గురువారం నర్సాపూర్ అర్బన్ పార్క్‌లో అల్లనేరేడు మొక్కనాటి ఆరో విడత హరితహారాన్ని ప్రారంభిస్తున్న కేసీఆర్. చిత్రంలో పద్మాదేవేందర్ రెడ్డి, మదన్‌రెడ్డి, హరీశ్
నాకు ఎమ్మెల్యే అయిన కొత్తలో ఫియట్ కారు ఉండేది. 1985లో.. నేనే నడుపుకుంటూ తిరిగినటువంటి రోడ్డు ఇది. తూప్రాన్ నుంచి నర్సాపూర్.. సంగారెడ్డి, మెదక్‌కు వచ్చేది. సినిమా వాళ్లకు అటవీ సీన్ కావాలంటే గతంలో అందరూ నర్సాపూర్‌కు వచ్చేవారు. ఆ అడవి ఎక్కడికి పోయినట్లు.. మనమే చేజేతులా పోగొట్టుకున్నం.
సాక్షి, మెదక్: ‘మనం గరీబోళ్లం కాదు.. తెలం గాణ 100 శాతం ధనిక రాష్ట్రమే. కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగులకు 3నెలలు సగం జీతాలు ఇచ్చాం. రైతులకు ఇచ్చేందుకే వారి జీతాల్లో కోత పెట్టాం’అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నేరేడు మొక్కను నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. 630 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించారు. మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులతో కలిసి కాలినడకన తిరుగుతూ పార్కు ప్రాంతంలో చేపట్టిన అటవీ పునరుద్ధరణను పరిశీలించా రు.రాక్‌ఫిల్ డ్యాం, వాటర్ హార్వెస్టింగ్ తది తర పనులపై ఆరా తీశారు. 50 మీటర్ల ఎత్తులో నిర్మించిన వాచ్ టవర్‌పైకి ఎక్కి అటవీ అందాలను తిలకించారు.
అనంతరం పార్కులో 100 మంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో నిరాడంబరంగా జరిగిన భేటీలో ఆయన మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌తో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలు ఆపినప్పటికీ.. రైతు బంధు, గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను విడుదల చేయడం ఆపలేదన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో రైతులు బాగుపడాలన్నదే ప్రభు త్వ ధ్యేయమని.. రైతుల అప్పులు తీరిపోవడంతోపాటు వారి బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికీ కనీసం రూ.లక్ష ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కులో వాచ్ టవర్‌పై నుంచి అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
అడవి దొంగలపై ప్రత్యేక నిఘా..
కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. స్పెషల్ ఆఫీసర్‌ను నియమించామని, అడవిలో చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అడవులను ఎవరైనా పట్టించుకున్నారా.. అని ప్రశ్నించారు. కలప దొంగలు వారి హయాంలోనే ఎక్కువని.. వారి పార్టీల్లోనే ఉన్నారని మండిపడ్డారు. అడవుల పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టిందని.. కలప దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదన్నారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. దీని కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అటవీ శాఖలో రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. 2,200 వాహనాలు ఇచ్చామని గుర్తు చేశారు. మనకు మనమే మేల్కొని.. చేజేతులా పోగుట్టుకున్న అడవులను తిరిగి మనమే వంద శాతం తెచ్చుకోవాలని సూచించారు. దీనికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి కేసీఆర్ పేర్కొన్నారు.
గ్రామానికో నర్సరీ తెలంగాణలోనే..
గతంలో 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు తెలంగాణలో చేపట్టామని కేసీఆర్ వివరించారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్‌ను సమకూర్చడం జరిగిందన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పది వేల మొక్కలను నాటేందుకు ఇబ్బందులు పడ్డామని.. వీటిని దృష్టిలో పెట్టుకుని అన్నీ సమకూర్చినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతీ గ్రామానికి నర్సరీ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో, బాధ్యతగా మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు.
ధర నిర్ణయం రైతులే తీసుకునేలా..
రైతులకు మేలు చేసేందుకే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డిమాండ్‌కు తగ్గ పంటలు వేసి.. మద్దతు ధర పొందేలా రైతులకు సౌకర్యవంతంగా ఒక నిర్ధిష్టమైన విధానాన్ని తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమన్నారు. గ్రామంలో రైతులు ఒకచోట కూర్చొని ఏ పంట సాగు చేయాలి.. ధర ఎంత కేటాయించాలో వారే నిర్ణయించుకునేందుకు వీలుగా రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్ల పరిధిలో మూడు నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సీఎం ఆదేశించారు.
ఇంటికి ఆరు మొక్కలు..
హరితహారంలో భాగంగా ఇంటికి కనీసం ఆరు మొక్కలు నాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇంట్లో వారి పేర్లు ఒక్కోదానికి ఒకరి పేరు పెట్టాలని సూచించారు. ఈ సెంటిమెంట్ పని చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగు వేల చెక్‌డ్యాంలు కడుతున్నామని.. తేమ శాతం పెరిగి పునర్‌వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నర్సాపూర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. 201 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున.. ఏడు మండల కేంద్రాలకు రూ. కోటి చొప్పున.. నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్‌ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శోభ, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి తదితరులు
అందరికీ బాధ్యత తెలిసొచ్చింది...
అడవులపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని.. అడవుల ప్రాముఖ్యతను గుర్తించి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అడవులు అంటే ప్రజాప్రతినిధుల బాధ్యత కాదని అంతకు ముందే అనుకునేవారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో అందరికీ బాధ్యత తెలిసి వచ్చిందన్నారు. మెదక్ జిల్లాలోని 469 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పటయ్యాయని.. సీఎం ఆలోచనలకు అనుగుణంగా చింత, రావి, మర్రి చెట్లు పెంచుతున్నామన్నారు. జిల్లాలో 76 రైతు వేదికలకు కొన్ని ప్రారంభమయ్యాయని తెలిపారు. సీఎం ఆశయాలు, లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో నియంత్రిత సాగుకు రైతులు ఆసక్తి చూపారన్నారు. 2,60,000 ఎకరాల్లో సాగు చేపట్టారని చెప్పారు. ఇప్పటివరకు వరి, పత్తి, కంది, ఇతర పంటలకు సంబంధించి 60 శాతానికిపైగా విత్తనాలు నాటారని వెల్లడించారు.
హైదరాబాద్ చుట్టూ 50 అర్బన్ పార్కులు...
సీఎం కేసీఆర్ కార్యదక్షతతో అన్నింటా విజయవంతంగా ముందుకు సాగుతున్నారని అటవీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అడవుల పునరుద్ధరణకు పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు ఐదు విడతల్లో 182 కోట్ల మొక్కలు నాటామని.. ఆరో విడతలో 30 కోట్ల మొక్కలు నాటనున్నట్లు వివరించారు. నర్సాపూర్ అర్బన్ పార్కు లాగా హైదరాబాద్ చుట్టూ 50 పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యాలయ కార్యదర్శి నర్సింగరావు, అటవీ శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ శోభ, అటవీ శాఖ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుముల మధన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్‌ఓ పద్మజారాణి, మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎఫ్‌ఆర్‌ఓ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
సైడ్‌లైట్స్..
- ‘ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్లకి పిల్లను కూడా ఇయ్యలే. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతుల వద్దే డబ్బులు ఉన్నాయి అని చెప్పడానికి గర్వపడుతున్నా’.. అని సీఎం కేసీఆర్ అనడంతో సమావేశ ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.
- సీఎం కార్యాలయ కార్యదర్శి నర్సింగరావు స్వస్థలం శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం. ఈయన ఆరో విడత హరితహారానికి రాగా.. సీఎం కేసీఆర్ ఆయనను నా కార్యాలయంలో పనిచేసే నర్సాపూర్ ముద్దుబిడ్డ నర్సింగరావు అని సంబోధించడంతో ప్రజాప్రతినిధులు చప్పట్లు కొట్టారు.
- తెలంగాణ వస్తే ఏం సాధిస్తారు అన్నవారికి సరైన సమాధానం చెప్పాం. ఐదేళ్ల ఫలితం ఏంటంటే వ్యవసాయంలో ప్రగతి సాధించడమే ఇందుకు నిదర్శనం. మన రాష్ట్రం నుంచే 55శాతం ధాన్యం ఎఫ్‌సీఐకి ఇచ్చాం. మిషన్ భగీరథలోనూ అద్భుత ప్రగతి సాధించాం. ఇంటింటికీ నీరు బ్రహ్మాండంగా అందుతోంది. బిందెల ప్రదర్శన బంద్ కాలేదా.. అని ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రోహిణి కార్తెను విత్తనాలు నాటే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
- ఒకప్పుడు కౌడిపల్లి పటేళ్ల వ్యవసాయం అంటే పాత మెదక్ జిల్లా అంతా మషూర్ ఉండేది. రెండు, మూడు నెలలు బెల్లం గానుగలు నడిచేవి. అలాంటిది కౌడిపల్లి కాడనే ఇప్పుడు కరవొచ్చింది. ఎక్కడ పడకున్నా పాత మెదక్ జిల్లాలో నర్సాపూర్‌లో వర్షం పడేది. మరి ఎక్కడికి పోయినయ్.. మళ్లీ గట్టిగా చెబుతున్నా.. మనకు మనమే అడవులు వాపస్ తెచ్చుకోవాలి. దండం పెట్టి చెబుతున్నా మనం బాగు పడాలంటే మనమే మేల్కోవాలి. ఎవరో వచ్చి సాయం చేయరు. అని ప్రజాప్రతినిధులకు సీఎం హితబోధ చేశారు.
ఈయన నర్సాపూర్ ముద్దుబిడ్డ..
ఊ సీఎం కార్యాలయ కార్యదర్శి నర్సింగరావు స్వస్థలం శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం. ఈయన ఆరో విడత హరితహారానికి రాగా.. సీఎం కేసీఆర్ ఆయనను నా కార్యాలయంలో పనిచేసే నర్సాపూర్ ముద్దుబిడ్డ నర్సింగరావు అని సంబోధించడంతో ప్రజాప్రతినిధులు చప్పట్లు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment