బడా నర్సరీల్ని కాదు.. బడుగు రైతుల్ని చూడండి
బడా నర్సరీల్ని కాదు.. బడుగు రైతుల్ని చూడండి
Published Wed, Mar 15 2017 11:49 PM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM
-మీటర్ల బిగింపు ఆలోచనను విరమించుకోవాలి
-నాడు వైఎస్ ఇచ్చిన వరాన్ని కొనసాగించాలి
–గ్రేటర్ రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కందుల
కడియం : ఒకరిద్దరు పెద్ద రైతుల నర్సరీలను చూసి అదే నర్సరీ రంగం అనుకోవడం పొరపాటని వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. నర్సరీల విద్యుత్ సర్వీసులకు మీటర్లు బిగించాలన్న ఆలోచనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కడియపులంకలో బుధవారం ఆయన స్థానిక నర్సరీ రైతులతో సమావేశయ్యారు. అనంతర విలేకరులతో మాట్లాడుతూ పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా, కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఏడాదికి రూ.48 వేలకు పైగా కరెంటు బిల్లుల రూపంలో బరువు మోపితే ఆర్థికంగా దెబ్బ తింటారన్నారు. పెద్ద నర్సరీలనే కాక 99 శాతం మంది చిన్న రైతుల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. చిన్న రైతుల ఆర్థిక పరిస్థితిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు. ఆ తరువాత సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సానుకూలంగానే వ్యవహరించారని, కానీ అప్పటి రాజకీయ అస్థిరత కారణంగా జీవో రాలేదని వివరించారు. అయితే అధికారుల నుంచి వచ్చే ఒత్తిడులను ప్రభుత్వపరంగా అడ్డుకోగలిగామన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ఎప్పుడూ ఉందని, కానీ అవసరమైన చోట మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా చొరవ చూపించాలన్నారు. దేశస్థాయిలో నర్సరీమెన్‌కు అధ్యక్షుడిగా కడియం ప్రాంతం నుంచే ఎన్నికయ్యారని, దేశంలో ఎక్కడాలేని విధంగా కడియంలోనే నర్సరీ రంగం విస్తరించిందని అన్నారు. ఇక్కడి రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికారులు చెప్పిన దానికే మొగ్గు చూపడం ప్రభుత్వానికి సరికాదన్నారు. మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నర్సరీ రైతులతో పాటు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసిన కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరాయ్, ఎంపీటీసీ సభ్యుడు టేకి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు, మాజీ ఉపసర్పంచ్‌లు తోరాటి శ్రీనివాసరావు, చిక్కాల బాబులు, నర్సరీ రైతులు ముద్రగడ జెమి, సలాది ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement