జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు టేకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పొలాల గట్లపైనే కాకుండా బీడు భూముల్లో నాటించాలనే ప్రణాళిక రూపొందించారు. తద్వారా కొన్నేళ్ల తర్వాత మొక్కలు ఏపుగా పెరిగాక రైతులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందనేది ప్రభుత్వ భావన.
ప్రతీ చిన్న, సన్నకారు రైతుకు ఎకరానికి 150 మొక్కల చొప్పున పంపిణీ చేయనుండగా అందజేస్తారు. ఇక రైతులతో టేకు మొక్కలు నాటించడం ద్వారా హరితహారం లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా టేకు మొక్కలు నాటేందుకు ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో ఉపాధి కూలీలతో గుంతలు తీయడంతో పాటు మొక్కలను నాటించడం కూడా ప్రభుత్వమే కూలీలతో చేయిస్తోంది.
15 వేల మంది రైతులకు...
జిల్లాలోని 15వేల మంది చిన్న, సన్న కారు రైతులను టేకు మొక్కలు పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు. మొత్తం జిల్లాలో 70 లక్షల టేకు మొక్కలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు భూమి రైతులను గుర్తించి ఎకరానికి 150 మొక్కలు పంపిణీ చేస్తారు.
అలాగే, మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో మొక్కకు నెలకు రూ.ఐదు చొప్పున చెల్లిస్తారు. ఇక పెద్ద రైతులకు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా గుంతలు తీయించి మొక్కలు ఉచితంగా అందజేస్తారు. మొక్కల సంరక్షణ మాత్రం వారే చూసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక ఇలా...
చిన్న రైతుల విషయానికొస్తే టేకు మొక్కలు తీసుకునేందుకు ఉపాధి హామీ జాబ్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. అదే పెద్ద రైతులైతే ఆధార్ కార్డు ఆధారంగా మొక్కలు అందజేస్తారు. మొక్కల పంపినీ ప్రక్రియ మొత్తం ఎంపీడీఓల ద్వారా కొనసాగుతుంది. భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు, ఆదౠర్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ కచ్చి తంగా ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తారు.
గతం కన్నా ఎక్కువ...
గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన హరిత హారం మూడో విడతలో టేకు మొక్కలు నాటించారు. అయితే, అంతకు మించి ఈసారి 70లక్షలకు పైగా టేకు మొక్కల పంపిణీ, నాటించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని అటవీ శాఖ, డీఆర్డీఓ నర్సరీల ద్వారా 1.23 కోట్ల టేకు మొక్కలు సిద్ధం చేశారు.
మొక్కకు రూ.5
రైతులు తమ పొలంలో టేకు మొక్కలు నాటితే సంరక్షణకు కూడా ప్రభుత్వమే నిధులు ఇవ్వనుంది. ప్రతీ మొక్కుకు రూ.5 చొప్పున రైతులకు ఇ స్తారు. ఇలా 400 మొక్కలు ఉన్న రైతులకు నెలకు రూ.2 వేల చొప్పున, 800 మొక్కలు నాటితే రూ.4వేల చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక సాయం అందుతుంది. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాక ప్రతీ నెల రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేశాక నిధులు విడుదల అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment