కోనాయిపల్లిలోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనకు సెంటిమెంట్ అయిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. సుమారు 12.30 గంటల సమయంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేంకటేశ్వస్వామిని దర్శించుకుని, నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
తర్వాత అర్చకులు సీఎంకు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. స్వామి వారి సన్నిధిలోనే గజ్వేల్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. మంత్రి హరీశ్‌రావు సైతం నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలుచేసి, వాటిపై సంతకం చేశారు. తర్వాత కేసీఆర్, హరీశ్‌రావు ఆలయం నుంచి బయటికి రాగా.. గ్రామ మహిళలు వారికి తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. సుమారు 1.15 గంటల సమయంలో వారు తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment