Accreditation
-
301 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న 301 మంది జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రతిపాదనల్ని ఆమోదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ డా.ఎ.మల్లికార్జున తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో అక్రిడిటేషన్ కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు ప్రభుత్వ ఉత్తర్వుల్ని అనుసరించి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులతో పాటు అవసరమైన ధృవపత్రాల కాపీలను జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలన్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అక్రిడిటేడ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోర్డినేటర్ డా.రాజేష్‌ని ఆదేశించామన్నారు. ప్రధాన పత్రికలు మినహా ఇతర పేపర్లలో విధులు నిర్వహిస్తున్న నిరుపేద రిపోర్టర్లకు జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌కు అవసరమైన చలానా నగదుని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యుడు, సాక్షి బ్యూరో చీఫ్, కె.రాఘవేంద్రారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ డా.మల్లికార్జున హెల్త్‌స్కీమ్ చలానాల్ని సీఎస్ఆర్ నిధుల్లో భాగంగా చెల్లించేందుకు అంగీకరించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం ఆర్టీసీ పాస్ చెల్లుబాటు అయ్యేలా చూడాలని కమిటీ సభ్యులు కోరగా.. ఇప్పటికే దానికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎన్‌ఎస్‌ఆర్‌కే బాబూరావు, చిట్టిబాబు, అనురాధ, డి.రాణి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్, మోహనలక్ష్మి, ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం సత్యనారాయణ, కన్వీనర్, మెంబర్ మణిరామ్ పాల్గొన్నారు. -
టాప్ అక్రెడిటేషన్ వ్యవస్థల్లో భారత్.. జీక్యూఐఐలో అయిదో ర్యాంకు
న్యూఢిల్లీ: నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి అత్యుత్తమ అక్రెడిటేషన్ వ్యవస్థలు ఉన్న టాప్ అయిదు దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. 184 దేశాల లిస్టులో అయిదో స్థానంలో నిల్చింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రా ఇండెక్స్ (జీక్యూఐఐ) 2021 ర్యాంకింగ్‌లు ఇటీవల విడుదలయ్యాయి. సూచీ ప్రకారం ప్రామాణీకరణలో భారత్ తొమ్మిదో స్థానంలో, మెట్రాలజీ విషయంలో 21వ ర్యాంకులోనూ ఉంది. ఈ జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా, చైనా, ఇటలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాప్ అయిదు అక్రెడిటింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌కు గుర్తింపు లభించడంపై భారతీయ నాణ్యతా మండలి (క్యూసీఐ) హర్షం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాణాల అమలుకు తోడ్పడే సంస్థలను నియమించేందుకు జాతీయ అక్రెడిటేషన్ సంస్థ పాటించే ప్రక్రియను అక్రెడిటేషన్గా వ్యవహరిస్తారు. నిర్దిష్ట సంవత్సరం ఆఖరు వరకూ ఉన్న డేటాను ఆ తదుపరి సంవత్సరంలో సేకరించి, విశ్లేషించి, ఏడాది ఆఖరున ర్యాంకింగ్‌లు విడుదల చేస్తారు. డిసెంబర్ 2021 ఆఖరు వరకు గల డేటాను 2022లో ఆసాంతం సేకరించి, విశ్లేషించి, 2021 ర్యాంకింగ్‌లు ఇచ్చారు. స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థలు మెసోపార్ట్నర్, అనలిటికర్ ఈ జీక్యూఐఐ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాయి. -
30 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం నిర్ణయించింది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కన్నెర్ర చేసింది. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు జేఎన్టీయూ (ఏ) పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. తక్కిన 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు. 39,195 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి 2022–23 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా–డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్టీయూ (ఏ) ఈ మేరకు నివేదించింది. కంప్యూటర్ సైన్సెస్‌తో కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్సెస్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి. సదుపాయాలున్న కళాశాలలకే గుర్తింపు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. అలాంటి కళాశాలల్లో చదివితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారు. గుర్తింపు తీసుకున్న కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరిస్తున్న నర్సరీలు
మల్లెలు, జాజుల గుబాళింపుతో నర్సరీలు స్వాగతం పలుకుతాయి. లిల్లీ, గులాబీల అందాలు రా..రమ్మని ఆహ్వానిస్తాయి. కనకాంబరాలు కలరింగ్‌తో పడేస్తాయి. హెల్కోనియా హ్యాంగింగ్స్ అబ్బుర పరుస్తాయి. గ్లాడియోలస్ అందాలు బాగున్నారా అంటూ పలుకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఆకర్షిస్తాయి. ఆర్కిడ్స్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెడతాయి. అలహాబాద్ సఫేదీ, తైవాన్ జామ నర్సరీలు, కొబ్బరి నర్సరీలు రైతులకు దిగుబడుల లాభాలను పంచుతామంటూ ముందుకు వస్తాయి. సరిగ్గా దృష్టి సారిస్తే కడియం, కడియపు లంక మాదిరి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కూడా నర్సరీల జిల్లాగా రూపాంతరం చెందేందుకు మార్గాలు అనేకం ఉన్నాయి. తాడేపల్లిగూడెం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఉన్న సమయంలోనే నర్సరీలు, ఫ్లోరీ కల్చర్, కొబ్బరి, జామ నర్సరీల అభివృద్ధికి పశ్చిమగోదావరిలో కృషి జరిగింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లాలోకి వెళ్లిన పెరవలి మండలం కాకరపర్రు పువ్వుల పల్లెగా పరిఢవిల్లింది. మెట్ట ప్రాంతాల్లో కూడా నర్సరీల పెంపకం పెరిగింది. విధానపరమైన నిర్ణయాలతో జిల్లా వేరువేరు ప్రాంతాలుగా విడిపోకముందు నర్సరీల అభివృద్ధిపై ఉద్యాన శాఖ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నర్సరీల సమాచారం సేకరించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం నర్సరీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని నర్సరీల వివరాలను తీసుకుంది. నర్సరీలకు జిల్లా అనుకూలం తైవాన్, అలహాబాద్ సఫేది రకాలకు చెందిన జామ నర్సరీలు తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఉన్నాయి. జిల్లాలోని తణుకు మండలం రేలంగి గ్రామంలో నర్సరీలను వృద్ధి చేస్తున్నారు. పాలకొల్లు మండలం అడవిపాలెంలో కొబ్బరి నర్సరీలను రైతులు పెంచుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంటలో ఈస్టుకోస్టు హైబ్రీడ్ కోకోనట్ సెంటర్లో కొబ్బరి నర్సరీలను పెంచుతున్నారు. ఇక్కడే హెల్కోనియా హ్యాంగింగ్స్ వంటి అలంకరణ పుష్పాల మొక్కలను పెంచుతున్నారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా థాయిలాండ్‌లోని నాంగ్నూచ్ గ్రామంలో ఏటా డిసెంబర్లో జరిగే కింగ్ షోకు వచ్చిన కొత్త విదేశీ రకాల మొక్కలను ఇక్కడికి తీసుకువచ్చి అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు. బంతి తోటల పెంపకం ఇటీవల కాలంలో జిల్లాలో ఊపందుకుంది. గోదావరి పరీవాహకంలో లంక ప్రాంతాలు ఉండటంతో ఈ మొక్కల పెంపకానికి, ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే పలు రకాల ఆర్కిడ్స్‌ను ఫ్లోరల్ ఎసెన్సు ఫారమ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆర్కిడ్స్ ఫార్మ్ తణుకులో పెంచుతున్నారు. డి.1075, ఎం.ఎల్లో, డి.997, వి.స్పాటెడ్ ఎల్లో, డి.999 వంటి ఆర్కిడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆర్కిడ్స్తో పాటు అరుదైన పుష్ప రకాల పెంపకం విషయంలో రైతులకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అటవీ, క్లైమేట్ ఛేంజ్ డెక్కన్ రీజియన్ హైద్రాబాద్ వారు మార్గదర్శనం చేస్తున్నారు. జిల్లా ఉద్యాన శాఖ కూడా నర్సరీల ప్రోత్సాహానికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. నర్సరీలకు అక్రిడేషన్ జిల్లాలో ఏ రకం నర్సరీలను ఎక్కడెక్కడ రైతులు పెంచుతున్నారు.. ఏ ప్రామాణికాలు పాటిస్తున్నారనే విషయాలను అంచనా వేస్తూ, వాటికి చట్టబద్ధత కోసం ఉద్యాన శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో అక్రిడేషన్ కోసం సమాచారం సేకరించారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో ఉన్న నర్సరీల వివరాలు, విశిష్ట రక్షిత సాగు పద్ధతిలో పెంచుతున్న నర్సరీల వివరాలను తీసుకున్నారు. 2010లో నర్సరీ యాక్ట్‌కు అనుగుణంగా నర్సరీల పెంపకాన్ని గమనించడానికి వీలుగా సమాచారం తీసుకున్నారు. చట్టానికి లోబడి వచ్చిన నర్సరీల వివరాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. (క్లిక్: కొల్లేరుకు మహర్దశ.. ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు) మేలైన మొక్కల కోసమే పశ్చిమ గోదావరి జిల్లా నర్సరీలకు అనువైన ప్రాంతం. పూల తోటలకు అనుకూలం. పండ్ల, కొబ్బరి, జామ నర్సరీలు ఇక్కడ ఊపందుకుంటున్నాయి. నర్సరీలకు కేరాఫ్‌గా ఉన్న కడియం, కడియపు లంక మాదిరంత కాకున్నా, ఇక్కడ నర్సరీలను పెంచవచ్చు. నర్సరీల ద్వారా పెంచే మొక్కల్లో నాణ్యత పాటించడానికి వీలుగా రూపొందించిన నర్సరీ చట్టాన్ని అనుసరించి వాటికి అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచారం తీసుకున్నాం. దీనివల్ల నర్సరీలు పెంచే వారి బాధ్యత మరింత పెరిగి వినియోగదారులకు మంచి మొక్కలను అందించగలుగుతారు. – ఎ.దుర్గేష్ , జిల్లా ఉద్యాన అధికారి, పశ్చిమగోదావరి జిల్లా -
కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు దక్కింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నుంచి గురువారం ఉత్తర్వులు అందాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవతో 2008లో మచిలీపట్నం కేంద్రంగా ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్రంలో 14 యూనివర్సిటీలు ఉన్నాయి. కృష్ణా తప్ప మిగతావన్నీ 12–బీ గుర్తింపు సొంతం చేసుకున్నాయి. ఇటీవల వరకు అద్దె భవనాల్లోనే (ఆంధ్ర జాతీయ కళాశాలలో) కొనసాగడం, వర్సిటీ అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 12–బీ గుర్తింపు దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పెత్తందారులు చేసిన రాజకీయ క్రీడతో వర్సిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో 12–బీ సాధనకు ఇదే సరైన సమయమని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కె.బి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రామిరెడ్డి తమ బృదానికి దిశానిర్దేశం చేశారు. దీంతో 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు సొంతమైంది. ఇకపై వర్సిటీ కార్యకలాపాలకు 80 శాతం నిధులు యూజీసీ నుంచి మంజూరవుతాయి. ఉన్నత విద్యకు ఊపిరి ► 2008–09లో అద్దె భవనాల్లో ప్రారంభమైన యూనివర్సిటీ ప్రస్తుతం రుద్రవరం వద్ద 102 ఎకరాల సువిశాల ప్రదేశంలో సొంతభవనాల్లో నడుస్తోంది. ► వర్సిటీకి అనుబంధంగా యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు కలిపి164 కాలేజీల్లో ఏటా సుమారు 53 వేల మంది చదువుతున్నారు. ► వర్సిటీ క్యాంపస్‌లో ఆర్ట్స్అండ్ సైన్సు కోర్సులతో పాటు, ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ కోర్సులను సైతం అందిస్తున్నారు. 2011–12 విద్యా సంవత్సరం నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్ అందుబాటులో ఉండగా, ఇటీవలనే వంద మంది విద్యార్థుల సామర్థ్యంతో ఎన్సీసీ యూనిట్ ఏర్పాటైంది. ► వర్సిటీలో ఆరు డిపార్టుమెంట్లు, నూజివీడులో మూడు డిపార్టుమెంట్లు పనిచేస్తున్నాయి. పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రయోగాలకు అవకాశం 12–బీ గుర్తింపుతో విద్యార్థులతో పాటు, బోధనా సిబ్బందికీ మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయోగాలు చేయవచ్చు. ఇందుకయ్యే నిధులను యూజీసీ సమకూరుస్తుంది. ఈ గుర్తింపు సాధన కమిటీలో నేనూ కూడా ఓ సభ్యుడిని అయినందుకు ఆనందంగా ఉంది. కృష్ణా యూనివర్సిటీ ప్రయోగాలకు కేంద్రంగా నిలువనుంది. – డాక్టర్ డి.రామశేఖర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ నాక్ గుర్తింపుపై దృష్టి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే 12–బీ గుర్తింపు సాధ్యమైంది. ఈ గుర్తింపు సాధనలో ఉన్నత విద్యామండలి పెద్దల సహకారంతో ఎంతో ఉంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఎస్ఓ 9001–2015 సర్టిఫికెట్ సొంతం చేసుకున్నాం. నా హయాంలో 12–బీ గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నాక్ గుర్తింపుపై దృష్టిపెట్టాం. – కె.బి.చంద్రÔశేఖర్, వైస్ చాన్స్‌లర్ విద్యార్థుల అభివృద్ధే లక్ష్యం కృష్ణా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఎక్కువగా పేదవర్గాల విద్యార్థులు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆశయా లకు అనుగుణంగా విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా అంతా సమన్వయంతో పనిచేస్తున్నాం. సొంత భవనాల్లో మౌలిక సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. వర్సిటీ మరింత అభివృద్ధికి యూజీసీ 12–బీ గుర్తింపు ఊతమిస్తుంది. – డాక్టర్ ఎం.రామిరెడ్డి, రిజిస్ట్రార్ -
TSRTC: జర్నలిస్టులకు సజ్జనార్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పరిగెత్తించేందుకు కృషిచేస్తూనే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతేగాక ట్విట్టర్లోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్రయాణికులు, నెటిజన్ల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తూ.. పరిష్కార మార్గాలను చూపుతున్నారు. చదవండి: నూతన వధూవరులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సర్ప్రైజ్.. ఈ క్రమంలో తాజాగా జర్నలిస్టులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త అందించారు. జర్నలిస్ట్ బస్ పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు తెలంగాణ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే తమకు లభించాల్సిన తగ్గింపు (కన్సెషన్) పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో గుడ్‌న్యూస్ ఫర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ సూచనలు చేసిన ఇద్దరు నెటిజన్లకు ఆయన కృతజ్జతలు తెలియజేశారు. కాగా సజ్జనార్ నిర్ణయంపై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సజ్జనార్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేశారు. చదవండి: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్ Good NEWS for our NEWS friends! Now, #journalists with valid bus pass from #TSRTC can avail of concession online also while booking tickets through our #TSRTC website. Thank You @iAbhinayD & @NVNAGARJUNA for your suggestion Patronage #TSRTC & #IchooseTSRTC #fridaymorning@V6News pic.twitter.com/7FEyzzBN99 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 12, 2021 అయితే మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ కార్డుతో ఆర్టీసీ నుంచి బస్ పాస్ తీసుకుంటారు. ఈ పాస్ ఉన్నవారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే కన్సెషన్ పొందుతుంటారు. ఇప్పటి వరకు నేరుగా బస్ కండక్టర్ నుంచి మాత్రమే రాయితీ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఆన్లైన్లో ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే మాత్రం ఈ మినహాయింపులు వర్తించేవి కావు. ఈ క్రమంలో తాజాగా టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు జర్నలిస్టులు తమ కన్సెషన్ పొందవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో వెల్లడించారు. -
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జీఎస్టీకి మినహాయింపునిస్తూ ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలు సవరించడం హర్షణీయమని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ వెన్ను శనివారం పేర్కొన్నారు. చదవండి: పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ -
పాత్రికేయులకు త్వరలో అక్రిడిటేషన్లు
సాక్షి, అమరావతి: అక్రిడిటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సరైందేనని న్యాయస్థానం తీర్పునివ్వడం పట్ల సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సంతోషం వ్యక్తం చేశారు. ఆ జీవోలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారమే పాత్రికేయులకు సోమవారం నుంచి అక్రిడిటేషన్లు జారీ చేస్తామన్నారు. విజయవాడలోని ఆర్టీసీ బస్ భవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 20,610 మందికి అక్రిడిటేషన్లున్నాయని, తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ఆహ్వానించగా ఏకంగా 40,442 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. జీవోలోని మార్గదర్శకాలను అనుసరించి వారిలో 32,314 మంది దరఖాస్తులు చేశారని చెప్పారు. వాటిలో ఇప్పటి వరకు 17,139 దరఖాస్తులను పరిశీలించి 6,490 మందికి అవసరమైన పత్రాలు సమర్పించాలని తెలిపామన్నారు. కేవలం 90 మంది దరఖాస్తులనే తిరస్కరించినట్టు చెప్పారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చేనాటికి 874 మంది దరఖాస్తులను ఆమోదించగా వారిలో 464 మందికి అక్రిడిటేషన్లు జారీ చేసినట్టు తెలిపారు. కొత్త వారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, దరఖాస్తు చేసుకున్నవారు వాటిలో మార్పులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. అక్రిడిటేషన్ల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని చెప్పారు. అక్రిడిటేషన్ల జారీ తర్వాత అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ప్రతిభ చాటుకుంటేనే అవకాశాలు.. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాల్సి ఉన్నందునే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘చంద్రబాబు కొడుకు లోకేశ్‌కు సత్యం రామలింగరాజు వంటివారు అమెరికాలో సీటు ఇప్పించి చదివిస్తారు గానీ, సామాన్యుల పిల్లలు పరీక్షలు రాసి ప్రతిభ చాటుకుంటేనే కదా అవకాశాలు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొందరు టీఆర్ఎస్ మంత్రులు వైఎస్సార్‌పై విమర్శలు చేస్తూ భావోద్వేగాలు రేకెత్తించేందుకు యత్నిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఒక్క గ్లాసు నీటిని కూడా అదనంగా వాడుకోవడం లేదన్నారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు సబబే
సాక్షి, అమరావతి: రాష్ట్ర, జిల్లా మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించే వారికే అక్రిడిటేషన్లు ఇస్తున్నారంటూ పిటిషనర్ చేసిన ఆరోపణలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమని తేల్చి చెప్పింది. తమకు మీడియా అక్రిడిటేషన్ కమిటీలో స్థానం కల్పించాలని కోరే చట్టబద్ధమైన, రాజ్యాంగ పరమైన హక్కు పిటిషనర్‌కు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్ గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆరోపణలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో.. అక్రిడిటేషన్ల జారీలో మరింత పారదర్శకత కోసమే వివిధ ప్రభుత్వాధికారులతో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వివక్షకు తావు లేకుండా ఈ కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు స్థానం కల్పిస్తే వారి మధ్య విబేధాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకపక్ష చర్యగా చెప్పలేమన్నారు. చట్టాలు చేసే విషయంలో ప్రభుత్వ యోగ్యతను పిటిషనర్ ప్రశ్నించలేరని తీర్పులో పేర్కొన్నారు. చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
ఐఐటీ, ఐఐఎంలతో త్వరగా అక్రిడేషన్
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల సాయంతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల అక్రిడేషన్ ప్రక్రియను త్వరగా చేపడతామని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అక్రిడేషన్ కోసం ఏర్పాటు చేసే కొత్త కమిటీలో చేరేందుకు ముందుకురావాలని ఐఐటీ, ఐఐఎంలను కోరామన్నారు. ఇంతకాలం 15 శాతం ఉన్నత విద్యాసంస్థల్లోనే అక్రిడేషన్‌ను చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్), జాతీయ గుర్తింపు మండలి(ఎన్బీఏ)లను విస్తరిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులు నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా కొత్త పథకాన్ని తెస్తామని జవదేకర్ చెప్పారు. -
‘ప్రత్యేక రాష్ట్రంలో 17 వేల అక్రిడేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల అక్రిడేషన్లు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 17 వేల అక్రిడేషన్లు ఇచ్చామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల్లో 15 కోట్లతో మీడియా అకాడమీ నిర్మిస్తున్నామన్నారు. పైసా కట్టకుండా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇచ్చామని.. అక్రిడేషన్ లేని వాళ్లకు కూడా కమిటీ వేసి హెల్త్ కార్డులు అందేలా చేశామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని హర్షం వ్యక్తం చేశారు. అందులో 34 కోట్ల రూపాయలను మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అందజేసినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధులను జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్త్ కార్డులు చెల్లడం లేదని చెప్పాడాన్నిఆయన ఖండించారు. హెల్త్ కార్డులు తీసుకోకపోవడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఆలోచనలో ఉందని.. ఆటంకాల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. సీఎం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే నమ్మకం ఉందన్నారు. జర్నలిస్టులకు పెన్షన్‌పై కూడా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. -
‘ఫేక్ న్యూస్’ ప్రకంపనలు
సాక్షి, బెంగళూరు: దేశంలో నకిలీ వార్తలు ప్రకంపనలు సష్టిస్తున్న నేపథ్యంలో వీటిని అరికట్టడం కోసం బాధ్యులైన జర్నలిస్టుల గుర్తింపు కార్డులు అంటే ఢిల్లీలోని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ జారీ చేసిన ‘అక్రిడిటేషన్ కార్డులు’ను రద్దు చేస్తామంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఓ సర్కులర్ తీసుకొచ్చి, ఆపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యంతో ఆ సర్కులర్‌ను చెత్తబుట్టలో పడేశారు. అసలు ఇంతకు ఎవరు నకిలీ న్యూస్‌ను సష్టిస్తున్నారు? ఎవరు వాటికి ప్రచారం కల్పిస్తున్నారు? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చేస్తున్న నకిలీ వార్తలు ఎలాంటివి? ఎవరి లక్ష్యంగా అవి ప్రచారం అవుతున్నాయి ? వారం క్రితమే (గత గురువారం) ‘పోస్ట్‌కార్డ్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహేశ్ విక్రమ్ హెగ్డేను నకిలీ వార్తల ప్రచురణ, ప్రచారం నేరారోపణల కింద బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలంటూ ‘రిలీజ్ మహేశ్ హెగ్డే’ హాష్ ట్యాగ్‌తో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మొదలుకొని సామాన్య బీజేపీ కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగించారు. మార్చి 18వ తేదీన ఓ జైన సన్యాసిని.. ముస్లిం యువకుడు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడని, సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటూ పోస్ట్‌కార్డ్ న్యూస్ ప్రచారం చేసింది. తన ఫేస్బుక్ పేజీలో కూడా పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. ఎల్లప్పుడు పోస్ట్‌కార్డ్ న్యూస్ తప్పుడు వార్తలపై ఓ కన్నేసి ఉంచే ఫ్యాక్ట్ ఫైండింగ్ వెబ్సైట్ ‘అల్టర్ న్యూస్’ జర్నలిస్టులు రంగంలోకి దిగి బెంగుళూరు పోలీసుల నుంచి వాస్తవాలను సేకరించారు. సదరు సన్యాసిపై ఎవరూ దాడి చేయలేదని, రోడ్డు దాటుతుండగా చిన్న ప్రమాదమై స్వల్ప గాయమైందని పోలీసులు చెప్పడంతోపాటు ఆ జైన సన్యాసి కూడా ధ్రువీకరించారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారుం చేస్తున్నారన్నది సులభంగానే అర్థం అవుతుంది. పోస్ట్‌కార్డ్ న్యూస్‌లో ఒక్కటి కాదు, పదులు కాదు, పాతిక సంఖ్యల్లో నకిలీ వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూత్వ శక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి. అందుకనేమో వీటిని బీజేపీ, ఆరెస్సెస్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో చురుగ్గా షేర్ చేస్తున్నారు. మచ్చుకు పోస్ట్‌కార్డ్ న్యూస్‌లో మరికొన్ని నకిలీ వార్తలు 2016, ఆగస్టు నెలలో: సీనియర్ జర్నలిస్ట్ బార్కా దత్, హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ జకీర్ రషీద్ భట్ అలియాస్ జకీర్ మూసాతోని టూవీలర్‌పై వెనక తగులుకునేలా కూర్చొని వెళుతున్న దశ్యం అంటూ పోస్ట్‌కార్డ్ న్యూస్ ప్రచారం చేసింది. ట్విటర్లో పుట్టిన ఈ వార్తను పోస్ట్‌కార్డ్ ప్రచారం చేయగా, దాన్ని హిందూత్వ శక్తులు వైరల్ చేశాయి. అల్లర్లు కొనసాగుతున్న కశ్మీర్లో తాను న్యూస్ కవరేజ్‌కి వెళ్లినప్పుడు కారు చెడిపోయిందని, కర్ఫ్యూ కారణంగా తాను కారు మరమ్మతు చేయించుకోలేక ఓ టూ వీలర్ బాటసారిని లిఫ్ట్ అడిగి గమ్యస్థానానికి చేరుకున్నానంటూ బార్కా దత్ వివరణ ఇచ్చారు.టూవీలర్ నడుపుతున్న వ్యక్తికి టెర్రరిస్ట్ కమాండర్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయని పోస్ట్‌కార్డ్ న్యూస్ వాదించింది. కనిపిస్తే కాల్చిచంపే ఉత్తర్వులు ఉన్నాయని తెలిసి, ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న టెర్రరిస్టు కమాండర్ కర్ఫ్యూ సమయంలో, విస్తృతంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్న సమయంలో టూ వీలర్‌పై ఎలా తిరుగుతాడని ‘అల్టర్ న్యూస్’ నిలదీసింది. 2017, మే నెల: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలోనే మరో పాకిస్తాన్‌గా మారిపోనుంది. ఆ పుణ్యం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కట్టుకోవచ్చు. ఎందుకంటే, ముస్లింల కోసం ఆమె త్వరలోనే ప్రత్యేక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టబోతున్నారు. ముస్లింలను మంచి చేసుకోవడం కోసం ఆమె రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ వార్తలో కూడా నిజం లేదని అల్టర్ న్యూస్ తేల్చింది. 2018, ఫిబ్రవరి 5: తమిళనాడులోని కొన్ని క్రైస్తవ బృందాలు మధురైలోని కలియార్ కోవిల్, శివగామి ఆలయాల్లోకి వెళ్లి ఆ ప్రాపర్టీ తమదని డిమాండ్ చేశాయని, క్రైస్తవ మిషనరీలు ఆ హిందూ దేవాలయాలను చర్చిలుగా మార్చేందుకు కుట్ర పన్నాయని పోస్ట్‌కార్డ్ న్యూస్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ వార్తను ప్రచురించింది. ఇలాంటి నకిలీ వార్తలను పట్టుకునే మరో వెబ్సైట్ ‘బూమ్లివ్’ స్థానిక పోలీసు అధికారులతోని, స్థానిక జర్నలిస్టులతోని మాట్లాడి వాస్తవాలను బయట పెట్టింది. క్రైస్తవ బృందాలు ఆ ఆలయాల సమీపం నుంచి వెళ్లాయని, ఆలయాల లోపలికి ఎవరు వెళ్లలేదని, ప్రతి ఏట సంప్రదాయంగా జరిగే ఊరేగింపు అదని తేలింది. హిందుత్వ శక్తులు, ప్రధాని మోదీకి అనుకూలంగా ట్వీట్లు కూడా పెట్టే మహేశ్ విక్రమ్ హెగ్డే ఎలాంటి జర్నలిస్టో సులభంగానే గ్రహించవచ్చు. నకిలీ వార్తలను అరికట్టాలంటూ స్మృతి ఇరానీ మాట్లాడం అంటే ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్లు ఉంది. అయితే జర్నలిస్టుల గుర్తింపు కార్డులు రద్దు చేయడం వల్ల నకిలీ వార్తలు ఆగుతాయా? గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారా? ఇంట్లో కూర్చున్న వారు, పోస్ట్‌కార్డ్ న్యూస్ లాంటి మీడియా ముసుగేసుకున్న వారు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా లాంటి వారే నకిలీ వార్తలను, ఫొటోలను ప్రచారం చేస్తుంటే ఇంకా ఎవరిని అరికడతాం. పశ్చిమ బెంగాల్లో ఏడాది క్రితం మత ఘర్షణలు జరిగినప్పుడు ‘బెంగాల్లో పట్టపగలు ఓ హిందూ మహిళను వివస్త్రను చేస్తున్న ముస్లిం యువకులు’ అన్న కాప్షన్‌తో మరాఠీ చిత్రంలోని ఓ సన్నివేశం ఫొటోతో సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేశారు. అభాసు పాలవుతామని నరేంద్ర మోదీనే ఇరానీ సర్కులర్‌ను రద్దు చేశారు. అయితే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే నకిలీ వార్తలు ఎక్కువయ్యాయన్న విషయాన్ని గ్రహించి వాటిని అరికట్టేందుకు సమగ్ర చట్టం తీసుకరావాలి. గతేడాదే జార్ఖండ్‌లో నకిలీ వార్తల కారణంగా రెండు వేర్వేరు సంఘటల్లో ఏడుగురు అమాయకులు మరణించారు. అపరిచితులు పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ ‘వాట్సాప్’లో తప్పుడు ప్రచారం జరగడంతో అమాయకులను అనుమానించి జనమే కొట్టి చంపారు. -
అక్రెడిటేషన్ రద్దు వద్దు
న్యూఢిల్లీ: నకిలీ వార్త రాస్తే జర్నలిస్టుల గుర్తింపు (అక్రెడిటేషన్) రద్దు చేస్తామన్న ప్రతిపాదన నుంచి కేంద్రం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద మార్గదర్శకాలపై అటు ప్రతిపక్షాలు, ఇటు జర్నలిస్టుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. వాటిని రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించారు. అక్రెడిటేషన్ రద్దుపై విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఆ మంత్రిత్వ శాఖకు సూచించింది. ప్రింట్ మీడియాకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), టెలివిజన్ మీడియాకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) నియంత్రణా వ్యవస్థలుగా ఉన్నాయని, ఆ సంస్థలే నకిలీ వార్తలా, కాదా అనే నిర్ధారణకు వస్తాయని ప్రధాని పేర్కొన్నట్లు పీఎంవో అధికారి తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం సరికాదని ప్రధాని అభిప్రాయపడినట్టు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో పీఎంవో సూచన మేరకు ఈ వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా తమ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి స్మృతీ ఇరానీ సమర్థిస్తూ ట్వీట్ చేసిన వెనువెంటనే ప్రధాని కార్యాలయం ఆ మార్గదర్శకాలను ఉపసంహరించుకోమని ఆదేశించడం విశేషం. ప్రధాని ఆదేశాల మేరకు... సమాచార ప్రసార శాఖ సోమవారం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. తొలిసారి నకిలీ వార్త రాసిన జర్నలిస్టుకు గుర్తింపును ఆరు నెలలపాటు, రెండో సారి అదే తప్పు చేస్తే సంవత్సరం పాటు, మూడో సారి కూడా తప్పు చేస్తే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తారు. అయితే ఈ నిబంధనలను ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మంగళ వారం ఉపసంహరించుకున్నారు. భగ్గుమన్న ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు నకిలీ వార్తలకు సంబంధించి సోమవారం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వెలిబు చ్చాయి. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. పత్రికలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లాహిరి అన్నారు. నకిలీ వార్తలపై ఫిర్యాదులుంటే ప్రెస్ కౌన్సిల్ చూసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం నిరంకుశ ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎడిటర్స్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అలాంటి ఆదేశాల ద్వారా మీడియాపై పర్యవేక్షణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వం తనపై వేసుకోవాలని భావిస్తోందని, ఇలాంటి వాటివల్ల జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడేలా పనికిరాని ఫిర్యాదు చేసేందుకు ద్వారాలు తెరిచినట్లవుతుందని ఎడిటర్స్ గిల్డ్ విమర్శించింది. ఫేక్ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా ముప్పుగా పరిణమించిందని, వాటిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అందులో తప్పేమీ లేదని, అయితే స్వతంత్ర రాజ్యాంగ సంస్థ మాత్రమే వాటి ప్రామాణికతను నిర్ధారించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. వివేకం కలిగిన ఎవరూ కూడా ఫేస్ న్యూస్‌ను సమర్ధించరని తెలిపింది. పత్రికా స్వేచ్ఛను హరించే నిర్ణయమిదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. -
అక్రిడేషన్ రద్దు చేస్తామనడం సరికాదు..
సాక్షి, హైదరాబాద్ : తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అభిప్రయాపడ్డారు. ఎవరైనా నిరాధార, తప్పుడు వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసిన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాస్తే అక్రిడేషన్ రద్దు చేస్తామనడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తప్పుడు వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. పూర్తి ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తే వాటిని ఫేక్ న్యూస్‌ల కింద పరిగణించి జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. -
తప్పుడు వార్త రాస్తే.. గుర్తింపు రద్దు..
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ వార్తలు పుట్టించినా, ప్రచారం చేసిన జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విలేకరుల గుర్తింపునకు సంబంధించిన నియమావళిని సవరరించింది. నిబంధనల ప్రకారం.. నకిలీ వార్తలను ప్రచురించడం, ప్రసారం చేసినట్లు నిర్ధారణ అయితే సదరు జర్నలిస్టు గుర్తింపును రద్దు చేస్తారు. తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు, రెండో సారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు, మూడోసారీ తప్పు చేస్తే గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయనుంది ప్రభుత్వం. ఫేక్ న్యూస్‌పై వచ్చే ఫిర్యాదులను పీసీఐ, ఎన్బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాయని ప్రభుత్వం వివరించింది. -
ఇకపై జర్నలిస్టులకు ఆన్లైన్లో బస్‌పాస్‌లు
సాక్షి, హైదరాబాద్ : అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు టీఎస్ఆర్టీసీ బస్‌పాస్‌ల కోసం ఇకనుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమలులోకి రానుందని టీఎస్ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు పేర్కొన్నారు. బస్‌పాస్‌ల కోసం జర్నలిస్టులు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్ఎం కార్యాలయాలకు వెళ్లకుండా సమీపంలోని బస్‌పాస్ కౌంటర్ నుంచి పొందేలా వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. ప్రస్తుతం జర్నలిస్టుల బస్‌పాస్‌ల గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ఆర్టీసీ అమలు చేయనుంది. ఆన్లైన్లో బస్‌పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు ఫోన్లో టీఎస్ఆర్టీసీ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత జర్నలిస్టులు తమ సమీపంలోని బస్‌పాస్ కౌంటర్‌కు వెళ్లి మెసేజ్‌ను చూపిస్తే అక్కడ బస్‌పాస్ జారీ చేస్తారని టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఐఐటీలు, ఐఐఎంలకు అక్రిడిటేషన్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, అక్రిడిటేషన్లను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు ఈ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంలను భాగస్వాములుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను యూజీసీ పర్యవేక్షణలో నడిచే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఒక్కటే చేపడుతున్నది. అయితే ప్రముఖ ప్రయివేట్ సంస్థలనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని నీతి అయోగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ వనరులను సమర్ధంగా ఉపయోగించుకుంటూ ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. అక్రిడిటేష్న్ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంల పాత్రను పెంచేందుకు త్వరలో ఎనిమిది ఐఐటీలు, ఐఐఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను పలువురు స్వాగతించగా, మరికొన్ని ఐఐటీలు, ఐఐఎంలు ఫ్యాకల్టీ కొరతను చూపి అదనపు బాధ్యతలపై నిరాసక్తత వ్యక్తం చేశాయి. -
అక్రిడిటేషన్ లేకుండానే హెల్త్ కార్డులు
► విద్యార్హతలు లేకుండా అక్రిడిటేషన్ ► రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ► జోగిపేటలో జిల్లా జర్నలిస్టుల సమావేశం జోగిపేట(అందోలు): త్వరలో రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డులు లేని జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. గురువారం జోగిపేటలోని శ్రీరామా ఫంక్షన్ హాలులో జరిగిన జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రంగాచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ గత నెల 22న జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన సీఎం మూడు రోజుల్లో జర్నలిస్టు సంఘాల నాయకులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారన్నారు. అక్రిడిటేషన్ కార్డులు లేకున్నా హెల్త్ కార్డులు, విద్యార్హతతో సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేసి కమిటీని కూడా వేశారన్నారు. రాష్ట్రంలో 430 మంది వరకు జర్నలిస్టులు చనిపోతే ఇప్పటి వరకు కేవలం 130 మందికి మాత్రమే ఆర్థికంగా సహకారం అందిందన్నారు. జిల్లా అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర నాయకుడు కాల్వ మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. జర్నలిస్టుల ర్యాలీ: జోగిపేటలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా మీదుగా శ్రీ రామ ఫంక్షన్ హాలు వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఫైజల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు దుర్గారెడ్డి , రవిచంద్ర, మన్మథరావు, పానుగంటి కృష్ణ, జగన్మోహన్రెడ్డి, సిద్దన్నపాటిల్, హైమద్, శివగౌడ్, మురళి, ఖయ్యూం, ఆరీఫ్, అందోలు తాలుకా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు భూమయ్య, నాయకులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వండి
నవీన్ మిట్టల్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎలాంటి నిబంధనలు, అడ్డంకులు సృష్టించకుండా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. అక్రెడిటేషన్ల జారీకి డిగ్రీ సర్టిఫికెట్లతో ముడిపెట్టడం, చిన్న పత్రికలకు అక్రెడిటేషన్ల జారీపై ఆంక్షలు విధించడం, అక్రెడిటేషన్లతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు జారీ కాకపోవడం పట్ల బుధవారం పలు జర్నలిస్టు యూనియన్లు సచివాలయంలో మంత్రిని కలసి ఫిర్యాదు చేశాయి. దీనికి స్పందించిన కేటీఆర్.. నవీన్ మిట్టల్‌తో మాట్లాడారు. డిగ్రీ విద్యార్హతతో సంబంధం లేకుండా జిల్లాల్లో చిన్న పత్రికలకు వెంటనే అక్రెడిటేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాత జిల్లాల ప్రకారమే జర్నలిస్టులకు బస్‌పాస్‌లు జారీ చేయాలని మంత్రి మహేందర్‌రెడ్డిని కోరారు. కేటీఆర్‌ను కలసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పలు యూనియన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
'కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అక్రెడిటేషన్, హెల్త్‌కార్డులు ఇస్తారని అనుకున్న జర్నలిస్టులకు... అధికారుల తాత్సారం అయోమయాన్ని స్పష్టించిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూ జే) మండిపడింది. అక్రిడిటేషన్ కమిటీలో ఉత్సవ విగ్రహాలుగా ఉండలేమని కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. ఇకపై జరిగే సమావేశాలకు కూడా తమ యూనియన్ ప్రతినిధులు హాజరుకారని ప్రధాన కార్య దర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్ట కవిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. డిగ్రీ ఉంటేనే అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామనడం మంచి దికాదన్నారు. అదేవిధంగా ఉమ్మ డి రాష్ట్రంలో ఏసీ బస్ సౌకర్యం ఉండేదని, ఇప్పుడు అది కూడా ఇవ్వని పరిస్థితి ఏర్ప డిందన్నారు. తెలం గాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల అధికారుల వివక్ష కొనసాగుతున్నట్లు కనిపిస్తోందన్నా రు. అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని జీవోలో ఉన్నా.... అది వారికి టిష్యూ పేపర్లా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలి
- జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి - టీయూడబ్ల్యూజే, ఐజేయూ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నూతన జీవో 239ను తక్షణమే సవరించి, వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని టీయూ డబ్ల్యూజే, ఐజేయూ డిమాండ్ చేసింది. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవనంలో నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు కె. శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరహత్ అలీలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రామచంద్ర మూర్తి కమిటీ సూచనలను, సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని కోరారు. చిన్న, మధ్యతరగతి పత్రికలకు తాము వ్యతిరేకం కాదని, పనిచేసే ప్రతి జర్నలిస్టు తరఫున తాము పోరాడతామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి జర్నలిస్టులందరికీ జిల్లా స్థాయి అక్రెడిటేషన్లు అందివ్వడం ద్వారా రైల్ పాసుల అంశంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. అక్రెడిటేషన్ల జారీకి విద్యార్హతలెందుకు? జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేసేందుకు విద్యార్హతలను పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తమ జేబులోనే ఉందని.. తాము చెప్పినట్లుగానే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని చెప్పుకుంటున్న కొన్ని వర్గాల నాయకులు జీవో 239 ద్వారా తలెత్తిన సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హెల్త్‌కార్డులను అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండానే జారీ చేసి, ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టుల ఆరోగ్యాలకు భద్రత కల్పించాలన్నారు. రెండున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల పక్షపాత ధోరణిని అవలంబిస్తుందని వాపోయారు. ఇకనైనా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే శీతాకాల సమావేశాల్లో జర్నలిస్టులమంతా కలసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు. -
జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వండి
తెలంగాణ జేఏసీ సాక్షి, హైదరాబాద్: జీవో నంబర్ 239ను రద్దుచేసి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ ప్రదీప్ చంద్రను కలసి వినతి సమర్పించారు. 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి శ్వాసగా నిలిచి ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితంలో మార్పు వస్తుందని ఆశపడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస గుర్తింపు లేకుండా చూస్తుందని విమర్శించారు. జీవో నంబర్ 239ను రద్దుచేసి వెంటనే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఈనెల 5న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
‘అక్రిడిటేషన్’కు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు సమర్పించాలని వార్తా పత్రికల సంపాదకులు, న్యూస్ చానెళ్ల సీఈవో/మేనేజింగ్ డైరెక్టర్లకు తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. విలేకరులు, ఫొటోగ్రాఫర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 15న ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2016’ పేరుతో జీవో 239 జారీ చేసిందని పేర్కొన్నారు. వీటి ప్రకారం అర్హులైన డెస్క్ జర్నలిస్టుల జాబితాను పంపించాలని ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా సంస్థలకు ఆయన లేఖ రాశారు. -
వరంగల్ లో జర్నలిస్టుల ధర్నా
జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజే(ఐజేయు) ఆద్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి జర్నలిస్టుల ధర్నా లో పాల్గొన్నరు ఈ కార్యక్రమనికి టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా జాతీయ ,రాష్ట్ర నాయకులూ దాసరి కృష్ణారెడ్డి వెంకటరమణ కుమారస్వామీ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విలేఖరులు హాజరయ్యారు. జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ ,కట్ల శ్రీను బిజేపి జిల్లా అద్యక్షులు అశోక్ రెడ్డి టీడీపీ నాయకురాలు సీతక్క సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు శ్రీనివాసరావు వాసుదేవరెడ్డిలు సంఘీభావం తెలిపారు. జీవో 239 ను సవరించి తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
ఆందోళన వద్దు.. అందరికీ అక్రిడిటేషన్లు
ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ న్యూశాయంపేట : ప్రభుత్వం ఇంకా కుదట పడలేదని, అధికారుల లేమితోనే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్యకార్డులు ఆలస్యమవుతున్నాయని, త్వరలో అందరికీ అందుతాయని రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమి చైర్మెన్‌గా రెండోసారి నియమితులైన సందర్భంగా ఆదివారం హన్మకొండ ప్రెసక్లబ్‌లో టీయూడబ్ల్యూజే(హెచ్–143) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పోరాటాల ఫలితంగానే అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందని, డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇచ్చేలా జీవో జారీ అయిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది తమ సంఘ పోరాట ఫలితమేనని చెప్పారు. రూ.100 కోట్ల నిధిని సాధించి, ప్రతి జర్నలిస్టుకు రూ.10 వేల పెన్షన్ వచ్చేలా పోరాడుతానని అన్నారు. తన హయాంలో ప్రతిక్షణం జర్నలిస్టుల సంక్షేమానికే వెచ్చిస్తానన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. తెలంగాణ సిలబస్ ప్రవేశపెట్టి అకాడమి ద్వారా జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు ప్రెస్‌క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు క్రాంతి, పి.రవి, లెనిన్, కొండల్రావు, పి.శివకుమార్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా అద్యక్షుడు జి.వెంకట్ పాల్గొన్నారు.