త్వరలో జిల్లాకు సీఎం కేసీఆర్
హరితహారానికి 18న వచ్చే అవకాశం..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలో జిల్లాకు రానున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈనెల 18న ఖమ్మం కార్పొరేషన్‌లో మొక్కలు నాటేందుకు ఆయన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అన్ని కార్పొరేషన్ల పరిధిలో మొక్కలు నాటేందుకు సీఎం పర్యటనలు ఖరారవుతున్న నేపథ్యంలో జిల్లాకు కూడా ఆయన రానున్నట్లు సమాచారం. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో రెండు లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
సీఎం వచ్చిన రోజు ఆయనతో వెలుగుమట్ల, పోలీస్ పరేడ్ గ్రౌండ్లలో మొక్కలు నాటించాలని అధికారులు భావిస్తున్నారు. సీఎం వస్తారన్న నేపథ్యంలో ముందస్తుగా రాష్ర్ట రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం డ్వామా, ఫారెస్టు, ఇరిగేషన్, కార్పొరేషన్, డీఆర్‌డీఏ, ఆర్‌అండ్‌బీ అధికారులతో టీటీడీసీలో హరితహారంపై చర్చించారు. 18నగానీ లేదా, ఏదో ఒకరోజు సీఎం జిల్లాలో హరితహారం కార్యక్రమానికి వస్తారని సూచనలుండడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తోంది.