అధికారులతో కలిసి అడవిలో పర్యటిస్తున్న కలెక్టర్ ధర్మారెడ్డి
నర్సాపూర్ మెదక్ : జిల్లాలోని అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ధర్మారెడ్డి చెప్పారు. డీఎఫ్‌ఓ పద్మజారాణి, ఇతర అధికారులతో కలిసి ఆయన నర్సాపూర్ అడవులలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న అడవులను వివిధ పథకాల కింద సంరక్షించడంతో పాటు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు.
నర్సాపూర్ అడవిలో ఎకో టూరిజం పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా అడవిని అభివృద్ధి చేసే పనులలో భాగంగా ఖాళీ ప్రదేశాలలో ఔషధ, ఇతర మొక్కలు నాటి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని.. అడవి చుట్టూ ఫెన్సింగ్ వేయనున్నారని చెప్పారు. కాగా ఎకో టూరిజం పార్కు కింద నర్సాపూర్ అడవితో పాటు నర్సాపూర్ రాయరావు చెరువును అభివృద్ధి చేసి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
టూరిజం పార్కు కింద ఎంపిక చేసిన అటవీ ప్రాంతంలో ప్రజలకు కనీస వసతులు కల్పించడం, విహార ప్రాంతంగా తీర్చిదిద్దే పనులను ఎక్కడెక్కడ చేపడితే బాగుంటుందో తెలుసుకునేందుకు తాము పర్యటించి పరీశీలించినట్లు ఆయన చెప్పారు. రాయరావు చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు. ఎకో టూరిజం పార్కును అటవీ శాఖ ఏర్పాటు చేస్తున్నప్పటికీ టూరిజం శాఖతో అనుసంధానం చేయనున్నందున ఆ శాఖ సైతం పలు వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ చెప్పారు.
రూ.20 కోట్లు మంజూరు
నర్సాపూర్ అడవి అభివృద్ధితోపాటు ఎకో టూరిజం పార్కు ఏర్పాటుకు గాను ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి చెప్పారు. కాగా జిల్లాలోని వడియారం, మనోహరబాద్, పర్కిబండ అడవులను అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ పార్కులు ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ నిధులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. వడియారం అడవిలోని 170 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.4.36 కోట్లు, మనోహరబాద్ అడవిని 725 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.3.33 కోట్లు, పర్కిబండ అడవిని 186 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.6.14 కోట్లు హెచ్‌ఎండీఏ మంజూరు చేసిందని ఆయన చెప్పారు.
అర్బన్ పార్కులలో పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేసి పర్యాటకులు సంతోషంగా గడిపేందుకు పార్కులను తీర్దిదిద్దుతారని చెప్పారు. పార్కు ఏర్పాటుకు సంబంధించి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ ధర్మారెడ్డి వెంట డీఎఫ్‌ఓ పద్మజారాణి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎండీఏ డీసీఎఫ్ శ్రీలక్ష్మి, స్థానిక ఎఫ్‌ఆర్‌ఓ గణేష్ తదితరులు ఉన్నారు.
కాగా అడవిలో ఉన్న వాగులు, గుట్టల వివరాలను అటవీ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. స్థానిక అటవీ శాఖ రేంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే పనులు చేపట్టారు. కలెక్టర్ ధర్మారెడ్డి నర్సాపూర్ అడవులలో పలువురు అధికారులతో పర్యటించిన అనంతరం రాయరావు చెరువు శిఖం వద్ద మొక్క నాటారు.
Comments
Please login to add a commentAdd a comment