అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న కూలీలు
రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 70 ఎకరాల్లో అటవీశాఖ అధికారులు 50 వేల మొక్కలు నాటి, హరితవనంగా మార్చారు. ఇందుకుగాను రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. మొక్కల సంరక్షణలో భాగంగా సదరు ప్లాంటేషన్ చుట్టూ కందకాన్ని సైతం తవ్వించారు. రామాయంపేట మండలంలోని కోమటిపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న దాదాపు 70 ఎకరాల అటవీ ప్రాంతంలో గతంలో యూకలిఫ్టస్ చెట్లు ఉండేవి.
వీటిని నరికివేయించిన అధికారులు ఆ స్థలంలో హరితహారం కింద మొక్కలు నాటి గ్రీనరీని పెంపొందించేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 50 వేల మొక్కలు నాటారు. ఇందులో ప్రత్యేకంగా 16 రకాల మొక్కలు నాటారు. కేవలం రెండు నెలల కాలంలో యుద్ధ ప్రతిపాదికన మొక్కలు నాటారు. ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది కూలీలు శ్రమించి మొక్కలు నాటి వాటికి సపోర్టుగా కర్రలు పాతారు. ఉన్నతాధికారులు ఈ మొక్కలను పరిశీలించడానికి వీలుగా ప్లాంటేషన్‌లో నలువైపులా రోడ్డు నిర్మించారు.
మూడు కిలోమీటర్ల మేర..
అటవీప్రాంతంలో ఉన్న జంతువులు, పశువులు ఈ మొక్కలను ధ్వంసం చేసే అవకాశం ఉండటంతో 70 ఎకరాల మేర ఉన్న ఈ ప్లాంటేషన్ చూట్టు మూడున్నర కిలోమీటర్లమేర కందకం తవ్వారు. దీంతో ఏ జంతువు నాటిన చెట్లలోకి రాకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు కందకంలో నీరు నిలిచి భూమిలో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
వేలాది మొక్కలు నాటిన ఈ ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటోంది. మొక్కలు నాటడం ఇతరత్రా పనులకు గాను రూ. 20 లక్షలు ఖర్చయ్యాయని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాటిన మొక్కల్లో మర్రి, అల్లనేరెడు, సీమరవ్వ, వేప, గుమ్మడి టేకు, సొప్పెర, ఇప్ప, మద్ది, కానుగ, రాగి, నమిలినార, బుడ్డ దంపిరి, మారేడు, పత్రి, చింత, సీమచింత, తదితర మొక్కలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment