బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్‌కు అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో వేముల, ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: ‘టుడే తెలంగాణ ఈజ్ ఏ టార్చ్ బేరర్. నేడు రాష్ట్రం అమలు చేసే కార్యక్రమాలను రేపు దేశం అనుసరిస్తుంది. గత ఏడున్నర సంవత్సరాల చరిత్రే దీనికి సాక్ష్యం. ఈ ప్రగతి యాత్రకు కొనసాగింపే ఈ కొత్త బడ్జెట్’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాస్వామ్య భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఓ అద్భుతమని చెప్పారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి.. రాష్ట్ర పురోగతిని వివరించారు. దేశంలో మరే రాష్ట్రం లో అమలు చేయలేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత, వాటి ఫలితంగా రాష్ట్రం పురోగమిస్తున్న తీరును తెలిపారు. బడ్జెట్‌లో పథకాల తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఆ వర్సిటీలకు రూ. 100 కోట్ల చొప్పున
దళితబంధుకు గత బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు, ఈసారి రూ. 17,700 కోట్లు ప్రతిపాదించాం. వచ్చే సంవత్సరాంతానికి 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో తొలి మహిళా వర్సిటీ కోసం రూ.100 కోట్లు, అటవీ విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లను కేటాయిస్తున్నాం. కొత్తగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చే స్తున్నాం. 2023లో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ము లుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదా ద్రిల్లో ఏర్పాటు చేస్తాం. కొత్త మెడికల్ కాలేజీల కోసం బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాం.
రూ.7,289 కోట్లతో స్కూళ్ల అభివృద్ధి..
రాష్ట్రంలో రూ.7,289 కోట్లతో దశల వారీగా పాఠశాలల అభివృద్ధి పనులు చేపడుతున్నాం. తొలి దశలో మండలం యూనిట్‌గా 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్ చార్జీలను ప్రతి బెడ్‌కు రూ.56 నుంచి రూ.112 (నిర్ధారిత కొన్ని జబ్బులకు)కు, సాధారణ రోగులకు రూ.40 నుంచి రూ. 80కి పెంచుతున్నాం. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను హైకోర్టు ప్రశంసించింది.
చదవండి: (కేసీఆర్ సైగలతో సభ నడుపుతారా?)
కొత్త ఆసరా పింఛన్లు ఇస్తాం
మేనిఫెస్టోలో ప్రకటించకుండానే రైతుబంధు తెచ్చాం. గత 8 సీజన్లలో రూ.50,448 కోట్లను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాం. 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు సడలించిన వయోపరిమితి ఆధా రంగా ఈ ఆర్థిక ఏడాది నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇస్తాం. ఇందుకు రూ.11,728 కోట్లు ప్రతిపాదించాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. 4 లక్షల మందికి సాయం అందించేలా బడ్జెట్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లను ప్రతిపాదించాం.
గొర్రెల పంపిణీకి రూ. వెయ్యి కోట్లు
రైతుబీమా తరహాలో నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేయనున్నాం. గీత కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లతో పథకం ప్రారంభిస్తాం. గొర్రెల పంపిణీకి రూ. వెయ్యి కోట్లు కేటాయి స్తున్నాం. గిరిజన,ఆదివాసీ పంచాయతీలకు సొంత భవనాలకు రూ.600 కోట్లను వెచ్చించనున్నాం.
భవన నిర్మాణ కార్మికులకు బైక్‌లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణకు రూ.1,542 కోట్లు కేటాయించాం. ఎస్టీ నివాస ప్రాం తాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఎస్టీ ఎస్‌డీఎఫ్ నిధు ల నుంచి రూ. వెయ్యి కోట్లను కేటాయించనున్నాం. మెట్రో రైలును పాత బస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానానికి రూ.500 కోట్లు, ప్రజా రవాణాకు రూ. 1,500 కోట్లు అందజేయనున్నాం. బాలింతల్లో రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ‘కేసీఆర్ నూట్రిషన్ కిట్’లను పంపిణీ చేయనున్నాం.
కాళేశ్వరం టూరిజానికి రూ.750 కోట్లు
కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌కు రూ.750 కోట్లు, అర్బన్ మిషన్ భగీరథకు రూ.800 కోట్లు, అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రో కనెక్టవిటీకి రూ.500 కోట్లు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కేటాయించాం. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ.2,142 కోట్లు, విద్యుత్ రాయితీ కింద రూ.190 కోట్లు ప్రతిపాదించాం. పావలా వడ్డీ స్కీంను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, చిన్న తరహా పరిశ్రమలను, మహిళలు ఏర్పాటు చేసేందుకు రూ.187 కోట్లు కేటాయించాం.
లక్షా 45 వేల కోట్ల ఐటీ ఎగుమతులు
గత ఆరేళ్లలో 28,288 పోలీసు పోస్టులను భర్తీ చేశాం. ఈ బడ్జెట్‌లో పోలీసు శాఖకు రూ.9,315 కోట్లు కేటాయించాం. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తెచ్చాక ఆ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి. రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో 12.98 శాతం పెరుగుదల నమోదైంది. 2021లో 1,45,522 కోట్ల మేర ఎగుమతులు జరిగాయి.
సస్పెన్షన్ కోసమే వెల్‌లోకి వచ్చారు!
బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి హరీశ్ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగం సందర్భాల్లో సభ్యులు వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి వెల్‌లోకి వచ్చినందునే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండయ్యారు. వారు అందుకే వెల్‌లోకి వచ్చారు’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సోమ వారం అసెంబ్లీ వాయిదా అనంతరం లాబీల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘బడ్జెట్, గవర్నర్ ప్రసంగం వేళ కాకుండా ఇతర సందర్భాల్లో సభ్యులకు నిరసన తెలిపే హక్కు ఉంది. సభ హుందాతనం కాపాడుకోవాలని బీఏసీలో సమష్టి నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి రానందునే సస్పెండ్ చేయలేదు. రాజ్యసభలో వెల్‌లోకి రాకున్నా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 12 మంది సభ్యులను మొత్తం సెషన్ నుంచే సస్పెండ్ చేశారు. ఢిల్లీకో న్యాయం.. రాష్ట్రానికో న్యాయమా’అని హరీశ్ ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పట్టించుకోవడంలేదు. అయినా కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయనే ఉద్దేశంతోనే బడ్జెట్‌లో ప్రతిపాదించాం’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment