
టైటిల్: హత్య; నటీనటులు: ధన్యా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్ తదితరులు. నిర్మాత: ప్రశాంత్ రెడ్డి; కథ–స్క్రీన్ ప్లే–దర్శకత్వం: శ్రీవిద్య బసవ; సంగీతం: నరేశ్ కుమరన్.పి సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్; ఎడిటర్: అనిల్ కుమార్ .పి; ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి దర్శక–నిర్మాతలు లోతైన పరిశోధన చేసి, దాగి ఉన్న పలు విషయాలను సేకరించినట్లుగా సినిమా చూసినవారికి అనిపించడం సహజం.
ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు చెప్పేలా కథ ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెంటనేపాపులర్ అయింది... నిజంగా ఏం జరిగింది? అనేదానికి ఈ సినిమా నిజమైన నమూనానా? హత్య వెనక ఉన్న నిజమైన హంతకులను ఈ సినిమా బయటపెట్టిందా? జరిగిన విషయాన్ని ఎలా తారుమారు చేసి, ప్రచారం చేస్తున్నారో ఈ సినిమా చూపించిందా? ‘హత్య’ సినిమా బయటపెట్టిన నిజాలు ఏంటి? ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారు, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అవుతున్నవారు చూడాల్సిన చిత్రం ఇది.
ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే...
ఇల్లందులో రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) దారుణ హత్యకు గురవుతాడు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడని నిర్ధారణ అవుతుంది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి (భరత్) నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సుధ (ధన్యా బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. ఆమె తన టీమ్‌తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారణ మొదలుపెడుతుంది. అజాత శత్రువు అయిన ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా నరికి చంపింది ఎవరు? ధర్మేంద్రకు, సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి? పొలిటికల్ ఎజెండాతో ఈ హత్య చేశారా?\
ఆర్థిక సమస్యలే కారణమా? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు)ను తప్పుదోవ పట్టించింది ఎవరు? చిన్నాన్న హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చడానికి సీఎం కిరణ్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గత ప్రభుత్వం దగ్గర అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు ఈ కేసును ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అనేక ఒత్తిడిలను తట్టుకొని ఐపీఎస్ అధికారి సుధ ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది? కేసు విచారణ చివరి దశలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ సినిమా కథంతా కల్పితమే అని చిత్రబృందం పేర్కొన్నప్పటికీ.. సినిమాప్రారంభంలోనే ఇది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆమె రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. సినిమాప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు దర్శకురాలు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వస్తుంటే.. ‘ఇది కదా అసలు నిజం’ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సలీమా, ధర్మేంద్రల మధ్య లవ్‌స్టోరీ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు ఎంతో పకడ్బందీగా రీసెర్చ్ చేసి, లవ్‌స్టోరీ చెప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్ పండించారు.
ఎవరెలా చేశారంటే..
ధర్మేంద్ర రెడ్డిపాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా ధన్యా బాలకృష్ణ తనపాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో పూజా రామచంద్రన్ మెప్పించారు. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్... మిగిలిన నటీనటులు వారిపాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నరేశ్ కుమరన్ .పి అందించిన నేపథ్య సంగీతం,పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.