
అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి హరీశ్‌రావు, తదితరులు
సాక్షి, సిద్దిపేట: ‘నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన యువత.. నేడు బంగారు తెలంగాణలో భాగస్వామ్యులు కావాలి. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడండతో పాటు సర్కార్ పనితీరును ప్రజలకు వివరించే వారధులు మీరే’ అని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్వీ రాజకీయ శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు.
ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది యువకులే అంటూ వారి త్యాగాలను గుర్తుచేశారు. అనతి కాలంలోనే తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తోందని స్వయానా ప్రధాన మంత్రి చెప్పారన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించడం, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం, 570 ఇంగ్లిష్ మీడియం గురుకులాల ఏర్పాటు, విదేశాల్లో విద్య అభ్యసించే వారికి రూ.20 లక్షల ప్రోత్సాహకం.. ఇలా తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రం కోసం చావు నోటి వరకు వెళ్లొచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి కావడంతోనే ఈ పథకాలు అమలవుతున్నాయన్నారు.
మరోవైపు రాష్ట్రంలో అన్నింటా సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఉత్తమ మున్సిపాలిటీగా, ఉత్తమ మండంగా, ఉత్తమ గ్రామంగా సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాలు నిలిచాయన్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు కోసం, డీఈఓను కలిసేందుకు, కలెక్టర్‌ను కలిసేందుకు సంగారెడ్డి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు సిద్దిపేట జిల్లా కావడంతో ఇబ్బందులు తీరాయని మంత్రి చెప్పారు. సిద్దిపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చరిత్రలో మిగిలిపోతుందన్నారు.
నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, ముగులులో హార్టికల్చల్, ఫారెస్టు యూనివర్సీటీల ఏర్పాటు, రూ.18 కోట్లతో పీజీ కళాశాల అభివృద్ధి, రూ.2.5 కోట్లతో మహిళా డిగ్రీకళాశాల నిర్మాణం, ఇర్కోడులో ఐటీఐ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో మన యువత ముందు ఉండేందుకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, ఉచిత భోజనంతో కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో యువత పాల్గొని హరిత సిద్దిపేటగా మార్చాలని కోరారు.
ఉత్సాహం నింపిన దేశపతి మాట.. పాట
టీఆర్‌ఎస్వీ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌రావు తన ఆటా.. పాటలతో యువతలో ఉత్సాహం నింపారు. మధ్యమధ్యలో నందినీ సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాలల్ల నా తెలంగాణ.. నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ..’ అని పాడుతూనే తెలంగాణ ప్రజలకు పాలపిట్ట ఎంత ఇష్టమో చెప్పారు. అదేవిధంగా ‘జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి..’ అంటూ అందె శ్రీ పాటను దేశపతి పాడుతుండగా మంత్రి హరీశ్‌రావు, విద్యార్థులు కోరస్ ఇవ్వడం విశేషం.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్‌ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య, టీఆర్‌ఎస్ నాయకులు పాల సాయిరాం, బర్ల మల్లికార్జున్, టీఆర్‌ఎస్వీ నాయకులు మహేశ్, శేఖర్‌గౌడ్, మాదాస్ శ్రీనివాస్, ప్రొఫెసర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
నా ప్రయత్నానికి మీరు అండగా నిలవాలి
సిద్దిపేటజోన్ : ప్రతి ఒక్కరూ హరిత ఉద్యమంలో కలిసి వచ్చి నా ప్రయత్నానికి అండగా నిలిచి కాలుష్య భూతాన్ని తరుముదామంటూ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్‌గా మారిందని, దీనివల్ల పర్యావరణానికి ఇబ్బందిగా మారడంతో పరోక్షంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు కారకాలుగా మారుతున్నాయన్నారు. ఈ భూతాన్ని తరిమేందుకు ప్రతి ఒక్కరు మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మీరంతా కలిసి వస్తే సిద్దిపేట, తెలంగాణ నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తొలగించే అవకాశం ఉందన్నారు.
సిద్దిపేట ప్రజలకు మంత్రి గ్రీన్ చాలెంజ్...
ఇటీవల హరిత ఉద్యమాన్ని చేపట్టామని ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని గ్రీన్ చాలెంజ్ చేస్తున్నామని, తనతో పాటు మీరు కూడా తప్పని సరిగా మొక్కలు నాటాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు చాలేంజ్ విసిరారు. దీని ద్వారా హరితసిద్దిపేటగా మారే అవకాశం ఉందన్నారు.
నిజాయితీ గల గడ్డ సిద్దిపేట...
మంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పథకం చెక్కులను ఇస్తున్న తనకు మీరు ఒక హామీ ఇవ్వాలని, ఇస్తారా అంటూ సభా ముఖంగా ప్రశ్నించారు. తాను అడిగేది ఏమిటో తెలుసా.... మాట ఇచ్చాక మరచిపోవద్దని షరతు విధించారు. నేను అడిగేది ఏమిటో తెలుసా అంటూ వారిని ప్రశ్నించగా అందులో కొందరు ఓటు ఇవ్వామంటారా అని చెప్పడంతో మంత్రి నవ్వుతూ సిద్దిపేట ప్రజలు ఎంతో మంచివారని, సిద్దిపేట నిజాయితీ గల గడ్డ అని, పనిచేసే వారిని ఆశీర్వదించే గుణం మీదని అందుకే పలు ఎన్నికల్లో నన్ను గెలిపించారన్నారు.
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మరోసారి పిలుపునిచ్చారు. అనంతరం రంగనాయక సాగర్ కాలువ కోసం భూములు ఇచ్చిన 163మందికి రూ.10.11కోట్లు, అదేవిధంగా 276 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ. 2.26కోట్లు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్‌లు మల్లికార్జున్, ఆనంద్, వెంకట్‌గౌడ్, చిన్న, మోహిజ్, కనకరాజు, నర్సయ్య, ఎంపీపీబీ మాణిక్యరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ,యాదయ్య, తహసీల్దార్‌లు పరమేశం, జానకీ,రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు.
హరిత సమాజాన్ని నిర్మిద్దాం
చిన్నకోడూరు(సిద్దిపేట) : జన్మనిచ్చిన నేలకు నేనేమిచ్చాని ఆలోచన చేసి అందరం చెట్లు పెంచుదామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య 9వ వార్షికోత్సవ సభలో మాట్లాడారు. 27 మహిళా గ్రామ సమాఖ్య సంఘ సభ్యులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. 74 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులు అందజేశారు. మండల గ్రామైఖ్య సంఘ మహిళలు పొదుపు చేసుకుంటున్న తీరు తెన్నులపై ఆరా తీశారు.
ప్రభుత్వ సేవలు విస్తరించాలి
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని చాలా బాగా చేశాం. ఆసుపత్రుల సేవలు వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలని, ఆస్పత్రి సేవలపై నమ్మకం కలిగేలా విస్తరింపజేయాల్సిన బాధ్యత మీపై ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ఆస్పత్రిలో సకల సదుపాయాలు సమకూర్చి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని రక్తశుద్ధి కేంద్రం, ఐసీయూ, కిడ్ని వ్యాధి గ్రస్తులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
పేదరికంలో ఉన్న వారికి బాలసదనం, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో చదివిస్తామని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి , స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తేవాలన్నారు. హరిత సమాజాన్ని నిర్మిద్దాం..అందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ కమల, మార్కెట్ కమిటీ చైర్మన్ కుంట వెంకట్‌రెడ్డి, సర్పంచ్ కాముని ఉమేష్, టీఆర్‌ఎస్ జిల్లా సమన్వయకర్త రాధాకృష్ణశర్మ, తహసీల్దార్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment