ఈజీఎస్ కింద టేకు మొక్కల దిగుమతి
అధికారుల నిర్లక్ష్యంతో మూలనపడ్డ వైనం
రైతులకు అందకుండానే ఎండుముఖం
రూ.లక్షల ప్రజాధనం వృథా
అధికారుల నిర్లక్ష్యం పచ్చని మొక్కల ప్రాణం తీసేసింది.. ఏపుగా ఎదిగి రైతులకు గణనీయమైన ఆదాయం సమకూర్చాల్సిన విలువైన టేకు మొక్కలు నాటకుండానే ఎండు ముఖం పట్టాయి.. లక్షల రూపాయలు వెచ్చించి తీసిన గుంతలు పూడుకుపోయాయి.. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్న వేల మొక్కలు నిరుపయోగంగా మారాయి.. వెరసి ప్రజాధనం వృథా అవుతోంది.. ఉపాధిహామీ (ఈజీఎస్) పథక లక్ష్యం నీరుగారుతోంది..
- యాచారం
వ్యవసాయ పొలాల్లో నాటుకునేందుకు చిన్న, సన్నకారు రైతులకు ఈజీఎస్ పథకం (ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ స్కీం) కింద ఉచితంగా టేకు మొక్కలు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది మండలంలోని 20 గ్రామాల్లో 626 మంది రైతులకు చెందిన వ్యవసాయ పొలాల్లో లక్ష 65 వేలకు పైగా టేకు మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడు నెలల క్రితం ఇతర జిల్లాల నుంచి మొక్కలు తెప్పించారు.
ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా గుంతకు రూ. 13 చొప్పున కేటాయించి, రూ. 20 లక్షలకు పైగా ఖర్చు చేశారు. కానీ 195 మంది రైతులకు చెందిన వ్యవసాయ పొలాల్లో కేవలం 43,400 టేకు మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. రైతుల్లో సరైన చైతన్యం కల్పించకపోవడంతో ఏ గ్రామంలో చూసినా టేకు మొక్కలు నాటకుండానే చచ్చిపోయి కనిపిస్తున్నాయి. గాండ్లగూడంలోని నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తెచ్చిపెట్టిన మొక్కలు పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎండిపోయి మూలన పడి ఉన్నాయి.
గుంతలకు రూ. 20 లక్షలు వృథా...
టేకు మొక్కలు నాటుకోవడం కోసం ఆసక్తి ఉన్న రైతులకు కూలీల ద్వారా ఉచితంగానే గుంతలు తీయించి, మొక్కలు పంపిణీ చేస్తారు. నీటి సౌకర్యం కలిగిన రైతులు మూడేళ్ల పాటు పోషణ చేస్తే ఈజీఎస్ నుంచి ప్రతి నెలా నిర్వాహణ బిల్లులు అందజేస్తారు.
అయితే మండల అధికారుల నిర్వాకంతో రూ. లక్షలు ఖర్చు చేసి ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్న విలువైన టేకు మొక్కలు వృథా అయ్యాయి. గ్రామాల్లో రూ. 20 లక్షలు ఖర్చు చేసి తవ్విన వేలాది గుంతలు పూడుకుపోయాయి. ఆయా గ్రామాల్లో 43,400 గుంతల్లో మొక్కలు నాటారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటిన మొక్కల్లో ఎన్ని బతికున్నాయో, ఎన్ని చనిపోయాయో కూడా సందేహాస్పదంగా మారింది. ఇదే విషయమై ఈజీఎస్ ఏపీఓ నాగభూషణంను వివరణ కోరగా అప్పట్లో రవాణ సమయంలో మొక్కలు దెబ్బతినడం వల్ల అలా వదిలేశామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇదే విషయమై యాచారం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఈజీఎస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
‘మొక్క’బడి
Published Sun, Nov 30 2014 12:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement