ముంబైలో పుట్టిన ముంతాజ్ (నగ్మా ఖాన్) తమిళ సినిమాతో ప్రపంచానికి పరిచయం అయింది. ఆపై తెలుగులో దాదాపు 16 ఏళ్లుగా చాలా సినిమాలలో తన గ్లామర్ డ్యాన్స్‌లతో మెప్పించింది. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్‌తో మాత్రమే ఆమెకు గుర్తింపు వచ్చింది. అందులోనూ చాలా గ్లామర్‌గా సాంగ్స్‌లలో కనిపించడంతో ఆమె పేరు బాగా వైరల్ అయింది. అయితే, తన కెరీర్ చాలా పీక్‌లో ఉన్నప్పుడే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేసింది. ముఖ్యంగా తెలుగులో ఖుషి,అత్తారింటికి దారేది చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌లలో ఆమె డ్యాన్స్‌ను ఎవరూ మరిచిపోరు.
తనకు 21 ఏళ్ల వయసులోనే పాటలలో మితిమీరిన గ్లామర్‌గా కనిపించి అందరినీ షాక్ అయ్యేలా చేసింది ముంతాజ్(Mumtaz ). 1999లోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, జెమినీ, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, ఆగడు తదితర చిత్రాల్లో అతిథి పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరగా 2015లో 'టామీ' అనే తెలుగు సినిమాలో కనిపించింది.
సినిమాలకు ఎందుకు దూరం అయింది..?
నటిగా కెరీర్ ఓ మాదిరిగా ఉండగానే పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసింది. హిజాబ్ ధరించింది. అయితే ఇలా పూర్తిగా నటనని పక్కనబెట్టేయడానికి గల కారణాన్ని కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించింది. 'నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్‌లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలియదు . ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను' అని మాజీ నటి ముంతాజ్ చెప్పుకొచ్చింది. సినిమా నుంచి పూర్తిగా తప్పుకున్న ముంతాజ్ ఇప్పుడు దైవభక్తి, ఆధ్యాత్మికతలో పూర్తిగా మునిగిపోయింది. ఆమె ఇప్పటికి మూడు సార్లు మక్కా వెళ్లింది.
నేను చనిపోయిన తర్వాత ఫోటోలు షేర్ చేయకండి
ఇంట్లో నా తోబుట్టువుల పిల్లలతో కలిసి నేను చేసిన డ్యాన్స్ పాటలను చూడలేకపోయాను. అంతలా ఆ గ్లామరస్ సాంగ్స్ నన్ను ఇబ్బంది పెట్టాయి. నేను చిన్న వయసులో ఉండగానే గ్లామర్ పాత్రలలో నటించాను. అప్పుడు నేను దేనికీ భయపడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం చాలా బాధ పడుతున్నాను. నేను ప్రేక్షకులతో పాటు నెటిజన్లను వేడుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత, నా అగ్లీ (అంటే బోల్డ్, గ్లామరస్) ఫోటోలను షేర్ చేయకండి. ఇది నా చివరి కోరికగా తీసుకోండి. మీరు నా అగ్లీ ఫోటోలను షేర్ చేస్తే, అది నా మరణంలో కూడా నాకు బాధ కలిగిస్తుంది.' అని ఆమె మాట్లాడింది.
నాకు పెళ్లిపై ఆశలు లేవు
తాను గ్లామరస్‌గా నటించినందుకు పెళ్లి చేసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. తన శృంగార భరిత ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నానని, అయితే ఆ పని తనకు సాధ్యం కావడం లేదని తెలిపింది. కాబట్టి అభిమానులు సాధ్యమైనంత వరకూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని వేడుకుంది. ఇకపై తనకు వివాహం జరుగుతుందనే నమ్మకం లేదని, అది జరుగుతుందా..? అన్నది వేచి చూద్దాం అని నటి ముంతాజ్ తన కన్నీటి కథను చెప్పింది. ఆమె చివరిగా నటించిన తమిళ చిత్రం రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రాజాది రాజా. అందులో ప్రతినాయకిగా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment