సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించేలా హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో మొక్కలను సిద్ధం చేసేందుకు వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవులు, పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. శనివారం ప్రగతిభవన్‌లో హరితహారం కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, ఎంపీలు జె.సంతోష్‌కుమార్, బాల్క సుమన్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, గువ్వల బాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, పీసీసీఎఫ్ పి.కె.ఝాతోపాటు అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘‘సంపద సృష్టించడంతోపాటు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే మంచి వాతావరణం చాలా ముఖ్యం. కాలుష్య వాతావరణంలో మనిషి మనుగడ సాధ్యం కాదు. పర్యావరణ సమతుల్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం శాస్త్రీయ దృక్పథం కలిగిన మనుషులు చేసే పని. ఇప్పుడు అడవుల శాతం తక్కువ ఉంది. తీవ్రంగా పని చేసి తెలంగాణలో అడవుల శాతం పెంచాలి. తెలంగాణలోని మొత్తం భూభాగంలో 24 శాతం అటవీ భూములు ఉన్నాయి. అడవులు మాత్రం 12 శాతంలోపే ఉన్నాయి.
కనీసం 33 శాతం గ్రీన్ కవర్ ఉండేలా చెట్ల పెంపకం జరగాలి. అడవుల్లో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో పండ్ల చెట్లుండేవి. కోతులతో పాటు ఇతర జంతువులు అవి తిని బతికేవి. ఇప్పుడు అడవిపోయింది. అడవిలోని పండ్ల చెట్లు పోయాయి. దీంతో కోతులతోపాటు ఇతర జంతువులు జనావాసాలపై పడ్డాయి. కోతులు పంటలు చేతికి అందకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితి పోవాలంటే అడవిలో పండ్ల చెట్లు భారీగా పెంచాలి. 37 రకాల పండ్ల చెట్లున్నాయి. వాటిని పెంచడానికి నర్సరీల ద్వారా మొక్కలు సిద్ధం చేయాలి.
ఈత చెట్లు, తాటి చెట్లు కూడా విరివిగా పెంచాలి. ఈ ఏడాది మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. హరితహారం కార్యక్రమానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉపాధి హామీ పథకం నిధులనూ ఇందుకు ఉపయోగించుకోవాలి’’అని సీఎం సూచించారు.
అక్రమ లే అవుట్లపై కఠినంగా ఉండండి
‘‘నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ భవనాలు పెరుగుతున్నాయి. ఇందుకోసం చెట్లను కొడుతున్నారు. గ్రీన్‌ల్యాండ్ కింద ఇవ్వాల్సిన భూమి ఇవ్వడం లేదు. అక్రమ లేఅవుట్లు వస్తున్నాయి. దీనివల్ల చెట్లు పెంచడానికి స్థలం లేకుం డా పోతోంది. మున్సిపల్ అధికారులు అక్రమ లే అవుట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలి’’అని సీఎం చెప్పారు.
‘‘లేఅవుట్లలో గ్రీన్‌ల్యాండ్, గ్రీన్ కవర్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ప్రతి నగరంలో గ్రీన్ మ్యాప్ సిద్ధం చేయాలి. అటవీ ప్రాంతాల్లో ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించడానికి వ్యూహం రూపొందించాలి. మొక్కలు నాటడం ప్రజాఉద్యమంగా సాగాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలి. విద్యా సంస్థల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, హరితహారంపై అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలి’’అని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment