సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, అక్రిడిటేషన్‌లను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు ఈ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంలను భాగస్వాములుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను యూజీసీ పర్యవేక్షణలో నడిచే నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఒక్కటే చేపడుతున్నది. అయితే ప్రముఖ ప్రయివేట్ సంస్థలనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని నీతి అయోగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
ప్రభుత్వ వనరులను సమర్ధంగా ఉపయోగించుకుంటూ ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. అక్రిడిటేష్‌న్ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంల పాత్రను పెంచేందుకు త్వరలో ఎనిమిది ఐఐటీలు, ఐఐఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను పలువురు స్వాగతించగా, మరికొన్ని ఐఐటీలు, ఐఐఎంలు ఫ్యాకల్టీ కొరతను చూపి అదనపు బాధ్యతలపై నిరాసక్తత వ్యక్తం చేశాయి.