Teak plants
-
గట్టు.. టేకు నాటు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు టేకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పొలాల గట్లపైనే కాకుండా బీడు భూముల్లో నాటించాలనే ప్రణాళిక రూపొందించారు. తద్వారా కొన్నేళ్ల తర్వాత మొక్కలు ఏపుగా పెరిగాక రైతులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందనేది ప్రభుత్వ భావన. ప్రతీ చిన్న, సన్నకారు రైతుకు ఎకరానికి 150 మొక్కల చొప్పున పంపిణీ చేయనుండగా అందజేస్తారు. ఇక రైతులతో టేకు మొక్కలు నాటించడం ద్వారా హరితహారం లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా టేకు మొక్కలు నాటేందుకు ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో ఉపాధి కూలీలతో గుంతలు తీయడంతో పాటు మొక్కలను నాటించడం కూడా ప్రభుత్వమే కూలీలతో చేయిస్తోంది. 15 వేల మంది రైతులకు... జిల్లాలోని 15వేల మంది చిన్న, సన్న కారు రైతులను టేకు మొక్కలు పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు. మొత్తం జిల్లాలో 70 లక్షల టేకు మొక్కలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు భూమి రైతులను గుర్తించి ఎకరానికి 150 మొక్కలు పంపిణీ చేస్తారు. అలాగే, మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో మొక్కకు నెలకు రూ.ఐదు చొప్పున చెల్లిస్తారు. ఇక పెద్ద రైతులకు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా గుంతలు తీయించి మొక్కలు ఉచితంగా అందజేస్తారు. మొక్కల సంరక్షణ మాత్రం వారే చూసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక ఇలా... చిన్న రైతుల విషయానికొస్తే టేకు మొక్కలు తీసుకునేందుకు ఉపాధి హామీ జాబ్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. అదే పెద్ద రైతులైతే ఆధార్ కార్డు ఆధారంగా మొక్కలు అందజేస్తారు. మొక్కల పంపినీ ప్రక్రియ మొత్తం ఎంపీడీఓల ద్వారా కొనసాగుతుంది. భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు, ఆదౠర్కార్డు, బ్యాంక్ అకౌంట్ కచ్చి తంగా ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తారు. గతం కన్నా ఎక్కువ... గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన హరిత హారం మూడో విడతలో టేకు మొక్కలు నాటించారు. అయితే, అంతకు మించి ఈసారి 70లక్షలకు పైగా టేకు మొక్కల పంపిణీ, నాటించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని అటవీ శాఖ, డీఆర్డీఓ నర్సరీల ద్వారా 1.23 కోట్ల టేకు మొక్కలు సిద్ధం చేశారు. మొక్కకు రూ.5 రైతులు తమ పొలంలో టేకు మొక్కలు నాటితే సంరక్షణకు కూడా ప్రభుత్వమే నిధులు ఇవ్వనుంది. ప్రతీ మొక్కుకు రూ.5 చొప్పున రైతులకు ఇ స్తారు. ఇలా 400 మొక్కలు ఉన్న రైతులకు నెలకు రూ.2 వేల చొప్పున, 800 మొక్కలు నాటితే రూ.4వేల చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక సాయం అందుతుంది. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాక ప్రతీ నెల రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదుచేశాక నిధులు విడుదల అవుతాయి. -
రైతుల కోసం టేకు మొక్కలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రైతులకు సరఫరా చేసేందుకు 40 లక్షల టేకు మొక్కల అభివృద్ధికి డ్వామా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు తమిళనాడు, కోయంబత్తూర్ నుంచి టేకు స్టంపులను తెప్పించి నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రతి ఏటా నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచిన డ్వామా అధికారులు రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఈ ఏడాది నాలుగో విడత హరితహారంలో టేకు మొక్కలను మాత్రమే పెంచాలని నిర్ణయించారు. గతేడాది 60 లక్షల మొక్కల పెంపకం లక్ష్యాన్ని ఈసారి 40 లక్షలకు కుదించారు. ఈ ఏడాది హరితహారం లక్ష్యం కోటి 84 లక్షల మొక్కల పెంపకం కాగా.. అత్యధిక లక్ష్యం ఫారెస్టు శాఖ అధికారులే నిర్ణయించుకున్నారు. డ్వామా అధికారులు 40 లక్షల టేకు మొక్కల పెంపకానికి మొదట మండలాల ఏపీఓల నుంచి ప్రణాళికలు తెప్పించుకున్నారు. మొక్కల పెంపకానికి జిల్లావ్యాప్తంగా మండలానికి రెండు నుంచి నాలుగు నర్సరీల చొప్పున మొత్తం 44 నర్సరీలను కూడా గుర్తించారు. జిల్లాకు చేరిన 30 లక్షల స్టంపులు.. గతేడాది టెండరు తీసుకున్న కాంట్రాక్టర్ సమయానికి స్టంపులను సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రత్యామ్నాయంగా అధికారులే విత్తనాలు తెచ్చి పాలిథిన్ బ్యాగ్‌లలో ఉపాధి కూలీలతో మట్టి నింపి మొలకెత్తేలా చేశారు. ఈ ఏడాది ముందుచూపుతో ఒక్కో టేకు స్టంపును 95 పైసలకు టెండరు ద్వారా తమిళనాడు, కోయంబత్తూర్ నుంచి మొక్కల కొనుగోలుకు ఒప్పందం కుదరగా, ఇప్పటి వరకు జిల్లాకు 30 లక్షల టేకు స్టంపులు వచ్చాయి. ఇటు సరిపడా పాలిథిన్ బ్యాగ్‌లను కూడా టెండరు ద్వారా కొనుగోలు చేసిన అధికారులు 39 లక్షల బ్యాగ్‌లలో కూలీలతో మట్టి నింపించి సిద్ధంగా ఉంచగా, 28 లక్షల బ్యాగ్‌లలో స్టంపులను ఫిట్టింగ్ చేశారు. జిల్లాకు ఇంకా 10 లక్షల టేకు స్టంపులు సరఫరా కావాల్సి ఉంది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ మహబూబ్‌నగర్‌కు చెందిన వారు కాగా తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి కొనుగోలు చేసి ఆయన జిల్లాకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ 40 లక్షల టేకు మొక్కలే కాకుండా గతేడాది మిగిలిన 8 లక్షల పండ్లు, పూల మొక్కలను కూడా టేకు మొక్కలతో కలిపి హరితహారం కార్యక్రమంలో నాటనున్నారు. టేకు మొక్కలన్నీ రైతులకే.. డ్వామా అధికారులు గతేడాది హరితహారంలో 60 లక్షల లక్ష్యంతో వివిధ రకాల మొక్కలను నర్సరీల్లో పెంచారు. ఆ మొక్కలను రైతులకే కాకుండా నివాసగృహాల్లో పెంచేందుకు కూడా అందజేశారు. ఈసారి టేకు మొక్కలను రైతులకే ఇవ్వనున్నారు. మొక్కల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు అధిక భూమి ఉంటే కోరినన్నీ (600 వరకు) టేకు మొక్కలను అందించనున్నారు. కాగా రైతుకు ఉన్న భూమి ఎకరాలను బట్టి మొక్కలను ఉచితంగా అందజేస్తారు. రైతులకు ఖర్చు లేకుండా ఉపాధిహామీ కింద మొక్కలు నాటేందుకు గుంతలను కూడా ఉచితంగా తవ్విస్తారు. తన భూమిలో నాటిన మొక్కలను నీళ్లు పట్టి సంరక్షించినందుకు గాను ఒక మొక్కకు నెలకు రూ.5 చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇవ్వనుంది. తద్వారా రైతుకు రెండు రకాలుగా మేలు జరుగనుంది. మరో 10 లక్షల స్టంపులు రానున్నాయి గతేడాది టేకు మొక్కలు కాకుండా 60 లక్షల వరకు వివిధ రకాల మొక్కలు పెంచాం. కానీ ఇప్పుడు రైతులకు మేలు చేయడానికి అధిక ధర కలిగిన టేకు మొక్కలను అందించనున్నాం. ఇందుకు 40 లక్షల టేకు మొక్కలను పెంచడానికి పక్క రాష్ట్రం నుంచి స్టంపులు కొనుగోలు చేసి తెప్పిస్తున్నాం. ఇప్పటి వరకు 30 లక్షల స్టంపులు వచ్చాయి. మరో 10 లక్షల స్టంపులు త్వరలోనే రానున్నాయి. వీటిని నర్సరీల్లో పెంచుతున్నాం. – వెంకటేశ్వర్లు, డీఆర్డీవో -
2.50కోట్ల టేకు మొక్కల పెంపకం
డ్వామా పీడీ వై.శేఖర్‌రెడ్డి హసన్‌పర్తి : జిల్లావ్యాప్తంగా 2.50కోట్ల టేకు మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ వై.శేఖర్‌రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హరితహారం కింద అన్ని గ్రామాల్లో టేకు మొక్కల పెంచడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దీనికోసం టేకు నర్సరీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డ్వామా ద్వారా 1.10కోట్లు, అటవీ శాఖ ద్వారా 1.40కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయిం చినట్లు చెప్పారు. హసన్‌పర్తి మండలం సీతానాగారం, అన్నాసాగరంలో నర్సరీలు ఏర్పాటు చేయగా, సీతంపేట, అర్వపల్లి, సిద్ధాపురం గ్రామాల్లో అటవీ శాఖ నర్సరీలు ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో 30వేల టేకు మొక్కలు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సన్న, చిన్నకారు రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలు మొక్కలు పెంచడానికి అర్హులని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రధాన రహదారులు, ఎస్సారెస్పీ భూముల్లో సైతం మొక్కలు పెంపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక్క మొక్కను పెంచడానికి నెలకు రూ.5 చొప్పున చెల్లిస్తామని అన్నారు. మొక్కలు నాటడం(గుంతలు తీయడం, నాటడం) కోసం రూ.16.50 చెల్లిస్తామని వివరించారు. పనులను స్వశక్తి గ్రూపులకు అప్పగించనున్నట్లు తెలిపారు. కాగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీతానాగారం ఫీల్డ్ అసిస్టెంట్ రవిని సస్పెండ్ చేస్తున్నట్లు పీడీ శేఖర్‌రెడ్డి తెలిపారు. ‘మామిడి’కి ప్రోత్సాహం అలాగే మామిడి మొక్కల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తున్నట్లు డ్వామా పీడీ తెలిపారు. మొక్కల పెంపకం ఖర్చు నిమిత్తం ఒక్కో మొక్కకు ప్రతి నెలా రూ.15 చొప్పున భరిస్తామన్నారు. మూడేళ్లపాటు ప్రభుత్వమే మొక్కల మెరుుంటనెన్స్ కో సం డబ్బులు చెల్లిస్తుందన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీవాణి, ఏపీడీ మాలతి, ఏపీఓ సుశీల్‌కుమార్ పాల్గొన్నారు. -
‘మొక్క’బడి
ఈజీఎస్ కింద టేకు మొక్కల దిగుమతి అధికారుల నిర్లక్ష్యంతో మూలనపడ్డ వైనం రైతులకు అందకుండానే ఎండుముఖం రూ.లక్షల ప్రజాధనం వృథా అధికారుల నిర్లక్ష్యం పచ్చని మొక్కల ప్రాణం తీసేసింది.. ఏపుగా ఎదిగి రైతులకు గణనీయమైన ఆదాయం సమకూర్చాల్సిన విలువైన టేకు మొక్కలు నాటకుండానే ఎండు ముఖం పట్టాయి.. లక్షల రూపాయలు వెచ్చించి తీసిన గుంతలు పూడుకుపోయాయి.. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్న వేల మొక్కలు నిరుపయోగంగా మారాయి.. వెరసి ప్రజాధనం వృథా అవుతోంది.. ఉపాధిహామీ (ఈజీఎస్) పథక లక్ష్యం నీరుగారుతోంది.. - యాచారం వ్యవసాయ పొలాల్లో నాటుకునేందుకు చిన్న, సన్నకారు రైతులకు ఈజీఎస్ పథకం (ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీం) కింద ఉచితంగా టేకు మొక్కలు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది మండలంలోని 20 గ్రామాల్లో 626 మంది రైతులకు చెందిన వ్యవసాయ పొలాల్లో లక్ష 65 వేలకు పైగా టేకు మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడు నెలల క్రితం ఇతర జిల్లాల నుంచి మొక్కలు తెప్పించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా గుంతకు రూ. 13 చొప్పున కేటాయించి, రూ. 20 లక్షలకు పైగా ఖర్చు చేశారు. కానీ 195 మంది రైతులకు చెందిన వ్యవసాయ పొలాల్లో కేవలం 43,400 టేకు మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. రైతుల్లో సరైన చైతన్యం కల్పించకపోవడంతో ఏ గ్రామంలో చూసినా టేకు మొక్కలు నాటకుండానే చచ్చిపోయి కనిపిస్తున్నాయి. గాండ్లగూడంలోని నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తెచ్చిపెట్టిన మొక్కలు పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎండిపోయి మూలన పడి ఉన్నాయి. గుంతలకు రూ. 20 లక్షలు వృథా... టేకు మొక్కలు నాటుకోవడం కోసం ఆసక్తి ఉన్న రైతులకు కూలీల ద్వారా ఉచితంగానే గుంతలు తీయించి, మొక్కలు పంపిణీ చేస్తారు. నీటి సౌకర్యం కలిగిన రైతులు మూడేళ్ల పాటు పోషణ చేస్తే ఈజీఎస్ నుంచి ప్రతి నెలా నిర్వాహణ బిల్లులు అందజేస్తారు. అయితే మండల అధికారుల నిర్వాకంతో రూ. లక్షలు ఖర్చు చేసి ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్న విలువైన టేకు మొక్కలు వృథా అయ్యాయి. గ్రామాల్లో రూ. 20 లక్షలు ఖర్చు చేసి తవ్విన వేలాది గుంతలు పూడుకుపోయాయి. ఆయా గ్రామాల్లో 43,400 గుంతల్లో మొక్కలు నాటారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటిన మొక్కల్లో ఎన్ని బతికున్నాయో, ఎన్ని చనిపోయాయో కూడా సందేహాస్పదంగా మారింది. ఇదే విషయమై ఈజీఎస్ ఏపీఓ నాగభూషణంను వివరణ కోరగా అప్పట్లో రవాణ సమయంలో మొక్కలు దెబ్బతినడం వల్ల అలా వదిలేశామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇదే విషయమై యాచారం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఈజీఎస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.