రైతుల కోసం టేకు మొక్కలు | fourty lakhs Teak Plants for Distribution | Sakshi
Sakshi News home page

రైతుల కోసం టేకు మొక్కలు

Published Tue, Feb 27 2018 12:51 PM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

fourty lakhs Teak Plants for Distribution - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌):  రైతులకు సరఫరా చేసేందుకు 40 లక్షల టేకు మొక్కల అభివృద్ధికి డ్వామా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు తమిళనాడు, కోయంబత్తూర్‌ నుంచి టేకు స్టంపులను తెప్పించి నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రతి ఏటా నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచిన డ్వామా అధికారులు రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఈ ఏడాది నాలుగో విడత హరితహారంలో టేకు మొక్కలను మాత్రమే పెంచాలని నిర్ణయించారు. గతేడాది 60 లక్షల మొక్కల పెంపకం లక్ష్యాన్ని ఈసారి 40 లక్షలకు కుదించారు. ఈ ఏడాది హరితహారం లక్ష్యం కోటి 84 లక్షల మొక్కల పెంపకం కాగా.. అత్యధిక లక్ష్యం ఫారెస్టు శాఖ అధికారులే నిర్ణయించుకున్నారు. డ్వామా అధికారులు 40 లక్షల టేకు మొక్కల పెంపకానికి మొదట మండలాల ఏపీఓల నుంచి ప్రణాళికలు తెప్పించుకున్నారు. మొక్కల పెంపకానికి జిల్లావ్యాప్తంగా మండలానికి రెండు నుంచి నాలుగు నర్సరీల చొప్పున మొత్తం 44 నర్సరీలను కూడా గుర్తించారు. 

జిల్లాకు చేరిన 30 లక్షల స్టంపులు..
గతేడాది టెండరు తీసుకున్న కాంట్రాక్టర్‌ సమయానికి స్టంపులను సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రత్యామ్నాయంగా అధికారులే విత్తనాలు తెచ్చి పాలిథిన్‌ బ్యాగ్‌లలో ఉపాధి కూలీలతో మట్టి నింపి మొలకెత్తేలా చేశారు. ఈ ఏడాది ముందుచూపుతో ఒక్కో టేకు స్టంపును 95 పైసలకు టెండరు ద్వారా తమిళనాడు, కోయంబత్తూర్‌ నుంచి మొక్కల కొనుగోలుకు ఒప్పందం కుదరగా, ఇప్పటి వరకు జిల్లాకు 30 లక్షల టేకు స్టంపులు వచ్చాయి. ఇటు సరిపడా పాలిథిన్‌ బ్యాగ్‌లను కూడా టెండరు ద్వారా కొనుగోలు చేసిన అధికారులు 39 లక్షల బ్యాగ్‌లలో కూలీలతో మట్టి నింపించి సిద్ధంగా ఉంచగా, 28 లక్షల బ్యాగ్‌లలో స్టంపులను ఫిట్టింగ్‌ చేశారు. జిల్లాకు ఇంకా 10 లక్షల టేకు స్టంపులు సరఫరా కావాల్సి ఉంది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మహబూబ్‌నగర్‌కు చెందిన వారు కాగా తమిళనాడులోని కోయంబత్తూర్‌ నుంచి కొనుగోలు చేసి ఆయన జిల్లాకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ 40 లక్షల టేకు మొక్కలే కాకుండా గతేడాది మిగిలిన 8 లక్షల పండ్లు, పూల మొక్కలను కూడా టేకు మొక్కలతో కలిపి హరితహారం కార్యక్రమంలో నాటనున్నారు.

టేకు మొక్కలన్నీ రైతులకే..
డ్వామా అధికారులు గతేడాది హరితహారంలో 60 లక్షల లక్ష్యంతో వివిధ రకాల మొక్కలను నర్సరీల్లో పెంచారు. ఆ మొక్కలను రైతులకే కాకుండా నివాసగృహాల్లో పెంచేందుకు కూడా అందజేశారు. ఈసారి టేకు మొక్కలను రైతులకే ఇవ్వనున్నారు. మొక్కల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు అధిక భూమి ఉంటే కోరినన్నీ (600 వరకు) టేకు మొక్కలను అందించనున్నారు. కాగా రైతుకు ఉన్న భూమి ఎకరాలను బట్టి మొక్కలను ఉచితంగా అందజేస్తారు. రైతులకు ఖర్చు లేకుండా ఉపాధిహామీ కింద మొక్కలు నాటేందుకు గుంతలను కూడా ఉచితంగా తవ్విస్తారు. తన భూమిలో నాటిన మొక్కలను నీళ్లు పట్టి సంరక్షించినందుకు గాను ఒక మొక్కకు నెలకు రూ.5 చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇవ్వనుంది. తద్వారా రైతుకు రెండు రకాలుగా మేలు జరుగనుంది.

మరో 10 లక్షల స్టంపులు రానున్నాయి
గతేడాది టేకు మొక్కలు కాకుండా 60 లక్షల వరకు వివిధ రకాల మొక్కలు పెంచాం. కానీ ఇప్పుడు రైతులకు మేలు చేయడానికి అధిక ధర కలిగిన టేకు మొక్కలను అందించనున్నాం. ఇందుకు 40 లక్షల టేకు మొక్కలను పెంచడానికి పక్క రాష్ట్రం నుంచి స్టంపులు కొనుగోలు చేసి తెప్పిస్తున్నాం. ఇప్పటి వరకు 30 లక్షల స్టంపులు వచ్చాయి. మరో 10 లక్షల స్టంపులు త్వరలోనే రానున్నాయి. వీటిని నర్సరీల్లో పెంచుతున్నాం.   – వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement