మల్లెలు, జాజుల గుబాళింపుతో నర్సరీలు స్వాగతం పలుకుతాయి. లిల్లీ, గులాబీల అందాలు రా..రమ్మని ఆహ్వానిస్తాయి. కనకాంబరాలు కలరింగ్‌తో పడేస్తాయి. హెల్కోనియా హ్యాంగింగ్స్ అబ్బుర పరుస్తాయి. గ్లాడియోలస్ అందాలు బాగున్నారా అంటూ పలుకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఆకర్షిస్తాయి. ఆర్కిడ్స్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెడతాయి. అలహాబాద్ సఫేదీ, తైవాన్ జామ నర్సరీలు, కొబ్బరి నర్సరీలు రైతులకు దిగుబడుల లాభాలను పంచుతామంటూ ముందుకు వస్తాయి. సరిగ్గా దృష్టి సారిస్తే కడియం, కడియపు లంక మాదిరి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కూడా నర్సరీల జిల్లాగా రూపాంతరం చెందేందుకు మార్గాలు అనేకం ఉన్నాయి.
తాడేపల్లిగూడెం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఉన్న సమయంలోనే నర్సరీలు, ఫ్లోరీ కల్చర్, కొబ్బరి, జామ నర్సరీల అభివృద్ధికి పశ్చిమగోదావరిలో కృషి జరిగింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లాలోకి వెళ్లిన పెరవలి మండలం కాకరపర్రు పువ్వుల పల్లెగా పరిఢవిల్లింది. మెట్ట ప్రాంతాల్లో కూడా నర్సరీల పెంపకం పెరిగింది. విధానపరమైన నిర్ణయాలతో జిల్లా వేరువేరు ప్రాంతాలుగా విడిపోకముందు నర్సరీల అభివృద్ధిపై ఉద్యాన శాఖ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నర్సరీల సమాచారం సేకరించింది. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం నర్సరీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని నర్సరీల వివరాలను తీసుకుంది.
నర్సరీలకు జిల్లా అనుకూలం
తైవాన్, అలహాబాద్ సఫేది రకాలకు చెందిన జామ నర్సరీలు తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఉన్నాయి. జిల్లాలోని తణుకు మండలం రేలంగి గ్రామంలో నర్సరీలను వృద్ధి చేస్తున్నారు. పాలకొల్లు మండలం అడవిపాలెంలో కొబ్బరి నర్సరీలను రైతులు పెంచుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంటలో ఈస్టుకోస్టు హైబ్రీడ్ కోకోనట్ సెంటర్‌లో కొబ్బరి నర్సరీలను పెంచుతున్నారు. ఇక్కడే హెల్కోనియా హ్యాంగింగ్స్ వంటి అలంకరణ పుష్పాల మొక్కలను పెంచుతున్నారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా థాయిలాండ్‌లోని నాంగ్‌నూచ్ గ్రామంలో ఏటా డిసెంబర్‌లో జరిగే కింగ్ షోకు వచ్చిన కొత్త విదేశీ రకాల మొక్కలను ఇక్కడికి తీసుకువచ్చి అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు. బంతి తోటల పెంపకం ఇటీవల కాలంలో జిల్లాలో ఊపందుకుంది.
గోదావరి పరీవాహకంలో లంక ప్రాంతాలు ఉండటంతో ఈ మొక్కల పెంపకానికి, ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే పలు రకాల ఆర్కిడ్స్‌ను ఫ్లోరల్ ఎసెన్సు ఫారమ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆర్కిడ్స్ ఫార్మ్ తణుకులో పెంచుతున్నారు. డి.1075, ఎం.ఎల్లో, డి.997, వి.స్పాటెడ్ ఎల్లో, డి.999 వంటి ఆర్కిడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆర్కిడ్స్‌తో పాటు అరుదైన పుష్ప రకాల పెంపకం విషయంలో రైతులకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, అటవీ, క్లైమేట్ ఛేంజ్ డెక్కన్ రీజియన్ హైద్రాబాద్ వారు మార్గదర్శనం చేస్తున్నారు. జిల్లా ఉద్యాన శాఖ కూడా నర్సరీల ప్రోత్సాహానికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణతో ముందుకు సాగుతోంది.
నర్సరీలకు అక్రిడేషన్
జిల్లాలో ఏ రకం నర్సరీలను ఎక్కడెక్కడ రైతులు పెంచుతున్నారు.. ఏ ప్రామాణికాలు పాటిస్తున్నారనే విషయాలను అంచనా వేస్తూ, వాటికి చట్టబద్ధత కోసం ఉద్యాన శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో అక్రిడేషన్ కోసం సమాచారం సేకరించారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో ఉన్న నర్సరీల వివరాలు, విశిష్ట రక్షిత సాగు పద్ధతిలో పెంచుతున్న నర్సరీల వివరాలను తీసుకున్నారు. 2010లో నర్సరీ యాక్ట్‌కు అనుగుణంగా నర్సరీల పెంపకాన్ని గమనించడానికి వీలుగా సమాచారం తీసుకున్నారు. చట్టానికి లోబడి వచ్చిన నర్సరీల వివరాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. (క్లిక్: కొల్లేరుకు మహర్దశ.. ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు)
మేలైన మొక్కల కోసమే
పశ్చిమ గోదావరి జిల్లా నర్సరీలకు అనువైన ప్రాంతం. పూల తోటలకు అనుకూలం. పండ్ల, కొబ్బరి, జామ నర్సరీలు ఇక్కడ ఊపందుకుంటున్నాయి. నర్సరీలకు కేరాఫ్‌గా ఉన్న కడియం, కడియపు లంక మాదిరంత కాకున్నా, ఇక్కడ నర్సరీలను పెంచవచ్చు. నర్సరీల ద్వారా పెంచే మొక్కల్లో నాణ్యత పాటించడానికి వీలుగా రూపొందించిన నర్సరీ చట్టాన్ని అనుసరించి వాటికి అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచారం తీసుకున్నాం. దీనివల్ల నర్సరీలు పెంచే వారి బాధ్యత మరింత పెరిగి వినియోగదారులకు మంచి మొక్కలను అందించగలుగుతారు.
– ఎ.దుర్గేష్ , జిల్లా ఉద్యాన అధికారి, పశ్చిమగోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment