- జామాయిల్ నర్సరీలకు మాగుడు తెగులు
- రూ.10 కోట్ల మేర రైతులకు నష్టం
- రాష్ట్రంలో ఖమ్మంలోనే ఎక్కువగా నర్సరీల పెంపకం
- జిల్లా నుంచి ఐటీసీ పరిశ్రమకు తగ్గనున్న కలప
- ఇతర రాష్ట్రాల నుంచి మొక్కల కొనుగోలుకు వ్యాపారుల వెనుకంజ
సాక్షి, ఖమ్మం: ఐటీసీ పరిశ్రమను చూసుకొని ఇటీవల కాలంలో జిల్లాలో జామాయిల్ నర్సరీల పెంపకం, సాగు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా మన జిల్లాలోనే 2 వేల నర్సరీలు ఉన్నాయి. వీటిని పెంచుతూ లాభాలు అర్జించిన రైతులకు ఈసారి గడ్డు కాలమే ఎదురైంది. జామాయిల్ నర్సరీలకు మాగుడు తెగులు ఆశించడంతో జిల్లాలో రైతులు రూ.10 కోట్ల మేర నష్టపోయారు. తెగుళ్లతో జిల్లాలో జామాయిల్ సాగు తగ్గి ఈసారి ఐటీసీ పరిశ్రమకు కలప సరఫరా తగ్గనుంది.
జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ పరిశ్రమ ఉండడంతో జామాయిల్ సాగుపై రైతులు కొంతకాలంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే నర్సరీల పెంపకం లేకపోవడంతో తొలుత వేల ఎకరాలకే పరిమితమైన ఈ సాగు ఆ తర్వాత జిల్లాలోనే నర్సరీల ఏర్పాటుతో ఇప్పుడు లక్షలాది ఎకరాలకు చేరింది. ఉమ్మడి రాష్ట్రంలోనే జామాయిల్ నర్సరీల పెంపకంలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉండగా నెల్లూరు, ఒంగోలు ద్వితీయ, తృతీయ స్థానంలో ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ నర్సరీల పెంపకానికి అనువైన భూమిలో ఖనిజ లవణాలు ఉండడంతో బూర్గంపాడు, కుక్కునూరు, అశ్వారావుపేట, దమ్మపేట, కల్లూరు మండలాల్లో రైతులు 2 వేలకు పైగా నర్సరీలను ఏర్పాటు చేశారు.
వీటి నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు ఏటా మొక్కలు సరఫరా అవుతున్నాయి. పక్కనే ఐటీసీ పరిశ్రమ ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ ఉండడంతో ఎకరానికి రూ.లక్షకు పైగా ఖర్చు చేసి రైతులు జామాయిల్ నర్సరీలు పెంచారు. ఎలాంటి తెగులు లేకపోతే ఒక్కో మొక్క రూ.2.50 పైసల నుంచి రూ.4 వరకు ధర పలికేది. ఇదే ధర ఉంటే పెంపకం ఖర్చులు పోను రైతులకు ఒక్కో నర్సరీ నుంచి రూ. లక్ష వరకు ఆదాయం వచ్చేది. అయితే నైరుతి రుతు పవన కాలంలో తొలుత వర్షాభావ పరిస్థితులు.. చివరలో వర్షం పడుతుండడంతో ఈ నర్సరీలను తెగుళ్లు ఆశించాయి. దీంతో వీటిని పెంచిన రైతులు పెట్టుబడి కూడా రాదేమోననే ఆందోళనలో ఉన్నారు.
నర్సరీలను ఆశించిన రూట్‌ర్యూట్..
జిల్లాలో మొక్క దశలో ఉన్న నర్సరీలకు వాతావరణ అసమతుల్యతతో వేరు కుళ్లు (రూట్ ర్యాట్), మాగుడు తెగుళ్లు ఆశించాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 వేల నర్సరీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.దీంతో 50 శాతం మేరకు మొక్కలు కుళ్లిపోయి నర్సరీ చేతికి రావడం లేదు. అంతేకాకుండా గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో బూజు తెగుళ్లు వ్యాప్తిచెందుతున్నాయి. రైతులు ఎన్ని రకాల సస్యరక్షణ మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం. తెగుళ్లు ఆశించిన మొక్కలను ప్రతిరోజు కూలీలతో గ్రేడింగ్ చేయించి తొలగిస్తున్నారు. ఒక్క పక్క తెగుళ్ల నివారణ మందులకు, మరో పక్క కూలీలకు రూ. లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో జామాయిల్ సాగు చాలావరకు తగ్గి మొక్క ధర కూడా పడిపోయింది.
ఒక్కో నర్సరీకి రూ.50 వేలు నష్టం..
రూట్‌ర్యాట్, మాగుడు తెగుళ్లతో ఒక్కో నర్సరీకి రూ.50 వేల వరకు రైతులు నష్టపోయారు. 50 శాతం మొక్క కుళ్లి పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే జిల్లాలో 2 వేల నర్సరీల్లో ఇదే పరిస్థితి ఉండడంతో మొత్తం మీద రూ.10 కోట్ల వరకు రైతులకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా ఈ తెగుళ్లు రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి మిగతా మొక్కను కొనుగోలు చేయడానికి గతంలోలా వ్యాపారులు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తెగుళ్లు పూర్తిగా సోకి మొక్క చేతికి రాకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఐటీసీ పరిశ్రమకు వచ్చే జామాయిల్‌లో కలప సరఫరాలో జిల్లా నుంచే 15 శాతం పైగా ఉంటుంది. నర్సరీలకు తెగుళ్లు రావడంతో జిల్లాలో జామాయిల్ సాగు విస్తీర్ణం తగ్గి ఐటీసీకి కలప సరఫరా తగ్గనుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
గడ్డు కాలం
Published Thu, Oct 2 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
Advertisement
Advertisement