రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు కేసీఆర్. ‘బై ఛాన్స్’ ఆయన రాజకీయాలలోకి రాలేదు; ‘బై ఛాయిస్’ వాటిని ఎంచుకున్నారు. తను పుట్టిన ప్రాంతం, కుటుంబం, పరిస్థితులు ఎన్ని పరిమితులు విధిస్తున్నా వాటిని అధిగమించారు. ఏదో ఒక పార్టీలో ఎవరో ఒకరికి అనుయాయిగా మిగిలిపోలేదు. కొత్త పార్టీని స్థాపించారు. కొత్త రాష్ట్రాన్ని సాధించారు. కొత్త చరిత్రను సృష్టించారు. స్వరాష్ట్ర సారథి ఇప్పుడు సమాఖ్య విలువల కోసం సమర శంఖం పూరిస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మరో పోరాటానికి సమాయత్తమవుతున్నారు. ప్రజాస్వామిక శక్తులను కూడగట్టే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. దేశభక్తి అంటే పొరుగు దేశాన్ని ద్వేషించడం కాదనీ, దేశవాసులకు నాణ్యమైన కరెంటు ఇవ్వటం, సాగునీరు ఇవ్వటం, ఉపాధినివ్వటం, మంచి జీవితాన్ని ఇవ్వటమనీ చాటుతున్నారు.
ఇతరులు కలలు కనేలా, మరింత నేర్చుకునేలా, మరింత ఎదిగేలా ఎవరి చర్యలైతే ప్రేరేపిస్తాయో వారే నాయకులౌతారు. ‘కేసీఆర్’ తన ఆలోచనలతో, మాటలతో, పోరాటంతో, పరిపాలనతో దేశాన్నే ప్రభావితం చేసిన, చేస్తున్న నాయకుడు. రెండు దశాబ్దాలుగా తెలం గాణ రాజకీయాల్ని ప్రభావితం చేస్తూ ఆయన దేశం దృష్టిని ఆకర్షిస్తు న్నారు. ఆయనే చెప్పినట్టు ‘బై ఛాన్స్’ ఆయన రాజకీయాలలోకి రాలేదు; ‘బై ఛాయిస్’ రాజకీయాలను ఎంచుకున్నారు.
పంతొమ్మిది వందల డెబ్భైలలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఏ యువకుడైనా తనకొక ఉద్యోగం వస్తే చాలని ఆలోచిస్తాడు. కేసీఆర్ అందుకు భిన్నంగా ఆలోచించాడు. దేశ రాజకీయాలపై ఆసక్తి పెంచు కున్నాడు. ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ వంటి శిఖరప్రాయు లైన నాయకుల రచనలతో ప్రభావితుడయ్యాడు. రాజకీయాలే తన భవిష్యత్ కార్యరంగం అని స్థిరంగా నిర్ణయించుకున్నాడు. తను పుట్టిన ప్రాంతం, కుటుంబం, పరిస్థితులు ఎన్ని పరిమితులు విధిస్తున్నా వాటన్నింటినీ అధిగమించాడు. శాసన సభ్యుడిగా రాజకీయ రంగంలో స్థానం కల్పించుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. ఏదో ఒక పార్టీలో ఎవరో ఒకరికి అనుయాయిగా మిగిలిపోలేదు. కొత్త పార్టీని స్థాపించాడు... కొత్త రాష్ట్రాన్ని సాధించాడు... కొత్త చరిత్రను సృష్టించాడు... దటీజ్ కేసీఆర్!
దిక్కూ మొక్కూ లేని తెలంగాణకు తానే దిక్కయ్యాడు. గొంతు పెగలని తెలంగాణకు గర్జించే గళమయ్యాడు. విద్రోహాలతో విసిగిన తెలంగాణకు బలమైన విశ్వాసమయ్యాడు. సందేహాల తెలంగాణకు సమాధానమయ్యాడు. అణగారిన తెలంగాణకు ఆత్మగౌరవ కేతన మయ్యాడు. ఉద్వేగ తెలంగాణకు ఉద్యమ వ్యూహమయ్యాడు. పడి లేచిన తెలంగాణను గెలుపు తీరం చేర్చిన విజయ సారథయ్యాడు. ఆగమయిన తెలంగాణ ఆదర్శ రాష్ట్రమయింది. నెర్రెలు బాసిన నేల సస్యశ్యామలమయింది. కరువు కాటకాల సీమ అన్నపూర్ణగా అవత రించింది. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని చవిచూస్తున్నది. అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నది. ఈ అద్భుత పరిణామానికి కర్త, కర్మ, క్రియ అయినవాడు ఒక్కడే! అతడే కేసీఆర్!!
మరో మహోద్యమం
ఆశయం సిద్ధించిందని అలుపు తీర్చుకోలేదు. అధికారం వచ్చిందని ఆగిపోలేదు. రాష్ట్రం బాగుపడిందని సంతృప్తి పడిపోలేదు. పోరాటమే ఆయన శ్వాస. ప్రజాస్వామ్యమే అయన ధ్యాస. అందుకే స్వరాష్ట్ర సారథి ఇప్పుడు సమాఖ్య విలువల కోసం సమర శంఖం పూరిస్తు న్నాడు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మరో పోరాటానికి సమా యత్తమవుతున్నాడు. పద్నాలుగేళ్ళు ఉద్యమించి నూతన రాష్ట్రాన్ని సాధించిన దార్శనికుడు, నేడు దేశంలో నూతన పరివర్తన కోసం మరో మహోద్యమానికి సంసిద్ధుడవుతున్నాడు.
దేశ స్వాతంత్య్రం ఇచ్చిన సంతోషం కన్నా, దేశ విభజన భారతీ యులను ఎక్కువ బాధ పెట్టింది; భయపెట్టింది. దేశంలో మరికొన్ని చోట్ల కూడా విభజన స్వరాలు వినిపిస్తున్న ఆనాటి సంక్లిష్ట సామాజిక సన్నివేశంలో దేశంలో ఐక్యతను నిలబెట్టడమే పెద్ద సవాలుగా మారింది. బహుమతాల, జాతుల, కులాల, భాషల, సంస్కృతుల భారతదేశాన్ని కలిపి ఉంచటానికి బలమైన కేంద్రం అవసరమని ఆనాటి రాజకీయ విజ్ఞులూ, రాజ్యంగా నిర్మాతలూ భావించారు. ఆనాటి పరిస్థితులకు వారి ఆలోచన సరైనదే! నేడు స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకొంటున్నాం. డెబ్భై ఐదేళ్ళ చరిత్రలో దేశం అఖండంగా, ఐక్యంగా నిలిచింది. జాతి సమైక్యతను నిలబెట్ట టంలో గాంధీ మహాశయుని వంటి నేతలు బోధించిన సామరస్య విలువలు ప్రధాన పాత్ర పోషించాయి. ఇది సానుకూల పరిణామం. కానీ రాను రాను కేంద్రం దగ్గర విస్తృత అధికారాలు పోగుపడ్డాయి. రాష్ట్రాల పాత్ర నామమాత్రం అయి పోయింది. సమాఖ్య స్ఫూర్తి విశాలం కావాల్సింది పోయి కుంచించుకు పోవడం మొదలయింది.
భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల అధికారాలను కుదించే ప్రక్రియ మరింత వేగవంతం అయింది. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే పన్నుల విధానం, ఒకే మార్కెట్, ఒకే రిజిస్ట్రేషన్ అంటూ అందమైన నినాదాలిస్తూ రాష్ట్రాల అధికారాలనూ, ఆదాయాన్నీ భాజపా ప్రభుత్వం కబళిస్తున్నది. పార్లమెంటుకు అతీతంగా జీఎస్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయటం సమాఖ్య విలువల మీద భయంకరమైన దాడి. విధి లేని పరిస్థితుల్లో రాష్ట్రాలు మిన్నకున్నాయి. రాజ్యంగబద్ధంగా కేంద్రం వసూలు చేసే పన్నులలో రాష్ట్రాలకు నలభై ఒక్క శాతం వాటా రావాలి. అందుకని కేంద్రం సెస్‌ల రూపంలో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. సెస్‌ల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రా లకు వాటా ఉండదు. దీన్ని అడ్డం పెట్టుకొని కేంద్రం దొడ్డిదోవన ఆదాయం సమకూర్చుకుంటూ రాష్ట్రాలకు వాటాను రాకుండా చేస్తున్నది. రాష్ట్రాలను నిధుల సంక్షోభంలోకి నెట్టుతున్నది.
ప్రశ్నిస్తే ద్రోహమా?
డిఫెన్స్, కరెన్సీ, ఫారిన్ అఫైర్స్ వంటి జాతీయ స్థాయి అంశాలకు కేంద్రం పరిమితం కావటం సబబు. వ్యవసాయం, విద్య, రోడ్లు, టెలీ కమ్యూనికేషన్లు వంటి అనేక రంగాలు రాష్ట్రాల పరిధిలోనే ఉండటం న్యాయం. కానీ రోజురోజుకూ కేంద్రం పరిధిలోని అంశాలు పెరిగి పోతుంటే, రాష్ట్రాల పరిధిలోని అంశాలు తరిగిపోతున్నాయి. యూరప్ దేశాల్లో గానీ, అమెరికాలో గానీ రాష్ట్రాలే కీలకం. దేశం బయటన ఉండే అంతర్జాతీయ అంశాలకే కేంద్రం అక్కడ పరిమితం. అందుకు భిన్నంగా భారత దేశంలో జరుగుతోంది.
ఇదేమిటని ప్రశ్నించలేని వాతావరణాన్ని భాజపా కల్పిస్తున్నది. సమాఖ్య విలువల కోసం ప్రశ్నిస్తే జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నది. ఆర్థిక రంగంలో, విదేశాంగ విధానంలో తన వైఫల్యాలను ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నది. ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగానే నేడు కేసీఆర్ కదనానికి సిద్ధం అవుతున్నారు. మనతో పాటే స్వాతంత్య్రం పొందిన చైనా ఉత్పత్తి రంగంలో గొప్ప అభివృద్ధిని సాధించి సూపర్ పవర్‌గా అవతరించింది. ‘చైనా కన్నా ఎక్కువ వనరులున్నా ఉత్పత్తిలో భారతదేశం ఎందుకు వెనుకబడిపోయింది?’ అని ప్రశ్నిస్తే చైనా తొత్తులని బద్నాం చేస్తారు. ‘ఆర్థిక వృద్ధిలో, మహిళా కార్మికశక్తి వినియోగంలో బంగ్లాదేశ్ కన్నా ఎందుకు వెనుకబడ్డాం?’ అంటే బంగ్లాదేశ్ తొత్తులని నిందలు వేస్తారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి వాస్తవాలను కప్పి పెడతారు. అందుకే దేశానికి ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం అవసరమని కేసీఆర్ భావించారు. భాజపా వ్యతిరేక ప్రజాస్వామిక శక్తులను కూడగట్టే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రజాస్వామిక విలువల కోసం కేసీఆర్ గొంతెత్తితే, పదవులకోసమని భాజపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ అనే సామాజిక ఆశయం కోసం కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నారనే సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు కదా! దేశభక్తి అంటే పొరుగు దేశాన్ని ద్వేషించడం ఒక్కటే కాదు. దేశభక్తి అంటే దేశవాసులకు నాణ్యమైన కరెంటు ఇవ్వటం, సాగునీరు ఇవ్వటం, ఉత్పత్తిని పెంచటం, ఉపాధినివ్వటం, మంచి జీవితాన్ని ఇవ్వటం! కేసీఆర్ పదే పదే చెప్తున్న గుణాత్మక మార్పు ఇదే. 68వ ఏట మరో మహదాశయం కోసం మరో పోరాటానికి శ్రీకారం చుడుతున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు దేశానికి కొత్త దిశను చూపించే రోజు కావాలని దేశ ప్రేమికులందరూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు.
తన్నీరు హరీశ్ రావు
ఆర్థిక, వైద్య – ఆరోగ్య శాఖామాత్యులు
Comments
Please login to add a commentAdd a comment