అయిదో విడతకు అంతా సిద్ధం! | Fifth Phase Of Haritha Haram In Nizamabad | Sakshi
Sakshi News home page

అయిదో విడతకు అంతా సిద్ధం!

Published Thu, Jul 4 2019 11:43 AM | Last Updated on Thu, Jul 4 2019 11:49 AM

Fifth Phase Of Haritha Haram In Nizamabad - Sakshi

సాక్షి, ఇందూరు (నిజామాబాద్‌): అయిదవ విడత హరితహారం కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) సిద్ధమైంది. గతేడాది కన్నా ఈసారి మూడింతల భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఈ శాఖ వేగంగా మొక్కలు నాటేందుకు పనులను ప్రారంభించింది. ఇందుకు ఆయా మండలాలు, గ్రామాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ఇతర ప్రాంతాల్లో ఉపాధిహామీ కూలీలతో గుంతలను తవ్విస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల వరకు గుంతల తవ్వకాలను పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో నేల మెత్తబడింది. వర్షాలు తగ్గుముఖం పట్టకముందే గుంతలను మరింత వేగంగా తవ్వించి ఎప్పటికప్పుడు మొక్కలు నాటించే ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లాలో గత ఏడాది డీఆర్‌డీఏ 60 లక్షల మొక్కలను మాత్రమే నాటింది. ఇందులో 40 లక్షల టేకు మొక్కలున్నాయి. అయితే ప్రస్తుతం అయిదవ విడతలో భారీగా మొక్కలు నాటేందుకు ప్రతి గ్రామ పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేసింది. మట్టిని నింపి అందులో విత్తనాలు పెట్టేందుకు కిలోకు రూ.159 చొప్పున టెండరు ద్వారా కొనుగోలు చేసి మొత్తం 2కోట్ల 78లక్షల 40వేల మొక్కలను పెంచింది. ప్రస్తుతం మొక్కలను నర్సరీల నుంచి నాటే స్థలాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయితే మొక్కలను ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జూలై రెండవ వారంలో ప్రారంభించేది. కాగా ఈసారి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇంత వరకు అందలేదు. ఏ రోజైనా ఆదేశాలు రావచ్చనే ముందస్తు ఆలోచనతో మొక్కలను సిద్ధం చేసి ఉంచారు. వర్షాలు కురుస్తున్నాయని, ఇదే అదనుగా కొన్ని చోట్ల అనధికారికంగా నాటడం కూడా మొదలెట్టేశారు.

నర్సరీలు 400
మొత్తం మొక్కలు 28740000
మొక్కల రకాలు 50
టేకు మొక్కలు 50 లక్షలు
ఇప్పటి వరకు తవ్విన గుంతలు 2 లక్షలు

50 లక్షల టేకు మొక్కలు రైతులకే... 
గత ఏడాది 40 లక్షల టేకు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేశారు. అయితే ఈ ఏడాది 50 లక్షల టేకు మొక్కలను ఇవ్వనున్నారు. అన్ని మొక్కలకన్నా ఎక్కువ ధర టేకుకే ఉంటుంది. విత్తనాలు కొనుగోలు చేసి పెంచినా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తమిళనాడు నుంచి టెండరు ద్వారా స్టంపులను తెప్పిస్తారు. ఈ ఏడాది కూడా ఒక్కో స్టంపును 82 పైసలకు కొనుగోలు చేసి తెప్పించి నర్సరీల్లో పెంచారు. వీటిని వ్యవసాయ రైతులకే ఇవ్వనున్నారు. పొలం గట్లపై పెంచడానికి 50 వరకు మొక్కలు ఇవ్వనున్నారు. కాగా రైతుకు ప్రత్యేక స్థలం ఉండి మొక్కలను పెంచడానికి ఉత్సాహం చూపితే 500 వరకు ఇచ్చే అవకాశం ఉంది. 50 లక్షల లక్ష్యానికి గాను జిల్లాల్లో 48 లక్షల స్టంపులు రావడంతో వాటినే పెంచారు.

మొత్తం యాబై రకాల మొక్కలు... 
భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న డీఆర్‌డీఏ .. 400 నర్సరీల్లో మొత్తం యాబై రకాల మొక్కలను పెంచింది. అందులో 50 లక్షల వరకు టేకు మొక్కలే ఉన్నాయి. మిగతా మొక్కలు మందారా, రోజా, బాహునియా, తబుబియా, సీతాఫలం, కరివేపాకు, టేకొమా, జామా, దానిమ్మ, గన్నేరు, మునగ, రెడ్‌ సాండర్స్, బాంబో, గుల్‌మోహర్, కానుగ, వేప, అల్‌బిజియా, బురుగు, చింత, చిన్నబాదం, బాదం, రెయిన్‌ ట్రీ, ఈత,మొర్రి, మారెడు, సీమ తంగెడు, జీడీ, జమ్మి, అల్ల నేరెడు, ఉసిరి, ఇతర రకం మొక్కలున్నాయి. ఈత, దానిమ్మ, ఉసిరి, మునగ లాంటి రకం మొక్కలు 9 లక్షల చొప్పున పెంచారు.

ఎక్కడెక్కడ నాటుతారంటే... 
మొక్కలను ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, ప్రయివేటు సంస్థలు, పరిశ్రమలు, చెరువు కట్టలు, రోడ్ల వెంబడి, కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు, తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. ఏ కేటగిరిలో ఎన్ని మొక్కలు నాటాలో ప్రణాళికను సైతం డీఆర్‌డీఏ అధికారులు రూపొందించుకున్నారు. ఈ చెట్లను గౌడ కులస్తులు వారి సొసైటీ స్థలాల్లో నాటేందుకు ముందుకు వస్తే మొక్కలను అందజేయనున్నారు.

మొక్కలు తరలిస్తున్నాం
హరితహారంలో మొక్కలు నాటేందుకు అన్ని నర్సరీల్లో మొక్కలు పెంచాం. ప్రస్తుతం మొక్కలను ఆయా ప్రాంతాలకు తరలించి నాటేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధిహామీ కూలీలతో గుంతలను వేగంగా తవ్విస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వేగంగా మొక్కలు నాటిస్తాం.
–రాథోడ్‌ రమేశ్, డీఆర్‌డీఓ,నిజామాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఉపాధిహామీ కూలీలతో గుంతలను తవ్విస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement