ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..
అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్‌లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?.
అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.
ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్‌లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.
అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ వివరణలలేవీ వైల్డ్‌లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.
వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.
ఏమేం ఉన్నాయంటే..
వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్‌మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది.
ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment