‘‘మీకేం కాదు. అండగా నేనున్నా. ధైర్యంగా ఉండండి. నేను కూడా కరోనా బారిన పడి కోలుకున్నాను. మీరు కూడా త్వరలోనే మహమ్మారిని జయిస్తారు.’’ అంటూ పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రత్యక్షంగా ఫోన్ చేసి ధైర్యాన్ని నింపుతున్నాడు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. దీంతో పాటు సొంత డబ్బులతో ప్రత్యేక మెడికల్ కిట్‌ను అందిస్తూ బాసటగా నిలుస్తున్నాడు. అటు బాధితులు.. ఇటు కష్టకాలంలో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందితో నిత్యం మాట్లాడుతూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు.
సాక్షి, సిద్దిపేట: స్థానిక కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఏ రోజుకు ఆ రోజు తెప్పించుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం వారికి ప్రత్యక్షంగా ఫోన్ చేసి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తే కరోనాను జయించవచ్చని వారిలో ఆత్మవిశ్వాన్ని పెంచుతున్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని వివరిస్తున్నారు.
ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌తో నిత్యం పర్యవేక్షణ
సిద్దిపేట కోవిడ్ వార్డు, ఆస్పత్రిలో సిబ్బంది పని తీరు, కరోనా బాధితులకు అందిస్తున్న సేవలను తెలుసుకునేందుకు మంత్రి హరీశ్‌రవు ప్రత్యేకంగా ఓ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అందులో నిత్యం బాధితులకు అందిస్తున్న టిఫిన్, భోజనం, డ్రైఫ్రూట్స్, పండ్ల వివరాలతో పాటు ఆస్పత్రి శానిటేషన్ సంబంధించిన పొటోలు పోస్ట్ చేయించి వాటిని పరిశీలిస్తున్నారు. మంత్రి ప్రత్యేక చొరవతో పౌష్టికాహారంతో పాటు మినరల్ వాటర్ బాటిల్స్‌ను సైతం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్య సేవల పై ఆరా తీస్తే వైద్యులకు బాధ్యతగా.. బాధితులకు భరోసాగా నిలుస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కొరత రాకుండా ఎప్పటికప్పుడు సిబ్బందితో మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగ వేలకు పైగా ఇంజక్షన్లను బాధితులకు వినియోగించారు.
రూ. 3 వేల విలువైన మెడికల్ కిట్
పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఆయన సొంత డబ్బులతో ప్రత్యేక మెడికల్ కిట్‌ను అందిస్తున్నాడు. ఈ కిట్ విలువ సుమారు రూ.3 వేల వరకు ఉంటుంది. ఇందులో పల్స్ ఆక్సీమీటర్, డిజిటల్ థర్మామీటర్, ఎన్–95, సర్జికల్ మాస్క్‌లతో పాటు పలు రకాల మందులు ఉంటున్నాయి. సిద్దిపేట నియోజక వర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకలు ద్వారా ఈ కిట్లను బాధితులకు అందజేస్తున్నారు. కిట్‌ల పంపిణీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పాజిటివ్ వచ్చిన రిపోర్ట్‌తోపాటు, సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు
జీరాక్స్‌లను తీసుకుని అందిస్తున్నారు.
కొండంత ధైర్యాన్ని ఇచ్చారు
నాకు, నా కూతురుకి ఒకేసారి పాజిటివ్‌గా తేలింది.మరుసటి రోజునే మంత్రి హరీశ్‌రావు నేరుగా నాకు ఫోన్ చేసి నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ధైర్యాన్ని కల్పించారు. అలాగే మా ఇద్దరికీ కొంత శ్వాస ఇబ్బంది ఉందని చెప్పగానే ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. వైద్యులతో నిత్యం మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు. దీంతో కరోనా నుంచి త్వరగా బయటపడ్డాం. మంత్రి నాతో మాట్లాడడంతో నాకు కొండంత ధైర్యం వచ్చింది.
–రాజయ్య, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment