సాక్షి, హైదరాబాద్: వానా కాలం సీజన్ మొదలైంది. గ్రేటర్ నగరం గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటిన్నర జనాభాకు చేరువైన సిటీలో హరితం శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల 42 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతిఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణ వేత్తలు స్పష్టంచేస్తున్నారు.
కాగా మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా..నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు అంతగా దోహదం చేయలేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హరితహారంలో ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేశారు.
బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో చేపట్టే హరితహారంలో భాగంగా ప్రస్తుతం గ్రేటర్‌లో ఉన్న గ్రీన్‌బెల్ట్ 20 నుంచి 30 శాతానికి పెంచాలని స్పష్టంచేస్తున్నారు.
లక్ష్యం చేరని హరితహారం..
625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీ పరిధిలో 2016 నుంచి ఏటా హరితహారం చేపట్టారు. ఐదేళ్లుగా సుమారు మూడు కోట్ల మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి,కలబంద,క్రోటన్,పూల మొక్కల వంటి చిన్నమొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీప్రదేశాలు,చెరువులు,పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం.
ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి,పర్యావరణ వేత్త
హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి,ఆక్సీజన్ అందించేవి,కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరిగి నగరంలో ఆక్సీజన్‌శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది.
గ్రీన్‌చాలెంజ్ ఇలా...
► నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి.
► తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది.
► సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.
►నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి.
► నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment