nurseries
-
ఆయిల్‌పామ్ @ 2.30 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. ఉద్యాన శాఖ సాగు ప్రణాళికకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం వేగంగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో 38 నర్సరీలు ఏర్పాటు చేసిన కంపెనీలు అవసరమైన మొక్కల్ని పెంచుతున్నాయి. ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి గల రైతులు ఆయా జిల్లాల ఉద్యానశాఖ అధికారులు, గ్రామాల్లోని ఏఈఓలను సంప్రదించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ♦ ఆయిల్‌ఫెడ్‌కు ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు లక్ష్యాన్ని నిర్దేశించించింది. ఈ సంస్థ 8 జిల్లాల పరిధిలో 76,900 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలి. తర్వాత ప్రీ యూనిక్ కంపెనీ 7 జిల్లాల్లో 34,800 ఎకరాలు, లోహియా కంపెనీ 27,100 ఎకరాలు, రుచిసోయా 24,300 ఎకరాలు, తిరుమల ఆయిల్ కంపెనీ 14,900 ఎకరాల్లో రైతులను సాగుకు ప్రోత్సహించేలా అనుమతి ఇచ్చింది. ♦ జిల్లాల వారీగా సాగు టార్గెట్ చూస్తే...కరీంనగర్ జిల్లాలో 18 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 17,800 ఎకరాలు, కొత్తగూడెంలో 16,800 ఎకరాలు, పెద్దపల్లిలో 14,900 ఎకరాలు, భూపాలపల్లిలో 12,800 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ♦ గతేడాదివరకు రాష్ట్రంలో 27 జిల్లాలకే ఆయిల్‌పామ్ సాగు పరిమితమైంది. ఈ ఏడాది కొత్తగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ జాబితాలో చేరాయి. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలను మినహాయిస్తే మొత్తం 31 జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగుకానుంది. ♦ రంగారెడ్డి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ కంపెనీ ముందుకురాగా, ఈ ఏడాది 5,500 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. వికారాబాద్ జిల్లాలో హెల్తీ హార్ట్స్ కంపెనీకి 3 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో లివింగ్ కంపెనీకి 5 వేల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో గోద్రెజ్ కంపెనీకి 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా అనుమతి ఇచ్చింది. ♦ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆయిల్‌పామ్ సాగు కేవలం 36 వేల ఎకరాలు మాత్రమే. ప్రస్తుతానికి ఈ సాగు 1.54 లక్షల ఎకరాలకు పెరిగింది. సాగు గణాంకాల్లో దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ రెండోస్థానంలో ఉంది. -
నర్సరీలకు మహర్దశ
నర్సరీలకు మహర్దశ పట్టనుంది. ప్రభుత్వ తోడ్పాటుతో దేశంలోనే తొలి నర్సరీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (ఎఫ్పీసీ) ఏర్పాటుకు రాష్ట్రంలో బీజం పడింది. ఇప్పటికే ఈ రంగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ఏపీ రిజిస్ట్రేషన్ ఆఫ్ హార్టీకల్చర్ నర్సరీస్ యాక్ట్– 2010ని సవరించి దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని నర్సరీలన్నిటినీ చట్టపరిధిలోకి తెచ్చారు. వాటికి లైసెన్సులు జారీ చేస్తున్నారు. మరోవైపు ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిస్తూ ఎఫ్‌పీవోలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. – సాక్షి, అమరావతి అత్యుత్తమ శ్రేణి.. తక్కువ ధర నినాదంతో రాష్ట్రంలో 3,550 నర్సరీల్లో ఏటా 422 కోట్ల మొక్కలను ఉత్పత్తి చేస్తుండగా.. ఏటా రూ.2,482 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. ప్రత్యక్షంగా 4.50 లక్షల మంది, పరోక్షంగా లక్షమంది ఉపాధి పొందుతున్నారు. సొంతంగా మొక్కల్ని ఉత్పత్తి చేసే నర్సరీలు, స్థానికంగా ఉత్పత్తి చేసే మొక్కల రకాలు చాలా తక్కువనే చెప్పాలి. దశాబ్దాలుగా వేళ్లూనుకున్న ఈ రంగం నేటికీ పూణే, కేరళ, బెంగాల్‌తో పాటు విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి స్థానిక నర్సరీలు తీసుకొచ్చే మొలకలు, విత్తనాలపై ఆధారపడే పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా రవాణ, నిర్వహణ చార్జీల పేరిట ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో అమ్ముతున్నారు. నాణ్యమైన మొక్కలు అందని ద్రాక్షగా మారింది. నాసిరకం మొక్కల బారినపడి ఏటా వందలాది కోట్ల పెట్టుబడిని రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ శ్రేణి.. తక్కువ ధర (హై క్వాలిటీ.. లో ప్రైస్) నినాదంతో నాణ్యమైన దేశీ, విదేశీ మొక్కలను స్థానికంగా ఉత్పత్తి చేసి, తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలోనీ నర్సరీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ తోడ్పాటుతో నర్సరీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీని ఏర్పాటు చేశాయి. రూ.3 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటైన ఈ కంపెనీలో ఇప్పటికే 300 నర్సరీలు షేర్ హోల్డర్స్‌గా చేరాయి. మూడు చోట్ల సేవా కేంద్రాలు కంపెనీ ఏర్పాటులో తొలి ప్రయత్నంగా విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరుల్లో అత్యున్నత ప్రమాణాలతో నర్సరీ సేవా కేంద్రాల పేరిట ఉమ్మడి మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా నర్సరీ రైతులకు మొక్కలతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతారు. దేశీయ, విదేశీ రకాలను స్థానికంగా అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తి చేయడంతో పాటు వాటిని ఒకేచోట చేర్చి రైతులకు, వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు. ఈ మార్కెట్ల ద్వారా కొత్త రకాల మొక్కల ఉత్పత్తి గణనీయంగా పెరగనుంది. దేశీయ మొక్కల మార్కెట్లో ప్రతి నర్సరీ ఉత్పత్తిదారులుగా మారడంతోపాటు డిమాండ్ తగినట్టుగా ఉత్పత్తిని పెంచి లాభాలు ఆర్జించనున్నారు. ఉత్పత్తిదారులుగా నర్సరీ రైతులు నర్సరీ రంగాన్ని వ్యవస్థీకృతం చేయడంతోపాటు స్థానికంగా ఉత్పత్తిని పెంచడం, నర్సరీ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా కంపెనీని ఏర్పాటు చేశాం. మాతో కలిసి వచ్చే ప్రతి నర్సరీ రైతుని ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దడం తద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం. తద్వారా నర్సరీ రంగంలో ఏపీని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. – గోపాలం రవీంద్ర, చైర్మన్, నర్సరీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ప్రభుత్వ తోడ్పాటు మరువలేనిది కంపెనీ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు మరువలేనిది. ఆంధ్రప్రదేశ్ నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన నర్సరీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీకి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. – ఆకుల చలపతిరావు, మేనేజింగ్ డైరెక్టర్, నర్సరీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ మూడేళ్లలో రూ.100 కోట్ల వ్యాపారం కంపెనీ ద్వారా నర్సరీలను ప్రత్యామ్నాయ వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, నర్సరీ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే పరిశ్రమలను ఏర్పాటుతో పాటు రైతులతో కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. కంపెనీ ద్వారా తొలి ఏడాది రూ.10 కోట్లు రెండో ఏడాది రూ.50 కోట్లు, మూడో ఏడాది రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోవాలని.. తద్వారా మొక్కల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్‌ను దేశంలో మొదటి స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సవరించిన నర్సరీల చట్ట పరిధిలోకి శాశ్వత పండ్ల మొక్కలను ఉత్పత్తి చేసే నర్సరీలతో పాటు షేడ్ నెట్/పాలీ హౌస్ నర్సరీలను తీసుకురావడంతోపాటు 2,930 నర్సరీలకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. -
చీనీ నర్సరీలతో అధిక లాభాలు
లింగాల: మండలంలో చీనీ నర్సరీలు విస్తారంగా సాగవుతున్నాయి. మండలంలోని లింగాల, పెద్దకుడాల, బోనాల, కర్ణపాపాయపల్లె, వెలిదండ్ల గ్రామాల్లోని రైతులు చీనీ నర్సరీలు విస్తారంగా సాగు చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి చీనీ నర్సరీలవల్ల లాభాలు గడిస్తున్నారు. ఏపీ, తెలంగాణా ప్రాంతాల నుంచి చీనీ మొక్కల కోసం విరివిగా వస్తున్నందున వాటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో నర్సరీల సాగు కోసం మండల రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారు. జంబోరా నారుకు డిమాండ్ : చీనీ నర్సరీలు సాగు చేయాలంటే జంబోరా నారు అవసరం. ఈ నారును అన్నమయ్య జిల్లా రాజంపేటలోనే సాగు చేస్తారు. గత ఏడాది ఒక్కో జంబోరా మొక్క ఒక్క రూపాయి ఉండగా.. ప్రస్తుతం రూ.3లు పలుకుతోంది. గత ఏడాది భారీ వర్షాలవల్ల రాజంపేట ప్రాంతంలో జంబోరా విత్తనాలు మొలకెత్తకపోవడంతో అక్కడక్కడా ఉన్న జంబోరా నారుకు డిమాండ్ పెరిగిందని.. దీంతో ధరలు పెరిగాయని రైతులు అంటున్నారు. అదేవిధంగా తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలలో లభించే జంబోరా విత్తనాలు తగినన్ని లభించకపోవడం కూడా జంబోరా నారు ధరలు పెరగడానికి కారణమంటున్నారు. ఏడాది పాటు వేచి ఉండాలి.. జంబోరా నారు నాటినప్పటి నుంచి ఆరు మాసాలు జంబోరా మొక్కలు పెంచాలి. ఆ తర్వాత నాణ్యమైన చీనీ చెట్ల నుంచి కొమ్మలు వేరు చేసి వాటికి అంట్లు కట్టాలి. అంట్లు కట్టిన ఏడాదికి చీనీ మొక్కలు చేతికందుతాయి. కూలీలకు డిమాండ్ : జంబోరా మొక్కలు నాటడానికి, వాటికి అంట్లు కట్టడానికి నైపుణ్యం గల కూలీలనే ఆశ్రయించాలి. విస్తారంగా చీనీ నర్సరీలు సాగు అవుతున్నందున కూలీలకు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు కూలీ ధరలు కూడా బాగా పెరిగాయి. లాభాలు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టినా చీనీ మొక్కలకు డిమాండ్ ఉన్నందున మంచి లాభాలు వస్తు న్నాయి. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు చీనీ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తే నర్సరీ రైతులకు కాస్తా ఊరట లభిస్తుంది. – కేశంరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (నర్సరీ రైతు), లింగాల లింగాల చీనీ మొక్కలకు డిమాండ్ లింగాల మండలంలో సాగు చేసిన చీనీ మొక్కలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ జంబోరా, రంగపూర్ మొక్కలు నాణ్యమైనవిగా పేరుగాంచింది. దీంతో ఏపీ, తెలంగాణా రైతులు వీటిపైనే మక్కువ చూపుతున్నారు. – ముచ్చుమర్రి చంద్రశేఖరరెడ్డి (చీనీ నర్సరీ రైతు), లింగాల -
పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరిస్తున్న నర్సరీలు
మల్లెలు, జాజుల గుబాళింపుతో నర్సరీలు స్వాగతం పలుకుతాయి. లిల్లీ, గులాబీల అందాలు రా..రమ్మని ఆహ్వానిస్తాయి. కనకాంబరాలు కలరింగ్‌తో పడేస్తాయి. హెల్కోనియా హ్యాంగింగ్స్ అబ్బుర పరుస్తాయి. గ్లాడియోలస్ అందాలు బాగున్నారా అంటూ పలుకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఆకర్షిస్తాయి. ఆర్కిడ్స్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెడతాయి. అలహాబాద్ సఫేదీ, తైవాన్ జామ నర్సరీలు, కొబ్బరి నర్సరీలు రైతులకు దిగుబడుల లాభాలను పంచుతామంటూ ముందుకు వస్తాయి. సరిగ్గా దృష్టి సారిస్తే కడియం, కడియపు లంక మాదిరి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కూడా నర్సరీల జిల్లాగా రూపాంతరం చెందేందుకు మార్గాలు అనేకం ఉన్నాయి. తాడేపల్లిగూడెం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఉన్న సమయంలోనే నర్సరీలు, ఫ్లోరీ కల్చర్, కొబ్బరి, జామ నర్సరీల అభివృద్ధికి పశ్చిమగోదావరిలో కృషి జరిగింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లాలోకి వెళ్లిన పెరవలి మండలం కాకరపర్రు పువ్వుల పల్లెగా పరిఢవిల్లింది. మెట్ట ప్రాంతాల్లో కూడా నర్సరీల పెంపకం పెరిగింది. విధానపరమైన నిర్ణయాలతో జిల్లా వేరువేరు ప్రాంతాలుగా విడిపోకముందు నర్సరీల అభివృద్ధిపై ఉద్యాన శాఖ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నర్సరీల సమాచారం సేకరించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం నర్సరీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని నర్సరీల వివరాలను తీసుకుంది. నర్సరీలకు జిల్లా అనుకూలం తైవాన్, అలహాబాద్ సఫేది రకాలకు చెందిన జామ నర్సరీలు తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఉన్నాయి. జిల్లాలోని తణుకు మండలం రేలంగి గ్రామంలో నర్సరీలను వృద్ధి చేస్తున్నారు. పాలకొల్లు మండలం అడవిపాలెంలో కొబ్బరి నర్సరీలను రైతులు పెంచుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంటలో ఈస్టుకోస్టు హైబ్రీడ్ కోకోనట్ సెంటర్లో కొబ్బరి నర్సరీలను పెంచుతున్నారు. ఇక్కడే హెల్కోనియా హ్యాంగింగ్స్ వంటి అలంకరణ పుష్పాల మొక్కలను పెంచుతున్నారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా థాయిలాండ్‌లోని నాంగ్నూచ్ గ్రామంలో ఏటా డిసెంబర్లో జరిగే కింగ్ షోకు వచ్చిన కొత్త విదేశీ రకాల మొక్కలను ఇక్కడికి తీసుకువచ్చి అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు. బంతి తోటల పెంపకం ఇటీవల కాలంలో జిల్లాలో ఊపందుకుంది. గోదావరి పరీవాహకంలో లంక ప్రాంతాలు ఉండటంతో ఈ మొక్కల పెంపకానికి, ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే పలు రకాల ఆర్కిడ్స్‌ను ఫ్లోరల్ ఎసెన్సు ఫారమ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆర్కిడ్స్ ఫార్మ్ తణుకులో పెంచుతున్నారు. డి.1075, ఎం.ఎల్లో, డి.997, వి.స్పాటెడ్ ఎల్లో, డి.999 వంటి ఆర్కిడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆర్కిడ్స్తో పాటు అరుదైన పుష్ప రకాల పెంపకం విషయంలో రైతులకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అటవీ, క్లైమేట్ ఛేంజ్ డెక్కన్ రీజియన్ హైద్రాబాద్ వారు మార్గదర్శనం చేస్తున్నారు. జిల్లా ఉద్యాన శాఖ కూడా నర్సరీల ప్రోత్సాహానికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. నర్సరీలకు అక్రిడేషన్ జిల్లాలో ఏ రకం నర్సరీలను ఎక్కడెక్కడ రైతులు పెంచుతున్నారు.. ఏ ప్రామాణికాలు పాటిస్తున్నారనే విషయాలను అంచనా వేస్తూ, వాటికి చట్టబద్ధత కోసం ఉద్యాన శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో అక్రిడేషన్ కోసం సమాచారం సేకరించారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో ఉన్న నర్సరీల వివరాలు, విశిష్ట రక్షిత సాగు పద్ధతిలో పెంచుతున్న నర్సరీల వివరాలను తీసుకున్నారు. 2010లో నర్సరీ యాక్ట్‌కు అనుగుణంగా నర్సరీల పెంపకాన్ని గమనించడానికి వీలుగా సమాచారం తీసుకున్నారు. చట్టానికి లోబడి వచ్చిన నర్సరీల వివరాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. (క్లిక్: కొల్లేరుకు మహర్దశ.. ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు) మేలైన మొక్కల కోసమే పశ్చిమ గోదావరి జిల్లా నర్సరీలకు అనువైన ప్రాంతం. పూల తోటలకు అనుకూలం. పండ్ల, కొబ్బరి, జామ నర్సరీలు ఇక్కడ ఊపందుకుంటున్నాయి. నర్సరీలకు కేరాఫ్‌గా ఉన్న కడియం, కడియపు లంక మాదిరంత కాకున్నా, ఇక్కడ నర్సరీలను పెంచవచ్చు. నర్సరీల ద్వారా పెంచే మొక్కల్లో నాణ్యత పాటించడానికి వీలుగా రూపొందించిన నర్సరీ చట్టాన్ని అనుసరించి వాటికి అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచారం తీసుకున్నాం. దీనివల్ల నర్సరీలు పెంచే వారి బాధ్యత మరింత పెరిగి వినియోగదారులకు మంచి మొక్కలను అందించగలుగుతారు. – ఎ.దుర్గేష్ , జిల్లా ఉద్యాన అధికారి, పశ్చిమగోదావరి జిల్లా -
వేతనం కోసం..వేదన
భీమవరం(పశ్చిమగోదావరి) : ఆటవీ శాఖ విభాగంలో నడిచే నర్సరీల్లో పనిచేస్తున్న వన సేవకులు, ఇతర సిబ్బందికి 8 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖ విభాగంలో పనిచేసే ఈనర్సరీలకు ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తారు. ఆ నిధుల ద్వారా సిబ్బంది వేతనాలు, నర్సరీ అభివృద్ధి పనులు నిర్వహిస్తారు. అయితే ఈవిభాగానికి ఉపాధి హామీ పథకం నిధులు రాక గత 8 నెలలుగా వనసేవకులకు వేతనాలు అందడం లేదు. పట్టించుకోని గత ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీరిని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా వన సేవకులు జీతాలు రాక అప్పులు చేసుకుని బతకాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వన సేవకుడికి సుమారు నెలకి రూ.8,800 వేతనం ఇస్తున్నారు. ఒక్కొక్కరికి సుమారు రూ.70 వేల వరకు వేతన బకాయిలు అందాల్సి ఉంది. జిల్లాలో నర్సాపురం డివిజన్లో వీరవాసరం మండలం కొణితివాడ, నర్సాపురం మండలం సీతరామాపురం, రుస్తుంబాదు, యర్రంశెట్టివారి పాలెం,పెరవలి మండలంలోని కాకరపర్రు, మొగల్తూరు మండలంలంలో కేపీ పాలెంలో మొత్తం 7 నర్సరీలు ఉన్నాయి వాటిలో మొత్తం 10 మంది వరకు వన సేవకులు ఇతర సిబ్బంది ఉన్నారు. మట్టి పనులు చేసినవారికి అందని బిల్లులు ఈనర్సరీల్లోని మొక్కల అభివృద్ధి కోసం ఎర్రమట్టి తీసుకువచ్చి వాటిలో ఈమొక్కలు ఉంచి సంరక్షణ చేస్తారు. మట్టితోలకం పనులు కాంట్రాక్టర్లు చేశారు. వారికి బిల్లులు చెల్లించలేదు. ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేస్తే వారికి బిల్లులు వస్తాయి. గత ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను ఇతర పనులకు వినియోగించుకోవడంతో వీరంతా నానా పాట్లు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వనసేవకులు కోరుతున్నారు. జిల్లాలో 40 నర్సరీలు జిల్లాలో∙40 నర్సరీలు ఉన్నాయి. వీటిలో 40 మంది వన సేవకులతో పాటు ఉపాధి కూలీలుగా పనిచేసిన సిబ్బంది నర్సరీకి 5 నుంచి 8 మంది చొప్పున ఉన్నారు. వీరికి ఉపాధి కూలీలకు ఇచ్చే విధంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు వన సేవకులుగా పనిచేస్తున్న మాకు 8 నెలలుగా జీతాలు రావడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. విధులకు రావడానికి ఇబ్బందులు పడుతున్నాం. ఎనిమిది నెలల వేతనాలు ఇవ్వకపోతే ఏమి తిని బతకాలి. ఉన్నతాధికారులు పట్టించుకుని మాకు వెంటనే జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – డి.వెంకటేశ్వరరావు, వన సేవకుడు, కొణితివాడ నర్సరీ నిధులు విడుదల కావాల్సి ఉంది నర్సరీల్లో పనిచేసే సిబ్బందికి, నర్సరీల అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చెల్లింపులు చేస్తారు. ప్రతి నెల సిబ్బందికి ఇవ్వాల్సిన వేతనాలు మేము జనరేట్ చేస్తాము. నిధులు విడుదలయిన వెంటనే వారి ఖాతాకు జమవుతాయి. నిధులు విడుదలయిన వెంటనే వేతనాలు జమవుతాయి. – కె.శ్రీనివాసరావు, అటవీశాఖాధికారి, ఏలూరు -
అయిదో విడతకు అంతా సిద్ధం!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్): అయిదవ విడత హరితహారం కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) సిద్ధమైంది. గతేడాది కన్నా ఈసారి మూడింతల భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఈ శాఖ వేగంగా మొక్కలు నాటేందుకు పనులను ప్రారంభించింది. ఇందుకు ఆయా మండలాలు, గ్రామాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ఇతర ప్రాంతాల్లో ఉపాధిహామీ కూలీలతో గుంతలను తవ్విస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల వరకు గుంతల తవ్వకాలను పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో నేల మెత్తబడింది. వర్షాలు తగ్గుముఖం పట్టకముందే గుంతలను మరింత వేగంగా తవ్వించి ఎప్పటికప్పుడు మొక్కలు నాటించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది డీఆర్డీఏ 60 లక్షల మొక్కలను మాత్రమే నాటింది. ఇందులో 40 లక్షల టేకు మొక్కలున్నాయి. అయితే ప్రస్తుతం అయిదవ విడతలో భారీగా మొక్కలు నాటేందుకు ప్రతి గ్రామ పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేసింది. మట్టిని నింపి అందులో విత్తనాలు పెట్టేందుకు కిలోకు రూ.159 చొప్పున టెండరు ద్వారా కొనుగోలు చేసి మొత్తం 2కోట్ల 78లక్షల 40వేల మొక్కలను పెంచింది. ప్రస్తుతం మొక్కలను నర్సరీల నుంచి నాటే స్థలాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయితే మొక్కలను ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జూలై రెండవ వారంలో ప్రారంభించేది. కాగా ఈసారి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇంత వరకు అందలేదు. ఏ రోజైనా ఆదేశాలు రావచ్చనే ముందస్తు ఆలోచనతో మొక్కలను సిద్ధం చేసి ఉంచారు. వర్షాలు కురుస్తున్నాయని, ఇదే అదనుగా కొన్ని చోట్ల అనధికారికంగా నాటడం కూడా మొదలెట్టేశారు. నర్సరీలు 400 మొత్తం మొక్కలు 28740000 మొక్కల రకాలు 50 టేకు మొక్కలు 50 లక్షలు ఇప్పటి వరకు తవ్విన గుంతలు 2 లక్షలు 50 లక్షల టేకు మొక్కలు రైతులకే... గత ఏడాది 40 లక్షల టేకు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేశారు. అయితే ఈ ఏడాది 50 లక్షల టేకు మొక్కలను ఇవ్వనున్నారు. అన్ని మొక్కలకన్నా ఎక్కువ ధర టేకుకే ఉంటుంది. విత్తనాలు కొనుగోలు చేసి పెంచినా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తమిళనాడు నుంచి టెండరు ద్వారా స్టంపులను తెప్పిస్తారు. ఈ ఏడాది కూడా ఒక్కో స్టంపును 82 పైసలకు కొనుగోలు చేసి తెప్పించి నర్సరీల్లో పెంచారు. వీటిని వ్యవసాయ రైతులకే ఇవ్వనున్నారు. పొలం గట్లపై పెంచడానికి 50 వరకు మొక్కలు ఇవ్వనున్నారు. కాగా రైతుకు ప్రత్యేక స్థలం ఉండి మొక్కలను పెంచడానికి ఉత్సాహం చూపితే 500 వరకు ఇచ్చే అవకాశం ఉంది. 50 లక్షల లక్ష్యానికి గాను జిల్లాల్లో 48 లక్షల స్టంపులు రావడంతో వాటినే పెంచారు. మొత్తం యాబై రకాల మొక్కలు... భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న డీఆర్డీఏ .. 400 నర్సరీల్లో మొత్తం యాబై రకాల మొక్కలను పెంచింది. అందులో 50 లక్షల వరకు టేకు మొక్కలే ఉన్నాయి. మిగతా మొక్కలు మందారా, రోజా, బాహునియా, తబుబియా, సీతాఫలం, కరివేపాకు, టేకొమా, జామా, దానిమ్మ, గన్నేరు, మునగ, రెడ్ సాండర్స్, బాంబో, గుల్మోహర్, కానుగ, వేప, అల్బిజియా, బురుగు, చింత, చిన్నబాదం, బాదం, రెయిన్ ట్రీ, ఈత,మొర్రి, మారెడు, సీమ తంగెడు, జీడీ, జమ్మి, అల్ల నేరెడు, ఉసిరి, ఇతర రకం మొక్కలున్నాయి. ఈత, దానిమ్మ, ఉసిరి, మునగ లాంటి రకం మొక్కలు 9 లక్షల చొప్పున పెంచారు. ఎక్కడెక్కడ నాటుతారంటే... మొక్కలను ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, ప్రయివేటు సంస్థలు, పరిశ్రమలు, చెరువు కట్టలు, రోడ్ల వెంబడి, కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు, తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. ఏ కేటగిరిలో ఎన్ని మొక్కలు నాటాలో ప్రణాళికను సైతం డీఆర్డీఏ అధికారులు రూపొందించుకున్నారు. ఈ చెట్లను గౌడ కులస్తులు వారి సొసైటీ స్థలాల్లో నాటేందుకు ముందుకు వస్తే మొక్కలను అందజేయనున్నారు. మొక్కలు తరలిస్తున్నాం హరితహారంలో మొక్కలు నాటేందుకు అన్ని నర్సరీల్లో మొక్కలు పెంచాం. ప్రస్తుతం మొక్కలను ఆయా ప్రాంతాలకు తరలించి నాటేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధిహామీ కూలీలతో గుంతలను వేగంగా తవ్విస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వేగంగా మొక్కలు నాటిస్తాం. –రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ,నిజామాబాద్ -
చెట్టుకు నీడ కరువవుతోంది..!
సాక్షి, దేవరపల్లి : మొన్నటి వరకు రకరకాల మొక్కలతో పచ్చదనంతో కళకళలాడిన ఉద్యానవనం నేడు ఎండిపోయి వెలవెలబోతుంది. లక్షల రూపాయల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాళీగా ఉన్న స్థలంలో రెండు సంవత్సరాల క్రితం రకరకాల మొక్కలు నాటి ఉద్యానవనం తయారు తయారు చేశారు. పచ్చని మొక్కలు, సువాసన వెదజల్లే మొక్కలతో ఉద్యానవనం (గార్డెన్) ్ఛహ్లాదకరంగా తయారు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ప్రముఖ దాత అంబటి శ్రీనివాసరావు తన సొంత నిధులు సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఉధ్యావనవనం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ముళ్లపొదలు, మురుగునీటి గుంటలతో ఉన్న ఆసుపత్రి ప్రాంగణం సుందరంగా తయారు చేశారు. అయితే ఇటీవల గార్డెన్ ఆలనాపాలనా లేక పచ్చదనం తగ్గింది. వేసవి ఎండల తీవ్రతకు ఉద్యావనంలోని మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. మొక్కలకు నీరులేక ఎండిపోయి వెలవెలబోతున్నాయి. చక్కని ఉద్యానవనం నిలువునా ఎండిపోవడంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు నిరూత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హరితహారానికి మొక్కలు సిద్ధం
సాక్షి, వేములపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధికారులు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని ఏడు గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటుచేసి వన సేవకులు మొక్కలను పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పం చాయతీలో 40వేల నుంచి లక్ష మొక్కలు నాట డమే లక్ష్యంగా అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లోఅటవీశాఖ ఆధ్వర్యంలో లక్షలాది మొక్కల పెంపకం శరవేగంగా జరుగుతుంది. ఉపాధిహామీ పథకంలో భాగంగా మరికొన్ని నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. మండలంలోని మంగాపురం గ్రామంలో 30వేల మొక్కలు, సల్కునూరులో 40వేలు, ఆమనగల్లు, శెట్టిపాలెం, రావులపెంట, వేములపల్లి, బుగ్గబావిగూడెం, లక్ష్మీదేవిగూడెం గ్రామాల్లో 50వేల చొప్పున, కామేపల్లి, అన్నపరెడ్డిగూడెం, తిమ్మారెడ్డిగూడెం గ్రామాల్లో 20వేల చొప్పున మొక్కలను నాటేందుకు అధికారులు నిర్ణయించారు. నాటిన ప్రతి మొక్క బతికేవిధంగా చర్యలు నర్సరీల్లో పెంచిన మొక్కలను మండలంలోని ఆయా గ్రామాల్లో నాటిన తరువాత నాటిన ప్రతి మొక్క బతికి పెరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే జామ, ఉసిరి, నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, వెలిగ, బొప్పాయి, మునగ, గోరింట, కరివేపాకు, మారేడు, పీటోపాల్, డెకోమా, టేకు లాంటి వివిధ రకాల మొక్కలను అందించనున్నా రు. ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో సంచులలో మట్టిని నింపేందుకు, మొక్కలకు నీటిని చల్లేం దుకు, మొక్కల మధ్య కలుపు తీసే పనులకు అధి కారులు ఉపాది కూలీలను వినియోగిస్తూ పలు కుటుంబాలకు జీవనాధారాన్ని కల్పిస్తున్నారు. జూన్ నాటికి మొక్కలు సిద్ధం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని వర్షాకాలంలో ప్రారంభించనున్నందున జూన్ నాటికి ఆయా గ్రామాల్లో మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలం లోని ఆరు నర్సరీల్లో సంచులలో మట్టిని నింపి విత్తనాలు వేశాం. అధికారులు ఎప్పటికప్పుడు నర్సరీలను పరిశీలించి వన సేవకులకు తగు సూచనలు చేస్తూ వర్షాకాలం ఆరంభంనాటికి మొక్కలు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనయ్య, ఏపీఓ -
ఊరూరా వన నర్సరీలు
సాక్షి, దామరగిద్ద: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంతో గ్రీన్‌విలేజ్ నిర్మాణానికి వన్ విలేజ్.. వన్ నర్సరీ నినాదంతో ఊరూరా ప్రారంభించిన నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రారంభమైంది. మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలో 30 నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉల్లిగుండం, కాన్కుర్తి, మొగుల్‌మడ్క, కంసాన్పల్లి, ముస్తాపేట్‌లో అటవీశాఖ ద్వారా 5నర్సీరీలు ఏర్పాటు చేయగా.. మిగిలిన అన్ని గ్రామాల్లో డ్వామా ద్వారా 25 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సీరీలో గ్రామ జనాభా, భౌగోళిక విస్తీర్ణం, రైతుల ఆసక్తిని పరిగణలోకి తీసుకొని 40వేల మొక్కల నుంచి లక్ష మొక్కలను పెంచుతున్నారు. 40శాతం టేకు మొక్కలే.. మండలంలోని మొత్తం 30 నర్సీరీల్లో 15 లక్షల మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో ప్రతి నర్సరీలో పెంచే మొక్కల్లో 40 శాతం టేకు మొక్కలు కాగా మిగిలిన 60 శాతం ఇంటి ముందు పరిసరాల్లో పెంచుకునే (హోంస్టేడ్) జామ నిమ్మ, అల్లనేరేడు, వంటి పండ్ల మొక్కలు కరవేపాకు, చింత, మామిడి తదితర మొక్కలకు పెంచుతున్నారు. నర్సరీలకు చేరిన 3.80 లక్షల టేకు వేళ్లు డ్వామా ద్వారా పెంచుతున్న రెండు నర్సరీల్లో టేకు మొక్కల పెంపకం ప్రారంభించారు. ఇప్పటివరకు మండలంలోని 17 గ్రామాల నర్సీరీలకు 3.80 లక్షల టేకు మొక్కలను సరఫరా చేయగా.. వాటిని మట్టి బ్యాగుల్లో నాటి పెంచుతున్నారు. జిల్లా అధికారుల నుంచి ఇప్పటివరకు అందిన టేకు మొక్కల వేళ్లు (స్టంప్స్) అందించగా పండ్ల మొక్కల పెంపకానికి విత్తనాలు సరఫరా కానున్నాయని అధికారులు అంటున్నారు. ఇక మరో రెండు రోజుల్లో 2.20 లక్షల స్టంఫ్స్ సరఫరా కానున్నాయని తెలియజేస్తున్నారు. ఆయా నర్సరీల్లో 60శాతం పెంచే పండ్ల మొక్కల పెంపకానికి ప్రత్యేక పార్మేషన్ బెడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటి పరిసరాల్లో పెంచే మొక్కల పెంపకానికి మట్టి గులికలతోపాటు ఎం45, ఎస్ఎస్పీ, ఒక్కో మీటర్ పొడవు వెడల్పు మట్టిబెడ్‌లను ఏర్పాటు చేసి వాటిలో విత్తనాలు చల్లి మొక్కలను పెంచనున్నారు. మొలకలు రాగానే వాటిని మట్టితో నింపిన ప్లాస్టిక్ బ్యాగులలో నాటి పెద్ద చేస్తారు. ప్రతి విలేజ్‌ను గ్రీన్‌విలేజ్ మార్చేందుకు నెల క్రితమే నర్సరీల్లో మట్టి బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తిచేసి సిద్ధంగా ఉంచారు. వన నర్సరీల ఏర్పాటుకు మూడు నెలల నుంచి కరసత్తు ప్రారంభించాం. అన్ని నర్సరీల్లో ఫిడస్ట్రాల్ ట్యాంకుల నిర్మాణం, మట్లి బ్యాగ్‌ల ఫిల్లింగ్ పూర్తయింది. 17 నర్సరీల్లో ఇప్పటి వరకు పంపిణీ చేసిన 3.80 టేకు స్టంప్స్ నాటి వాటని పెంచుతున్నాం. మరో 2.20 టేకు స్టంఫ్స్ పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలో టేకుతో పాటు మొత్తం 15 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నర్సరీలు కొనసాగుతున్నాయి. – సందీప్‌కుమార్, ఎంపీడీఓ, దామరగిద్ద -
నల్లగొండ మున్సిపాలిటీలో నర్సరీలు..!
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం కింద ఇకనుంచి మున్సిపాలిటీలో కూడా నర్సరీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీలగిరి మున్సిపాలిటీలో ఈ ఏడాది నర్సరీల ద్వారా ఒక లక్ష మొక్కలు పెంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రతిపానదలు రూపొందించారు. మెప్మా పర్యవేక్షణలో సమభావన సంఘాల మహిళల ద్వార నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. నీలగిరి పట్టణంలో ఉన్న సమభావన సంఘాల్లోని ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే వారిచే నర్సరీల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. సమభావన సంఘాల మహిళలు ఏర్పాటు చేసే నర్సరీలలో మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేయనుంది. గత ఏడాది వరకు ఇతర నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి హరితహారం కింద మొక్కలు నాటే వారు. ఒక్కో మొక్కకు రూ.10 చెల్లింపు నర్సరీలు ఏర్పాటు చేయాలంటే తగినంత స్థలం, నీటి వసతి, వాటి రక్షణ అవసరం ఉంటుంది. ఈ సౌకర్యాలు ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తారు. నారు కొనుగోలు చేయడంతో పాటు ఎర్రమట్టి, కవర్లు, ఎరువు తదితర వాటిని సంబంధిత మహిళలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నారు గింజలను కూడా మెప్మా సిబ్బంది కొనుగోలు చేయిస్తారు. దాదాపు నాలుగున్నర నెలల పాటు నర్సరీలలో మొక్కలు పెంచాల్సి ఉంటుంది. 2నుంచి 3 ఫీట్లు పెంచిన మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేసి పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో నాటుతారు. నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచిన సంబంధిత మహిళలకు ఒక్కో మొక్కకు రూ. 10 ల చొప్పున మున్సిపాలిటీ చెల్లిస్తుంది. మహిళలు ఎన్ని మొక్కలు పెంచినా వాటిలో బతికిన వాటికి మాత్రమే మున్సిపల్ అధికారులు డబ్బులు ఇస్తారు. బ్యాంకు రుణ సౌకర్యం... నర్సరీలను ఏర్పాటు చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే సంబంధిత మహిళలకు బ్యాంకు రుణం ఇప్పించాలని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. మహిళా సభ్యులు వ్యక్తి గతంగానైనా, గ్రూపుగానైనా నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి బ్యాంకుల ద్వారా మొక్కలను బట్టి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మొక్కలు విక్రయించిన తర్వాత బ్యాంకులో చెల్లించే విధంగా సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడాలని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. నర్సరీల ద్వారా లక్ష మొక్కలు నీలగిరి పట్టణంలో మొక్కల సరఫరాకు ఇబ్బం ది లేకుండా ఇక్కడే నర్సరీలు ఏర్పాటు చేయాలని సీడీఎంఏ అధికారులు ఆదేశించారు. మహిళా సంఘాల వారి ద్వార నర్సరీలు ఏర్పా టు చేసి లక్ష మొక్కలు పెంచడానికి నిర్ణయిం చాం. వారు పెంచిన మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేస్తుంది. – దేవ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ -
పంచాయతీకో నర్సరీ
నేరడిగొండ(ఆదిలాబాద్): పచ్చదనానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. గ్రామాలను పచ్చలహారంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాల్లో విరివిగా మొ క్కలు నాటిస్తుండగా.. దీనిని ఉద్యమంలా కొనసాగించేందుకు ప్రతీ పంచాయతీలో న ర్సరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. పాత పంచాయతీలతోపాటు కొత్త గ్రామపంచాయతీల్లోనూ మొక్కలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతులు నివాస, పరిసర ప్రాంతాల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను ఆ గ్రామ పరిధిలోని నర్సరీలోనే పెంచే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పూలు, పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు అవసరమైన మొక్కల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా.. పంచాయతీ పరిధిలోని నర్సరీలో మొక్కలు పొందే విధంగా చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు బాధ్యతను గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖలకు అప్పగించింది. జిల్లాలోని 467 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలకు అదనంగా కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాలని, ప్రతీ పంచాయతీలో నర్సరీ ఉండాలని సూచనల్లో పేర్కొంది. దీంతో పాత, కొత్త గ్రామపంచాయతీల పరిధిలో నూతన నర్సరీలు ఏర్పాటు కానున్నాయి. ఈ నెల 15లోగా ఏర్పాటు.. గ్రామాలను పచ్చని తోరణాలుగా మలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతీ పంచాయతీలో ప్రభుత్వం నర్సరీని ఏర్పాటు చే స్తోంది. ఇప్పటివరకు మండలానికి రెండు నుంచి ఐదు నర్సరీలు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య ను పెంచి ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసే లా మార్గదర్శకాలు విడుదల చేసింది. స్థలాలను ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సూచించింది. ఈ నెల 15వ తేదీలోగా నర్సరీల వారీగా స్థలాలను నిర్ణయించి.. నివేదిక అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు వన సేవకులను కూడా గుర్తించాలని సూచించింది. ఆగస్టు 31లోగా ఎంపిక చేసిన నర్సరీ స్థలాల్లో నీటి సౌకర్యం, పైపులైన్ నిర్మాణం ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితోపాటు అవసరమైన టేకు స్టంప్స్, విత్తనాలు సిద్ధం చేసుకొని వాటిని నాటేందుకు పాలిథిన్ సంచులు సమకూర్చుకోవాల్సి ఉంది. సెప్టెంబర్ 15లోగా నర్సరీల్లో విత్తన బ్యాగులు ఏర్పాటు చేసేందుకు బెడ్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అక్టోబర్ 20లోగా పాలిథిన్ బ్యాగుల్లో మట్టిని నింపి సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అక్టోబర్ 31లోగా వాటిలో ఆయా పండ్ల విత్తనాలు, టేక్ స్టంప్స్ నాటాల్సి ఉంది. 467 నర్సరీలు. జిల్లాలో 467 నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో మండలంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 20 నర్సరీలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 8 నర్సరీలు పెంచేలా ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచనలు చేసింది. జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 419 నర్సరీల్లో 99లక్షల మొక్కలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 48 నర్సరీల్లో 41లక్షల మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రకారం జిల్లాలో నర్సరీలు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. జనాభా ప్రాతిపదికన మొక్కల పెంపకం.. ప్రభుత్వం కొత్త పంచాయతీల్లో ఏర్పాటు చేసే న ర్సరీల్లో జనాభా ప్రాతిపదికన మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ పంచా యతీ పరిధిలో గ్రామాలు, స్థానికులు వినియోగించుకునేలా నర్సరీల్లో మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టింది. వెయ్యికి పైగా జనాభా ఉన్న గ్రామంలో లక్ష మొక్కలు పెంచేలా నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తే అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం శాతా న్ని పెంచాలని సూచించింది. గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసే నర్సరీల్లో మొక్కల పెంపకం స్థానికుల అభీష్టం మేరకే ఉండనున్నది. రైతుల పొలాల్లో నాటేందుకు, నివాస పరిసరాల్లో నాటేందుకు అనువైన మొక్కలు పెంచేందుకు ప్ర భుత్వం నిర్ణయించింది. స్థానిక రైతులు, ప్రజలు తమకు అవసరమైన మొక్కలను సూచిస్తే.. వాటిని మాత్రమే ఆ నర్సరీల్లో పెంచేలా ప్రణాళికలు రూపొందించింది. వీటిలో అత్యధిక శాతం పూలు, పండ్ల మొక్కలను మాత్రమే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కల రక్షణకు గ్రామ కమిటీలు.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రక్షణకు ప్రభుత్వం గ్రామ కమిటీలు వేయనుంది. పంచాయతీ పరిధిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితోపాటు గ్రామంలో మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగిన రైతులు, యువకులను ఇందులో సభ్యులుగా నియమించనుంది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ, మొక్కల రక్షణ, పెంపకం అంతా కమిటీలే చూసుకోవాలి. వాటి నిర్వహణకయ్యే ఖర్చు ప్రభుత్వం భరించనుంది. నర్సరీల నిర్వహణకు ఉపాధిహామీ పథకంలోని కూలీలను వినియోగించుకునేలా వీలు కల్పించింది. కొత్త నర్సరీల ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో కొత్త నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసేలా ఫీల్డ్ అసిస్టెంట్లు, మండలస్థాయి సిబ్బందికి సూచనలు చేశాం. ప్రభుత్వం విధించిన గడువులోగా జిల్లాలో నర్సరీలు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాం. డీఆర్డీఓ ఆధ్వర్యంలో 419, అటవీ శాఖ ఆధ్వర్యంలో 48 నర్సరీల ఏర్పాటుకు దాదాపు స్థలాల ఎంపిక పూర్తయ్యింది. ఆయా స్థలాల్లో అవసరమైన వసతులు త్వరితగతిన సమకూర్చి లక్ష్యాలను చేరుకుంటాం. – రాథోడ్ రాజేశ్వర్,జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి -
పల్లె మెరవాలె
సాక్షి, హైదరాబాద్: పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన పల్లెల కోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని సూచిం చారు. వచ్చే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనులు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతోపాటు మరికొన్ని బాధ్యతలనూ గ్రామ పంచాయతీలకు అప్పగించాలని చెప్పారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, పీకే ఝా, వికాస్‌రాజ్, నీతూప్రసాద్, స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిని ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నెల రోజులపాటు చేపట్టాల్సిన పనులపై మార్గనిర్దేశనం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలను, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలను నాటాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు సీఎం చేసిన సూచనలివీ.. వదిలేసిన గుంతలు, ఉపయోగించని, పాడుపడిన బావులను పూడ్చేయాలి. కూలిపోయిన ఇళ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తీసి, అన్ని కాల్వలను పరిశుభ్రం చేయాలి. హా గ్రామంలోని అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చాలి. గుంతల్లో మొరం పోయాలి. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చూడాలి దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలు పెంచాలి. పిచ్చిమొక్కలను, సర్కారు తుమ్మలను, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. చెత్తను వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. డంప్ యార్డు కోసం స్థలం సేకరించాలి గ్రామానికి ఒక శ్మశాన వాటిక కచ్చితంగా నిర్మించాలి. హా గ్రామాలకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్యపరిచి వారానికోసారి శ్రమదానం చేయించాలి. పచ్చదనం పెంచేందుకు చేసిన సూచనలివీ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పు న మొత్తం 12,751 నర్సరీలను ఏర్పాటు చేయాలి గ్రామంలోని రైతులతో, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకుని దానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు పెంచాలి దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలు కూడా ఉన్నాయి. వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాలి. రైతులు పొలం గట్ల మీద, బావుల వద్ద మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి. గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలోనూ మొక్కలు పెంచాలి. అన్ని విద్యాసంస్థల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఆ సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. ఈ విషయంలో జిల్లా విద్యాధికారులకు లేఖలు రాయాలి. ప్రత్యేకాధికారులు సేకరించాల్సిన వివరాలు గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి ఎలాంటి స్థితిలో ఉన్నాయి? గ్రామ పరిధిలో మురికి కాల్వల పొడవు ఎంత? అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి? గ్రామంలో శ్మశాన వాటిక ఉందా? ఉంటే నిర్వహణ సరిగా ఉందా? లేకుంటే స్థలాన్ని సేకరించాలి గ్రామంలో దోబీఘాట్ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉంది. లేకుంటే ఏర్పాటు చేయాలి. గ్రామంలో విద్యుత్ వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా? కామన్ డంప్ యార్డు ఉందా? ఉంటే ఎలా ఉంది? లేకుంటే స్థలం సేకరించాలి. పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంత మంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి? -
ఏటా వంద కోట్ల మొక్కలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించేలా హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో మొక్కలను సిద్ధం చేసేందుకు వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవులు, పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. శనివారం ప్రగతిభవన్‌లో హరితహారం కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, ఎంపీలు జె.సంతోష్‌కుమార్, బాల్క సుమన్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, గువ్వల బాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, పీసీసీఎఫ్ పి.కె.ఝాతోపాటు అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘‘సంపద సృష్టించడంతోపాటు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే మంచి వాతావరణం చాలా ముఖ్యం. కాలుష్య వాతావరణంలో మనిషి మనుగడ సాధ్యం కాదు. పర్యావరణ సమతుల్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం శాస్త్రీయ దృక్పథం కలిగిన మనుషులు చేసే పని. ఇప్పుడు అడవుల శాతం తక్కువ ఉంది. తీవ్రంగా పని చేసి తెలంగాణలో అడవుల శాతం పెంచాలి. తెలంగాణలోని మొత్తం భూభాగంలో 24 శాతం అటవీ భూములు ఉన్నాయి. అడవులు మాత్రం 12 శాతంలోపే ఉన్నాయి. కనీసం 33 శాతం గ్రీన్ కవర్ ఉండేలా చెట్ల పెంపకం జరగాలి. అడవుల్లో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో పండ్ల చెట్లుండేవి. కోతులతో పాటు ఇతర జంతువులు అవి తిని బతికేవి. ఇప్పుడు అడవిపోయింది. అడవిలోని పండ్ల చెట్లు పోయాయి. దీంతో కోతులతోపాటు ఇతర జంతువులు జనావాసాలపై పడ్డాయి. కోతులు పంటలు చేతికి అందకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితి పోవాలంటే అడవిలో పండ్ల చెట్లు భారీగా పెంచాలి. 37 రకాల పండ్ల చెట్లున్నాయి. వాటిని పెంచడానికి నర్సరీల ద్వారా మొక్కలు సిద్ధం చేయాలి. ఈత చెట్లు, తాటి చెట్లు కూడా విరివిగా పెంచాలి. ఈ ఏడాది మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. హరితహారం కార్యక్రమానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉపాధి హామీ పథకం నిధులనూ ఇందుకు ఉపయోగించుకోవాలి’’అని సీఎం సూచించారు. అక్రమ లే అవుట్లపై కఠినంగా ఉండండి ‘‘నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ భవనాలు పెరుగుతున్నాయి. ఇందుకోసం చెట్లను కొడుతున్నారు. గ్రీన్‌ల్యాండ్ కింద ఇవ్వాల్సిన భూమి ఇవ్వడం లేదు. అక్రమ లేఅవుట్లు వస్తున్నాయి. దీనివల్ల చెట్లు పెంచడానికి స్థలం లేకుం డా పోతోంది. మున్సిపల్ అధికారులు అక్రమ లే అవుట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలి’’అని సీఎం చెప్పారు. ‘‘లేఅవుట్లలో గ్రీన్‌ల్యాండ్, గ్రీన్ కవర్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ప్రతి నగరంలో గ్రీన్ మ్యాప్ సిద్ధం చేయాలి. అటవీ ప్రాంతాల్లో ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించడానికి వ్యూహం రూపొందించాలి. మొక్కలు నాటడం ప్రజాఉద్యమంగా సాగాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలి. విద్యా సంస్థల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, హరితహారంపై అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలి’’అని ఆదేశించారు. -
బడా నర్సరీల్ని కాదు.. బడుగు రైతుల్ని చూడండి
-మీటర్ల బిగింపు ఆలోచనను విరమించుకోవాలి -నాడు వైఎస్ ఇచ్చిన వరాన్ని కొనసాగించాలి –గ్రేటర్ రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కందుల కడియం : ఒకరిద్దరు పెద్ద రైతుల నర్సరీలను చూసి అదే నర్సరీ రంగం అనుకోవడం పొరపాటని వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. నర్సరీల విద్యుత్ సర్వీసులకు మీటర్లు బిగించాలన్న ఆలోచనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కడియపులంకలో బుధవారం ఆయన స్థానిక నర్సరీ రైతులతో సమావేశయ్యారు. అనంతర విలేకరులతో మాట్లాడుతూ పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా, కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఏడాదికి రూ.48 వేలకు పైగా కరెంటు బిల్లుల రూపంలో బరువు మోపితే ఆర్థికంగా దెబ్బ తింటారన్నారు. పెద్ద నర్సరీలనే కాక 99 శాతం మంది చిన్న రైతుల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. చిన్న రైతుల ఆర్థిక పరిస్థితిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు. ఆ తరువాత సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సానుకూలంగానే వ్యవహరించారని, కానీ అప్పటి రాజకీయ అస్థిరత కారణంగా జీవో రాలేదని వివరించారు. అయితే అధికారుల నుంచి వచ్చే ఒత్తిడులను ప్రభుత్వపరంగా అడ్డుకోగలిగామన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ఎప్పుడూ ఉందని, కానీ అవసరమైన చోట మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా చొరవ చూపించాలన్నారు. దేశస్థాయిలో నర్సరీమెన్కు అధ్యక్షుడిగా కడియం ప్రాంతం నుంచే ఎన్నికయ్యారని, దేశంలో ఎక్కడాలేని విధంగా కడియంలోనే నర్సరీ రంగం విస్తరించిందని అన్నారు. ఇక్కడి రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికారులు చెప్పిన దానికే మొగ్గు చూపడం ప్రభుత్వానికి సరికాదన్నారు. మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నర్సరీ రైతులతో పాటు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసిన కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరాయ్, ఎంపీటీసీ సభ్యుడు టేకి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు, మాజీ ఉపసర్పంచ్లు తోరాటి శ్రీనివాసరావు, చిక్కాల బాబులు, నర్సరీ రైతులు ముద్రగడ జెమి, సలాది ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యానంపై ఉక్కు పిడికిలి
- కడియం నర్సరీకి విద్యుత్తు షాక్ - వైఎస్ ఉచితంగా విద్యుత్తు ఇస్తే బాబు బాదుడే - సుమారు 60 వేల మంది రైతులు సతమతం - మోటార్లు బిగిస్తే ఒక్కో మోటారుపై రూ.50 వేలు అదనపు భారం - నిరసన తెలిపినా అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యమే... సాక్షిప్రతినిధి, కాకినాడ : రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అందుకే రైతు పక్షపాతి ఎవరంటే ఎవరి నోటైనా ఠక్కున వచ్చే సమాధానం వైఎస్ రాజశేఖరరెడ్డి అని. ప్రజాప్రస్థానంతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసేటప్పుడు ఆ మహానేత రైతుల బాధలను వారి పొలాలకు వెళ్లి నేరుగా చూసి చలించిపోయారు. అందుకే మెట్ట ప్రాంతంలో విద్యుత్‌పై ఆధారపడి వరి పండించే రైతులతోపాటు నర్సరీ రైతులకు కూడా ఉచిత విద్యుత్తు సరఫరా చేశారు. వైఎస్‌కు ముందు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్న చంద్రబాబు గత సార్వత్రిక ఎన్నికల్లో రైతుల పక్షాన ఉంటానని నమ్మబలికి రైతుల ఓట్ల కోసం వారికి రుణమాఫీ ప్రకటించారు. అది అరకొర మాఫీగానే మిగిలిపోయిందిగానీ రైతుల రుణాలన్నీ మొత్తంగాæ మాఫీ చేశానని చెప్పుకుంటున్నారు. రుణమాఫీ విషయాన్ని పక్కనబెడితే జిల్లాలో నర్సరీ రైతుల ఇబ్బందులను గుర్తించి అప్పట్లో వైఎస్ వారికి ఉచిత విద్యుత్తును ప్రకటించి అమలు చేశారు. విద్యుత్తు బకాయిలు చెల్లించనవసరం లేకుండా సడలింపు ఇచ్చారు. విద్యుత్తు చార్జీలు భారంగా మారాయని మొరబెట్టుకున్న నర్సరీ రైతులను మానవతా దృక్పధంతో రాజశేఖరరెడ్డి ఆదుకుంటే, అటువంటి రైతుల నెత్తిపై చంద్రబాబు విద్యుత్తు ఛార్జీల భారం మోపేందుకు ‘సై’ అంటున్నారు. నాటి వైఎస్‌కు నేటి చంద్రబాబుకు ఉన్న తేడా అదేనని రైతుల మధ్య చర్చ నడుస్తోంది. వై.ఎస్. ఏమీ చేశారు...? కడియం నర్సరీలకు రాష్ట్రంతోపాటు పలు రాష్ట్ర్రాల్లో మంచి గుర్తింపు ఉంది. కడియం మండలం ఆ మండలాన్ని ఆనుకుని మండపేట రూరల్, ఆలమూరు, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలాల్లో కలిపి పాతిక గ్రామాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో నర్సరీలు సాగుచేస్తున్నారు. 15వేల మంది రైతులు నేరుగా నర్సరీలు చేస్తుండగా సుమారు 40వేల మంది ఆ రంగంపై ఆధారపడి పొట్టపోసుకుంటున్నారు. విద్యుత్తు చార్జీల భారంతో నర్సరీ రంగం కుదేలవుతోందని రైతులు అప్పటి రోడ్లు భవనాలశాఖా మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు మొరబెట్టుకున్నారు. వైఎస్ సీఎం అయ్యాక 2004లో కాకినాడ వచ్చిన సందర్భంలో నర్సరీ రైతుల ఇబ్బందులను జక్కంపూడి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన వైఎస్ విద్యుత్ బకాయిలు చెల్లించనవసరం లేదని, విద్యుత్ మీటర్లు బిగించవద్దని ఆదేశాలు జారీచేశారు. అంటే సుమారు 13 ఏళ్లుగా నర్సరీ రైతులు మహానేత వైఎస్ పుణ్యమా అంటూ చార్జీల సడలింపు పొందుతున్నారు. అటువంటి రైతులపై చంద్రబాబు సర్కార్ కత్తికట్టి చార్జీల భారం మోపేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు ఏప్రిల్ ఒకటే తేదీని ముహూర్తంగా నిర్ణయించింది. మోటార్లు బిగించి వసూళ్లకు... వచ్చే నెల ఒకటి నుంచి నర్సరీల్లోని విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించి ప్రతినెలా బిల్లులు వసూలు చేయనుంది. ఇప్పటి వరకు వ్యవసాయ హోదాలో ఉన్న నర్సరీ రంగాన్ని ఉద్యాన రంగంగా పరిగణిస్తూ చంద్రబాబు సర్కార్ నర్సరీ రైతులపై భారం మోపుతోంది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడ్డ రైతులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ హయాంలో విద్యుత్ మీటర్లు పెడదామని ట్రాన్స్‌కో అధికారుల ప్రతిపాదనను తిరస్కరించి ‘ఆల్ నర్సరీస్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్..’అంటూ అధికారులకు తెగేసి చెప్పారని నాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తాడాల వీరాస్వామి ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి చొరవతో నర్సరీలకు ఉచిత విద్యుత్తును అమలు చేశారన్నారు. రైతులకు తమ ప్రభుత్వం వెన్నంటి నిలుస్తుందంటోన్న చంద్రబాబు 40 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న నర్సరీ రంగంపై విద్యుత్ బిల్లుల భారం వేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.నాడు రాజశేఖర్‌రెడ్డి కల్పించిన బిల్లుల సడలింపు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో మోటారుపై ఏడాదికి రూ.50 వేలు పైమాటే.. ఒక్కో మోటారుపై ఏడాదికి రూ. 50 వేలు వరకు విద్యుత్ బిల్లు భారం పడుతుందని అంచనా. అంటే నర్సరీ రైతులపై ఏడాదికి పడే భారం ఆరున్నర కోట్లు పై మాటే. 5 హార్స్పవర్ మోటారు ఒక్కో దానిపై ఏడాదికి రూ. 50వేల వరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా ఉన్న 5 హెచ్‌పీ మోటారుపై గంటకు 3.75 యూనిట్లు విద్యుత్తు అవసరమవుతుంది. 7 గంటలపాటు సరఫరా చేస్తారని లెక్కేసినా రోజుకు 26.25 యూనిట్లు వంతున నెలకు 787.50 యూనిట్లు వినియోగించాల్సి వస్తుంది. యూనిట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3.70. ఈ లెక్కన నెలకు రూ.2,913.75 విద్యుత్తు ఛార్జీలు చెల్లించాలి. విద్యుత్తు ఛార్జీలకు ఇతర ఛార్జీలు అదనంగా కలిపితే నెలనెలా ఒక మోటారు రూ. 3,500 పైనే బిల్లుల భారం పడనుంది. ప్రస్తుతం నర్సరీల్లో వినియోగిస్తున్న విద్యుత్తు మోటార్లు దాదాపు పాతవే. ఇవి ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి.అంటే ఆ మేరకు భారం మరింత పెరుగుతుందంటున్నారు. నర్సరీల్లో మొక్కలకు నిత్యం నీటి అవసరాలు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం రాయితీపై సోలార్ పంపుసెట్లు ఇస్తున్నాం వాటిని వినియోగించమని చెబుతోంది. వాతావరణ పరిమితులతోపాటు, సీజన్ల వారీగా చేలలో ప్యాకెట్లను మార్చడం, మబ్బుతో కూడిన వాతావరణం ఉన్న సమయాల్లో నీటిని తోడడంలో తలెత్తే ఇబ్బందులు, సోలార్‌పై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం తదితర కారణాలతో సోలార్ మోటార్లను అమర్చుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ అననుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు సర్కార్ నర్సరీ రైతులను నట్టేటా ముంచేసేందుకు సమాయత్తమవుతోందని వాపోతున్నారు. నిరసనగా మోటారు సైకిల్ ర్యాలీ చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై ఆందోళనతో ఉన్న నర్సరీ రైతులు రెండు రోజుల కిందట మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కడియం నర్సరీ రైతు సంఘం అధ్యక్షుడు పుల్లా చంటి, ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తదితర ప్రతినిధులు సుమారు 250 మంది రైతులతో కలిసి రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఇంటికి వెళితే గంటన్నర తరువాత కానీ కలవలేకపోయామంటున్నారు. వైఎస్ ఇవ్వగా లేంది ఇప్పుడు ఇవ్వలేరా అని రైతులు ప్రశ్నిస్తే అప్పుడు పక్కాగా ఇచ్చి ఉంటే ఇలా ఉండేది కాదని అయినా అదంతా ఏపీఈఆర్సీ పరిధిలో ఉందని, సీఎం వద్దకు వెళదామని ముక్తసరిగా సమాధానం చెప్పారని రైతులు పేర్కొంటున్నారు. రైతుల విషయంలో మహానేత వైఎస్‌కు, ఇప్పటి సీఎం చంద్రబాబుకు ఉన్న తేడా ఇదేనంటున్నారు. -
గడ్డు కాలం
- జామాయిల్ నర్సరీలకు మాగుడు తెగులు - రూ.10 కోట్ల మేర రైతులకు నష్టం - రాష్ట్రంలో ఖమ్మంలోనే ఎక్కువగా నర్సరీల పెంపకం - జిల్లా నుంచి ఐటీసీ పరిశ్రమకు తగ్గనున్న కలప - ఇతర రాష్ట్రాల నుంచి మొక్కల కొనుగోలుకు వ్యాపారుల వెనుకంజ సాక్షి, ఖమ్మం: ఐటీసీ పరిశ్రమను చూసుకొని ఇటీవల కాలంలో జిల్లాలో జామాయిల్ నర్సరీల పెంపకం, సాగు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా మన జిల్లాలోనే 2 వేల నర్సరీలు ఉన్నాయి. వీటిని పెంచుతూ లాభాలు అర్జించిన రైతులకు ఈసారి గడ్డు కాలమే ఎదురైంది. జామాయిల్ నర్సరీలకు మాగుడు తెగులు ఆశించడంతో జిల్లాలో రైతులు రూ.10 కోట్ల మేర నష్టపోయారు. తెగుళ్లతో జిల్లాలో జామాయిల్ సాగు తగ్గి ఈసారి ఐటీసీ పరిశ్రమకు కలప సరఫరా తగ్గనుంది. జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ పరిశ్రమ ఉండడంతో జామాయిల్ సాగుపై రైతులు కొంతకాలంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే నర్సరీల పెంపకం లేకపోవడంతో తొలుత వేల ఎకరాలకే పరిమితమైన ఈ సాగు ఆ తర్వాత జిల్లాలోనే నర్సరీల ఏర్పాటుతో ఇప్పుడు లక్షలాది ఎకరాలకు చేరింది. ఉమ్మడి రాష్ట్రంలోనే జామాయిల్ నర్సరీల పెంపకంలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉండగా నెల్లూరు, ఒంగోలు ద్వితీయ, తృతీయ స్థానంలో ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ నర్సరీల పెంపకానికి అనువైన భూమిలో ఖనిజ లవణాలు ఉండడంతో బూర్గంపాడు, కుక్కునూరు, అశ్వారావుపేట, దమ్మపేట, కల్లూరు మండలాల్లో రైతులు 2 వేలకు పైగా నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటి నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు ఏటా మొక్కలు సరఫరా అవుతున్నాయి. పక్కనే ఐటీసీ పరిశ్రమ ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ ఉండడంతో ఎకరానికి రూ.లక్షకు పైగా ఖర్చు చేసి రైతులు జామాయిల్ నర్సరీలు పెంచారు. ఎలాంటి తెగులు లేకపోతే ఒక్కో మొక్క రూ.2.50 పైసల నుంచి రూ.4 వరకు ధర పలికేది. ఇదే ధర ఉంటే పెంపకం ఖర్చులు పోను రైతులకు ఒక్కో నర్సరీ నుంచి రూ. లక్ష వరకు ఆదాయం వచ్చేది. అయితే నైరుతి రుతు పవన కాలంలో తొలుత వర్షాభావ పరిస్థితులు.. చివరలో వర్షం పడుతుండడంతో ఈ నర్సరీలను తెగుళ్లు ఆశించాయి. దీంతో వీటిని పెంచిన రైతులు పెట్టుబడి కూడా రాదేమోననే ఆందోళనలో ఉన్నారు. నర్సరీలను ఆశించిన రూట్ర్యూట్.. జిల్లాలో మొక్క దశలో ఉన్న నర్సరీలకు వాతావరణ అసమతుల్యతతో వేరు కుళ్లు (రూట్ ర్యాట్), మాగుడు తెగుళ్లు ఆశించాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 వేల నర్సరీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.దీంతో 50 శాతం మేరకు మొక్కలు కుళ్లిపోయి నర్సరీ చేతికి రావడం లేదు. అంతేకాకుండా గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో బూజు తెగుళ్లు వ్యాప్తిచెందుతున్నాయి. రైతులు ఎన్ని రకాల సస్యరక్షణ మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం. తెగుళ్లు ఆశించిన మొక్కలను ప్రతిరోజు కూలీలతో గ్రేడింగ్ చేయించి తొలగిస్తున్నారు. ఒక్క పక్క తెగుళ్ల నివారణ మందులకు, మరో పక్క కూలీలకు రూ. లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో జామాయిల్ సాగు చాలావరకు తగ్గి మొక్క ధర కూడా పడిపోయింది. ఒక్కో నర్సరీకి రూ.50 వేలు నష్టం.. రూట్ర్యాట్, మాగుడు తెగుళ్లతో ఒక్కో నర్సరీకి రూ.50 వేల వరకు రైతులు నష్టపోయారు. 50 శాతం మొక్క కుళ్లి పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే జిల్లాలో 2 వేల నర్సరీల్లో ఇదే పరిస్థితి ఉండడంతో మొత్తం మీద రూ.10 కోట్ల వరకు రైతులకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా ఈ తెగుళ్లు రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి మిగతా మొక్కను కొనుగోలు చేయడానికి గతంలోలా వ్యాపారులు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తెగుళ్లు పూర్తిగా సోకి మొక్క చేతికి రాకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఐటీసీ పరిశ్రమకు వచ్చే జామాయిల్లో కలప సరఫరాలో జిల్లా నుంచే 15 శాతం పైగా ఉంటుంది. నర్సరీలకు తెగుళ్లు రావడంతో జిల్లాలో జామాయిల్ సాగు విస్తీర్ణం తగ్గి ఐటీసీకి కలప సరఫరా తగ్గనుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రభుత్వ స్థలాల్లో నర్సరీలు
మోర్తాడ్ :తెలంగాణ హరిత హారంలో భాగంగా విస్తారంగా మొక్కలను పెంచడం కోసం అవసరం అయిన ఏర్పాట్లను ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీశాఖ అధికారులు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను ఎంపిక చేసి అక్కడ నర్సరీలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం యోచిస్తోంది. నర్సరీల నిర్వహణ బాధ్యతను ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీ శాఖలకు అప్పగించారు. గ్రామాల్లో మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టింది. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలను, జిల్లా వ్యాప్తంగా 3.60 కోట్ల మొక్కలను రానున్న మూడేళ్లలో నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. కాగా తెలంగాణ హరిత హారం పథకాన్ని అమలు చేయడానికి ఇప్పుడు నిర్వహిస్తున్న నర్సరీల సంఖ్య సరిపోదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కొత్త నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. భారీగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడంతో అందుకు అనుగుణంగా మొక్కలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి మండల కేంద్రంలో, మేజర్ పంచాయతీలో నర్సరీలను నిర్వహించడం కోసం అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రి, జూనియర్, డిగ్రీ కళాశాలల స్థలాలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖ అతిథి గృహాలు ఇతర ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను పెంచడానికి నర్సరీలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకానికి సామాజిక అటవీ శాఖ 75 శాతం మొక్కలను సరఫరా చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం కింద మరో 25 శాతం మొక్కలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు శాఖలు నిర్వహిస్తున్న నర్సరీలకు అనుబంధంగానే కొత్త నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మండలానికి పది నుంచి 15 నర్సరీలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.