
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గోదాములు, మార్కెట్ యార్డుల్లో లక్ష మొక్కలు నాటాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఒకటిన్నర మీటర్ల నుంచి రెండు మీటర్ల ఎత్తుండే పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అల్వాల్ రైతు బజార్ ఆధునీకరణ పనులు చేపడుతామన్నారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ కోసం రైల్వే, కంటోన్మెంట్, ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌ను పది కోట్లతో ఆధునీకరణ పనులకు శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్న రైతు బజార్‌ను హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు చేస్తామని చెప్పారు. గడ్డిఅన్నారం మార్కెట్‌కు మెట్రోస్టేషన్ సమీపంలో ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. హయత్‌నగర్ మండలం కోహెడ వద్ద 178 ఎకరాల్లో, రూ.164 కోట్ల అంచనా వ్యయంతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment