Haritha Haram programme
-
గ్రీన్ చాలెంజ్ తరుణమిదే..ఎలాంటి మొక్కలు పెంచాలి?
సాక్షి, హైదరాబాద్: వానా కాలం సీజన్ మొదలైంది. గ్రేటర్ నగరం గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటిన్నర జనాభాకు చేరువైన సిటీలో హరితం శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల 42 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతిఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణ వేత్తలు స్పష్టంచేస్తున్నారు. కాగా మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా..నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు అంతగా దోహదం చేయలేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హరితహారంలో ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో భాగంగా ప్రస్తుతం గ్రేటర్లో ఉన్న గ్రీన్‌బెల్ట్ 20 నుంచి 30 శాతానికి పెంచాలని స్పష్టంచేస్తున్నారు. లక్ష్యం చేరని హరితహారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో 2016 నుంచి ఏటా హరితహారం చేపట్టారు. ఐదేళ్లుగా సుమారు మూడు కోట్ల మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి,కలబంద,క్రోటన్,పూల మొక్కల వంటి చిన్నమొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీప్రదేశాలు,చెరువులు,పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి,పర్యావరణ వేత్త హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి,ఆక్సీజన్ అందించేవి,కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరిగి నగరంలో ఆక్సీజన్శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. గ్రీన్‌చాలెంజ్ ఇలా... ► నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. ► తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. ► సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ►నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. ► నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. -
Telangana Haritha Haram: ఏడో విడత..19.91 కోట్ల మొక్కలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడో విడత హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి పదిరోజుల పాటు 19.91 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈసారి రహదారి వనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయతీ రోడ్ల వెంట మొక్కలు నాటాలని (మల్టీ అవెన్యూ ప్లాంటేషన్) నిర్ణయించింది. వీలున్న ప్రతిచోటా మియావాకీ మోడల్లో మొక్కలు నాటాలని ఆదేశించింది. హైదరాబాద్ శివార్లలోని అంబర్పేట్ కలాన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి ఏడో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం వివరాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఆరు విడతల హరితహారం విజయవంతమైన స్ఫూర్తితో ఏడో విడతను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటేలా ప్రోత్సహించనున్నామని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచామన్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ పచ్చదనం పెంచేలా చర్యలు చేపడుతున్నామని పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,241 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నాటిన మొక్కలన్నీ బతికేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈసారి 230 కోట్ల లక్ష్యం పూర్తి 2015లో హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టినపుడు మొత్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు ఆరు విడతల్లో 220.70 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. తాజా విడతలో మొత్తం లక్ష్యాన్ని అధిగమించనున్నారు. హరితహారం కోసం అన్నిశాఖల్లో కలిపి ఇప్పటిదాకా రూ.5,591 కోట్లు ఖర్చు చేశారు. -
Haritha Haram: ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు.. నిర్లక్ష్యం చూపితే చర్యలు..
సాక్షి, సిరిసిల్ల: ఏడో విడత హరితహారంలో భాగంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందించాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా అధి కారులతో కలిసి అన్ని మండలాల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పల్లెప్రగతిని జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలో పది ఎకరాల్లో పల్లె ప్రకృతివనం నిర్మించేందుకు స్థలం సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, నీటిట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు. బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యం చూపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్ల వెంట మొక్కలు నాటాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ పల్లెల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలిన కోరారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్, పీఆర్ ఈఈ శ్రీనివాస్‌రావు, ఏడీవో రణధీర్‌కుమార్, ఆర్టీవో కొండల్రావు, అడిషనల్ డీఆర్డీవో మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. హరితహారం పోస్టర్ల ఆవిష్కరణ జిల్లాలో పల్లెప్రగతిని పండుగలా నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ కోరారు. కలెక్టరేట్లో సోమవారం హరితహారం పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. పల్లెప్రగతిని సామాజిక బాధ్యతగా నిర్వహించాలని కోరారు. చదవండి: నేడు గొల్లపూడిలో దిశ యాప్ అవగాహన సదస్సు -
హుజూర్‌నగర్‌లో హరితహారం కార్యక్రమం
-
తెలంగాణ ధనిక రాష్ట్రమే
నాకు ఎమ్మెల్యే అయిన కొత్తలో ఫియట్ కారు ఉండేది. 1985లో.. నేనే నడుపుకుంటూ తిరిగినటువంటి రోడ్డు ఇది. తూప్రాన్ నుంచి నర్సాపూర్.. సంగారెడ్డి, మెదక్‌కు వచ్చేది. సినిమా వాళ్లకు అటవీ సీన్ కావాలంటే గతంలో అందరూ నర్సాపూర్‌కు వచ్చేవారు. ఆ అడవి ఎక్కడికి పోయినట్లు.. మనమే చేజేతులా పోగొట్టుకున్నం. సాక్షి, మెదక్: ‘మనం గరీబోళ్లం కాదు.. తెలం గాణ 100 శాతం ధనిక రాష్ట్రమే. కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగులకు 3నెలలు సగం జీతాలు ఇచ్చాం. రైతులకు ఇచ్చేందుకే వారి జీతాల్లో కోత పెట్టాం’అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నేరేడు మొక్కను నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. 630 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించారు. మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులతో కలిసి కాలినడకన తిరుగుతూ పార్కు ప్రాంతంలో చేపట్టిన అటవీ పునరుద్ధరణను పరిశీలించా రు.రాక్‌ఫిల్ డ్యాం, వాటర్ హార్వెస్టింగ్ తది తర పనులపై ఆరా తీశారు. 50 మీటర్ల ఎత్తులో నిర్మించిన వాచ్ టవర్‌పైకి ఎక్కి అటవీ అందాలను తిలకించారు. అనంతరం పార్కులో 100 మంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో నిరాడంబరంగా జరిగిన భేటీలో ఆయన మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌తో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలు ఆపినప్పటికీ.. రైతు బంధు, గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను విడుదల చేయడం ఆపలేదన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో రైతులు బాగుపడాలన్నదే ప్రభు త్వ ధ్యేయమని.. రైతుల అప్పులు తీరిపోవడంతోపాటు వారి బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికీ కనీసం రూ.లక్ష ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కులో వాచ్ టవర్‌పై నుంచి అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ అడవి దొంగలపై ప్రత్యేక నిఘా.. కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. స్పెషల్ ఆఫీసర్‌ను నియమించామని, అడవిలో చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అడవులను ఎవరైనా పట్టించుకున్నారా.. అని ప్రశ్నించారు. కలప దొంగలు వారి హయాంలోనే ఎక్కువని.. వారి పార్టీల్లోనే ఉన్నారని మండిపడ్డారు. అడవుల పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టిందని.. కలప దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదన్నారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. దీని కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అటవీ శాఖలో రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. 2,200 వాహనాలు ఇచ్చామని గుర్తు చేశారు. మనకు మనమే మేల్కొని.. చేజేతులా పోగుట్టుకున్న అడవులను తిరిగి మనమే వంద శాతం తెచ్చుకోవాలని సూచించారు. దీనికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామానికో నర్సరీ తెలంగాణలోనే.. గతంలో 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు తెలంగాణలో చేపట్టామని కేసీఆర్ వివరించారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్‌ను సమకూర్చడం జరిగిందన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పది వేల మొక్కలను నాటేందుకు ఇబ్బందులు పడ్డామని.. వీటిని దృష్టిలో పెట్టుకుని అన్నీ సమకూర్చినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతీ గ్రామానికి నర్సరీ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో, బాధ్యతగా మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. ధర నిర్ణయం రైతులే తీసుకునేలా.. రైతులకు మేలు చేసేందుకే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డిమాండ్‌కు తగ్గ పంటలు వేసి.. మద్దతు ధర పొందేలా రైతులకు సౌకర్యవంతంగా ఒక నిర్ధిష్టమైన విధానాన్ని తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమన్నారు. గ్రామంలో రైతులు ఒకచోట కూర్చొని ఏ పంట సాగు చేయాలి.. ధర ఎంత కేటాయించాలో వారే నిర్ణయించుకునేందుకు వీలుగా రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్ల పరిధిలో మూడు నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సీఎం ఆదేశించారు. ఇంటికి ఆరు మొక్కలు.. హరితహారంలో భాగంగా ఇంటికి కనీసం ఆరు మొక్కలు నాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇంట్లో వారి పేర్లు ఒక్కోదానికి ఒకరి పేరు పెట్టాలని సూచించారు. ఈ సెంటిమెంట్ పని చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగు వేల చెక్‌డ్యాంలు కడుతున్నామని.. తేమ శాతం పెరిగి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నర్సాపూర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. 201 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున.. ఏడు మండల కేంద్రాలకు రూ. కోటి చొప్పున.. నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్‌ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శోభ, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి తదితరులు అందరికీ బాధ్యత తెలిసొచ్చింది... అడవులపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని.. అడవుల ప్రాముఖ్యతను గుర్తించి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అడవులు అంటే ప్రజాప్రతినిధుల బాధ్యత కాదని అంతకు ముందే అనుకునేవారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో అందరికీ బాధ్యత తెలిసి వచ్చిందన్నారు. మెదక్ జిల్లాలోని 469 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పటయ్యాయని.. సీఎం ఆలోచనలకు అనుగుణంగా చింత, రావి, మర్రి చెట్లు పెంచుతున్నామన్నారు. జిల్లాలో 76 రైతు వేదికలకు కొన్ని ప్రారంభమయ్యాయని తెలిపారు. సీఎం ఆశయాలు, లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో నియంత్రిత సాగుకు రైతులు ఆసక్తి చూపారన్నారు. 2,60,000 ఎకరాల్లో సాగు చేపట్టారని చెప్పారు. ఇప్పటివరకు వరి, పత్తి, కంది, ఇతర పంటలకు సంబంధించి 60 శాతానికిపైగా విత్తనాలు నాటారని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ 50 అర్బన్ పార్కులు... సీఎం కేసీఆర్ కార్యదక్షతతో అన్నింటా విజయవంతంగా ముందుకు సాగుతున్నారని అటవీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అడవుల పునరుద్ధరణకు పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు ఐదు విడతల్లో 182 కోట్ల మొక్కలు నాటామని.. ఆరో విడతలో 30 కోట్ల మొక్కలు నాటనున్నట్లు వివరించారు. నర్సాపూర్ అర్బన్ పార్కు లాగా హైదరాబాద్ చుట్టూ 50 పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యాలయ కార్యదర్శి నర్సింగరావు, అటవీ శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ శోభ, అటవీ శాఖ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుముల మధన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్ఓ పద్మజారాణి, మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎఫ్ఆర్ఓ గణేష్ తదితరులు పాల్గొన్నారు. సైడ్‌లైట్స్.. ‘ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్లకి పిల్లను కూడా ఇయ్యలే. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతుల వద్దే డబ్బులు ఉన్నాయి అని చెప్పడానికి గర్వపడుతున్నా’.. అని సీఎం కేసీఆర్ అనడంతో సమావేశ ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. సీఎం కార్యాలయ కార్యదర్శి నర్సింగరావు స్వస్థలం శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం. ఈయన ఆరో విడత హరితహారానికి రాగా.. సీఎం కేసీఆర్ ఆయనను నా కార్యాలయంలో పనిచేసే నర్సాపూర్ ముద్దుబిడ్డ నర్సింగరావు అని సంబోధించడంతో ప్రజాప్రతినిధులు చప్పట్లు కొట్టారు. తెలంగాణ వస్తే ఏం సాధిస్తారు అన్నవారికి సరైన సమాధానం చెప్పాం. ఐదేళ్ల ఫలితం ఏంటంటే వ్యవసాయంలో ప్రగతి సాధించడమే ఇందుకు నిదర్శనం. మన రాష్ట్రం నుంచే 55శాతం ధాన్యం ఎఫ్‌సీఐకి ఇచ్చాం. మిషన్ భగీరథలోనూ అద్భుత ప్రగతి సాధించాం. ఇంటింటికీ నీరు బ్రహ్మాండంగా అందుతోంది. బిందెల ప్రదర్శన బంద్ కాలేదా.. అని ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రోహిణి కార్తెను విత్తనాలు నాటే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు కౌడిపల్లి పటేళ్ల వ్యవసాయం అంటే పాత మెదక్ జిల్లా అంతా మషూర్ ఉండేది. రెండు, మూడు నెలలు బెల్లం గానుగలు నడిచేవి. అలాంటిది కౌడిపల్లి కాడనే ఇప్పుడు కరవొచ్చింది. ఎక్కడ పడకున్నా పాత మెదక్ జిల్లాలో నర్సాపూర్‌లో వర్షం పడేది. మరి ఎక్కడికి పోయినయ్.. మళ్లీ గట్టిగా చెబుతున్నా.. మనకు మనమే అడవులు వాపస్ తెచ్చుకోవాలి. దండం పెట్టి చెబుతున్నా మనం బాగు పడాలంటే మనమే మేల్కోవాలి. ఎవరో వచ్చి సాయం చేయరు. అని ప్రజాప్రతినిధులకు సీఎం హితబోధ చేశారు. ఈయన నర్సాపూర్ ముద్దుబిడ్డ.. ఊ సీఎం కార్యాలయ కార్యదర్శి నర్సింగరావు స్వస్థలం శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం. ఈయన ఆరో విడత హరితహారానికి రాగా.. సీఎం కేసీఆర్ ఆయనను నా కార్యాలయంలో పనిచేసే నర్సాపూర్ ముద్దుబిడ్డ నర్సింగరావు అని సంబోధించడంతో ప్రజాప్రతినిధులు చప్పట్లు కొట్టారు. -
హెచ్ఎండీఏ నర్సరీలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 6వ విడత హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఇందుకోసం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) శంషాబాద్‌లోని హెచ్ఎండీఏ నర్సిరీ మొక్కలను బుధవారం పరీశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలను పెంచుతున్న తీరు, ఏఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలపై ఆయన ఆరా తీశారు. ఇక ఈ మొక్కలను ప్రజలకు అందించే ప్రక్రియ వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. (హామీలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి) అక్కడ పనిచేసే అర్హులైన వారందరికీ ఈఎఫ్, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది 6వ విడత హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పారు. పట్టణాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడంపై ఇప్పటికే తమ శాఖ తరపున ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. హరితహారంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకి గ్రీనరీని కానుకగా ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కల కావాల్సి వస్తే నగర పరిధిలో ఉన్న నర్సరీలలో నుంచి ఉచితంగా తీసుకోవచ్చని, ఒకటి రెండు రోజుల్లో నగరంలోని నర్సరీల సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. (హరిత పట్నం కావాలి: కేటీఆర్) -
హరిత పట్నం కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : మరోసారి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని పురపాలక మంత్రి కె.తారకరామారావు కోరారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, జిల్లా అడిషనల్ కలెక్టర్లతో శనివారం ఇక్కడ ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పట్టణ పురపాలిక బడ్జెట్లో 10 శాతం హరిత బడ్జెట్‌గా ఉండాలన్న నిబంధనను నూతన పురపాలక చట్టం చెబుతోందని, హరిత పట్టణాలుగా తీర్చిదిద్దడానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. గ్రీన్ బడ్జెట్ వినియోగంపైన భవిష్యత్‌లో సమగ్ర సమీక్ష ఉంటుందని, హరితహారం, గ్రీన్ బడ్జెట్‌ను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. మొక్కలను నాటడం, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మునిసిపల్ కమిషనర్, చైర్పర్సన్లదే అన్నారు. కనీసం 85% నాటిన మొక్కలను కాపాడాలని చెప్పారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రై డేగా పాటించి నాటిన చెట్లను సంరక్షించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డంప్ యార్డుల వద్ద సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని, సాధ్యమైనంత ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలను నాటితే వాటి సంరక్షణ సులువు అవుతుందన్నారు. దోమలను తరిమే మస్కిటో రిప్పెలంట్ చెట్లను నాటాలన్నారు. ప్రతీ పట్టణానికి ఒక ట్రీ–పార్క్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 పట్టణాలకు దగ్గర్లో అటవీ బ్లాకులు అందుబాటులో ఉన్నాయని, వీటిలో చెట్లు నాటేందుకు పురపాలకలు ముందుకు రావాలని కోరారు. ప్రతి పట్టణంలో స్మృతి వనాలను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తగిన కార్యాచరణ చేపట్టాలన్నారు. పట్టణాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఉధృతంగా పారిశుద్ధ్య పనులు.. జీహెచ్ఎంసీతో సహా అన్ని పురపాలికలకు ప్రతినెలా రూ.148 కోట్ల ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను నేరుగా విడుదల చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చామన్నారు. ఈ నిధులతో పారిశుద్ధ్యంతో పాటు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అవసరమైన కార్యచరణ చేపట్టిందని తెలిపారు. సీఎం సూచన మేరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ని కూడా చేపట్టామన్నారు. ఈ సీజన్ మొత్తం సాధారణంగా చేసే పారిశుద్ధ్యానికి అదనంగా నాలుగు రెట్లు ఎక్కువ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. పౌరుల భాగస్వామ్యంతో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి ఒక్కరు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇల్లందులో పట్టణ ప్రగతి నిర్వహణపై ఒక నివేదికను రూపొందించి మంత్రికి పంపించిన మునిసిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మునిసిపల్ కమిషనర్‌ను కేటీఆర్ అభినందించారు. ఇదే తరహాలో పట్టణ ప్రగతికి ముందు, తర్వాత ఉన్న పరిస్థితులను పొటోలతో సహా ఒక రిపోర్ట్ తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచితే ప్రజలకి తాము చేస్తున్న కార్యక్రమాలు అర్ధమవుతాయని మంత్రి సూచించారు. -
57 వేల మొక్కలు నాటిన పోలీస్ శాఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పోలీస్‌శాఖ లోని డీజీపీ స్థాయి నుండి హోం గార్డ్ లు, ఇటీవల నూతనంగా నియమితులైన ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల వరకు తప్పని సరిగా మొక్కలు నాటాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో నేడు అన్ని జిల్లాల్లో, పోలీస్ సంస్థల్లో నేడు ఒక్క రోజే 56,872 మొక్కలను నాటారు. పేట్లబుర్జ్ లో నిర్వహించిన హరితహారంలో హోంమంత్రి మహమూద్ ఆలీ, పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తాలు మొక్కలు నాటారు. డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు. డీజీపీ, అడిషనల్ డీజీలు, ఐజీలతో సహా అన్ని జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీల నుండి ఎస్ఐ, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఈ హరిత హారం లో మొక్కలను తమ పరిధిలోని పోలీస్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల లో నాటారు. అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఇతర సంస్థలైన బెటాలియన్లు, పోలీస్ శిక్షణా సంస్థలు, ఇతర సంస్థల్లో హరితహారం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన హరితహారం లో 13, 629 మొక్కలు నాటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అగ్రస్థానం లో నిలువగా, 6, 278 మొక్కలు నాటి బెటాలియన్స్ ద్వితీయ స్థానం లో, 3500 మొక్కలు నాటి సైబారాబాద్ కమిషనరేట్ తృతీయ స్థానం లో నిలిచింది. -
దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు
సాక్షి, ధర్మారం(ధర్మపురి): దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి రికార్డు సృష్టించిందని రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ శివారులో వానరవనంలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ‘30 రోజుల ప్రణాళిక’ను గ్రామగ్రామాన అమలు చేయటం జరుగుతోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను ఆయా గ్రామాల పాలకవర్గాలతో పాటుగా అధికారులకు అప్పగించి ప్రభుత్వం పకడ్బందీగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. నాలుగేళ్లలో కోటి 50 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు. కోతుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో వనారవనాన్ని ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను పెంచుతుందన్నారు. దీంతో గ్రామాల్లో ఉన్న కోతులు అడవిలోకి వెళతాయన్నారు. ఈ వనంలో 180 రకాల పండ్ల మొక్కలను నాటుతున్నామన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఫొటోలకు పోజులివ్వటం కాదు.. ‘మొక్కలను నాటి వెళ్ళి పోవటం కాదు.. పెట్టిన ప్రతి మొక్కను రక్షించాలి.. నేను మొక్కను నాటుతుంటే నా వెంట ఉంటూ నిలపడితే సరికాదు. నా వద్ద బెల్లం లేదు.’ అన్నారు. మంత్రి ఈశ్వర్ ఖిలావనపర్తి వానరవనంలో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి ఈశ్వర్‌కు మొక్కను నాటిన తర్వాత సరిపడు మట్టి అందుబాటులో లేకపోవటంతో మంత్రికి కోపాన్ని తెప్పించింది. గుంతలు ఎందుకు తీయలేదని గ్రామస్తులను ప్రశ్నించారు. తాను వెళ్లిన తర్వాత ఇంతే సంగతా అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో గొప్పదని ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలన్నారు. ఎంపీపీ కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మజ, సర్పంచ్ కనకతార, ఎంపీటీసీ సుజాత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జితేందర్‌రావు, నాయకులు బలరాంరెడ్డి, రాజేశం, రాజయ్య, బుచ్చిరెడ్డి, మల్లేశం, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
హరితహారం మొక్కను మేసిన ఎడ్లు.. శిక్షగా
సాక్షి, కామారెడ్డి: హరితహారంలో నాటిన మొక్కలను మేపినందుకు ఎడ్ల యజమానికి జరిమానా విధించిన సంఘటన మండలంలోని ఉగ్రవాయిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లంబాడి శంకర్‌కు చెందిన రెండు ఎడ్లు క్యాసంపల్లి తండా శివారులోని రైస్ మిల్ సమీపంలో కమ్యూనిటీ స్థలంలో హరితహారంలో నాటిన మొక్కలను మేశాయి. దీన్ని చూసిన గ్రామ కారోబార్ జీపీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. కార్యదర్శి జరిమానా విధించాలని పేర్కొనడంతో కారోబార్ హరితహారంలో ఎడ్లు మేసిన మొక్కలను పరిశీలించారు. జీపీ సిబ్బందితో ఎడ్ల యజమాని లంబాడి శంకర్‌ను పిలిపించి రూ.1000 జరిమాన విధించారు. హరితహారంలో నాటిన మొక్కలను ఎవరూ మేపినా జరిమానాలు తప్పవని గ్రామ కార్యదర్శి పేర్కొన్నారు. మరోవైపు, పశువులు మొక్కలు తిన్నాయని రైతులకు జరిమానాలు వేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్‌లు సైతం నిరసన తెలుపుతున్నారు. గొర్రెల కాపర్లకు ప్రభుత్వం సహాయం అందజేస్తూ జరిమానాలు వేయడంపై కుర్మ గొల్లలు నిరసన తెలిపారు. పరిస్థితి ఇలాగా ఉంటే ఉద్యమం తప్పదని పేర్కొంటున్నారు. -
వెనుకబడ్డారు.. వేగం పెంచండి!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): హరితహారం కార్యక్రమంలో విధించిన లక్ష్యానికి దూరంగా ఉన్న పలు మండలాల ఉపాధిహామీ ఏపీఓలు, టీఏలు తాకీదులు అందుకోనున్నారు. ఇప్పటివరకు నమోదైన మొక్కలు నాటిన జిల్లా శాతం కంటే తక్కువ శాతం నమోదు చేసిన మండలాలను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేస్తోంది. నేడో, రేపో సంబంధిత మండలాలకు నోటీసులు వెళ్లనున్నాయి. ప్రస్తుతం ఈనెల 28 తేదీ వరకు మొక్కలు నాటిన జిల్లా యావరేజీ శాతం 66.21గా ఉంది. జిల్లా శాతానికి తక్కువగా ఉన్న కోటగిరి, డిచ్పల్లి, బాల్కొండ, నందిపేట్, నిజామాబాద్, రెంజల్, సిరికొండ మండలాలకు నోటీసులు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధిహామీ విభాగంతో జిల్లాలో 2కోట్ల 30 లక్షలు మొక్కలు నాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాత మండలాల ప్రకారం మొత్తం 19 మండలాల్లోని 530 గ్రామ పంచాయతీల్లో పంచాయతీకి ఒకటి చొప్పున నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. మొక్కలు నాటడం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు 1,52,27,451 (66.21 శాతం)మొక్కలను ఉపాధిహామీ సిబ్బంది గుంతలు తీయించి కూలీలచే నాటించారు. ఇంకా 77,72,549 మొక్కలను నాటించాల్సి ఉంది. అయితే మొక్కలను నాటించడంలో పలు మండలాల ఏపీఓలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఫలితంగా లక్ష్యంలో వెనుకబడి ఉన్నారు. దీంతో జిల్లా పర్సంజేటీపై ప్రభావం పడుతోంది. చాలా మండలాలు 65 శాతం మొక్కలు నాటించడం క్రాస్ చేయగా, కొన్ని మండలాల కారణంగా హరితహారంలో జిల్లా వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. కమ్మర్పల్లి మండలం 87.35 శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో ఆర్మూర్ 84.17శాతం, ధర్పల్లి 82.87శాతం, వేల్పూర్ 73.64 శాతంతో ఉన్నాయి. సెప్టెంబర్ 15 వరకు లక్ష్యాలు పూర్తి చేయాలి.. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని వచ్చే సెప్టెంబర్ 15వరకు పూర్తి చేయాలని ఉపాధిహామీ సిబ్బందికి డీఆర్డీఓ రాథోడ్ రమేష్ ఆదేశాలిచ్చారు. ఇందుకు బుధవారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, టీఏలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొక్కలు నాటడంలో లక్ష్యానికి వెనుకబడి ఉన్న మండలాలు వారం రోజుల్లో మెరుగుపరుచుకోవాలని, లేదంటే నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. - జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం (ఫైల్) -
హారం.. ఆలస్యం!
సాక్షి, ఖమ్మం : జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2019–20 సంవత్సరానికి సంబంధించి 3.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాఖలవారీగా విభజించిన అధికారులు ఆయా శాఖలోని పరిస్థితులనుబట్టి కొంత లక్ష్యాన్ని నిర్ణయించారు. అటవీ, పోలీస్ శాఖతో కలిపి కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే డీఆర్డీఏ ఆధ్వర్యంలో కోటి, సింగరేణి ఆధ్వర్యంలో 25వేలు, ఐటీసీ బీపీఎల్ ఆధ్వర్యంలో 50 వేలు, వ్యవసాయ శాఖ 15వేలు, ఎక్సైజ్ శాఖ 1000, మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 28,600, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 10వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. వర్షాల ఆలస్యంతో.. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాలు ప్రారంభమైన వెంటనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వర్షాలతో భూమి మెత్తబడడం.. మొక్కలు నాటేందుకు అనువుగా ఉండడంతో ఈ కార్యక్రమానికి పూనుకుం టారు. వర్షాకాలం పూర్తయ్యే సమయానికి లక్ష్యం మేరకు మొక్కలు నాటడాన్ని పూర్తి చేస్తారు. అయితే ఈ ఏడాది అటువంటి పరిస్థితులు లేవు. సాధారణంగా జూలై మొదటి వారంలో వర్షాలు కురవడంతో అదే సమయంలో హరితహారం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఆగస్టు వరకు వర్షాలు కురవలేదు. దీంతో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం సాధ్యం కాలేదు. ఇటీవల తుపాను, రుతుపవనాల ప్రభావంతో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడే హరితహారం ప్రారంభించారు. హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ మేరకు ప్రస్తుతం అధికారులు మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. నాటింది 1.32 కోట్ల మొక్కలే.. హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 1.32 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. మొత్తం 3.29 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఆ దిశగా మొక్కలు నాటే ప్రక్రియ సాగడం లేదు. ఇటీవల కాలంలోనే మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కావడంతో ఇంకా ఊపందుకోలేదు. హరితహారంలో భాగంగా మొక్కలను పాఠశాలలు, ఇళ్ల ఆవరణ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, డివైడర్ల మధ్యలో.. ఆర్అండ్బీ రహదారుల వెంట, అటవీ ప్రాంతాలు, ఖాళీ స్థలాల్లో నాటాలని నిర్ణయించారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా కారణంతో మొక్క చనిపోతే దాని స్థానం లో మరో మొక్కను నాటేలా చర్యలు చేపట్టారు. అయితే లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత పెంచేందుకు అధికారులు మెగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఒక్కో మండలంలో 5లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ క్రమంలో 15 మండలాల పరిధిలో సుమారు 50 లక్షల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. కాగా.. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు మెగా హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మొక్క నాటని వ్యవసాయ శాఖ జిల్లాలోని వివిధ శాఖలు తమకు కేటాయించిన విధంగా మొక్కలు నాటుతూ వస్తుండగా.. వ్యవసాయ శాఖ మాత్రం ఈ ఏడాది ఒక్క మొక్క కూడా నాటని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో రైతులతో అనుసంధానంగా ఉండే వ్యవసాయ శాఖ మొక్కలను నాటకపోవడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి.. హరితహారం కార్యక్రమం జిల్లాలో ఆలస్యంగా ప్రారంభం కావడంతో నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కృషి చేసున్నా.. వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మెగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మొక్కలు నాటడంతో అడుగులు లక్ష్యం దిశగా పడుతున్నట్లు తెలుస్తోంది. – ఖమ్మం, సహకారనగర్ -
'చైనా మాదిరిగా ఉద్యమం చేపట్టాలి'
సాక్షి, మంథని : ‘చైనాలో పర్యావరణ విపత్తు సంభవించినప్పుడు అక్కడి ప్రభుత్వం చాలెంజ్‌గా తీసుకుంది. 600 కోట్ల మొక్కలు నాటి గ్రేట్ గ్రీన్ ఆప్ చైనాగా సమస్యను పరిష్కరించుకుంది. పర్యావరణ సమతుల్య సాధనకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యో రామగుండంలో అదే మాదిరిగా ఉద్యమం చేపట్టాలి’ అని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సింగేరేణి సంస్థ ఆర్జీ– 3, అడ్రియాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంథని మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలవాగు కరకట్టపై హరితాహారం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మంత్రి కొప్పులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు, పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే డి. శ్రీధర్ బాబు, సింగరేణి సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ వనజాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కరకట్టపై మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. మానవ మనుగడకు ముడిపడి ఉన్న పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అడవులశాతాన్ని పెంచేందుకు 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. నాలుగు విడతల్లో నాటిన మొక్కల్లో 48శాతమే మిగిలాయని, సింగరేణి గనులు విస్తరించి ఉన్న రామగుండం అగ్నిగుండంలా మారిందన్నారు. ఇక్కడ ఆ పరిస్థితులు అధిగమించడానికి సింగరేణి అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో కోటి 95లక్షల మొక్కలు నాటడం టార్గెట్‌గా ఉందని, ఇప్పటి వరకు25 లక్షల మొక్కలే నాటారన్నారు. కోతులు గ్రామాలకు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అడవికి పంపేందుకు జగిత్యాల జిల్లా మాదిరిగా ఇక్కడా చర్యలు చేపట్టాలని తెలిపారు. సింగరేణి, నీటి పారుదలశాఖల పరిధిలో భూములు కోల్పోయిన వారి సమస్యల సాధనకు కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మంథని మున్సిపాలిటీలో ఇంత పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన సింగరేణికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు. సింగరేణి సంస్థ డైరెక్టర్(పా)చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండేళ్లలో రెండు కోట్ల మొక్కలు నాటామన్నారు. సింగరేణి కాలరీస్ పరిధిలో స్థలాలు లేకపోవడంతో మున్సిపల్, మేజర్ పంచాయతీల్లోనూ మొక్కలు నాటుతున్నామన్నారు. మంథని ఆర్డీవో నగేష్, మంథని ప్రత్యేక అధికారి బోనరిగి శ్రీనివాస్, సింగరేణి గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, జనరల్ మేనేజర్లు సూర్యనారాయణ, వీరారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
త్వరితం.. హరితం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో 3 కోట్ల మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో 1.30 లక్షల మొక్కలనుజీహెచ్‌ఎంసీ, జలమండలి ఖాళీ స్థలాల్లో పెంచు తుండగా... మరో 70 లక్షల మొక్కల ను హెచ్ఎండీఏ, గృహనిర్మాణ శాఖ ఖాళీ స్థలాల్లో పెంచుతున్నారు. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారుల వెంబడి, వివిధ సంస్థలు, విద్యాసంస్థల్లో దాదాపు 10 లక్షల మొక్కలు నాటుతున్నారు. మిగిలిన మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించగా... అధికారులు ఇప్పటికే 13 లక్షల మొక్కలు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాటనున్న మొక్కలకు సంబంధించి స్థలాల ఎంపిక పూర్తవ్వగా... గుంతల తవ్వకం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ మొక్కలకు జీహెచ్ఎంసీ జియోట్యాగింగ్ కూడా చేయనుంది. జీహెచ్ఎంసీ నాటనున్న 5లక్షల మొక్కల్లో ఎల్బీనగర్ జోన్లో 95వేలు,చార్మినార్ జోన్లో 65వేలు, ఖైరతాబాద్ జోన్లో 79,600, శేరిలింగంపల్లి జోన్లో 85,250, కూకట్పల్లి జోన్లో 1,01,050, సికింద్రాబాద్ జోన్లో 74,100 మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఆయా జోన్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు దాదాపు 3,084 ప్రాంతాల్లో 1,729 ఎకరాల భూమిని గుర్తించారు. వర్షాలతో పంపిణీ ముమ్మరం... నగరంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు మొక్కల పంపిణీ ముమ్మరం చేశారు. కాలనీలు, బస్తీలు, విద్యాసంస్థల్లో మొక్కల పంపిణీ చేపట్టారు. ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో వివిధ కాలనీలు, ఆలయాలు, విద్యాసంస్థల్లో 9.50 లక్షల మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు హరితహారంలో పాల్గొనాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు... నగరంలోని ఏరో స్పేస్ వ్యాలెట్ కంపెనీ సిబ్బంది ఆదివారం దాదాపు 2వేల మొక్కలు నాటారు. కంపెనీ ఎండీ నితిన్ పీటర్, మయాంత్, అనూష, గ్రాస్ వరల్డ్ ఎండీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
హరితం.. వేగిరం
హరితహారం లక్ష్యసాధనపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వర్షాలు కురుస్తుండటంతో ఇదే అదునుగా భావించిన అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో నాలుగో విడత హరితహారంలో 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇదివరకే ప్రభుత్వ శాఖల వారీగా టార్గెట్ నిర్దేశించిన కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు.. ప్రతి రోజూ ఒకటి లేదా రెండు మండలాల చొప్పున పర్యటిస్తూ మొక్కలు పంపిణీ చేస్తున్నారు. సాక్షి, మెదక్: ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పల్లెల్లో మొక్కల పంపణీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 433 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 321 నర్సరీలు ఉండగా.. అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నవి 112 ఉన్నాయి. ఇప్పటికే అన్ని నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ నర్సరీల్లో పెంచిన మొక్కలు 3 కోట్లకు పైనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రెట్టింపునకు పైగా లక్ష్యంతో.. 2018లో చేపట్టిన మూడో విడత హరితహారంలో జిల్లా వ్యాప్తంగా 1.31 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పుడు 1.15 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. ఇందులో ఎన్ని బతికాయో.. ఎన్ని పోయాయో తెలియదు గానీ ప్రస్తుతం రెట్టింపు సంఖ్యకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకనుగుణంగా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. అయితే.. ఎప్పటికీ జూలై 31లోపు హరితహారం కార్యక్రమం ముగిసేది. ప్రస్తుతం వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఇప్పటివరకు 24,32,388 మొక్కలు జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలకు హరితహారం లక్ష్యాన్ని కలెక్టర్ నిర్దేశించారు. ఇప్పటివరకు కేవలం ఐదు ప్రభుత్వ శాఖలు మొక్కలు నాటడం మొదలుపెట్టాయి. జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటాలనేది టార్గెట్ కాగా.. వ్యవసాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ, గనులు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వరకు 24,32,388 మొక్కలు మాత్రమే నాటారు. కలెక్టర్ ప్రత్యేక నజర్ జిల్లాలో అటవీ శాతం పెంపు, ఇంకుడుగుంత నిర్మాణంతోపాటు పాస్టిక్ వ్యర్థాల నిర్మూలపై కలెక్టర్ ధర్మారెడ్డి ప్రత్యేక నజర్ వేశారు. ఈ మూడు కార్యక్రమాలను స్వయంగా ఆయనే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే తగని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా వాటిని సంరంక్షించే విధానంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. మొక్కలు ఎక్కడెక్కడ ఏ శాఖల ఆధ్వర్యంలో నాటారో.. వాటి బాధ్యతను సైతం ఆయా శాఖల అధికారులకే అప్పగించారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సమీక్ష సమావేశాల్లో హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. త్వరలో శాఖల వారీగా కార్యక్రమం నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని వేగిరం చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రభుత్వ శాఖల వారీగా త్వరలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు, ఇతర సంస్థల సహకారంతో రోడ్ల వెంట, మైదానాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కొత్త చట్టంతో సక్సెస్ అయ్యేనా.. ప్రభుత్వం ఇటీవల నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టంలో ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాలని.. గ్రామస్తుల అవసరాలకు అనుగుణంగా పండ్లు, పూల మొక్కలు నాటాలని.. ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలు పంపణీ చేసి వాటిని సంరంక్షిచాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ బాధ్యతల్లో విఫలమైన పక్షంలో సర్పంచ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శిపై వేటు పడు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కొత్తచట్టంతో గ్రామాల్లో హరితహారం సక్సెస్ అవుతుందని పలువురు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలి. నూతన పంచాయతీరాజ్ చట్టం పకడ్బందీ అమలుతోపాటు గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు కీలకపాత్ర పోషిస్తే ఊరువాడా హరితమయమై పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతాయనే భావన ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతోంది. లక్ష్యంతో పాటు రక్షణ ముఖ్యం మెదక్‌జోన్: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతిగ్రామానికి మొక్కలు నాటేందుకు ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని లక్ష్యాన్ని చేరుకునేందుకు మొక్కలే నాటడం ముఖ్యం కాదని నాటిన ప్రతిమొక్కను రక్షించుకోవడమే ప్రదానమని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్లో హరితహారం కార్యక్రమం విజయవంతంకోసం జిల్లాలోని ఉపాధిహామీ పథకం సిబ్బంది. ఐకేపీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా నిర్వహించిన హారితహారం కార్యక్రమంలో ఆయా గ్రామాలకు ఇచ్చిన లక్ష్యాలను చేరుకునేందుకు గానూ ఇష్టానుసారంగా మొక్కలను నాటడమే జరిగిందని వాటి సంరక్షణ మాత్రం పట్టించుకోలేక పోయారని పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ సరిగా జరగక పోవటానికి ఇదే ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం తమకు నిర్దేశించిన మొక్కలను నాటామని కాకుండా నాటిన ప్రతి మొక్క రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఉపాధి సిబ్బంది, ఐకేపీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ సీతారామరావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలను గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బంది సమష్టి కృషితో విజయవంతం చేశారని అదే స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలపాలన్నారు. నిజాంపేట మండలంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి రైతులకు వివరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను తీసుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. అనంతరం డీపీవో హనూక్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలకు విరివిగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో పద్మజారాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏడీ హార్టికల్చర్ నర్సయ్య, ఏపీడీలు ఉమాదేవి, భూమయ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. మెదక్ రూరల్: హరితహారం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. మెక్కలు నాటే విధానం గురించి హైదరాబాద్ అకాడమిలో శిక్షణ పొందిన అధికారులతో గురువారం మెదక్ కలెక్టరేట్లో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు ప్రతి గ్రామంలో గామసభలను నిర్వహించి హరితహారం ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని సూచించారు. ప్రతి ఇంటికి పంపిణీ చేసే మొక్కల వివరాలను ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేసేలా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు, డీపీఓ హనూక్, డీఎఫ్ఓ పద్మజారాణి, జిల్లా అధికారులు పరుశురాంనాయక్, దేవయ్య, నర్సయ్య, సుధాకర్, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఏసయ్య, రసూల్‌బి తదితరులు ఉన్నారు. -
మొక్కల్ని బతికించండి
సాక్షి,హైదరాబాద్: హరితహారంలో భాగంగా తెలంగాణలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి సూచించారు. నగరానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీశాఖ అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తోందన్నారు. నగరంలోని గుర్రంగూడ వద్ద ఆరోగ్య సంజీవని వనం పేరిట ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలసి సీఎస్ ఎస్కే జోషి దంపతులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్బన్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ పార్కులో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఐదో విడత హరితహారంపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ అభివృద్ధి్ద కార్పొరేషన్ ఎం.డి. రఘువీర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. హరీశ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇంటికే మొక్క
సాక్షి, సిటీబ్యూరో: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రజలకు అందజేసే మొక్కల్ని నేరుగా వారి ఇళ్లకే చేర్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రతి ఏటా ప్రజలు ఇళ్లలో నాటుకునేందుకు 50 లక్షల నుంచి 90 లక్షల మొక్కల వరకు పంపిణీ అవుతున్నట్లు లెక్కలు చూపుతున్నప్పటికీ, వాటిని ఎవరికి పంచుతున్నారో, ప్రజలు వాటిని నాటుతున్నారో లేదో తెలియడం లేదు. హరితహారంలో భాగంగా ఇప్పటికే కోట్ల మొక్కలు నాటడంతో నగరంలో కొత్తగా నాటేందుకు స్థలాలు కూడా దొరకడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం గ్రేటర్ పరిధిలో మూడు కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసే మొక్కలను పకడ్బందీగా పంపిణీ చేయడంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. సంవత్సరంలో మూడు కోట్ల మొక్కలు నాటాల్సి ఉన్నా.. తొలిదశలో భాగంగా కోటి మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో 5 లక్షలు జీహెచ్ఎంసీ నాటనుండగా, మరో 5 లక్షలు జంక్షన్లలో నాటేందుకు ప్రతిపాదించారు. విద్యాసంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతరత్రా సంస్థలకు తగిన స్థలాలుండి మొక్కలు నాటేందుకు ముందుకొచ్చే వారికి ఇచ్చేందుకు 5 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు. ఇలా 15 లక్షలు పోను మిగతా 85 లక్షల మొక్కలు తమ ఇళ్లలో నాటుకునేందుకు ప్రజలకే అందజేయనున్నారు. ఈ పంపిణీ సక్రమంగా జరిగేందుకు.. పకడ్బందీ చర్యల కోసం జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మొక్కల కోసం ప్రజలకు ఎక్కడకూ వెళ్లకుండా వారి ఇళ్లకే వీటిని చేర్చాలనే యోచనలో జీహెచ్ఎంసీ ఉంది. అందుకుగాను ఇంటింటికి వెళ్లే స్వచ్ఛ ఆటోల ద్వారా ఈ మొక్కలను పంపిణీ చేసే యోచన ఉంది. ఉదయం పూట స్వచ్ఛ ఆటోలు ఇళ్లనుంచి చెత్తను తరలించాక, మధ్యాహ్నం ఖాళాగానే ఉండటంతో వాటి ద్వారానే ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఇతరత్రా మార్గాలను కూడా ఆలోచిస్తున్నామని జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ తెలిపారు. ఒక్కో ఇంటికి తొలిదశలో 5–10 మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో ప్రతి ఇంటికీ హరితహారం మొక్కలు అందేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తగినంత వర్షం పడ్డాక వీటి పంపిణీ ప్రారంభించనున్నారు. చెత్త తరలించే కార్మికులకు అన్ని ఇళ్లూ తెలుసు కనుక వారిద్వారా అయితే ప్రతి ఇంటికీ పంపిణీ కాగలవని భావిస్తున్నారు. పకడ్బందీగా పంపిణీకి అధికారులందరితోచర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొక్కలు పంపిణీ సందర్భంగా ఇంటి నెంబర్‌తో పాటు వారి సంతకం, ఫోన్ నెంబర్ వంటివి సేకరించడం ద్వారా పంపిణీలో అవకతవకలకు తావుండదని భావిస్తున్నారు. ఒక వేళ ఎవరికైనా మొక్కలు అందని పక్షంలో సమీపంలోని నర్సరీల ద్వారా కూడా పంపిణీ చేయనున్నారు. నర్సరీల్లో కోటి మొక్కలు.. హరితహారం కార్యక్రమంలో మొక్కల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీకి చెందిన నర్సరీల్లోనే కోటి మొక్కలు పెంచుతున్నారు. జూలైలో పంపిణీ చేసేందుకు 50 లక్షలు సిద్ధంగా ఉన్నాయని అడిషనల్ కమిషనర్ తెలిపారు. ఆగస్టులో 30 లక్షలు, సెప్టెంబర్‌లో 20 లక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రేటర్ నగరంలోని బహిరంగ, ఖాళీ ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ ఐదు లక్షల మొక్కలు నాటనుంది. గతంలో మొక్కలు నాటిన మార్గాల్లోని గ్యాప్లతోపాటు ఇతరత్రా ఖాలీ ప్రదేశాల్లో, పార్కుల్లో నీడనిచ్చే పెద్దచెట్లుగా పెరిగే మొక్కలు నాటనున్నారు. నగరంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుల్లో 616 పార్కులకు ప్రహరీలతోపాటు లోపల ఎంతో ఖాలీ స్థలమున్నప్పటికీ ఎలాంటి నిర్వహణకు నోచుకోకుండా అధ్వాన్నంగా ఉన్నట్లు ఇటీవలి సర్వేలో గుర్తించారు. ఈ 616 పార్కుల్లోనూ వాక్‌వే పోను మిగతా ప్రదేశంలో నీడనిచ్చే మొక్కలు ఎక్కువగా నాటనున్నారు. వాటితోపాటు అందమైన పూల మొక్కలు కూడా నాటనున్నారు. తద్వారా పార్కులు పచ్చగా, సుందరంగా, ఆహ్లాదంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇంకా మేజర్ రోడ్ల వెంబడి, ప్రజలు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో నీడనిచ్చే పెద్దచెట్లుగా ఎదిగే మొక్కల్ని నాటనున్నారు. తద్వారా కాలుష్యం కొంతమేర తగ్గి పర్యావరణపరంగానూ శ్రేయస్కరమని అధికారులు పేర్కొన్నారు. ఇలా ఒక్కో జోన్‌కు సగటున 80వేల మొక్కల్ని పంపిణీ చేయనున్నారు. పార్కుల్లో, రహదారుల వెంబడి.. పార్కులు, రహదారుల వెంబడి, ఆయా సంస్థలు, ఇతర ఖాలీస్థలాల్లో నాటే వాటిల్లో కదంబ, వేప, కాంచనం, రావి, మర్రి, రేల, కానుగ, పట్టెడ,నేరెడు, చింత, ఉసిరి, నెమలినార, చందనం, మహాగని, పొగడ, బ్యాడ్మింటన్బాల్ట్రీ, ఫౌంటెన్ ట్రీ, పింక్షవర్, జావా కేసియా, బట్టర్కప్ట్రీ, సిస్సు, బాదం, అడవిబాదం, పింక్ టబేబుయా, పింక్ ట్రంపెట్, మేడి, కసోడ్, జువ్వి, సిల్వర్‌ఓక్, ఎర్ర చందనం, టేకు, తెల్లమద్ది జాతులకు వంటివి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇళ్లల్లో నాటేందుకు.. ఇళ్లల్లో నాటుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపే పండ్లు, పూల జాతులతోపాటు ఔషధ, సుగంధ మొక్కలకు ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. వాటిల్లో సీతాఫలం, జామ, నిమ్మ, నేరేడు, మునగ, బొప్పాయి, కనకాంబరం, నందివర్ధనం, గులాబీ, సబ్జాతులసి, లెమన్‌గ్రాస్, కలబంద, పుదీన, మనీప్లాంట్స్ తులసి, హెన్నా, అడ్డసరం, మాచపత్రి, సరస్వతి, వేము, బోగన్ విల్లా, క్రసాండ్ర, హైబిస్కస్, మల్లె, నీరియం, ప్లుంబాగో,నైట్‌క్వీన్, పారిజాతం తదితర రకాలుంటాయని తెలిపారు. రహదారుల కూడళ్లలో అందంగా కనబడే సీజనల్ పూలమొక్కలు నాటుతామని పేర్కొన్నారు. -
అయిదో విడతకు అంతా సిద్ధం!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్): అయిదవ విడత హరితహారం కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) సిద్ధమైంది. గతేడాది కన్నా ఈసారి మూడింతల భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఈ శాఖ వేగంగా మొక్కలు నాటేందుకు పనులను ప్రారంభించింది. ఇందుకు ఆయా మండలాలు, గ్రామాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ఇతర ప్రాంతాల్లో ఉపాధిహామీ కూలీలతో గుంతలను తవ్విస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల వరకు గుంతల తవ్వకాలను పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో నేల మెత్తబడింది. వర్షాలు తగ్గుముఖం పట్టకముందే గుంతలను మరింత వేగంగా తవ్వించి ఎప్పటికప్పుడు మొక్కలు నాటించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది డీఆర్డీఏ 60 లక్షల మొక్కలను మాత్రమే నాటింది. ఇందులో 40 లక్షల టేకు మొక్కలున్నాయి. అయితే ప్రస్తుతం అయిదవ విడతలో భారీగా మొక్కలు నాటేందుకు ప్రతి గ్రామ పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేసింది. మట్టిని నింపి అందులో విత్తనాలు పెట్టేందుకు కిలోకు రూ.159 చొప్పున టెండరు ద్వారా కొనుగోలు చేసి మొత్తం 2కోట్ల 78లక్షల 40వేల మొక్కలను పెంచింది. ప్రస్తుతం మొక్కలను నర్సరీల నుంచి నాటే స్థలాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయితే మొక్కలను ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జూలై రెండవ వారంలో ప్రారంభించేది. కాగా ఈసారి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇంత వరకు అందలేదు. ఏ రోజైనా ఆదేశాలు రావచ్చనే ముందస్తు ఆలోచనతో మొక్కలను సిద్ధం చేసి ఉంచారు. వర్షాలు కురుస్తున్నాయని, ఇదే అదనుగా కొన్ని చోట్ల అనధికారికంగా నాటడం కూడా మొదలెట్టేశారు. నర్సరీలు 400 మొత్తం మొక్కలు 28740000 మొక్కల రకాలు 50 టేకు మొక్కలు 50 లక్షలు ఇప్పటి వరకు తవ్విన గుంతలు 2 లక్షలు 50 లక్షల టేకు మొక్కలు రైతులకే... గత ఏడాది 40 లక్షల టేకు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేశారు. అయితే ఈ ఏడాది 50 లక్షల టేకు మొక్కలను ఇవ్వనున్నారు. అన్ని మొక్కలకన్నా ఎక్కువ ధర టేకుకే ఉంటుంది. విత్తనాలు కొనుగోలు చేసి పెంచినా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తమిళనాడు నుంచి టెండరు ద్వారా స్టంపులను తెప్పిస్తారు. ఈ ఏడాది కూడా ఒక్కో స్టంపును 82 పైసలకు కొనుగోలు చేసి తెప్పించి నర్సరీల్లో పెంచారు. వీటిని వ్యవసాయ రైతులకే ఇవ్వనున్నారు. పొలం గట్లపై పెంచడానికి 50 వరకు మొక్కలు ఇవ్వనున్నారు. కాగా రైతుకు ప్రత్యేక స్థలం ఉండి మొక్కలను పెంచడానికి ఉత్సాహం చూపితే 500 వరకు ఇచ్చే అవకాశం ఉంది. 50 లక్షల లక్ష్యానికి గాను జిల్లాల్లో 48 లక్షల స్టంపులు రావడంతో వాటినే పెంచారు. మొత్తం యాబై రకాల మొక్కలు... భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న డీఆర్డీఏ .. 400 నర్సరీల్లో మొత్తం యాబై రకాల మొక్కలను పెంచింది. అందులో 50 లక్షల వరకు టేకు మొక్కలే ఉన్నాయి. మిగతా మొక్కలు మందారా, రోజా, బాహునియా, తబుబియా, సీతాఫలం, కరివేపాకు, టేకొమా, జామా, దానిమ్మ, గన్నేరు, మునగ, రెడ్ సాండర్స్, బాంబో, గుల్మోహర్, కానుగ, వేప, అల్బిజియా, బురుగు, చింత, చిన్నబాదం, బాదం, రెయిన్ ట్రీ, ఈత,మొర్రి, మారెడు, సీమ తంగెడు, జీడీ, జమ్మి, అల్ల నేరెడు, ఉసిరి, ఇతర రకం మొక్కలున్నాయి. ఈత, దానిమ్మ, ఉసిరి, మునగ లాంటి రకం మొక్కలు 9 లక్షల చొప్పున పెంచారు. ఎక్కడెక్కడ నాటుతారంటే... మొక్కలను ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, ప్రయివేటు సంస్థలు, పరిశ్రమలు, చెరువు కట్టలు, రోడ్ల వెంబడి, కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు, తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. ఏ కేటగిరిలో ఎన్ని మొక్కలు నాటాలో ప్రణాళికను సైతం డీఆర్డీఏ అధికారులు రూపొందించుకున్నారు. ఈ చెట్లను గౌడ కులస్తులు వారి సొసైటీ స్థలాల్లో నాటేందుకు ముందుకు వస్తే మొక్కలను అందజేయనున్నారు. మొక్కలు తరలిస్తున్నాం హరితహారంలో మొక్కలు నాటేందుకు అన్ని నర్సరీల్లో మొక్కలు పెంచాం. ప్రస్తుతం మొక్కలను ఆయా ప్రాంతాలకు తరలించి నాటేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధిహామీ కూలీలతో గుంతలను వేగంగా తవ్విస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వేగంగా మొక్కలు నాటిస్తాం. –రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ,నిజామాబాద్ -
అభివృద్ధిలో అగ్రస్థానం: ఎర్రబెల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ప్రతీ అంశంలోనూ అభివృద్ధి సాధిస్తోందని... ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలు ఇందులో అగ్రస్థానంలో నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి వేగంగా అభివృద్ధిని సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరు జిల్లాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జిల్లా అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మిషన్ భగీరథ, హరితహారం, పంచాయతీరాజ్ చట్టం అమలు, ఓడీఎఫ్ పురోగతి, దేవాదుల భూసేకరణ, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, విద్య, వైద్యం, డబుల్ బెడ్రూం గృహాలు, వ్యవసాయం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మిషన్.. బృహత్తర పథకం ‘మిషన్ భగీరథ’ బృహత్తర పథకం. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి భగీరథ కార్యక్రమం లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ ఒక్క మహిళ నెత్తిన బిందె పెట్టుకుని నీళ్ల కోసం ఎక్కడికో వెళ్లాలిసిన పరిస్థితి ఎదురుకాకూడదు. అధికారులు మంచిగ పని చేస్తున్నారు. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 15 వరకు పనులు పూర్తి చేసి ప్రతీ ఇంటికీ వంద శాతం నీరు సరఫరా చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ఆలయాలు, మసీదులు, చర్చిలకు ఉచితంగా నీరు సరఫరా చేసేలా పనులు పూర్తి చేయాలి. పనులు వంద శాతం పూర్తయినట్లుగా గ్రామపంచాయతీ గ్రామసభలో ఆమోదించి సర్పంచ్‌తో సంతకం చేయించాలి. ఈ పనులపై ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రోడ్లపై ఉన్న నల్లాల పైపులను ఇంటిలోపలి వరకు బిగించాలి. తాగునీరు వృథా చేస్తే గ్రామపంచాయతీలు జరిమానా విధించాలి. మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలి. మేడారం జాతర అవసరాలకు తగ్టట్లు నీరు సరఫరా చేసే పనులు జరిగేలా చూడాలి’ అని మంత్రి దయాకర్‌రావు సూచించారు. హరితహారం.. యజ్ఞం హరితహారంలో ఆరు జిల్లాలు అగ్రస్థానంలో ఉండాలని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ‘మొక్కల పెంపకం ఒక యజ్ఞంలా సాగాలి. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాలి. హరితహారంలో ప్రభుత్వ లక్ష్యాలను కచ్చితంగా పూర్తి చేయాలి. అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాల్సి ఉండగా పోలీసు శాఖ కీలకంగా వ్యవహరించాలి. మొక్కలను నాటడంతోనే ఆగిపోకుండా సంరక్షణ ముఖ్యం. మండంలో పని చేసే అధికారుల ఒక్కో గ్రామానికి బాధ్యులుగా ఉండాలి. ఎవరెవరు ఎన్ని మొక్కలు నాటారో గ్రామపంచాయతీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. అలా అయితే అవి ఎండిపోకుండా జాగ్రత్త పడతారు. చెట్లను నరికితే కఠినంగా వ్యవహరించాలి. వాల్టా చట్టం అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. హరితహారంలో ముందున్న గ్రామపంచాయతీలకు అభివద్ధి పనుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తాం’ అని మంత్రి అన్నారు. గ్రామాలు.. స్వచ్ఛత గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ అధికారి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ‘ఉమ్మడి వరంగల్ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి అభిప్రాయం ఉంది. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేయాలి. జిల్లాల పునర్విభజన తర్వాత గ్రామాలను బాగు చేసే సువర్ణ అవకాశం కలెక్టర్లకు దక్కింది. కలెక్టర్లు అన్ని శాఖలను సమన్వయం చేయాలి. అవసరమైన మేరకు చట్టాలను కఠినంగానే అమలు చేయాలి. అధికారులు చేసే మంచి పనులకు ప్రజా ప్రతినిధుల సహకారం ఎప్పటికీ ఉంటది. పని చేయని వారిపైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ఎవరూ మీకు అడ్డు చెప్పరు’ అని స్పష్టం చేశారు. సాగునీరు.. రైతులకు భరోసా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు వ్యవసాయంపై భరోసా కలుగుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. దేవాదుల భూసేకరణ ప్రక్రియలో జాప్యంపై అధికారులపై అసంతప్తి వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ముఖ్యంగా ఆర్డీఓ తీరు సరిగా లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆరు జిల్లాల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని అన్నారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. దీని తొలి ఫలితం మన వరంగల్ జిల్లాకే అందుతోంది. కాళేశ్వరంతో వచ్చే నీరు ఎస్సారెస్పీ ద్వారా సాగు అవసరాలకు అందుతుంది. కాళేశ్వరం నీటితో ప్రతీ చెరువు నింపేలా ప్రణాళిక రూపొందించారు. అవసరమైన ప్రతీచోట చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం రూ.650 కోట్లు మంజూరు చేసింది. క్షేత్ర స్థాయిలో పనులు వేగంగా జరగాలి’ మంత్రి సూచించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే... ► పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే చాలా వరకు పూర్తయినా.. మిగిలిన పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్లిష్టంగా ఉన్న చోట తహసీల్దార్లు, ఆర్డీఓలు స్వయంగా వెళ్లి త్వరగా ముగించాలి. గ్రామసభలు నిర్వహించి మిగిలిపోయిన పాసుపుస్తకాలను పంపిణీ చేయాలి. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. హెచ్ఎంలు, ఉపాధ్యాయుల తీసుకుంటున్న శ్రద్ధతో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కొందరు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక యువత, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూత పడే స్థితికి వచ్చే పాఠశాలల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి చైతన్యం తీసుకురావాలి. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి. ► వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజన్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపర్చాలి. ఎంజీఎం అభివృద్ధి విషయంలో రెండు దశాబ్దాల క్రితం స మస్యలు ఉన్నా దాతల విరాళాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశాం. ► డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. వారంలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, పనుల శంకుస్థాపనలు జరగాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో పురోగతి కనిపించాలి. లబ్ధిదారుల ఎంపిక పారద్శకంగా చేపట్టడంతో పాటు అర్హులకే ఇళ్ల కేటాయింపు జరగాలి.లని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే చాలా వరకు పూర్తయినా.. మిగిలిన పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్లిష్టంగా ఉన్న చోట తహసీల్దార్లు, ఆర్డీఓలు స్వయంగా వెళ్లి త్వరగా ముగించాలి. గ్రామసభలు నిర్వహించి మిగిలిపోయిన పాసుపుస్తకాలను పంపిణీ చేయాలి. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. హెచ్ఎంలు, ఉపాధ్యాయుల తీసుకుంటున్న శ్రద్ధతో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కొందరు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక యువత, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూత పడే స్థితికి వచ్చే పాఠశాలల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి చైతన్యం తీసుకురావాలి. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి. ► వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజన్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపర్చాలి. ఎంజీఎం అభివృద్ధి విషయంలో రెండు దశాబ్దాల క్రితం స మస్యలు ఉన్నా దాతల విరాళాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశాం. ► డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. వారంలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, పనుల శంకుస్థాపనలు జరగాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో పురోగతి కనిపించాలి. లబ్ధిదారుల ఎంపిక పారద్శకంగా చేపట్టడంతో పాటు అర్హులకే ఇళ్ల కేటాయింపు జరగాలి.లని అన్నారు. మంత్రి – ఎమ్మెల్యేల జల సంవాదం బీంఘనపూర్, చలివాగు ప్రాజెక్టుల నుంచి నిర్ధేశిత నీటి మట్టం కంటే ఎక్కువ నీటిని మాత్రమే ఇతర ప్రాంతాలకు ఎత్తిపోయాలని పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, నీరు ఎత్తిపోయకుంటే మిట్ట ప్రాంతాలకు సాగు, నీరు ఎలా అందుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ‘మీరు పాలకుర్తి, జనగామకు నీరు తీసుకుపోతే మా ప్రాంతాల్లో ప్రాజెక్టు ఉన్నా నీరు అందకపోతే రైతులు, ప్రజలు మమ్ముల్ని నిలదీస్తారు’ అని ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. దీనికి ప్రతిగా ‘గతంలో నీటి కోసం మీరు చేసిందంతా నాకు తెలుసు’ అని మంత్రి అనడంతో ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతం కోసం వారు డిమాండ్ చేయడం సహజమేనని పేర్కొన్నారు. దీనిపై మంత్రి దయాకర్‌రావు స్పందిస్తూ ప్రాజెక్టుల్లో నీటి మట్టాల పర్యవేక్షణ, ఆయకట్టుకు విడుదల తదితర అంశాలను ఆ యా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఎస్‌ఈలే పర్యవేక్షించాలని ఆదేశించారు. మంత్రిగా తాను కానీ ఎమ్మెలేలు కానీ నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. హాజరైంది వీరే... సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సత్యవతిరాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు శంకర్‌నాయక్, వొడితల సతీష్‌కుమార్, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి కమిషన్ నీతూకుమారి, మిషన్ భగీరథ అధికారి జి.కృపాకర్‌రెడ్డితో పాటు జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎం.హరిత, వినయ్కష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లు, శివలింగయ్య, నారాయణరెడ్డి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రవీందర్, ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్‌కు మెడికల్ కాలేజీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం కోసం కలెక్టర్ నాలుగు ఎకరాల స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ సమావేశంలో వెల్లడించారు. దీంతో జోక్యం చేసుకున్న మంత్రి దయాకర్‌రావు ‘కలెక్టర్ గారూ.. మానుకోటలో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం.. సీఎం కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించారు.. ఆ ఏర్పాట్లు కూడా చూడండి ’ అంటూ కలెక్టర్ శివలింగయ్యకు సూచించారు. -
మొక్కల పండుగకు సన్నద్ధం
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం పథకం ఐదో విడతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మొక్కల పెంపకం చేపడుతున్న అధికారులు లక్ష్యాన్ని చేరుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 1.23 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా మొత్తం 215 నర్సరీల్లో వీటి పెంపకం చేపడుతున్నారు. అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపాధిహామీ, అటవీ శాఖ ద్వారా నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో హరితహారంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కోడ్ ముగియగానే తేదీని ఖరారు చేసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. 1.23 కోట్ల మొక్కలు లక్ష్యం.. గతేడాది కంటే ఈసారి హరితహారం మొక్కల లక్ష్యాన్ని పెంచారు. ఈసారి ఉపాధిహామీ పథకం ద్వారా 83 లక్షలు, అటవీశాఖ ద్వారా 40 లక్షల మొక్కలను నాటాలని నిర్దేశించారు. ఈ మేరకు ఇప్పటికే ఈజీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 215 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో సుమారు 20 వేల నుంచి లక్ష వరకు మొక్కలను సిద్ధం చేశారు. మరో 20 రోజుల్లో మొక్కలు అందుబాటులోకి రానున్నాయి. ఇక అటవీశాఖ సైతం హరితహారానికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేసింది. అటవీజాతి మొక్కలతో పాటు పండ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీశాఖ ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని అటవీజాతి మొక్కలను అధిక మొత్తంలో సిద్ధం చేస్తోంది. రహదారుల వెంట ఎక్కువగా నాటేలా ప్రణాళికలు చేశారు. రెండో వారంలో కమిటీలు.. హరితహారం ఐదో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. అయితే జూన్ మొదటి లేదా రెండో వారంలో కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కమిటీలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. దాంతో పాటు గ్రామాల్లోనూ పంచాయతీలవారీగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసి అన్ని శాఖలు సమన్వయంతో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు చేపట్టనున్నారు. సింగరేణి యాజమాన్యం సైతం ప్రతిఏట తనవంతు బాధ్యతగా హరితహారంలో పాలుపంచుకుంటూ విరివిగా మొక్కలు నాటుతోంది. గత సంవత్సరం సుమారు 6లక్షల మొక్కలు నాటగా ఈసారి ఆ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. సంరక్షిస్తేనే మనుగడ.. మొక్కలను నాటడంలో చూపుతున్న శ్రద్ధ వాటిని సంరక్షించడంలో లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షల్లో మొక్కలు నాటుతున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ఆనవాళ్లు కూడా లేకుండా పోతున్నాయి. మొక్కల సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో నాటిన కొద్ది రోజులకే మొక్కలు చనిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కేవలం మొక్కలను నాటడంతో తమ పనై పోయిందని అధికారులతో పాటు ప్రజలు భావిస్తుండటంతో పథకం లక్ష్యాన్ని చేరడం లేదన్నది నిజం. నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే పచ్చదనం వెల్లివిరుస్తుంది. ప్రతిఒక్కరూ మొక్కల సంరక్షణను తమ వంతు బాధ్యతగా చేపట్టాల్సిన అవసరముంది. అధికారులు సైతం మొక్కల సంరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. -
హరితహారానికి మొక్కలు సిద్ధం
సాక్షి, వేములపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధికారులు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని ఏడు గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటుచేసి వన సేవకులు మొక్కలను పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పం చాయతీలో 40వేల నుంచి లక్ష మొక్కలు నాట డమే లక్ష్యంగా అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లోఅటవీశాఖ ఆధ్వర్యంలో లక్షలాది మొక్కల పెంపకం శరవేగంగా జరుగుతుంది. ఉపాధిహామీ పథకంలో భాగంగా మరికొన్ని నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. మండలంలోని మంగాపురం గ్రామంలో 30వేల మొక్కలు, సల్కునూరులో 40వేలు, ఆమనగల్లు, శెట్టిపాలెం, రావులపెంట, వేములపల్లి, బుగ్గబావిగూడెం, లక్ష్మీదేవిగూడెం గ్రామాల్లో 50వేల చొప్పున, కామేపల్లి, అన్నపరెడ్డిగూడెం, తిమ్మారెడ్డిగూడెం గ్రామాల్లో 20వేల చొప్పున మొక్కలను నాటేందుకు అధికారులు నిర్ణయించారు. నాటిన ప్రతి మొక్క బతికేవిధంగా చర్యలు నర్సరీల్లో పెంచిన మొక్కలను మండలంలోని ఆయా గ్రామాల్లో నాటిన తరువాత నాటిన ప్రతి మొక్క బతికి పెరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే జామ, ఉసిరి, నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, వెలిగ, బొప్పాయి, మునగ, గోరింట, కరివేపాకు, మారేడు, పీటోపాల్, డెకోమా, టేకు లాంటి వివిధ రకాల మొక్కలను అందించనున్నా రు. ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో సంచులలో మట్టిని నింపేందుకు, మొక్కలకు నీటిని చల్లేం దుకు, మొక్కల మధ్య కలుపు తీసే పనులకు అధి కారులు ఉపాది కూలీలను వినియోగిస్తూ పలు కుటుంబాలకు జీవనాధారాన్ని కల్పిస్తున్నారు. జూన్ నాటికి మొక్కలు సిద్ధం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని వర్షాకాలంలో ప్రారంభించనున్నందున జూన్ నాటికి ఆయా గ్రామాల్లో మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలం లోని ఆరు నర్సరీల్లో సంచులలో మట్టిని నింపి విత్తనాలు వేశాం. అధికారులు ఎప్పటికప్పుడు నర్సరీలను పరిశీలించి వన సేవకులకు తగు సూచనలు చేస్తూ వర్షాకాలం ఆరంభంనాటికి మొక్కలు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనయ్య, ఏపీఓ -
కలప అమ్మకాలపై సెస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అటవీ సంపద తరుగుతున్నా సర్కారు ఖజానాకు పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఇకపై కలప క్రయవిక్రయాలపై ప్రత్యేక పన్ను విధించాలని యోచిస్తోంది. విలువైన అటవీ సంపద కారణంగా టింబర్ డిపోలు, సామిల్లుల్లో కోట్ల రూపాయల్లో టర్నోవర్ జరుగుతోంది. అయినా.. దీని వల్ల రాష్ట్ర సర్కారు ఖజానాకు పెద్దగా ఒరిగిందేమీ ఉండటం లేదు. మరోవైపు, విలువైన టేకు వనాలు క్రమంగా మైదానాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ విస్తీర్ణాన్ని 35%కు పెంచాలనే లక్ష్యంతో.. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇకపై.. కలప విక్రయాలపై విధించనున్న పన్ను మొత్తాన్ని.. హరితహారం కార్యక్రమానికి వినియోగించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని అటవీశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అటవీ చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని యోచిస్తోంది. ‘జంగిల్ బచావో.. జంగిల్ బడావో’అనే నినాదంతో అటవీరక్షణపై పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. కలప అక్రమ రవాణాను చూసీచూడనట్లు వ్యవహరించిన అటవీశాఖ ఉన్నతాధికారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా అటవీ నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఈ మార్పుల్లో భాగంగా ఫారెస్టు పన్నును కూడా విధించేలా నిబంధనలను మార్చాలని భావిస్తోంది. మార్కెట్ ఫీజు మాదిరిగా ఆయా వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతం జీఎస్టీతో పాటు, 1% మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లోనే కాకుండా, ఆ మార్కెట్ కమిటీ పరిధిలో ఎక్కడ క్రయవిక్రయాలు జరిగినా 1% మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే టేకు కలపపై ప్రస్తుతం 18% జీఎస్టీ అమల్లో ఉంది. ఇందులో 9% ఎస్జీఎస్టీ, 9%సీజీఎస్టీ. ఈ పన్నులో 50% రాష్ట్ర వాటా ఉన్నప్పటికీ, అదనంగా కొంత పన్ను విధించడం ద్వారా హరితహారం వంటి అటవీ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు మరింత ప్రోత్సాహం ఉంటుందని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం టింబర్ డిపోలు, సామిల్లులపై సరైన నిఘా కొరవడటంతో.. కలపపై ఆదాయం ప్రభుత్వానికి వచ్చే నామమాత్రంగానే ఉంటోంది. వాణిజ్యపన్నుల శాఖ పరిధిలో ఉండే ఈ సామిల్లులు, టింబర్ డిపోలు ఎంత చెల్లిస్తే అంతే అన్న ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో రూ.కోట్ల విలువైన అటవీసంపద తరిగిపోతున్నా.. సర్కారు ఖజానాకు పెద్దగా ఒరిగిందేమీ లేకుండా పోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 105 టింబర్ డిపోలు, సామిల్లులు ఉన్నాయి. వీటిలో స్మగ్లింగ్ కలపతోనే ఏటా కోట్ల రూపాయల దందా చేసేవే ఎక్కువ. కొన్ని సామిల్లులకు మహారాష్ట్రలోని యా వత్మాల్, కిన్వట్, పాండ్రకవుడా అటవీశాఖ డి పోల నుంచి మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కూడా కలప దిగుమతి అవుతోంది. మయన్మార్, చైనా తదితర దేశాల నుంచి కూడా రాష్ట్రానికి కలప దిగుమతి చేసుకుంటున్నారు. ఘనా వంటి ఆఫ్రికా దేశాల నుంచి కూడా కలప వస్తోంది. బాంబే షిప్‌యార్డుల నుంచి ఇక్కడికి తరలించి స్థానిక అవసరాలకు కలపను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో రూ. వందల కోట్ల టర్నోవర్ జరుగుతోంది. జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది నామమాత్రమే. మార్కెట్ ఫీజు మాదిరిగా కొంత మొత్తాన్ని ప్రత్యేక పన్నుగా విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
24 నుంచి ‘హైజీన్ కిట్లు’ పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని 5,90,980 మంది బాలికలకు ఈ నెల 24 నుంచి హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనిపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షించారు. అలాగే హరితహారం కార్యక్రమంపైనా సమీక్ష జరిపారు. ఈ నెల 31 వరకు జిల్లా పరిషత్, ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకుల, కేజీబీవీ, పాఠశాల ల్లోని బాలికలందరికీ హైజీన్ కిట్లు అందించాలని నిర్ణయించారు. ఈ కిట్లలో బాలికలకు కావాల్సిన 14 రకాల వస్తువులు ఉండేలా రూపొందించారు. ఏడాదికి సరిపడా వస్తువులను ఒకేసారి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం ఒక్కో విద్యార్థినిపై ఏటా రూ.1,600 ఖర్చు చేస్తున్నామని, మొత్తంగా రూ.100 కోట్ల వరకు వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల బాలికలు 4,18,440 మంది, మోడల్ స్కూళ్ల బాలికలు 55,195 మంది, కేజీబీవీ బాలికలు 80,999 మంది, గురుకులాల విద్యార్థినులు 9,651 మంది, ఎయిడెడ్ పాఠశాలల బాలికలు 26,695 మంది.. మొత్తం 5,90,980 మంది బాలికలకు కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. 25న ‘హరిత పాఠశాల–హరిత తెలంగాణ’ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి ‘హరిత పాఠశాల–హరిత తెలంగాణ’ కార్యక్రమం చేపట్టాలని కడియం అధికారులను ఆదేశించారు. హరితహారం నిర్వహణకు ప్రతి పాఠశాలలో విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్లను నియమించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు గ్రీన్ బ్రిగేడ్ల కోసం దుస్తులు, టోపీలు, రుమాళ్లు సమకూర్చాలన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఉన్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు దాదాపు కోటి పూలు, పండ్ల మొక్కలు ఇవ్వాలని వెల్లడించారు. హరితహారంలో నాటిన మొక్కల్లో బతుకుతున్న మొక్కల శాతం విద్యాసంస్థల్లోనే ఎక్కువగా ఉందన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల గ్రామం లోని రెసిడెన్షియల్ పాఠశాలలో గతంలో నాటిన మొత్తం వెయ్యి మొక్కలనూ పరిరక్షించారని చెప్పారు. సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రిన్సి పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీకే ఝా, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
సాక్షి ఆధ్వర్యంలో హరిత హారం..
హసన్‌పర్తి : ‘సాక్షి’ దిన పత్రిక సౌజన్యంతో చేపట్టిన ‘గ్రీన్ చాలెంజ్’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. వారం రోజుల క్రితం హసన్‌పర్తి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్ సవాల్‌ను ఎల్లాపురం పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మీ, దేవన్నపేట పాఠశాల హెచ్ఎం ప్రేమానందరెడ్డి, మడిపల్లి పాఠశాల హెచ్ఎం రాజిరెడ్డి స్వీకరించారు. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో మొక్కలు నాటి.. ఒక్కొక్కరు మరో ముగ్గురికి గ్రీన్‌చాలెంజ్ సవాల్ విసిరారు. అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో–ఆర్డినేటర్ విజయ్, సంగాల విక్టర్‌బాబు, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, బండి రజనీకుమార్, మణీంధర్‌నాథ్, పాడి రామకృష్ణారెడ్డి, రాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో హరితహారం
రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 70 ఎకరాల్లో అటవీశాఖ అధికారులు 50 వేల మొక్కలు నాటి, హరితవనంగా మార్చారు. ఇందుకుగాను రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. మొక్కల సంరక్షణలో భాగంగా సదరు ప్లాంటేషన్ చుట్టూ కందకాన్ని సైతం తవ్వించారు. రామాయంపేట మండలంలోని కోమటిపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న దాదాపు 70 ఎకరాల అటవీ ప్రాంతంలో గతంలో యూకలిఫ్టస్ చెట్లు ఉండేవి. వీటిని నరికివేయించిన అధికారులు ఆ స్థలంలో హరితహారం కింద మొక్కలు నాటి గ్రీనరీని పెంపొందించేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 50 వేల మొక్కలు నాటారు. ఇందులో ప్రత్యేకంగా 16 రకాల మొక్కలు నాటారు. కేవలం రెండు నెలల కాలంలో యుద్ధ ప్రతిపాదికన మొక్కలు నాటారు. ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది కూలీలు శ్రమించి మొక్కలు నాటి వాటికి సపోర్టుగా కర్రలు పాతారు. ఉన్నతాధికారులు ఈ మొక్కలను పరిశీలించడానికి వీలుగా ప్లాంటేషన్‌లో నలువైపులా రోడ్డు నిర్మించారు. మూడు కిలోమీటర్ల మేర.. అటవీప్రాంతంలో ఉన్న జంతువులు, పశువులు ఈ మొక్కలను ధ్వంసం చేసే అవకాశం ఉండటంతో 70 ఎకరాల మేర ఉన్న ఈ ప్లాంటేషన్ చూట్టు మూడున్నర కిలోమీటర్లమేర కందకం తవ్వారు. దీంతో ఏ జంతువు నాటిన చెట్లలోకి రాకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు కందకంలో నీరు నిలిచి భూమిలో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. వేలాది మొక్కలు నాటిన ఈ ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటోంది. మొక్కలు నాటడం ఇతరత్రా పనులకు గాను రూ. 20 లక్షలు ఖర్చయ్యాయని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాటిన మొక్కల్లో మర్రి, అల్లనేరెడు, సీమరవ్వ, వేప, గుమ్మడి టేకు, సొప్పెర, ఇప్ప, మద్ది, కానుగ, రాగి, నమిలినార, బుడ్డ దంపిరి, మారేడు, పత్రి, చింత, సీమచింత, తదితర మొక్కలున్నాయి. -
గీత దాటితే.. మొక్క నాటాల్సిందే!
వనపర్తి క్రైం : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన ప్రతిఒక్కరి చేత మొక్కలు నాటించి, హరితహారంలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు సోమవారం వనపర్తి జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో హరితహరం కార్యక్రమం చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌లో పాత నేరస్తులు, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిని హరితహారంలో భాగస్వాములు చేస్తూ మొక్కలు నాటడంపై పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. అంతరించిపోతున్న అడవులను పెంచాలనే ఉద్దేశంతో హరితహరం కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడానికి జిల్లా పోలీస్‌శాఖ తనవంతు సామాజిక బాధ్యతగా చెట్లు నాటే కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రారంభించింది. సంస్కరణల పాలసీ.. పోలీస్ విభాగం యొక్క ‘సంస్కరణల పాలసీ‘లో భాగంగా నేర చరిత గల వారిలో సత్ప్రవర్తనతో మార్పు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వారిని పోలీస్స్టేషన్లకు రప్పించి, వారిచేత మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబోతుంది. ఇక మీదట వారు నేరం చేయకుండా ఉండటానికి ఈ కార్యక్రమం సత్ఫలితాన్ని ఇస్తుందని పోలీస్ శాఖ భావిస్తుంది. నేరస్తుల చేత మొక్కలు నాటించడం వల్ల వారిలో ఎంతమార్పు వచ్చిందని పోలీస్‌శాఖ గుర్తిస్తుంది. అయితే ప్రధానంగా నేర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తూ సానుకూలమైన పున:ప్రారంభ కార్యక్రమాలు సమాజానికి సహాయపడుతాయని జిల్లా పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కమ్యూనిటీ ఔట్రీచ్ ప్రోగ్రాం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లు, పోలీస్ నివా స గృహాలు, సీఐ, ఇతర పోలీస్ కార్యాలయాల్లో కలిపి కొన్ని లక్షల మొక్కల పెంపకం చేపట్టాలని జిల్లా పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ‘కమ్యూనిటీ ఔట్రీచ్ ప్రోగ్రాం ద్వారా పౌరులని భాగస్వాములు చేస్తూ విస్తృత సామాజి క సమస్యలు, నేరాలకు దారితీసే మావన అక్రమ రవాణా, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, మద్యపానం వంటి అవగాహన కార్యక్రమాలు హ రితహారంలో ఒక భాగంగా నిర్వహించాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. పలు కేసుల్లో నేరస్తులుగా ఉన్న వారిని, రౌడీషీటర్, అనుమానితులను హరి తహారంలో భాగస్వాములను చేస్తూ జిల్లా వ్యాప్తం గా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని పోలీస్స్టేషన్లలో మొక్కలు వనపర్తి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో విడలవారీగా నేరస్తుల చేత మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. ఎవరైనా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లయితే వారి ఫొటో తీసి 9705320420 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపినట్లయితే వారిని హరితహారంలో భాగస్వాములను చేయాలని భావిస్తుంది. రెండో సారి ఉల్లంఘించినట్లయితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. -
చిరు హరిత సవాలు
-
చిరు చాలెంజ్.. ఎవరికో తెలుసా?
హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ చాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బడా బడా పొలిటీషయన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్, కవిత, సచిన్, రాజమౌళి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు కూడా. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో పాల్గొని మరికొందరికి సవాల్ వేశారు. ఎన్టీవీ ఛానెల్ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన సవాల్‌ను స్వీకరించిన చిరు.. ఇంట్లో మూడు మొక్కలు నాటి కొందరిని నామినేట్ చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తోపాటు, మీడియా దిగ్గజం రామోజీరావు, సోదరుడు పవన్ కల్యాణ్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్
-
గ్రేటర్.. ఎవర్గ్రీన్ ఎప్పుడో!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరం గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటి జనాభాను మించిన సిటీలో తలసరిగా ప్రతి వ్యక్తికీ వంద చెట్లుండాల్సిన అవసరం ఉండగా..కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం తలపెట్టింది. అయితే ఈ కార్యక్రమం గ్రీన్‌బెల్ట్ వృద్ధికి అంతగా దోహదం చేయదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా హరితహారంలో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 40 లక్షల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 2.6 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించిన విషయం విదితమే. ఇందులో ప్రధానంగా ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేయనున్నారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటడం ద్వారా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని..అయితే తాజా కార్యక్రమంతో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో గ్రీన్‌బెల్ట్ 8 శాతం నుంచి 15 శాతానికి పెరగడం అసాధ్యమని స్పష్టంచేస్తుండడం గమనార్హం. గ్రీన్‌బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడోస్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు. పలు మెట్రోనగరాల్లో హరితం ఇలా ఉంది... దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చంఢీగడ్ తొలిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో నిలిచిన దేశరాజధాని ఢిల్లీలో 20.20 శాతం, గ్రీన్ సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్‌కతాలో 15 శాతం, ముంబయిలో పదిశాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మన నగరంలో హరితం 8 శాతానికే పరిమితమవడం గమనార్హం. హెచ్ఎండీఏ పరిధిలో.. గతేడాది హెచ్ఎండీఏ పరిధిలో 95 లక్షల మొక్కలు నాటగా.. ఇందులో 50 శాతమే మొక్కలు బతికాయి. ఇక ఈ సీజన్ మొత్తంగా 2.06 కోట్ల మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులోనూ సుమారు 90 శాతం ఇళ్లలో పెరిగేవే కావడం గమనార్హం. తులసి, అశ్వగంధ, అలోవెరా, కలబంద, లెమన్‌గ్రాస్, లావెండర్, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, వేప, నందివర్ధనం, జాస్మిన్, మందారం తదితర వెరైటీలతో పాటు రాయల్ ఫామ్స్, రెయిన్ ట్రీ, ఫింట్లోఫారం, గుల్ మొహర్, మెల్లిన్ టోనియా, మెయిన్ క్యారేజ్ వైపు బహునియా, క్యాషియా, పిస్టియా, అర్జెంటీయా తదితర 40 రకాల మొక్కలను నాటనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, ఔటర్‌రింగ్‌రోడ్డు పరిధిలో సుమారు 40 లక్షలు మొక్కలు నాటాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇక హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొందిన లే అవుట్లలో సుమారు 35 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో... 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది సుమారు కోటి మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఈ సారి సుమారు 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి, కలబంద, క్రోటన్, పూల మొక్కల వంటి చిన్నమొక్కలు 35 లక్షలుండడం గమనార్హం. మిగతా వాటిని ఖాళీప్రదేశాలు, చెరువులు, పార్కుల వద్ద నాటాలని నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్దమొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం. హరిత హననం. భాగ్యనగరంలో ఇపుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరంలో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగయి పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 30 శాతం గ్రీన్‌బెల్ట్(హరిత వాతావరణం)ఉండాల్సి ఉండగా..నగరంలో కేవలం 8 శాతమే గ్రీన్‌బెల్ట్ ఉండడంతో నగరంలో ప్రాణవాయువు కనుమరుగై సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలా చేస్తే మేలు.. ♦ నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగాతగ్గుతుంది. ♦ సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంతవిస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని,ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ♦ నూతనంగా ఏర్పడిక కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చేసమయంలో ఈవిషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. హరితంతో కాలుష్యం దూరం..దూరం.. ♦ చెట్ల ఆకులు వాతావరణంలోని కార్భన్డయాౖMð్సడ్,సూక్ష్మధూళికణాలను గ్రహించి ఆక్సీజన్‌ను విడుదల చేస్తుండడంతో పీల్చేగాలిలో ఆక్సీజన్ మోతాదు పెరుగుతుంది. చెట్లు ఎయిర్ఫిల్టర్లుగా పనిచేస్తాయని అందరూ గ్రహించాలి. ♦ చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్ వంటి ఇంధనాన్ని ఆదాచేస్తాయి. కాలుష్య ఉద్గారాలను బాగా తగ్గిస్తాయి. హరితం హననం..మనుగడ గగనం.. గ్రేటర్ నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. సిటీలో హరితం శాతం 8 మాత్రమే. అంటే మహానగరంలో సుమారు 12,320 ఎకరాల్లో హరితవాతావరణం(గ్రీన్‌బెల్ట్)అందుబాటులో ఉంది. దీన్ని 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే మొత్తం నగర విస్తీర్ణంలో హరితం శాతం కనీసం 16 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఇళ్లలో నాటే మొక్కలతోగ్రీన్బెల్ట్ పెరగదు హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి, ఆక్సిజన్ అందించేవి, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరిగి నగరంలో ఆక్సీజన్శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. తాజా హరితహారంతో నర్సరీల నిర్వాహకులకే లాభం చేకూరుతోంది. – జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త -
సిద్దిపేట ప్రజలకు హరీశ్‌రావు గ్రీన్ చాలెంజ్..
సాక్షి, సిద్దిపేట: ‘నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన యువత.. నేడు బంగారు తెలంగాణలో భాగస్వామ్యులు కావాలి. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడండతో పాటు సర్కార్ పనితీరును ప్రజలకు వివరించే వారధులు మీరే’ అని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ రాజకీయ శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది యువకులే అంటూ వారి త్యాగాలను గుర్తుచేశారు. అనతి కాలంలోనే తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తోందని స్వయానా ప్రధాన మంత్రి చెప్పారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించడం, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం, 570 ఇంగ్లిష్ మీడియం గురుకులాల ఏర్పాటు, విదేశాల్లో విద్య అభ్యసించే వారికి రూ.20 లక్షల ప్రోత్సాహకం.. ఇలా తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రం కోసం చావు నోటి వరకు వెళ్లొచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి కావడంతోనే ఈ పథకాలు అమలవుతున్నాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో అన్నింటా సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఉత్తమ మున్సిపాలిటీగా, ఉత్తమ మండంగా, ఉత్తమ గ్రామంగా సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాలు నిలిచాయన్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు కోసం, డీఈఓను కలిసేందుకు, కలెక్టర్‌ను కలిసేందుకు సంగారెడ్డి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు సిద్దిపేట జిల్లా కావడంతో ఇబ్బందులు తీరాయని మంత్రి చెప్పారు. సిద్దిపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చరిత్రలో మిగిలిపోతుందన్నారు. నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, ముగులులో హార్టికల్చల్, ఫారెస్టు యూనివర్సీటీల ఏర్పాటు, రూ.18 కోట్లతో పీజీ కళాశాల అభివృద్ధి, రూ.2.5 కోట్లతో మహిళా డిగ్రీకళాశాల నిర్మాణం, ఇర్కోడులో ఐటీఐ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో మన యువత ముందు ఉండేందుకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, ఉచిత భోజనంతో కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో యువత పాల్గొని హరిత సిద్దిపేటగా మార్చాలని కోరారు. ఉత్సాహం నింపిన దేశపతి మాట.. పాట టీఆర్ఎస్వీ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌రావు తన ఆటా.. పాటలతో యువతలో ఉత్సాహం నింపారు. మధ్యమధ్యలో నందినీ సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాలల్ల నా తెలంగాణ.. నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ..’ అని పాడుతూనే తెలంగాణ ప్రజలకు పాలపిట్ట ఎంత ఇష్టమో చెప్పారు. అదేవిధంగా ‘జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి..’ అంటూ అందె శ్రీ పాటను దేశపతి పాడుతుండగా మంత్రి హరీశ్‌రావు, విద్యార్థులు కోరస్ ఇవ్వడం విశేషం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, బర్ల మల్లికార్జున్, టీఆర్ఎస్వీ నాయకులు మహేశ్, శేఖర్‌గౌడ్, మాదాస్ శ్రీనివాస్, ప్రొఫెసర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నా ప్రయత్నానికి మీరు అండగా నిలవాలి సిద్దిపేటజోన్ : ప్రతి ఒక్కరూ హరిత ఉద్యమంలో కలిసి వచ్చి నా ప్రయత్నానికి అండగా నిలిచి కాలుష్య భూతాన్ని తరుముదామంటూ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్‌గా మారిందని, దీనివల్ల పర్యావరణానికి ఇబ్బందిగా మారడంతో పరోక్షంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు కారకాలుగా మారుతున్నాయన్నారు. ఈ భూతాన్ని తరిమేందుకు ప్రతి ఒక్కరు మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మీరంతా కలిసి వస్తే సిద్దిపేట, తెలంగాణ నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తొలగించే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట ప్రజలకు మంత్రి గ్రీన్ చాలెంజ్... ఇటీవల హరిత ఉద్యమాన్ని చేపట్టామని ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని గ్రీన్ చాలెంజ్ చేస్తున్నామని, తనతో పాటు మీరు కూడా తప్పని సరిగా మొక్కలు నాటాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు చాలేంజ్ విసిరారు. దీని ద్వారా హరితసిద్దిపేటగా మారే అవకాశం ఉందన్నారు. నిజాయితీ గల గడ్డ సిద్దిపేట... మంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పథకం చెక్కులను ఇస్తున్న తనకు మీరు ఒక హామీ ఇవ్వాలని, ఇస్తారా అంటూ సభా ముఖంగా ప్రశ్నించారు. తాను అడిగేది ఏమిటో తెలుసా.... మాట ఇచ్చాక మరచిపోవద్దని షరతు విధించారు. నేను అడిగేది ఏమిటో తెలుసా అంటూ వారిని ప్రశ్నించగా అందులో కొందరు ఓటు ఇవ్వామంటారా అని చెప్పడంతో మంత్రి నవ్వుతూ సిద్దిపేట ప్రజలు ఎంతో మంచివారని, సిద్దిపేట నిజాయితీ గల గడ్డ అని, పనిచేసే వారిని ఆశీర్వదించే గుణం మీదని అందుకే పలు ఎన్నికల్లో నన్ను గెలిపించారన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మరోసారి పిలుపునిచ్చారు. అనంతరం రంగనాయక సాగర్ కాలువ కోసం భూములు ఇచ్చిన 163మందికి రూ.10.11కోట్లు, అదేవిధంగా 276 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ. 2.26కోట్లు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మల్లికార్జున్, ఆనంద్, వెంకట్‌గౌడ్, చిన్న, మోహిజ్, కనకరాజు, నర్సయ్య, ఎంపీపీబీ మాణిక్యరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ,యాదయ్య, తహసీల్దార్లు పరమేశం, జానకీ,రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు. హరిత సమాజాన్ని నిర్మిద్దాం చిన్నకోడూరు(సిద్దిపేట) : జన్మనిచ్చిన నేలకు నేనేమిచ్చాని ఆలోచన చేసి అందరం చెట్లు పెంచుదామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య 9వ వార్షికోత్సవ సభలో మాట్లాడారు. 27 మహిళా గ్రామ సమాఖ్య సంఘ సభ్యులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. 74 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులు అందజేశారు. మండల గ్రామైఖ్య సంఘ మహిళలు పొదుపు చేసుకుంటున్న తీరు తెన్నులపై ఆరా తీశారు. ప్రభుత్వ సేవలు విస్తరించాలి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని చాలా బాగా చేశాం. ఆసుపత్రుల సేవలు వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలని, ఆస్పత్రి సేవలపై నమ్మకం కలిగేలా విస్తరింపజేయాల్సిన బాధ్యత మీపై ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ఆస్పత్రిలో సకల సదుపాయాలు సమకూర్చి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని రక్తశుద్ధి కేంద్రం, ఐసీయూ, కిడ్ని వ్యాధి గ్రస్తులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పేదరికంలో ఉన్న వారికి బాలసదనం, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో చదివిస్తామని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి , స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తేవాలన్నారు. హరిత సమాజాన్ని నిర్మిద్దాం..అందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ కమల, మార్కెట్ కమిటీ చైర్మన్ కుంట వెంకట్‌రెడ్డి, సర్పంచ్ కాముని ఉమేష్, టీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త రాధాకృష్ణశర్మ, తహసీల్దార్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గట్టు.. టేకు నాటు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు టేకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పొలాల గట్లపైనే కాకుండా బీడు భూముల్లో నాటించాలనే ప్రణాళిక రూపొందించారు. తద్వారా కొన్నేళ్ల తర్వాత మొక్కలు ఏపుగా పెరిగాక రైతులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందనేది ప్రభుత్వ భావన. ప్రతీ చిన్న, సన్నకారు రైతుకు ఎకరానికి 150 మొక్కల చొప్పున పంపిణీ చేయనుండగా అందజేస్తారు. ఇక రైతులతో టేకు మొక్కలు నాటించడం ద్వారా హరితహారం లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా టేకు మొక్కలు నాటేందుకు ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో ఉపాధి కూలీలతో గుంతలు తీయడంతో పాటు మొక్కలను నాటించడం కూడా ప్రభుత్వమే కూలీలతో చేయిస్తోంది. 15 వేల మంది రైతులకు... జిల్లాలోని 15వేల మంది చిన్న, సన్న కారు రైతులను టేకు మొక్కలు పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు. మొత్తం జిల్లాలో 70 లక్షల టేకు మొక్కలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు భూమి రైతులను గుర్తించి ఎకరానికి 150 మొక్కలు పంపిణీ చేస్తారు. అలాగే, మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో మొక్కకు నెలకు రూ.ఐదు చొప్పున చెల్లిస్తారు. ఇక పెద్ద రైతులకు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా గుంతలు తీయించి మొక్కలు ఉచితంగా అందజేస్తారు. మొక్కల సంరక్షణ మాత్రం వారే చూసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక ఇలా... చిన్న రైతుల విషయానికొస్తే టేకు మొక్కలు తీసుకునేందుకు ఉపాధి హామీ జాబ్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. అదే పెద్ద రైతులైతే ఆధార్ కార్డు ఆధారంగా మొక్కలు అందజేస్తారు. మొక్కల పంపినీ ప్రక్రియ మొత్తం ఎంపీడీఓల ద్వారా కొనసాగుతుంది. భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు, ఆదౠర్కార్డు, బ్యాంక్ అకౌంట్ కచ్చి తంగా ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తారు. గతం కన్నా ఎక్కువ... గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన హరిత హారం మూడో విడతలో టేకు మొక్కలు నాటించారు. అయితే, అంతకు మించి ఈసారి 70లక్షలకు పైగా టేకు మొక్కల పంపిణీ, నాటించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని అటవీ శాఖ, డీఆర్డీఓ నర్సరీల ద్వారా 1.23 కోట్ల టేకు మొక్కలు సిద్ధం చేశారు. మొక్కకు రూ.5 రైతులు తమ పొలంలో టేకు మొక్కలు నాటితే సంరక్షణకు కూడా ప్రభుత్వమే నిధులు ఇవ్వనుంది. ప్రతీ మొక్కుకు రూ.5 చొప్పున రైతులకు ఇ స్తారు. ఇలా 400 మొక్కలు ఉన్న రైతులకు నెలకు రూ.2 వేల చొప్పున, 800 మొక్కలు నాటితే రూ.4వేల చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక సాయం అందుతుంది. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాక ప్రతీ నెల రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదుచేశాక నిధులు విడుదల అవుతాయి. -
మొక్కకు చీర రక్ష
బోధన్ : ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారంలో భాగంగా బోధన్ మున్సిపల్ శాఖ పట్టణంలోని ప్రధాన రోడ్లలో మొక్కలు నాటారు. పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి రైల్వేగేట్ మీదుగా బాన్సువాడ వెళ్లే ప్రధాన రోడ్డులో లయన్స్ కంటి ఆస్పత్రి, రాకాసీపేట్ రైల్వేస్టేషన్, రాకాసీపేట్ ప్రాంత క్రాసింగ్ కూడలి వద్ద ప్రధాన రోడ్డుకు ఆనుకుని మొక్కలు నాటా రు. ఇక్కడ రోడ్డు పక్కన చిరు టీ, టిఫిన్ హోట ల్ నడుపుకుంటున్న వహీదా అనే మహిళ హో టల్ ముందు నాటిన మొక్క మేకలు తినేయకుండా, మొక్క చుట్టూ చీరలు కట్టి సంరక్షిస్తోంది. ఇలా ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకుంటే హరిత తెలంగాణ కల సాకారం అవుతోందనడంలో సందేహంలేదు. -
మొక్క ‘లెక్క’ చెప్పాలె!
సాక్షి, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాని జిల్లా అటవీశాఖ తూతూమంత్రంగా అమలుచేసిందని, 44వ జాతీయ రహదారి వెంట నాటిన చాలా మొక్కలు రక్షణ ఎండిపోయాయని, కానీ నిర్వహణ పేరిట ప్రజాధనం వృథాచేశారని ఈనెల 12న ‘సాక్షి’లో వచ్చిన ‘మొక్క.. తప్పు లెక్క! శీర్షికన వచ్చిన కథనానికి ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి ఆదేశించారు. జిల్లాలోని జాతీయ రహదారి వెంట 2016 సెప్టెంబర్‌లో రెండవ విడత హరితహరంలో భాగంగా 17వేల మొక్కలు నాటారు. వాటి సంరక్షణ కోసం ఒక్కో మొక్కపై ప్రభుత్వం సుమారు రూ.600 ఖర్చుచేసింది. మొక్కలను నాటిన నుంచి వాటి సంరక్షణ బాధ్యతలను అటవీశాఖలోని ఐదుగురు సిబ్బంది బషీర్, సువర్ణమూర్తి, రవీందర్‌రెడ్డి, బాలరాజ్, రాజశేఖర్‌కు అప్పగించారు. మొక్కల్లో ఎదుగుదల లేదని ఫిర్యాదు అందుకున్న రాష్ట్ర అటవీశాఖ అధికారి డొబ్రియల్ పదినెలల క్రితం జిల్లాలో జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్రకాశ్‌ను కోరారు. కానీ ఆయన పది నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. పొంతనలేని మొక్కల లెక్కలు ఈ విషయమై ‘సాక్షి’ పక్కా ఆధారాలతో ఈనెల 11న ‘మొక్కేశారు’ శీర్షికన కథనం వెలువడడంతో అప్రమత్తమై మాటమార్చిన ఫారెస్ట్ శాఖ జిల్లా అధి కారి 70శాతం మొక్కలు బతికే ఉన్నా యని లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చా రు. తిరిగి ఆయనే 11వేల మొక్కలను తిరిగి నాటేందుకు ఆర్డర్ ఇచ్చామని రెండు రకాల సమాధానం చెప్పారు. దీనిపై స్పందించిన ‘సాక్షి’ జిల్లాలోని జాతీయ రహదారి వెంట 30శాతం మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయని, అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని కథనం వెలువరించింది. బాధ్యులైన సిబ్బంది నుంచి డబ్బును రికవ రీ చేయాల్సి ఉన్నా అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఈ విషయాన్ని మరుగున పడేయాలని చూశారు. కానీ విషయం తెలుసుకున్న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి స్పందించడంతో బాధ్యుల్లో గుబులు మొదలైంది. ఇక మీదటైనా నిజనిజాలను బయటికి తీసుకురావాల ని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. -
హరిత‘దైన్యం’
సాక్షి, సిద్దిపేట: మూడో విడత హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా 492 మంది హరిత సైనికులను నియమించారు. సైకిళ్లను సైతం అందచేశారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను.. రోజూ మూడు కిలోమీటర్ల మేర సైకిల్‌పై తిరిగి పర్యవేక్షించాలి. మొక్క ఎదుగుదలను పరిశీలించడం, కలుపు తీసి కంచెవేయడం, పాదులు తీయడం, ట్రీగార్డుపెట్టడం, మొక్క చనిపోతే దాని స్థానంలో కొత్తది నాటడం.. వీరి విధులు. ఈ పని చేసినందుకు రోజుకు రూ.194 చొప్పున ఉపాధి హామీ పథకం కింద చెల్లిస్తారు. ఉపాధి హామీ నిబంధన ప్రకారం ఒక జాబ్ కార్డుకు ఏడాదికి వంద రోజులే పని కల్పిస్తారు. హరిత సైనికులు నెలలో 24 రోజులు పనిచేసినా.. నాలుగు నెలల్లోనే అతని వంద రోజులు పని పూర్తవువుతుంది. దీంతో అతనికి డబ్బులు చెల్లింపునకు నిబంధనలు అడ్డు వస్తాయి. దీంతో అతని పనిదినాలు పూర్తయ్యాక మరొకరి కార్డుపై పనిచేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నిజమైన కార్డుదారునికి, హరిత సైనికుడికి మధ్య డబ్బుల విషయంలో ఘర్షణలు పరిపాటి అయ్యాయి. నిజానికి ఒక సైనికుడు రోజూ 400 మొక్కలు పరిరక్షించాలి. కానీ, 800–1,000 మొక్కల పర్యవేక్షణ అతనికి అప్పగిస్తున్నారు. కూలీ మాత్రం 400 మొక్కలకే ఇస్తున్నారు. మిగిలిన మొక్కలు చూసినందుకు అదనపు డబ్బులు ఇవ్వడం లేదు. జిల్లాలో ఉపాధి హామీ పథకం నుంచి హరితహారానికి కేటాయించిన డబ్బుల్లో రూ.2.5 కోట్లు బకాయిలు పడగా.. ఇందులో హరిత సైనికుల బకాయిలు కోటి రూపాయల వరకు ఉన్నాయి. దీంతో పలువురు హరిత సైనికులు మొక్కల సంరక్షణను పట్టించుకోవడం లేదు. ‘నీళ్లొదిలిన’ ట్యాంకర్లు హరిత సైనికుల సంగతిలా ఉంటే, జిల్లాలోని 399 గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు 325 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. నీరు పోసినందుకు మొక్కకు 96 పైసలు చొప్పున ఇస్తారు. ప్రతీ మొక్కకు వారం, లేదా 10 రోజులకోసారి 10 లీటర్ల చొప్పున నీళ్లు పెట్టాలి. ఈ లెక్కన ట్యాంకర్‌కు ప్రభుత్వం రూ.384 చొప్పున లెక్కకట్టి చెల్లిస్తోంది. ట్యాంకరు సామర్థ్యం 5 వేల లీటర్లు. మొక్కలకు నీళ్లు పెట్టడంలో ఎక్కువ తక్కువలు ఉంటాయని, కాబట్టి ట్యాంకర్‌కు రూ.480 చొప్పున ఇస్తే తప్ప గిట్టుబాటు కాదని వీరంటున్నారు. పెరిగిన డీజిల్, డ్రైవర్, కూలీ ఖర్చులతో రూ.384కి తాము నీళ్లు పోయలేమని అంటున్నారు. అదనపు డబ్బులు ఇవ్వకపోతే పనిచేయలేమని తేల్చి చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను కాపాడుకోవడం జిల్లా యంతాంగానికి సవాల్ కానుంది. ముంచుకొస్తున్న వేసవి మూడో విడత హరితహారం కింద 2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ఇందుకు అనుగుణంగా అటవీ శాఖ పరిధిలోని 105 నర్సరీల్లో 1.60 కోట్ల మొక్కలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని 43 నర్సరీల్లో 33 లక్షల టేకు మొక్కలు పెంచారు. మరికొన్ని మొక్కల్ని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రారంభంలో కురిసిన వర్షాలకు మొక్కలు నాటుకొని ఏపుగా పెరిగాయి. చలికాలంలోనూ వాటి పరిరక్షణ విజయవంతమైంది. నాటిన వాటిలో 90 శాతానికి పైగా బతికాయి. అసలైన సవాల్ ఇప్పుడే ఎదురైంది. ఒకపక్క హరిత సైనికులు, ఇంకోపక్క వాటర్ ట్యాంకర్ల యజమానుల సహాయ నిరాకరణ.. మరోపక్క ముదురుతున్న ఎండలు అధికారులను హడలెత్తిస్తున్నాయి. ఈ వేసవిలో మొక్కల సంరక్షణపై యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. పైసా ఇవ్వలేదు నన్ను హరిత సైనికునిగా నియమించి, సైకిల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైసా ఇవ్వలేదు. మూడు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను రోజూ సంరక్షిస్తున్నా. మొక్కలకు దిక్కవుతున్న మాకు ఏ దిక్కూ లేకుండాపోయింది. పైసలు అసలిస్తరో యియ్యరో అర్థం కావట్లేదు. – అస్క స్వామి, హరిత సైనికుడు, మిరుదొడ్డి రెండు నెలల జీతమే వచ్చింది ఆరు నెలలుగా పనిచేస్తున్నా. రెండు నెలల జీతమే ఇచ్చిండ్రు. రోజుకు రూ.194 ఇస్తామని చెబితే సైకిల్‌పై తిరుగుతూ మొక్కలకు పాదులు తీసి నీళ్లు పోత్తన్న. ఉపాధి హామీలో వంద రోజులు నిండిపోయిన్నై. మిగతా జీతం ఎట్ల ఇత్తరో ఏమో? పనులు చేయాలని చెబుతున్నరు. పనైతే చేత్తన్న. జీతం రాకుంటే మండల ఆఫీసుల పోయి కూర్చుంట. ఈ పని చేయబట్టి మల్లా ఏ పనీ చేయరాకుండా కావట్టే. నెలనెలా జీతమిత్తె జర ఇల్లు గడుసు. – గాలిపెల్లి శంకర్, పొట్లపల్లి నీటి బిల్లులు ఇస్తలేరు ప్రతి నెలా నాలుగైదుసార్లు మొక్కలకు ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నాం. ఒక్కో ట్రిప్పునకు రూ.500 చెల్లిస్తామని సార్లు చెప్పిండ్రు. ఇప్పటి వరకు రూ.60 వేల బిల్లయ్యింది. నాకు రూ.23 వేలు మాత్రమే చెల్లించారు. మిగిలిన పైసల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఇలా అయితే నీళ్లు బంద్ చేసుడే.. – తోట భూపాల్‌రెడ్డి, హరితహారం వాటర్ ట్యాంకర్ యజమాని, మిరుదొడ్డి మొక్కల రక్షణకు ప్రణాళిక హరితహారం 3వ విడత అవెన్యూ ప్లాంట్స్ సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. హరిత సైనికుల, వాటర్ ట్యాంకర్ బకాయిలు త్వరలో చెల్లిస్తాం. పాదులు పెద్దగా ఉండటంతో నీళ్లు ఎక్కువ పడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి ట్యాంకర్ల వారికి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. – స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
బతికినవి 42 శాతమే!
చారకొండ : మండల పరిధిలో హరితహారం అబాసుపాలవుతోంది. నాటిన మొక్కలు సగానికంటే ఎక్కువగానే ఎం డిపోయాయి. కేవలం 42శాతం మొ క్కలు మాత్రమే బతికాయని అధికారులే చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. నాటినవి లక్షా 60 వేలు.. మండల పరిధిలోని జూపల్లి, తిమ్మాయిపల్లి, తుర్కలపల్లి, సిరుసనగండ్ల, చారకొండ, చంద్రాయన్పల్లి, గోకారం తదితర గ్రామాల్లో 1లక్ష 60వేల మొక్కలు నాటారు. ప్రస్తుతం 42శాతం మొక్కలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల వద్ద నాటిన మొక్కలు మాత్రమే ఆయా యజమాన్యాల చొరవతో మొక్కలు సజీవంగా ఉన్నాయి. గ్రామాలలో రోడ్లపై, ఖాళీస్థలాలలో నాటిన మొక్కలను బతికించే బాధ్యత మండల పరిషత్ అధికారులకు ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ ఆదేశించినా.. మొక్కలను పెంచే బాధ్యత మండల పరిషత్ అధికారులదేనని కలెక్టర్ చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో నాటిన మొక్కలు చనిపోయాయి. ఇన్చార్జ్ ఎంపీడీఓగా వంగూరు మండల అధికారి హిమబిందును నియమించ డంతో ఆమె వంగూరుకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో హరితహారం భవి తవ్యం ప్రశ్నార్థకమంగా మా రుతోంది. నిర్లక్ష్యం తగదు... ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అదికారుల నిర్లో్యంతో నీరుగారుస్తంన్నారు. మొక్కలు నాటి వాటివంక చూడకుండా పోతున్నారు. మాగ్రామంలో ఎంతో హడావిడిగా దేవాలయాలవద్ద, రోడ్లవద్ద, మజీద్‌లవద్ద మొక్కలు నాటారు. నీరులేక ఎండిపోయాయి. ప్రభుత్వ అదికారులు మొక్కలు సంరక్షించే బాధ్యత మరిచి పోయారు. కాలుష్య నివారణకు, వర్షాలు సమృద్ధిగా కురవడానికి ప్రకృతిలో మొక్కల పాత్ర ప్రధానమైనది. మొక్కలు పెంచడంలో నిర్లక్షం వహించరాదు. – జగపతి, జూపల్లి -
హరితహారం ప్రణాళిక రూపొందించాలి
నిర్మల్‌టౌన్ : తెలంగాణకు హరితహారంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో కోటి రెండు లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో మంగళవారం సా యంత్రం జిల్లా అధికారులతో హరితహారంపై ఆమె సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. వారం రోజుల్లోగా ప్రణాళికలు అందజేయాలన్నారు. 2018లో ప్రతీ శాఖకు సంబంధించి లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. తమకు కేటాయించిన లక్ష్యం మేరకు ప్రతీ శాఖ వందశాతం ప్రగతి సాధించాలన్నారు. మొక్కలు నాటడంపై ప్రణాళికలు తయారుచేసి, వివరాలు నిర్ణీ త నమూనాలో వారం రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలు, పాఠశాలల్లో కరివేపాకు, నిమ్మ, మునగ, బొప్పాయి, ఉసిరి, జామ తదితర మొక్కలు నాటాలన్నారు. రైతుల పొలాలు, పొలం గట్లపై, ఇళ్ల ఆవరణలో మొక్కలు నాటేలా ప్రోత్సహించాలన్నారు. నీటి పారుదల, పంచాయతీ, రహదారులు, శ్మశాన వాటికలు, దేవాలయాలు, పోలీస్‌స్టేషన్, పారిశ్రామిక వాడలు, పరిశ్రమలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. డ్వామాకు 50లక్షలు, ఐకేపీకి 12లక్షలు, రెవెన్యూ శాఖకు 50వేలు, పంచాయతీరాజ్‌కు 3లక్షలు, అటవీశాఖకు 22లక్షలు, హార్టికల్చర్‌కు 5లక్షలు, అబ్కారీశాఖకు 1.50లక్షలు, ఇరిగేషన్‌కు 2లక్షలు, పోలీసు శాఖకు 2లక్షలు, ఆర్‌అండ్‌బీకి 50వేలు, విద్యాశాఖకు 20వేలు, నిర్మల్ మున్సిపాలిటీకి 1.5లక్షలు, భైంసా మున్సిపాలిటీకి లక్ష, పశుసంవర్ధక శాఖకు 70వేలు, ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మార్కెటింగ్, డీసీవో, విద్యుత్ తదితర శాఖలకు 2వేల నుంచి 5వేల చొప్పున మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులను ప్రోత్సహించి పొలంగట్లపై టేకు మొక్కలు నాటేలా, అలాగే అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జేసీ శివలింగయ్య, డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ప్రసూనాంబా, అన్ని శాఖల జిల్లా అధికారులున్నారు. -
అంతరిస్తున్న మొక్కలు నాటుతున్నాం
శంషాబాద్ రూరల్: జీవ వైవిద్య పరిరక్షణలో భాగంగా అంతరిస్తున్న, అరుదైన మొక్కల పెంపకం కోసం కృషి చేస్తున్నట్లు మైహోం గ్రూపు ఎండీ జూపల్లి జగపతిరావు అన్నారు. మండలంలోని ముచ్చింతల్‌లో శనివారం మైంహోం గ్రూపు ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. జిల్లా కలెక్టరు రఘునందన్‌రావు, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగపతిరావు మాట్లాడుతూ.. ముచ్చింతల్ సమీపంలోనే జీవ వైవిద్య పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశ నలమూలల నుంచి అన్ని రకాల ఔషధ, పండ్లు, పూల మొక్కలను తెప్పిస్తున్నామని చెప్పారు. అంతరించిపోయిన సుమారు 140 రకాల మొక్కల సేకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పార్కు ఏడాదిన్నరలోపు పూర్తిస్థాయిలో ఏర్పాటు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. తమ వంతుగా లక్ష మొక్కల పెంపకం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం సొంతంగా నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. మైహోం సంస్థ జీవ వైవిద్య పార్కు ఏర్పాటుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇంటికి రెండు మొక్కల చొప్పున నాటుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, ఆర్డీఓ సురేష్ పొద్దార్, సర్పంచులు రాజశేఖర్‌రెడ్డి, లాలీచందర్, ఎంపీటీసీ సభ్యులు మోహన్‌నాయక్, ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అడవిని తలపించాలి
మొయినాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. శనివారం మొయినాబాద్ మండలంలో ఆమె హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలో విద్యార్థులు, మహిళలతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలునాటి జిల్లాను అడవిని తలపించేలా చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి గ్రామానికి 40 వేల మొక్కల చొప్పున జిల్లాలో 2 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజలంతా హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతిఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, రోడ్లుపక్కన, ఖాలీస్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని మహిళా సమాఖ్య భవనం, రోడ్ల పక్కన ఆమె మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, ఏఎంసీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మొయినాబాద్ సర్పంచ్ జీనత్‌బేగం, చిలుకూరు సర్పంచ్ గున్నాల సంగీత, ఎంపీటీసీ సహదేవ్, ఎంపీడీఓ సుభాషిణి, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంఈఓ వెంకటయ్య, నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, రవుఫ్, కొండల్‌గౌడ్, శ్రీహరి, రమేష్, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. -
ఇల్లు కట్టుకోవాలంటే 10 మొక్కలైనా నాటాల్సిందే
-
ఇల్లు కట్టుకోవాలంటే 10 మొక్కలైనా నాటాల్సిందే
హైదరాబాద్ : ఇకపై ఇల్లు కట్టుకోవాలంటే 10 మొక్కలైనా నాటాల్సిందేనని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. అలా అయితేనే భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తామని చెప్పాలన్నారు. సోమవారం బీహెచ్ఈఎల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రభుత్వ బాధ్యత కాదని, హరితహారం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటడంతోపాటు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. నాటిన మొక్కలన్నింటిపై ఆరు నెలల్లో సర్వే చేయిస్తామని, మొక్కలు ఎండిపోతే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. స్వయంగా తానే మొక్కలను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ఇకపై పూల బొకేలు ఇవ్వడం మానాలని, చెట్లతో స్వాగతం పలకాలని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడోసారి !
♦ నేడు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ వేల్పూరులో బస చేయనున్న సీఎం ♦ ఎల్లుండి మొక్కలునాటే కార్యక్రమం ♦ నిజామాబాద్‌లో సీఎం బహిరంగసభ ♦ హరితహారంలో రెండు రోజుల టూర్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు రోజులు జిల్లాలో గడపనున్నారు. తెలంగాణ హరితహారంలో భాగంగా ఆదివారం సాయంత్రం జిల్లాకు చేరుకోనున్న ఆయన సోమవారం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి వస్తున్నారు. హరితహారంలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న ఆయన సాయంత్రం నిర్మల్ నుంచి వేల్పూరుకు చేరుకుంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి సీఎం రెండు రోజుల టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం జిల్లా అధికారులకు పంపించారు. జిల్లాలో మూడేళ్లలో 10.05 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఈ ఏడాది 3.35 కోట్లు నాటుతు న్నారు. మూడునప్రారంభమైన ఈ కార్యక్రమం చురుకుగా సాగుతుండగా, 5, 6 తేదీలలో సీఎం పాల్గొననుండటం ప్రతిష్టాత్మకంగా మారింది. కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా అధికారయంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం రాత్రి సీఎం నిర్మల్ నుంచి నేరుగా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరుకు చేరుకుంటారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం నుంచి హరితహారం కార్యక్రమంలో పా ల్గొంటారు. ఈ మేరకు రెండు రోజులుగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం పర్యటన ఏ ర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిని పరిశీలించారు. సీఎం నిద్రించే గది, ఆయన కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సౌకర్యాల గురించి ఎమ్మె ల్యేను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాలలో సీఎం పర్యటించే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. టూర్ షెడ్యూల్ ఇదీ అధికారులు వెల్లడించిన ప్రకారం సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి ఏడు గంటలకు వేల్పూరుకు చేరుకుని రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు వేల్పూరు ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన అనంతరం అక్కడి రైతులతో మాట్లాడుతారు. వేల్పూర్ హైస్కూల్ ఆవరణలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మొ క్కలు నాటుతారు. అక్కడి నుంచి బయలుదేరి ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రా ంగణం) సీఎం మొక్కలు నాటుతారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పరిశీలిస్తారు. అక్కడి నుంచి నిజామా బాద్‌కు చేరుకునే సీఎం కేసీఆర్ పాలిటెక్నిక్ మైదానం, గిరిరాజ్ కళాశాల మైదానంలో మొక్కలు నాటుతారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరం గ సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు కేంద్రమంత్రి ప్రకాశ జవదేవకర్ ముఖ్యఅతిధిగా హాజరవుతారు. తర్వాత ఈద్గా, రఘునాథ చెరువు వద్ద సీఎం మొక్కలు నాటుతా రు. అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పించి మొక్కలు నాటుతారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇంట్లో ఏ ర్పాటు చేసిన భోజన కార్యక్రమం తర్వాత తెలంగాణ యూనివర్సిటీకి చేరుకోనున్న సీఎం తెలంగాణ హరితహారంలో పాల్గొంటారు. యూనివర్శిటీపై అధికారులు, ప్ర జాప్రతినిధులతో మాట్లాడి సదాశివనగర్ మండలకేంద్రంలోని పాతచెరువును కేసీఆర్ సందర్శిస్తారు. అక్కడ తాను ప్రారంభించిన మిషన్ కాకతీయ పనులను పరిశీ లించి ఆ చెరువులో మొక్కలు నాటుతారు. అక్కడి నుంచి బయలుదేరి కామారెడ్డికి చేరుకోనున్న ఆయన ప్రభుత్వ డిగ్రీ, డైరీ కళాశాలల్లో మొక్కులు నాటే కార్యక్రమంలో పాల్గొని మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్తారు. -
మన సార్లు.. ‘నర్సరీ’ తప్పారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఆరు నెలలు కుస్తీ పట్టారు. రూ.27 కోట్లు వెచ్చించారు. 450 నర్సరీలలో 3.52 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు.. భేటీలు.. సమీక్షలంటూ నానా హడావుడి చేశారు. తీరా అవసరానికో మొక్క దొరకలేదు. నాగపూర్ నర్సరీల నుంచి రాత్రికి రాత్రి మొక్కలు తెప్పించి మఖ్యమంత్రి, మంత్రుల చేత నాటించి ‘కార్యం’ గట్టెక్కించారు. కోట్లు ఖర్చు చేసినా.. సీఎం ఇష్టంగా నాటేలా మన నర్సరీలలో ఒక్క మొక్కనూ పెంచలేని అధికారుల తీరు హరితహారం భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకానికి అప్పుడే ‘నిర్లక్ష్య’పు తెగులు పట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని సవాల్‌గా భావిస్తుంటే, జిల్లా యంత్రాంగం దాన్ని ‘లైట్’గా తీసుకుంటోంది. 450 నర్సరీల్లో 3.52 కోట్ల మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉంచామని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. ప్రతి నర్సరీలో 20-30 జాతుల మొక్కలు ఉన్నాయని, ప్రజలు తమకు కావాల్సినవి తీసుకుని నాటుకోవాలని సామాజిక వనాల డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి వంతపాడారు. ఇదీ జరిగింది.. శనివారం జిల్లాలో జరిగిన హరితహారంలో సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని మిట్టపల్లి రెసిడెన్సియల్ స్కూల్, ఎంపీడీవో కార్యాలయం, 1500 రోజుల దీక్షా ప్రాంగణం, వైశ్య భవన్, నంగనూరు మండలం ముండ్రాయి, పాలమాకుల, రాజగోపాల్‌పేట ప్రాంతాల్లో 7 మొక్కలు నాటారు. అవన్నీ ఒకే రకం మొక్కలు. దాదాపు పది అడుగుల పొడవున్న ఇవి చూడ్డానికి ఆకర్షణీయంగా, బలిష్టంగా కనిపించాయి. శుక్రవారం మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేటలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం ఇవే రకం మొక్కలు నాటారు. హరితహారం నర్సరీలకు టెండర్లు పిలిచిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మొక్కలు నాటి నీరు పోసిన నేటి (శనివారం) వరకు ‘సాక్షి’ నెట్వర్క్ జిల్లా వ్యాప్తంగా వివిధ నర్సరీల్లో కలియ తిరిగింది. మొక్కల పెరుగుదల సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు కథనాలు ప్రచురించింది. ఏ నర్సరీలలోనూ ఇంత పెద్ద మొక్కలు కనిపించలేదు. కానీ రాత్రికి రాత్రే పెరిగి సీఎం, మంత్రుల కార్యక్రమంలో హల్చల్ చేసిన వీటి గురించి ఆరా తీయగా అసలు నిజం బయటికి వచ్చింది. నాగపూర్ నర్సరీల నుంచి.. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన 7 మొక్కలు, శుక్రవారం హరీష్‌రావు నాటినవి ‘తబూబియా’ జాతి మొక్కలు. వీటిని మహారాష్ట్రలోని నాగపూర్ ప్రైవేటు నర్సరీల నుంచి తెప్పించారు. ఒక్కటీ రూ.370 చొప్పున 3 వేల మొక్కలను తెప్పించినట్టు తెలిసింది. వీటికి రవాణా ఖర్చులు అదనం. దేశంలోనే మూడో పెద్ద పథకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంతో వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఊళ్లకు ఊళ్లను ఆకుపచ్చని వనాలుగా మార్చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఆయన ఆకాంక్షకు తగ్గట్టు మన అధికారులు నర్సరీల్లో మొక్కలను పెంచలేకపోయారు. మే చివరి వారం వరకు జిల్లాలోని నర్సరీలను ఏ అధికారీ పట్టించుకోలేదు. వీటి స్థితిగతులను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చాకే కదిలారు. అప్పటికే సమయం మించిపోయింది. ఎందుకిలా చేశారు... జిల్లా అధికారులు 3.52 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నట్టు ముందు నుంచీ చెబుతున్నా.. వాస్తవంగా అందులో 60 శాతం కూడా రెడీగా లేవు. వృక్ష శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం- ఒక మొక్కను వేరేచోట నాటినప్పుడు, కొత్త వాతావారణ పరిస్థితుల్లో ఇమడాలంటే పూర్తి ఆరోగ్యంతో ఆ మొక్క వయసు కనీసం 4 నెలలైనా ఉండాలి. ప్రస్తుతం నర్సరీల్లో పెరిగిన మొక్కలకు ఆ స్థాయి లేదు. అసలవి ఎదుగుతాయో లేదో తెలియని పరిస్థితుల్లో సీఎం, మంత్రులు చేత వీటిని నాటిస్తే తమ పరువు-కొలువులకు ఇబ్బందేనని ముందే పసిగట్టిన అధికారులు నాగపూర్ నర్సరీల నుంచి మొక్కలు తె ప్పించి ‘గట్టె’క్కారని విద్యావంతులు అంటున్నారు. దీనిపై సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డిని వివరణ కోరగా- డీఎఫ్‌వో ఇచ్చిన మొక్కలనే తాము సీఎం చేత నాటించామని చెప్పారు. -
హరిత హారం..మహా యజ్ఞం
-
హరిత హారం..మహా యజ్ఞం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘హరితహారం’ శ్రీకారానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 10 వరకు జిల్లాలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారం రోజుల్లో 3.10 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో అధికారయంత్రాంగంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, విద్యాసంస్థలు మమేకమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 41 మండలాల్లోని 243 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. మొక్కలు నాటడంలో అటవీ శాఖతోపాటు ఐటీడీఏ ఇతర ప్రభుత్వ శాఖలు పాలుపంచుకుంటున్నారుు. టేకు మొక్కలు 52 లక్షలు, ఎర్రచందనం 2.50 లక్షలు, వెదురు 9.50 లక్షలు, పండ్ల మొక్కలు 22లక్షలు, పూలమొక్కలు 30 లక్షలు, యూకలిఫ్టస్ కోటి మొక్కలు, మిగితావి ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు అందించనున్నారు. పొలం గట్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, గ్రామాల్లోని అంతర్గత రోడ్ల వెంట, చెరువు గట్లపై, చెరువు గర్భంలో సిల్ట్ పేరుకున్న భూముల్లో, గ్రామాలను అనుసంధానం చేసే రోడ్ల వెంట, దేవాలయ భూములు, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో మొక్కలను నాటనున్నారు. వారం రోజుల కార్యక్రమంలో ఓ వైపు ప్రజలకు అడవులతో జరిగే మేలును వివరిస్తూ మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పలు కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, బస్‌లపై హరితహారం పోస్టర్లు, స్టిక్కర్లు అంటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం చేశారు. మొత్తం శాఖల వారీగా ఎన్ని మొక్కలు నాటారో కూడా ప్రభుత్వానికి ప్రతి రోజు నివేదిక అటవీ శాఖ అధికారులు అందించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 18.74 లక్షల మొక్కలు, భద్రాచలంలో 10.45 లక్షలు, ఖమ్మంలో 15.25 లక్షలు, కొత్తగూడెంలో 16.45 లక్షలు, మధిరలో 27.23 లక్షలు, పాలేరులో 22.08 లక్షలు, పినపాకలో 29.90 లక్షలు, సత్తుపల్లిలో 17.33 లక్షలు, వైరాలో 51.68 లక్షలు, ఇల్లెందు నియోజకవర్గంలో 34.72 లక్షల మొక్కలను నాటనున్నారు. ఈ మొక్కలన్నీ 2.43 కోట్లు కాగా, మిగితా మొక్కలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ప్రజా ప్రతినిధులు కూడా తమ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో మొక్కలు నాటేందుకు సన్నద్ధులయ్యారు. పోడు భూములలో అధికారులు మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడంతో వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గిరిజనులు పోడు చేసుకుంటున్న భూముల్లో ఎక్కడైనా అధికారులు మొక్కలు నాటితే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాయి. మొక్కలు నాటనున్న మంత్రి తుమ్మల హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం 3.05 గంటలకు కలెక్టరేట్లో, 3.15 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో, 3.20 గంటలకు వీవీ నగర్ కాలనీలో మొక్కలను నాటనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 9,10 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానుండటంతో ఆయనతో ఎక్కడ మొక్కలు నాటించాలనే దానిపై అధికారులు టూర్ షెడ్యూల్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. -
వచ్చే నెలలో 40 కోట్ల మొక్కలు నాటాలి: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెలలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని, తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్లు మొక్కలు నాటాలని కేసీఆర్ చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ఒక ప్రజా ఉద్యమని అన్నారు. పోలీసులతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ కోరారు. హరితహారం కోసం బస్సులో అన్ని జిల్లాలు తిరుగుతానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు దేశ వ్యాప్తంగా మంచి పేరుందని కేసీఆర్ చెప్పారు.