లాక్ లిస్ట్ ను విదించినట్టు ఐఐటీ మద్రాస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ అడ్వైజర్ వీ.బాబు తెలిపారు. అయితే ఏయే కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారో ఆ కంపెనీ వివరాలను వెల్లడించలేదు. ఏడాది పాటు ఈ కంపెనీలు ఐఐటీల్లో ప్లేస్ మెంట్లు నిర్వర్తించకుండా బ్లాక్ లిస్ట్ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవలే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో, ఐఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఐఐటీ గౌహతి క్యాంపస్ లో ఐదుగురు విద్యార్థులకు జింప్లీ సంస్థ, ఐఐటీ బొంబాయి క్యాంపస్ లో ఏడుగురు విద్యార్థులకు పోర్టియా అండ్ పెప్పర్ సంస్థ జాబ్ ఆఫర్లు ప్రకటించి, ఫిబ్రవరి మధ్యలో విత్ డ్రా చేసుకుంది. -
మాతృభాషల్లో ఐఐటీ
చెన్నై: తమిళం, తెలుగు, కన్నడం తదితర విద్యార్థులు వారివారి మాతృ భాషల్లో ఐఐటీ ప్రవేశ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ఎండీఎంకే కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్నికల కసరత్తుకు శ్రీకారం చుడుతూ సోమవారం పార్టీ కార్యవర్గం, అనుబంధ విభాగాల కార్యవర్గాలతో వైగో మంతనాల్లో మునిగారు. ప్రజా కూటమికి నేతృత్వం ఎవరన్న అంశంపై, తమకు పట్టున్న స్థానాల ఎంపికపై నేతల అభిప్రాయాల్ని సేకరించారు. ఎగ్మూర్‌లోని తాయగంలో ఎండీఎంకే రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల కార్యవర్గాల సమావేశం పార్టీ ప్రిసీడి యం చైర్మన్ తిరుపూర్ దురై స్వామి అధ్యక్షతన జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహాల్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో రచించారని చెప్పవచ్చు. ప్రజా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలన్న అంశంపై పార్టీ వర్గాలతో సమాలోచించడమే కాకుండా, తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఆయా స్థానాల్ని ప్రజా కూటమిలో సీట్ల పందేరం సమయంలో చేజిక్కించుకోవడంతో పాటుగా, ఆయా ప్రాంతాల్లో పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న నాయకులు, ప్రజా బలం, ఆర్థిక బలం కల్గిన వారి వివరాలను ఆరా తీసినట్టు సమాచారం. ఆయా స్థానాల్లో ఇప్పటి నుంచే కార్యక్రమాల్ని విస్తృతం చేయడం కోసం వ్యూహాల్ని రచించి ఇచ్చి ఉన్నారు. ప్రజా కూటమిలోకి డీఎండీకే నేత విజయకాంత్ వచ్చిన పక్షంలో ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే వచ్చే లాభనష్టాల మీద పార్టీ వర్గాల అభిప్రాయాల్ని వైగో స్వీకరించినట్టు తెలిసింది. ఈ సమావేశం అంతా రానున్న ఎన్నికల్ని టార్గెట్ చేసి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా కూటమికి నేతృత్వం వైపుగా సాగినా, చివరకు తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన తీర్మానాలను మీడియాకు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. మాతృభాషల్లో పరీక్ష: ఐఐటీ ప్రవేశ నిమిత్తం తమిళం, తెలుగు, కన్నడం తదితర 22 భాషలకు చెందిన విద్యార్థులు వారి వారి మాతృభాషల్లో పరీక్షలు రాసుకునేందుకు అనుమతి కల్పిస్తూ కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంబరంబాక్కం నీటి విడుదలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తమిళనాడులో నెలకొన్న పరిణామాలను జాతీయ విపత్తుగా ప్రకటించి,ప్రజల్ని ఆదుకునేందుకు రూ.50 వేల కోట్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నది పరివాహక, చెరువులు తదితర ప్రాంతాల్లోని ఆక్రమణలను ఆగమేఘాలపై తొలగించాలని డిమాండ్ చేశారు. జల్లికట్టుకు త్వరితగతిన అనుమతి మంజూరు చేయాలని, అందుకు తగ్గ చర్యల్ని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వేగవంతం చేయాలని కోరారు. -
జూన్ 24నే తుది ర్యాంకులు
ముందస్తుగా జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు ఉమ్మడి ప్రవేశాల కోసం ర్యాంకుల వెల్లడి తేదీల మార్పు ఈనెల 24న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష.. జూన్ 25 నుంచి విద్యార్థుల ఆప్షన్ల స్వీకరణ జూలై 1న ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్ల కేటాయింపు జూలై 16 నుంచి ఐఐటీల్లో, 23 నుంచి ఎన్ఐటీల్లో తర గతులు షెడ్యూలు ప్రకటించిన జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలను త్వరగా పూర్తి చేసి, సకాలంలో తరగతులను ప్రారంభించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా ప్రవేశాల్లో జాప్యం జరుగుతుండటంతో తరగతుల ప్రారంభం ఆలస్యమవుతోంది. దీంతో విద్యా సంవత్సరంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి నిర్ణీత వ్యవధిలోనే (జూలై) తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీలకు వేర్వేరుగా ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టడం వల్ల సీట్లు మిగిలిపోతుండటంతో అలా జరగకుండా ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను ముందస్తుగా వెల్లడించేందుకు మంగళవారం షెడ్యూలు ప్రకటించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ముందుగా ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్, 10, 11 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్షల్లో విద్యార్థుల స్కోర్‌ను ఏప్రిల్ 27న ప్రకటించింది. ఆల్ ఇండియా ర్యాంకులను జూలై 7న వెల్లడించాల్సి ఉంది. అయితే ఉమ్మడి కౌన్సెలింగ్ నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 24నే ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల జేఈఈ మెయిన్‌కు చెందిన సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు చెందిన జాయింట్ అడ్మిషన్ బోర్డు సంయుక్తంగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీగా ఏర్పడి ఉమ్మడి కౌన్సెలింగ్‌కు చర్యలు చేపట్టాయి. ఈనెల 24న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 18న ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు జూన్ 24న జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను కూడా వెల్లడించి, 25వ తేదీ నుంచే విద్యార్థుల నుంచి ఆప్షన్ల నమోదుకు చర్యలు చేపట్టింది. మొత్తానికి జూలై 16 నుంచి ఐఐటీల్లో, 23 నుంచి ఎన్ఐటీల్లో తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూలు - ఈనెల 7 వరకు: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ - మే 11-14 వరకు: హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డు) డౌన్లోడ్ - మే 24: రాత పరీక్ష (ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపరు-2) - జూన్ 8: ఆన్లైన్లో జవాబుల కీ - 8 -11 వరకు: జవాబుల కీపై అభ్యంతరాలు స్వీకరణ - 13: మార్కుల విడుదల - 18: జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటన ఇదీ సీట్ల కేటాయింపు షెడ్యూలు జూన్ 24: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు 25-29 వరకు: విద్యార్థులు కాలేజీలను ఎంచుకునేందుకు ఆప్షన్లు (చాయిస్) 28: ఆప్షన్లను బట్టి మాక్ సీట్ అలొకేషన్ ప్రదర్శన 30: ఐఐటీ/ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు, పరిశీలన జూలై 1: మొదటి దశ సీట్లు కేటాయింపు ప్రకటన 2-6 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం 7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్లు ప్రకటన. రెండో దశ సీట్ల కేటాయింపు 8-11 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం 12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాల ప్రకటన. మూడో దశ సీట్లు కేటాయింపు 13 -15 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం 16 నుంచి: ఐఐటీల్లో తరగతులు ప్రారంభం. భర్తీ అయిన, మిగిలిన సీట్ల వివరాల ప్రకటన. నాలుగో దశ సీట్లు కేటాయింపు 17- 20 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం 23 నుంచి: ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో తరగతుల ప్రారంభం ఇదీ ఐఐటీ ప్రవేశ అర్హత విధానం ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంకుతోపాటు అర్హత పరీక్ష అయిన 12వ తరగతి/ఇంటర్మీడియట్ బోర్డులో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా అర ్హత పరీక్షలో 75 శాతం (జనరల్), ఓబీసీ, 70 శాతం (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) మార్కులు సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క నిబంధనకు అర్హత సాధించినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఆ విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇదీ ఎన్ఐటీలో ప్రవేశాల విధానం విద్యార్థి జేఈఈ మెయిన్‌లో సాధించిన స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, 12వ తరగతి/ఇంటర్మీడియట్ సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి సదరు విద్యార్థి ఆల్ ఇండియా తుది ర్యాంకును ఖరారు చేస్తారు. విద్యార్థి చాయిస్‌ను బట్టి, తుది ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో సీట్లను కేటాయిస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్ఐటీ ఉన్నా.. ఆ రాష్ట్ర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకే హోమ్‌స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లను కేటాయిస్తారు. -
నాణ్యమైన విద్యకు ఐఐటీలదే బాధ్యత!
న్యూఢిల్లీ:దేశంలోని నాణ్యమైన విద్యను అందించేందుకు ఐఐటీల నడుంబిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్సష్టం చేశారు. దీనికి సంబంధించిన మార్గాలను ఐఐటీలు అన్వేషించాలని ఆయన తెలిపారు. ఆ రకంగా విద్యలో నాణ్యత ఉన్నప్పుడు భారతదేశం మానవ వనరల్లో విశిష్టమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్ లో ఐఐటీ బోర్డు అధ్యక్షులతో సమావేశమైన ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో జ్ఞానం పెంపొందించడానికి ఐఐటీ నాయకత్వం వహించాలి. అందుకోసం తగిన ప్రణాళికలతో ఐఐటీ నిపుణులు ముందుకెళ్లాలి. ఏ రకంగా అయితే నాణ్యమైన విద్యను అందించ గలమో.. దాని కోసం ఐఐటీలు శోధించాలి' అని ప్రణబ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరతిగతిన తగిన చర్యలు చేపట్టాలని ఆయన విజ్క్షప్తి చేశారు. మన శక్తి సామర్ధ్యాలు స్వదేశీ పరిజ్ఞానానికి వినియోగించి పలు శాటిలైట్ లను అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి వినియోగించాలన్నారు. -
ఐఐటీల్లో హ్యూమానిటీస్ కోర్సులు
దేశంలో సాంకేతిక విద్యకు తలమానికం.. ఐఐటీలు. ఇంజనీరింగ్ విద్యను అందించడంలోప్రపంచ వినుతికెక్కిన ఈ విద్యా సంస్థలు.. మారుతున్న ఒరవడికి అనుగుణంగా తమ పంథాను మార్చుకుంటున్నాయి.. విద్యార్థి తాను చదువుతున్న డిగ్రీకే పరిమితం కాకుండా.. తన చుట్టూ ఉన్న సమాజాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా రూపొందించే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాయి.. ఈ ఆలోచనల్లోంచే ఐఐటీలు తమ కరిక్యులంలో సాంకేతిక అంశాలతో పాటు సామాజిక విషయాలకు పెద్ద పీట వేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఐఐటీలు అందిస్తున్న హ్యూమానిటీస్ కోర్సులు, సంబంధిత అంశాలపై విశ్లేషణ.. ప్రస్తుత విద్యా రంగంలో ఎటు చూసినా ప్రొఫెషనల్ కోర్సుల హవా కొనసాగుతుంది. దాంతో విద్యార్థులు తమ ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకే పరిమితమవుతున్నాడు. చుట్టూ ఉన్న ప్రపంచం, చరిత్ర, వారసత్వ సంపద, మానవ సంబంధాలు.. సమాజం పరంగా తన బాధ్యత వంటి అంశాలే విద్యార్థిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. ఈ ప్రాముఖ్యాన్ని గుర్తించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు హ్యూమానిటీస్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటితోపాటు బిట్స్-పిలానీ, నిట్లు కూడా ఇంగ్లిష్, సైకాలజీ, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ వంటి కోర్సులను బోధిస్తున్నాయి. ఆలోచన వెనక: కొత్తగా వస్తున్న సాంకేతిక మార్పులతో ప్రపంచమంతా యాంత్రికంగా మారుతోంది. ఈ నేపథ్యంలో..చుట్టూ ఉన్న సమాజాన్ని, మానవ సంబంధాలను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూఎస్ లిబరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాదిరిగా.. డిస్క్రిప్టివ్(Descriptive), నార్మేటివ్ (Normative) అంశాలకు విద్యా వ్యవస్థలో ప్రాధాన్యం ఉండాలి. ఈ ఆలోచనే ఐఐటీలతోపాటు ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో హ్యూమానిటీస్ కోర్సులు ప్రారంభానికి దోహదం చేసింది. హ్యూమానిటీస్ కోర్సులు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాం? మన చరిత్ర ఏమిటి? చుట్టూ ఉన్న ప్రజలతో మనకున్న సంబంధం? సామాజిక బాధ్యత? ఏవిధంగా ఒక సమాజంగా మనుగడ సాగించాలి? వంటి అంశాలను తెలుసుకోవడం ద్వారా పరిపూర్ణ మూర్తిమత్వానికి పునాది వేసుకోవడం.. హ్యూమానిటీస్ కోర్సులతోనే సాధ్యం. ఐఐటీలను మొదట ప్రారంభించినప్పుడు.. దేశం ఒక అత్యున్నత సాంకేతిక సమాజంగా రూపుదిద్దుకోవాలని అప్పటి విధాన నిర్ణేతలు భావించారు. కాబట్టి అప్పట్లో హ్యూమానిటీస్ కోర్సులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. సమాజం నిరంతరం మార్పు దిశగా పయనిస్తున్న క్రమంలో హ్యూమానిటీస్ అంశాలకు కూడా ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు ఐఐటీని చేరువ చేయాలనే ఉద్దేశం కూడా ఈ నిర్ణయం వెనక దాగి ఉంది. పరిధి: హిస్టరీ, ఎకనామిక్స్, డెవలప్మెంట్ స్టడీస్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, లిటరేచర్, లా, సోషియాలజీ, రిలీజియన్, కల్చర్, ఆర్ట్స్, అంత్రోపాలజీ, కమ్యూనికేషన్, సైకాలజీ వంటి సబ్జెక్టులు హ్యూమానిటీస్ కోర్సుల పరిధిలోకి వస్తాయి. వీటిల్లో ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్ట్‌లను దాదాపు అన్ని ఐఐటీలు, బిట్స్-పిలానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం) ఆఫర్ చేస్తున్నాయి. కరిక్యులంలో భాగంగా: ప్రస్తుతం బీటెక్ విద్యార్థి కేవలం తన సబ్జెక్ట్‌కు మాత్రమే పరిమితమైతే సరిపోదు. తన చుట్టూ ఉన్న ప్రపంచం, ఎంచుకున్న రంగంలో సాంఘికంగా, ఆర్థికంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనించడం తప్పనిసరి. అంతేకాకుండా వివిధ రకాల మనస్తత్వం, విభిన్న సంస్కృతుల నేపథ్యం ఉన్న వ్యక్తులతో ఏవిధంగా వ్యవహరించాలో అవగాహన ఏర్పర్చుకోవాలి. చరిత్ర, సాహిత్యం మీద కూడా ఆసక్తి ఉండడం కూడా చాలా అవసరం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వీటి ప్రాముఖ్యతను గుర్తించిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఈ అంశాలను సిలబస్‌లో భాగంగా ఆఫర్ చేస్తున్నాయి. తదనుగుణంగా.. సోషియాలజీ, ఫిలాసఫీ, సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫారెన్ లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ వంటి అంశాలకు కరిక్యులంలో చోటు కల్పించాయి. ఈ క్రమంలో అన్ని ఐఐటీల్లో హ్యూమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ విభాగం కనిపిస్తుంది. ఇంటర్ డిసిప్లినరీగా: కొన్ని ఐఐటీలు హ్యూమానిటీస్ అంశాలను రెగ్యులర్ కరిక్యులంలో తప్పనిసరిగా చేస్తే.. కొన్ని అంశాలను మాత్రం ఐచ్ఛికంగా ఆఫర్ చేస్తున్నాయిు. తద్వారా ఒక టెక్నికల్ విద్యార్థి కేవలం తన రంగానికి పరిమితం కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచంపై అవగాహన పెంచుకునేందుకు తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు ఐఐటీ-కాన్పూర్ బ్యాచిలర్ స్థారుులో ప్రత్యేకంగా బీఎస్-ఎకనామిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అదే ఐఐటీ-ఢిల్లీ విషయానికొస్తే.. ఎకనామిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ అంశాలను అందిస్తుంది. ఇవి ఐచ్ఛికం. వీటిని ఇంటర్‌డిసిప్లినరీ పద్ధతిలో బోధిస్తుంది. ఇదే ఇంటర్‌డిసిప్లినరీ విధానాన్ని దాదాపు అన్ని ఐఐటీలు అనుసరిస్తున్నాయి. దాదాపు అన్ని ఐఐటీలు హ్యూమానిటీస్ కోర్సులను పీజీ, పీహెచ్డీ విభాగాల్లో అందిస్తుండడం విశేషం. తప్పనిసరి: దేశంలో సంస్కరణల ఫలితంగా ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ భాగస్వామ్యం, గ్లోబలైజేషన్ ఫలితంగా హ్యూమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సుల ప్రాముఖ్యత అటు అకడమిక్, ప్రొఫెషనల్ రెండిటి పరంగాను పెరిగింది. అంతర్జాతీయ సంస్థలు దేశంలో పరిశ్రమలు నెలకొల్పుతుండడంతో.. అందులో పని చేసే అభ్యర్థులకు టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత ఆర్థిక అంశాలపై అవగాహన ఉండడం తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, మాక్రోఎకనామిక్స్, మేనేజీరియల్ ఎకనామిక్స్ వంటి అంశాలను బోధిస్తున్నారు. వివిధ రకాల వ్యక్తులతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి వారి మనస్తత్వాలకనుగుణంగా వ్యవహరించడానికి తోడ్పడే.. వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కోసం సోషియాలజీ, సైకాలజీ అంశాలకు కరిక్యులంలో చోటు కల్పించారు. సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కోసం హిస్టరీ, లింగ్విస్టిక్స్ ఉపాధి కోసం ఎల్లలు దాటి వెళుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఇంగ్లిష్ భాషపై అవగాహన ఉంటే సరిపోదు. ఏదైనా ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఉండడం అవకాశాలను విస్తృతం చేస్తుంది. దానికి తోడు కొన్ని స్వదేశీ కంపెనీలు విదేశాల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభిస్తుండడంతో ఫారెన్ లాంగ్వేజ్ తెలిసి ఉండడం తప్పనిసరిగా మారింది. అన్నిటి కంటే చుట్టూ ఉన్న సమాజాన్ని, మానవ సంబంధాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కోసం ఫిలాసఫీని కూడా బోధిస్తున్నారు. ప్రవేశం: బ్యాచిలర్/ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ స్థాయిలో ఉండే కోర్సులకు జేఈఈ-అడ్వాన్స్డ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ మద్రాస్ మాత్రం.. హ్యూమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (హెచ్ఎస్ఈఈ) ఆధారంగా అడ్మిషన్లను చేపడుతుంది. 2014 సంవత్సరానికి హెచ్ఎస్ఈఈ నోటిఫికేషన్ వెలువడింది. పీహెచ్డీ, ఎంఫిల్, పీజీ కోర్సుల ప్రవేశ వివరాలను ఆయా ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్ నుంచి పొందొచ్చు. కొన్ని ఐఐటీలు బోధిస్తున్న అంశాలు ఐఐటీ-ఇండోర్ ఇంగ్లిష్, సైకాలజీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్ (బీటెక్ కోర్సులో భాగంగా). పీహెచ్డీ. వెబ్సైట్: www.iiti.ac.in ఐఐటీ-మద్రాస్ ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఇంటిగ్రేటెడ్ ఎంఏ (డెవలప్మెంట్ స్టడీస్, ఇంగ్లిష్ స్టడీస్) అర్హత: 10+2/తత్సమానం. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. రాత పరీక్ష: పేపర్-1, పేపర్-2 అనే రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్-1ను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్, అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్ఎబిలిటీ, జనరల్ స్టడీస్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-2 డిస్క్రిప్టివ్‌గా ఉంటుంది. ఇందులో నిర్దేశించిన అంశంపై వ్యాసం రాయాలి. 30 నిమిషాల సమయం కేటాయించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 18, 2013. ఆన్లైన్ దరఖాస్తుకు ముగింపు: జనవరి 17, 2014. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జనవరి 24, 2014 పోస్ట్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ: జనవరి 27, 2014 పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2014. వివరాలకు: http://hsee.iitm.ac.in ఐఐటీ-ఢిల్లీ అండర్ గ్రాడ్యుయేట్ (ఇంటర్ డిసిప్లినరీ ఓరియెంటేషన్‌లో.. ఎకనామిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ), పీహెచ్డీ. వెబ్సైట్: www.iitd.ac.in ఐఐటీ-గాంధీనగర్ ఎకనామిక్స్, ఫిలాసఫీ, వరల్డ్ సివిలైజేషన్/ హిస్టరీ తదితరాలు (బీటెక్ కోర్సులో భాగంగా). పీహెచ్డీ (ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, ఇంగ్లిష్) వెబ్సైట్: www.iitgn.ac.in ఐఐటీ-మండి కమ్యూనికేషన్, జర్మన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్, పొలిటికల్ ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ (బీటెక్ కోర్సులో భాగంగా). పీహెచ్డీ-పబ్లిక్ పాలసీ, పొలిటికల్ ఫిలాసఫీ, తదితర. వెబ్సైట్: www.iitmandi.ac.in ఐఐటీ-బాంబే బ్యాచిలర్ (బీటెక్ కోర్సులో భాగంగా-ఇంటర్ డిసిప్లినరీ ఓరియెంటేషన్‌లో ఎలెక్టివిస్గా).. ఎకనామిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ తదితరాలు. ఎంఫిల్-డెవలప్మెంట్ స్టడీస్, పీహెచ్డీ. వెబ్సైట్: www.iitb.ac.in