criticism
-
కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఫైర్
సాక్షి,వరంగల్ జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. శనివారం(అక్టోబర్ 26) స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ ఫిరాయించిన వారిని కేటీఆర్ రాజకీయ వ్యభిచారి అనడం సిగ్గుచేటు. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిన తర్వాత ఎందరో పార్టీ మారారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటాం.కేటీఆర్ అహంకార, బలుపు వ్యాఖ్యలు సహించేది లేదు. 2014 ముందు నీ ఆస్తులు ఎంత,ఇప్పుడు ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలి. గురివింద గింజ కింద నలుపు ఎరుగది అన్నట్లు కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం. 2014లో పార్టీ మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వలేదా. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదా. పార్టీ ఫిరాయింపులకు తెర లేపిందే బీఆర్ఎస్. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’అని కడియం హెచ్చరించారు.ఇదీ చదవండి: కేసులకు భయపడం ఏం చేస్తారో చేస్కోండి: కేటీఆర్ -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్‌రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
నింద భోజనం
కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ ‘నిందలు వేయరాదు’ అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! ‘వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట’ అన్నాడాయన. సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ‘ఏం చేస్తామండీ ఖర్మ’ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం. కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి ‘బాల వ్యాకరణం’ వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని ‘అవును.. కాపీయే’ అని నిందించడం. ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. ‘లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి’ అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి ‘రాధికా సాంత్వనం’ ఎంత సాంత్వనం కోల్పోయిందని?తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, ‘నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ’ అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు. నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే. నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధు లతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్ఛీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ! -
‘కామ్ కీ బాత్’ ఏనాడూ చెప్పలేదు
సురాన్‌కోట్(జమ్మూకశీ్మర్)/శ్రీనగర్: జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్య, ధరల కట్టడిని మోదీ నిర్లక్ష్యం చేశారని ఎండగట్టారు. సోమవారం పూంఛ్ జిల్లాలోని సురాన్‌కోట్ శాసనసభ నియోజకవర్గంలో, శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘నెలకోసారి ‘మన్ కీ బాత్’ముచ్చట్లతో మోదీ మోతెక్కిస్తారు. కానీ ఏనాడూ తాను పూర్తిచేయాల్సిన కీలక బాధ్యతలను ప్రస్తావించరు. బాధ్యతలను విస్మరించారు. ఉద్యోగాల కల్పన, ధరల కట్టడి వంటి చేయాల్సిన పనులపై ‘కామ్ కీ బాత్’ఏనాడూ చెప్పరు. గతంలో 56 అంగుళాల ఛాతి అంటూ గొప్పలు చెప్పుకుని తిరిగిన ఆనాటి మోదీ ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆయన మూడ్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాల ‘ఇండియా’కూటమి మార్చేసింది. ప్రధాని మోదీ సైకాలజీని మా కూటమి దెబ్బకొట్టింది’’అని రాహుల్ అన్నారు. కశ్మీర్‌ను ఢిల్లీ సర్కార్ కాదు, స్థానికులే పాలించాలి జమ్మూకశీ్మర్‌ను ఢిల్లీ ప్రభుత్వం కాకుండా స్థానికులే పాలించాలని రాహుల్ అన్నారు. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మోదీ సర్కార్ నేరుగా పరిపాలిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలుచేశారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లను రాష్ట్రాలుగా మార్చారుగాగానీ రాష్ట్రాన్ని యూటీగా మార్చడం భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పూర్తిస్థాయి రాష్ట్రమైన జమ్మూకశీ్మర్‌ను యూటీగా మార్చి ఇక్కడి పౌరుల హక్కులను కాలరాశారు’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం పాల్గొన్నారు. వాళ్లు చేయకుంటే మేమే చేస్తాం ‘‘జమ్మూకశీ్మర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కోసం కేంద్రప్రభుత్వంతో పోరాడతాం. అయినా వాళ్లు ఇవ్వకపోతే మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేమే హోదా ఇస్తాం. యూటీకాకమునుపు స్థానికులే కశీ్మర్‌ను పాలించేవారు. ఇక్కడి వారి భవిష్యత్తు, ప్రయోజనాలకనుగుణంగా నిర్ణయాలు జరిగేవి. ఇప్పుడు ‘బయటి’వ్యక్తులు మీ గొంతుక వినకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నడిపిస్తోంది. మేం మీ ప్రభుత్వాన్ని జమ్మూకశీ్మరే నడపాలని కోరుకుంటున్నాం. మీ సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎలుగెత్తి చాటేందుకు మీ గొంతుకనవుతా’’అని స్థానికులనుద్దేశించి రాహుల్ అన్నారు. జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దఫాలో 26 స్థానాలకుగాను సెపె్టంబర్ 25న జరగబోయే పోలింగ్‌కు ప్రచారం సోమవారంతో ముగిసింది. కుల గణన అనడానికే మోదీ జంకుతున్నారు కుల గణన అనడానికి కూడా ప్రధాని మోదీ జంకుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, బీజేపీని విమర్శిస్తూ రాహుల్ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హిందీలో పలు పోస్ట్‌లుచేశారు. ‘‘బీజేపీ పూర్తిగా బహుజనుల వ్యతిరేక పారీ్టగా తయారైంది. వాళ్లు ఎన్ని పుకార్లు పుట్టించినా, అబద్ధాలు వ్యాపింపజేసినా మేం మాత్రం రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు రానివ్వం. సమగ్ర కులగణన జరిగేదాకా మేం ఊరుకోం. సమాజంలోని ప్రతి వర్గానికి హక్కులు, వాటా, న్యాయం దక్కేలా చూస్తాం. అవసరమైతే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి ఎక్కువ రిజర్వేష్లను కలి్పస్తాం. మోదీజీ కనీసం కులగణన అనడానికి కూడా భయపడుతున్నారు. బహుజనులకు న్యాయం దక్కడమనేది రాజకీయ అంశంకాదు అది నా జీవిత లక్ష్యం’’అని రాహుల్ అన్నారు. -
తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ముంబై: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదని, ఆ పార్టీలో దేశభక్తి లేదన్నారు. మహారాష్ట్రలోని వార్దాలో శుక్రవారం(సెప్టెంబర్20) జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయితీ లేకపోవడం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని విమర్శించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ రైతులను మోసగించిందన్నారు. నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోందని మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందులో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటన అందరికీ తెలుసన్నారు. అందరం ఏకమై కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి.. ఖర్గే మోదీ కంటే సీనియర్.. ఆయనను అవమానిస్తారా: ప్రియాంకగాంధీ -
Narendra Modi: దేశ ప్రతిష్ట దిగజార్చే యత్నం
అహ్మదాబాద్: పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. విద్వేషాన్ని నింపుకున్న వాళ్లు దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టరని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రూ.8,000 కోట్ల పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. తర్వాత దేశంలోనే తొలి వందేభారత్ మెట్రో సర్వీస్ అయిన భుజ్–అహ్మదాబాద్ ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ను ప్రారంభించారు. దీంతోపాటు ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాహుల్, కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కొందరు ప్రతికూలత, విద్వేషంతో భారత్‌ను విడగొట్టేందుకు దేశ ఐక్యత, సమత్రలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇండియా, గుజరాత్ల పరువు తీసేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వీళ్లు చేజార్చుకోరు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక తొలి 100 రోజుల్లో పాలనపై విపక్షాలు దారుణంగా విమర్శించాయి. నేను మాత్రం అభివృద్ధి అజెండా అమలుపైనే దృష్టిపెట్టా. నేను జీవిస్తే మీ కోసమే జీవితాన్ని ధారపోస్తా. పోరాడితే మీ కోసమే పోరాడతా. చనిపోవాల్సి వస్తే మీ కోసమే ప్రాణాలప్పిస్తా’’ అని వేలాది మంది సభకులనుద్దేశించి అన్నారు.తొలి భారత్ మెట్రో పేరు మార్పుమెట్రో నగరాల మధ్య తిరిగే దేశంలో తొలి మెట్రో ‘వందే మెట్రో’ పేరును ప్రారంభోత్సవానికి కొద్దిసేపటి ముందు కేంద్రం ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా మార్చింది. సోమవారం సాయంత్రం ఈ రైలును మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది తొమ్మిది స్టేషన్లలో ఆగుతూ 359 కి.మీ. ప్రయాణించి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు టికెట్ ధర రూ.455గా నిర్ణయించారు.మరో మెట్రోలో ప్రధాని ప్రయాణంఅహ్మదాబాద్, గాంధీనగర్‌లను కలిపే రెండో దశ మెట్రోను మోదీ ప్రారంభించారు. అందులో గాంధీనగర్ సెక్టార్1 స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీకి వెళ్లారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కొందరు విద్యార్థులు ప్రయాణించారు. రూ.5,384 కోట్ల వ్యయంతో ఫేజ్2 పనులు చేపట్టారు.భారత సౌర విప్లవం ఒక సువర్ణాధ్యాయంగాంధీనగర్లో నాలుగో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి దారుల సదస్సు, ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ‘‘వెయ్యేళ్ల ప్రగతికి భారత్ పునాదులు వేసుకుంటోంది. అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవడమే గాక, అక్కడే కొనసాగాలని లక్షిస్తోంది. మూడో దఫా పాలన తొలి 100 రోజుల్లో మా ప్రాధమ్యాలను గమనిస్తే దేశం వేగం, విస్తృతి అర్ధమవుతాయి’’ అని పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు. ‘‘సౌర, పవన, అణు, జల విద్యుదుత్పత్తి ద్వారా భారత్ ఇంధన అవసరాలు తీర్చుకోనుంది. దేశ 21వ శతాబ్ద చరిత్రలో సౌరవిప్లవ అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో రాస్తారు’’ అన్నారు. గాంధీనగర్‌లో వవోల్ ప్రాంతంలోని షాలిన్–2 సొసైటీలో ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనా’ పథక లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. -
రైతులనే మోసం చేస్తారా?: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గందరగోళంలోకి నెట్టిందని, కరెంట్ విషయంలో పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం(సెప్టెంబర్8) ఆయన మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ మంత్రులు సంపాదనలో మునిగిపోయారు. రైతులు మిమ్మల్ని గెలిపిస్తే అదే రైతులను మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారా లేదా స్పష్టమైన వైఖరి తెలియజేయాలి. వరద బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి’అని డిమాండ్ చేశారు -
ఆ కాలేజీల్లో కేటాయింపులపై రగడ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో ఇటీవల జరిగిన డిగ్రీ లెక్చరర్ల కేటాయింపులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో డిగ్రీ లెక్చరర్లను రాత్రికి రాత్రే మల్టీజోన్–1 నుంచి డిస్లొకేట్ చేస్తూ మల్టీజోన్–2కు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. కేవలం ఐదు కాలేజీల నుంచి దాదాపు నలభై మంది డిగ్రీ లెక్చరర్లు మల్టీజోన్–1 నుంచి మల్టీజోన్–2కు కేటాయిస్తూ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ గత నెల జూలై 19, 24, 29 తేదీల్లో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వీరంతా మల్టీ జోన్–2లో వారికి కేటాయించిన చోట విధుల్లోకి చేరుతున్న నేపథ్యంలో అసలు వీరంతా ఏయే కారణాలతో డిస్లొకేట్ అయ్యారనే అంశం ఇప్పుడు గురుకుల ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌లో ఎందుకు?టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో ఉద్యోగ కేటాయింపులన్నీ ఇదివరకు కార్యదర్శిగా పనిచేసిన రోనాల్్డరోస్ సమయంలో జరిగాయి. అప్పట్లో ఉద్యోగ కేటాయింపులన్నీ గజిబిజిగా జరగడంతో వాటిని సరిదిద్దే క్రమంలో డిస్లొకేషన్ చేస్తున్నట్లు గురుకుల అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించకుండా మాన్యువల్ పద్ధతిలో చేయడంతో పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్లు సొసైటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఓ సంఘం నేతలకే ప్రాధాన్యం? సొసైటీ కార్యాలయంలో ఉద్యోగుల కేటాయింపులు చేసే విభాగంలోని అధికారుల్లో కొంతమంది.. ఓ ఉద్యోగ సంఘానికి చెందిన వారు కావడంతో కేటాయింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, కరీంనగర్, జగిత్యాల డిగ్రీ కాలేజీల నుంచి 40 మంది లెక్చరర్లను మల్టీజోన్–1 నుంచి మల్టీజోన్–2కు కేటాయించడం... వీరికి గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కలున్న కాలేజీల్లోనే పోస్టింగ్ ఇవ్వడంపైన ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక్కో లెక్చరర్ నుంచి భారీ మొత్తంలో దండుకున్న కొందరు అధికారులు ఈ ఘనకార్యం చేశారంటూ ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. ఓ ఉద్యోగ సంఘం నేతలకే పోస్టింగ్ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలున్నాయి. ఆ తొమ్మిది మందికి నచ్చిన చోట పోస్టింగ్ ఎస్సీ గురుకుల సొసైటీలో డిప్యుటేషన్లను సొసైటీ కార్యదర్శి ఇటీవల రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ కార్యాలయంలో పనిచేస్తున్న 12 మందిని వారి సొంత స్థానాలకు పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఇందులో తొమ్మిది మంది ఉద్యోగులకు నచ్చినచోట పోస్టింగ్ ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ ఉద్యోగికి ఏకంగా మహిళా విద్యా సంస్థలో పోస్టింగ్ ఇవ్వడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మహిళా విద్యా సంస్థలో కేవలం మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పని పరిస్థితుల్లో అయితే పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి అవకాశం కలి్పంచాలి. కానీ కనీస నిబంధనలు పట్టించుకోకుండా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
న్యూఢిల్లీ: దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల విశ్వసనీయతపై చర్చ జరగడం సాధారణమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతాలు ఆలస్యంగా ప్రకటించడంపైకి చర్చ మళ్లింది. దీనికి కారణం ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్‌కు సంబంధించి ఫైనల్ ఓటర్ టర్నవుట్ డేటాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్(ఈసీ) వారాల కొద్ది సమయం తీసుకోవడమే. డేటా ఆలస్యమవడంతో పాటు పోలింగ్‌రోజు రాత్రి ప్రటించిన పోలింగ్ శాతానికి సమయం తీసుకుని ప్రకటించన డేటాకు మధ్య భారీ వ్యత్యాసముండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఎన్జీవోలు ఈ విషయంలో కోర్టుల తలుపులు తడుతున్నాయి. పోలింగ్ శాతం డేటాల్లో భారీ వ్యత్యాసాలపై ఇప్పటికే అసోసియేట్ ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను మే17న తొలుత విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్ టర్నవుట్‌లు ప్రకటించడానికి ఆలస్యమెందుకవుతోంది, డేటాల్లో భారీ వ్యత్యాసమెందుకు ఉంటోందని ఈసీని ప్రశ్నించింది. మే 24న మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తొలి దశ పోలింగ్ శాతం డేటాకు ఏకంగా 11 రోజులు... అంకెల్లోనూ భారీ వ్యత్యాసం..లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరిగితే ఈసీ యాక్చువల్ పోలింగ్ పర్సెంటేజీ ప్రకటించడానికి ఏకంగా 11 రోజులు పట్టింది. ఇక డేటా విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన రోజు డేటా 60 శాతం అని తెలపగా 11 రోజుల తర్వాత ఈడేటా ఏకంగా 6 పర్సెంటేజీ పాయింట్లు పెరిగి 66.14 శాతానికి చేరింది.దీనిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్జీవోలు విస్మయం వ్యక్తం చేశాయి. పోలింగ్ శాతాల్లో ఇంత వ్యత్యాసమెందుకు వస్తోంది.. డేటా వెల్లడించడానికి ఎందుకంత సమయం తీసుకోవాల్సి వస్తోందని ఈసీకి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాయి. ఇదే తంతు సెకండ్ ఫేజ్ పోలింగ్‌కు మళ్లీ రిపీట్ అయింది. ఏప్రిల్ 26న సాయంత్రం పోలింగ్ శాతం 60.96 శాతం అని ప్రకటించగా అది కాస్తా ఏప్రిల్ 30న వాస్తవ డేటా ప్రకటించే సరికి 66.71శాతానికి పెరిగిపోయింది.నాలుగు దశల్లో 1.07 కోట్ల ఓట్ల తేడా..ఎన్నికల నాలుగు దశల పోలింగ్ శాతాల్లో ఈసీ ప్రకటించిన తొలి, తుది డేటాల వ్యత్యాసాన్ని ఓట్లలో పరిశీలిస్తే 1.07 కోట్ల ఓట్ల వ్యత్యాసం వచ్చింది. ఇప్పటివరకు పోలింగ్ పూర్తయిన 379 నియోజకవర్గాలకు ఈ ఓట్లను పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 28 వేల ఓట్ల తేడా వస్తున్నట్లు అంచనా. అన్నింటికంటే ఎక్కువగా మే 13న పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా చూసినపుడు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతాల డేటాల్లో తేడా అభ్యర్థుల గెలుపోటములను ఈజీగా ప్రభావితం చేయగలదన్న వాదన వినిపిస్తోంది. 2019లో ఎలా ప్రకటించారు.. ఇప్పుడేమైంది..ఐదోవిడత పోలింగ్ సోమవారం(మే20)న జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఓటర్ టర్నవుట్ 60.09గా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ఫైనల్ పోలింగ్ శాతం డేటాను ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై అనేక ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారిగా, స్ట్రీ,పురుషుల వారిగా అన్ని రకాల డేటాను ప్రకటించిందని, ఇప్పుడెందుకు ఈసీకి అది సాధ్యమవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.17సి ప్రామాణికం కాదా...సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ప్రతి పోలింగ్ బూత్‌లో ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఆ బూత్‌లో పోలైన ఓట్ల వివరాలను 17సి ఫామ్‌లో ఎన్నికల అధికారులు అందిస్తారు. ఇది నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లోనూ జరుగుతుంది. 17సి ఫామ్‌లతో అభ్యర్థులకు నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. ఇంత క్లియర్‌గా 17సి ఉండగా ఫైనల్ డేటా విషయంలో సమస్య ఎక్కడ వస్తోందని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ప్రశ్నించడం గమనార్హం. -
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్లో విచారణను న్యాయస్థానం ముగించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసును తమ పార్టీకి, నాయకులకు అంటగట్టాలని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు చూస్తూ.. రెచ్చగొట్టేలా, పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసి అలాంటి వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మార్చి 29న సీఎం రేవంత్‌రెడ్డి, ఏప్రిల్ 1న మంత్రి కొండా సురేఖ, ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో రాహుల్ గాం««ధీ, మరో సందర్భంలో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు కేటీఆర్‌కు సంబంధం ఉందని నిరాధార విమర్శలు చేశారన్నారు. ఈసీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును 3వ తేదీ(శుక్రవారం) పరిష్కరించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్లో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
Lok sabha elections 2024: ‘ఎక్స్–రే’పై మాట మార్చిన రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిర చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే(ఎక్స్–రే) నిర్వహిస్తామంటూ ఈ నెల 7న తాను చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారడంతోపాటు తీవ్ర విమర్శలు వస్తుండడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెనక్కి తగ్గారు. బుధవారం ఢిల్లీలో సామాజిక న్యాయ సదస్సులో మాట్లాడుతూ మాట మార్చేశారు. ఈ సర్వే ప్రజల ఆస్తులను గుర్తించడానికి కాదని పేర్కొన్నారు. ప్రజలకు ఏ మేరకు అన్యాయం జరిగింది అనేది తెలుసుకోవడమే సర్వే ఉద్దేశమని స్పష్టం చేశారు.సర్వే విషయంలో తన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక, సంస్థాగత సర్వే చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాను ఏనాడూ చెప్పలేదని పేర్కొన్నారు. సర్వేపై తాను మాట్లాడగానే ప్రధాని మోదీ తీవ్రంగా స్పందిస్తున్నారంటే సంపద పంపిణీలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అన్యాయానికి గురైన వర్గాలకు న్యాయం చేకూర్చాలన్నదే తన ఉద్దేశమని వివరించారు.ఆర్థిక, సంస్థాగత సర్వే చేపట్టడం దేశాన్ని కూల్చేసే కుట్ర ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. సర్వే జరిగితేనే అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశభక్తులం అని చెప్పుకుంటున్న కొందరు ప్రబుద్ధులు సర్వే అనగానే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో 90 శాతం మందికి అన్యాయం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం జరగాల్సిందేనని తేలి్చచెప్పారు. దేశంలో ప్రజల మధ్య సంపద పంపిణీ ఏ రీతిలో జరిగిందో నిర్ధారించడానికి తమ ప్రభుత్వ హయాంలో ఎక్స్–రే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
గూగుల్ అనువాదం ఎఫెక్ట్.. పట్టాలెక్కిన ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’
కొచ్చి: గూగుల్ అనువాదంతో బుక్కైన రైల్వే అధికారులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కేరళలోని ఓ రైలు పేరు హటియా-ఎర్నాకులం అని హిందీ ఇంఘ్లీష్లో ఉండగా హటియాను అనువదించి మళయాలంలో హత్య(మర్డర్) అని అర్థం వచ్చేలా ‘కొలపతకం’ అని బోర్డుపై రాశారు. దీంతో రైలు పేరు కాస్తా మర్డర్ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది. ఈ వ్యవహారంలో రైల్వే అధారులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైలు నేమ్ ప్లేట్‌ను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ ‘ష్..వారికి ఎవరూ చెప్పొద్దు’ అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. గూగుల్ అనువాదంపై పూర్తిగా ఆధారపడ్డ ఫలితం అని మరో నెటజన్ చురకంటించారు. రైలు పేరు విషయంలో అనువాదం బెడిసికొట్టిన వ్యవహారంపై రాంచీ డివిజన్ సీనియర్ రైల్వే అధికారి స్పందించారు. ఇది తప్పుడు అనువాదం వల్ల వచ్చిన సమస్యని, తమ దృష్టికి రాగానే నేమ్‌ప్లేట్ సరి చేశామని తెలిపారు. రాంచీలోని హటియా నుంచి ఎర్నాకులానికి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 😭😭😭 https://t.co/u2CXud1sok — Cow Momma (@Cow__Momma) April 12, 2024 ఇదీ చదవండి.. బోర్న్వీటాపై కేంద్రం కీలక ఆదేశాలు -
ప్రజాగళం: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌లో..
కావలి/కోవెలకుంట్ల: ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కంటే హంతకులే నయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, నంద్యాల జిల్లా బనగానపల్లెల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వానికి ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు. కేసు పెడతారు. తర్వాత సీబీసీఐడీ వారు వస్తారు. వాళ్లు అరెస్ట్ చేస్తారు. జైల్లో పెడతారు. జైల్లో కొడతారు. టార్చర్ చేస్తారు. కొంతమంది పోలీసులు చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు’ అంటూ పోలీసుల ఆత్మగౌరవాన్ని, నిబద్ధతను కించపరిచేలా మాట్లాడారు. ఇక.. అధికారం కోసం మళ్లీ ఆయన ఇస్తున్న ఎన్నికల హామీలపై సెటైర్లు పడుతున్నాయి. అధికారంలోకి వస్తే ‘వర్క్ ఫ్రం హోం’ తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్(ఈ స్కాంలోనే ఆయన అరెస్టైంది)తో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి లాభాల బాట పట్టిస్తానన్నారు. ఒకప్పుడు ఏ నోటితో అయితే వలంటీర్లను విమర్శించారో.. ఇప్పుడు అదే వలంటీర్లపై వరాల జల్లు కురిపించే యత్నం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లను తొలగించబోమని చెప్పారు. మళ్లీ అరిగిపోయిన రీల్ వేసి.. హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసింది తానేనన్నారు. హైటెక్ సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్, విమానాశ్రయం అంటే తన పేరే గుర్తుచేసుకుంటారని చెప్పారు. టెక్నాలజీ, సెల్ఫోన్లు, పవర్ సెక్టార్ తన చలువేనన్నారు. బస్సులోనే పడిగాపులు: సభకు జనాలు రాకపోవడంతో చంద్రబాబు గంటకుపైగా బస్సులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజాగళం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక్కొక్కరికి రూ. 500 వంతున ఇచ్చి తీసుకువచ్చిన జనాలు కూడా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై అసంతృప్తితోనే పార్టీ నేతలు, కార్యకర్తలు సభకు ముఖం చాటేశారని చెబుతున్నారు. ఆటోల్లో తీసుకువచ్చిన జనాలకు ‘రాజరాజేశ్వరి ఐస్’ కంపెనీ పేరుతో ఉన్న స్లిప్పులను సభాస్థలి వద్దే పంపిణీ చేశారు. వెళ్లేటప్పుడు స్లిప్ ఇచ్చి రూ.500 తీసుకోవాలని సూచించారు. పోలీసులు, ఎన్నికల నిఘా సిబ్బంది ముందే స్లిప్పులు పంపిణీ చేస్తున్నా ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. -
నిందలూ... నిజాలూ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఉదంతంపై అంతర్జాతీయంగా వచ్చిపడుతున్న వ్యాఖ్యానాలు, విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రకటనతో ఈ సంగతి రుజువవుతోంది. మొదట జర్మనీ, ఆ తర్వాత అమెరికా చేసిన వ్యాఖ్యానాలపై మన దేశం ప్రతిస్పందిస్తుండగానే ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి సైతం కేజ్రీవాల్ కేసులో నిష్పక్షపాతంగా, పారదర్శ కంగా వ్యవహరించాలని సూచించటం సాధారణ విషయం కాదు. పైగా ఢిల్లీలోని అమెరికా దౌత్య వేత్త గ్లోరియా బెర్బేనాను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి మన అసంతృప్తిని, అభ్యంత రాన్ని తెలియజేసి 24 గంటలు గడవకుండానే రెండోసారి కూడా కేజ్రీవాల్ కేసులో అమెరికా ఆందో ళన వ్యక్తం చేసింది. దాంతోపాటు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటాన్ని కూడా ప్రస్తా వించింది. ఇక అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటన సరేసరి. అన్ని టికీ అతీతమని భావించుకునేవారు సైతం అనుకోకుండా వచ్చిపడే పొగడ్తలకు లోలోన సంతోషపడకుండా వుండలేరు. అలాగే విమర్శలొచ్చినప్పుడూ, తప్పును ఎత్తిచూపినప్పుడూ పౌరుషం పొడుచు కురావటం కూడా సహజం. పాశ్చాత్య దేశాలు అవసరార్థమో, అనివార్య పరిస్థితుల్లోనో మన దేశాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఉదంతాలు కోకొల్లలు. అయితే వాటినుంచి వచ్చే విమర్శలు అలా కాదు. అవి అరుదే కావొచ్చుగానీ ఆలోచించదగినవి. ఇందిరాగాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించి దేశాన్నే జైలుగా మార్చినప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనంతరకాలంలో మేధావులనూ, పౌరహక్కుల సంస్థల నేతలనూ అరెస్టు చేసిన సందర్భాల్లో పాశ్చాత్య ప్రపంచంస్పందించకపోలేదుగానీ... ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై వెలువడుతున్న స్పందన తీవ్రత అధికం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలకూ, అవి ప్రాతినిధ్యంవహించే రాజ్యాలకూ అంతర్జాతీయంగా ఆమోదనీయత, విశ్వసనీయత వుంటాయి. అయితే అస మ్మతి విషయంలో వాటి వైఖరి ఎలావుందన్నదాన్నిబట్టి ఆ ప్రభుత్వాల నైతిక స్థితి నిర్ణయమవుతుంది. దాన్ని పొందాలంటే సంయమనం పాటించటం, విమర్శలను హుందాగా స్వీకరించటం, పాలనలో పారదర్శకంగా వుండటం అవసరమవుతాయి. అగ్రరాజ్యాలు అన్నాయని కాదుగానీ, మన దేశంలో అంతా సవ్యంగానే వున్నదని భావించగలమా? కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారమే తీసుకుంటే దాదాపు రెండేళ్లనుంచి మద్యం కుంభకోణం గురించీ, అందులో కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా పేరు వినిపిస్తూనే వుంది. కానీ తనను తక్షణం విడుదల చేయాలన్న కేజ్రీ వాల్ వాదనకు జవాబిచ్చేందుకు మూడు వారాల వ్యవధి కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానాన్ని కోరటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన వాదనను పూర్వపక్షం చేసే పకడ్బందీ ఆధారాలు ఆ సంస్థ వద్ద ఉంటే వాటిని న్యాయస్థానం ముందుంచి ఈ కారణాల రీత్యా కేజ్రీవాల్ వాదన చెల్లదని వెనువెంటనే చెప్పలేని స్థితిలో వుండటం ఈడీ తీరుతెన్నులపై అనుమా నాలు రేకెత్తించదా? ఆమధ్య మనీశ్ సిసోడియా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయనపై అప్రూవర్లు ఇచ్చిన ప్రకటనలు మినహా తమ వద్ద వేరే ఆధారాల్లేవని సుప్రీంకోర్టు ముందే ఆసంస్థ అంగీకరించింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆ అంశంపైనే నిలదీస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిపై ఎవరో ఆరోపణలు చేస్తే కేవలం వాటి ఆధారంగా అరెస్టు చేయటం సబబేనా అని న్యాయస్థానం ముందు వినిపించిన వాదనల్లో ఆయన ప్రశ్నించారు. దేనికైనా సమయం, సందర్భం చూసుకోవాలంటారు. ఒకపక్క సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో వున్నాయి. అన్ని పార్టీలూ తమ తమ సత్తా చాటేందుకు పొత్తులు ఖరారు చేసుకుని వ్యూహరచనలో మునిగాయి. ఇలాంటి సమయంలో విపక్ష కూటమి అధినేతను అరెస్టు చేయటం విమర్శలకు ఆస్కారమిస్తుందని తెలియనంత అమాయకత్వంలో ఈడీ వున్నదంటే నమ్మలేం. మరో మూడు నాలుగు నెలలు ఆగితే ఇందులో కొంపమునిగేది ఏముందన్న ప్రశ్నకు ఆ సంస్థ దగ్గర జవాబులేదు. నేరం నిరూపణయ్యేవరకూ నిందితుడు నిర్దోషేనని న్యాయ శాస్త్రం చెబుతుంది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో తప్ప నిందితులను జైలుకు పంపరాదని ఇటీవల సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కింది కోర్టులకు హితవు పలికారు. పౌరులకు రాజ్యాంగం కల్పించే ఈ రక్షణలను విస్మరించటం, నీరు కార్చటం బాహాటంగా కనిపిస్తుంటే విమర్శలు రావా? మన దేశంలో ఇప్పటికీ ఇతర వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థకు విశ్వసనీయత అధికం. దాన్ని మరింత పెంచేలా ప్రభుత్వ విభాగాల వ్యవహారశైలి వుండాలి. దానికి విఘాతం కలిగితే పాలకపక్షం సంగతలావుంచి దేశ పరువుప్రతిష్ఠలకే భంగం వాటిల్లుతుంది. అమెరికా రెండోసారి కూడా అన్నదనో, జర్మనీ విమర్శించిందనో, ఐక్యరాజ్యసమితి సైతం మాట్లాడిందనో కాదు... చట్టం ముందు పౌరులంతా సమానమన్న రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా లేదా అన్న అంశంలో ఆత్మవిమర్శ చేసుకోక తప్పదు. సహ ప్రజాస్వామిక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం విషయంలో బాధ్యతతో మెలగాలనీ, దాన్ని విస్మరించటం సరికాదనీ మన విదేశాంగ శాఖ హితవు పలికింది. కానీ మానవహక్కుల ఉల్లంఘనల అంశంలో మనం కూడా వేరే దేశాల తీరుతెన్నులను విమర్శించిన సందర్భాలున్నాయని గుర్తించాలి. మనం అన్ని విషయాల్లోనూ సక్రమంగానే వున్నామన్న భావన ఇంటా బయటా కలగజేయటం ప్రభుత్వ బాధ్యత. దానికి భిన్నమైన పరిస్థితులుంటే అవి ఎందుకు తలెత్తాయో సమీక్షించుకోవటం అవసరం. -
మోదీవి పచ్చి అబద్ధాలు: ఖర్గే
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలన్నీ పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పదేళ్ల పాలనలో ఆయన సర్కారు సాధించిందేమీ లేకపోవడం వల్లే ఇలా జనం దృష్టి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్‌పై పసలేని ఆరోపణలు, విమర్శలు తప్ప మంగళ, బుధవారాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన చేసిన ప్రసంగంలో మరేమీ లేదు. ఎన్డీఏ అంటేనే నో డేటా అవేలబుల్ (ఏ గణాంకాలూ అందుబాటులో లేవు)! రాజ్యాంగంపై నమ్మకమే లేని వ్యక్తులు దేశ స్వాతంత్య్రం కోసం ముందుండి పోరాడిన కాంగ్రెస్‌కు దేశభక్తి గురించి నీతులు చెబుతున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో అన్ని రంగాల్లోనూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ మోదీపై నిప్పులు చెరిగారు. యూపీఏ హయాంలోని అభివృద్ధికి క్రెడిట్ కొట్టేస్తున్నారు. -
పాతపట్నంలో కొత్త రచ్చ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం తెలుగుదేశం పార్టీలో మరోసారి రచ్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఎంపిక సర్వే కలకలం రేపుతోంది. ఐవీఆర్ఓఎస్, ఎస్ఎంఎస్ పేరుతో జరుగుతున్న అభిప్రాయ సేకరణలో ఏది వాస్తవమో, ఏది నకిలీయో తెలియదు గాని రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. టిక్కెట్ ఆశిస్తున్న కలమట వెంకట రమణ, మామిడి గోవిందరావు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీరి మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతున్నాయి. ఇద్దరికన్నా నోటాకే ఎక్కువ అభిప్రాయాలు అధిష్టానం చేస్తుందో, ప్రైవేటు ఏజెన్సీలు చేస్తున్నాయో తెలియదు గానీ అభిప్రాయ సేకరణ పేరుతో నియోజకవర్గంలో రచ్చ నడుస్తోంది. ఒకసారి వెంకటరమణ, గోవిందరావు, కలమట సాగర్ పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా.. మామిడికి ఎక్కువ సానుకూలత ఉన్నట్టు వారిలో వారే ప్రచారం చేసుకున్నారు. మరోసారి వెంకటరమణ, గోవిందరావు నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా ఇద్దరి కన్న నోటాకే ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంకోసారి జరిగిన అభిప్రాయ సేకరణలో మామిడి కన్న కలమటకు ఎక్కువ మద్దతు వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. తాజాగా గోవిందరావు ప్రస్తావన లేకుండా వెంకటరమణ, జనసేన నాయకుడు గేదెల చైతన్య, నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరిగిందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ మరోవైపు గోవిందరావు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై గోవిందరావు తనపై ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాతపట్నం పోలీసు స్టేషన్లో కేసు పెడతానని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తమకు అనుకూలంగా వస్తే అసలైన సర్వే అని, వ్యతిరేకంగా వస్తే ఫేక్ సర్వే అని రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నాయి. కుమ్ములాటలు కొత్తకాదు.. పాతపట్నం టీడీపీలో కుమ్ములాటలు కొత్త కాదు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లిపోయింది. తరచూ పార్టీలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, వంశధార నిర్వాసితుల పరిహారాన్ని మింగేయడమేన కాకుండా ప్యాకేజీ కోసం ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ఫిరాయించారని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణపై గోవిందరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. దానికి ధీటుగా గోవిందరావుపై వెంకటరమణ వర్గం అంతే విమర్శలతో తిప్పికొడుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో భూదందాలు చేశారని, ఆ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని, పార్టీ పెద్దలంతా తన వెనకే ఉన్నారంటూ గోవిందరావుపై విమర్శలు చేస్తున్నారు. -
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
కోల్‌కతా: దాదాపు 1,20,000 మందితో కోల్‌కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
సెటైర్లు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం మొదలైంది. అభ్యంతరాలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, వ్యంగ్య వ్యాఖ్యలతో రోజంతా సభ ఆసక్తికరంగా సాగింది. సభలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామంటూనే అధికార పక్షం బీఆర్ఎస్పై దాడికి దిగింది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ పక్షాన సీనియర్ సభ్యులు కేటీఆర్, హరీశ్ ఇద్దరూ దూకుడుగా కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రయతి్నంచారు. కుటుంబ పాలన, వరి పంటకు మద్దతు ధర, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, 50ఏళ్ల కాంగ్రెస్ పాలన అవస్థలు, ఆ పార్టీ సీఎంలను ఎంపిక చేసిన తీరు తదితర అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం వ్యంగ్య విమర్శలు, వాదోపవాదాలకు దిగారు. మొదట సీఎం దాడి.. సీఎం రేవంత్ తన ప్రసంగం ప్రారంభంలోనే బీఆర్ఎస్పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా బీఆర్ఎస్లో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. ఇక ‘మేనేజ్మెంట్ కోటా’పేరిట జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది. ‘‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వారు కేబినెట్ నిర్ణయాలు, చట్టబద్ధత కల్పించడంపై తేడాను గమనించాలి’’అని రేవంత్ వ్యాఖ్యానించగా.. కేటీఆర్ ప్రతిస్పందిస్తూ..‘‘ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ అధ్యక్ష పదవి, సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు’’అని ఎద్దేవా చేశారు. దీంతో.. ‘‘గవర్నర్ ప్రసంగం చూసి సిగ్గుపడుతున్నానని కేటీఆర్ అన్నారు. నిజంగా గత పదేళ్ల పాలనపై ఆయన సిగ్గుపడాల్సిందే..’’అని రేవంత్ సెటైర్ వేయగా.. ‘పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా’నని కేటీఆర్ విమర్శించారు. దీనికి ప్రతిగా ‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి.. ప్రజల నుంచి వచ్చి సీఎం కుర్చిలో కూర్చున్న వారిపై కుళ్లుకుంటున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకట్లు, రైతుల ఆత్మహత్యలేనని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించగా.. గత పాలనలో అన్యాయం జరిగిందనే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడు గత పదేళ్ల పాలన గురించి మాట్లాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హరీశ్‌రావుకు మైక్ నిరాకరణపై నిరసన ధన్యవాద తీర్మానంపై సీఎం ఇచ్చిన సమాధానానికి బీఆర్ఎస్ పక్షాన హరీశ్‌రావు వివరణ కోరడం కూడా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేటీఆర్‌కే వివరణ కోరే అవకాశం ఇస్తామని స్పీకర్ పలుమార్లు ప్రకటించారు. అయి నా చివరికి హరీశ్‌రావుకు మైక్ ఇచ్చారు. ‘‘సీఎం పలు అంశాలపై హుందాతనం లేకుండా విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు సీఎం అయినా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ చనిపోతే చూసేందుకు కాంగ్రెస్ నేతలెవరూ రాలేదు’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి కల్పించుకుంటూ.. బీఆర్ఎస్ వాల్లు పదేళ్ల నుంచీ అదే చెప్తున్నారని, ఇంకెన్నాళ్లు చాచా నెహ్రూ, పీవీ నర్సింహారావుల గురించి మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటిస్తూ, శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదని నినాదాలు చేస్తూ సభ నుంచి బయటికి వచ్చారు. -
నిజం మాట్లాడే సొంత నేతలనూ బహిష్కరిస్తుంది
జైపూర్: రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారసభల్లో అధికార కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరింతగా విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్వాడా జిల్లాలోని కోట్రీ గ్రామంలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘ కాంగ్రెస్ కుటుంబం ముందు ఎవరైనా నిజం మాట్లాడితే ఇక అంతే. సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఒకప్పుడు రాజేశ్ పైలట్ ఆహార సమస్యపై కాంగ్రెస్ కుటుంబాన్నే సవాల్ చేశారు. దీంతో అప్పటి నుంచి రాజేశ్ పైలటే కాదు ప్రస్తుతం ఆయన కుమారుడు సచిన్ పైలట్ సైతం పార్టీ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 1997లో పార్టీ అధ్యక్ష పదవికి సీతారాం కేసరికి పోటీగా ఎన్నికల్లో నిల్చున్నందుకు రాజేశ్ పైలట్‌పై పార్టీ కన్నెర్రజేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం అశోక్ గెహ్లోత్‌తో పోటీపడినా అధిష్టానం దీవెనలు సచిన్‌కు దక్కలేదు’’ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు క్లీన్ చిట్ ‘‘అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు రాష్ట్ర మంత్రులే క్లీన్చిట్ ఇస్తున్నారు. ఇలాంటి పాలనలో మన తల్లులు, కూతుళ్లు, అక్కాచెల్లెళ్లకు రక్షణ ఏది? ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఏ ఒక్క అవకాశాన్నీ కాంగ్రెస్ వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముగింపు పలకాల్సిన సమయమొచ్చింది. కమలానికి మీరు వేసే ఒక్కో ఓటు కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేందుకు దోహదపడుతుంది’’ అని మోదీ అన్నారు. అంతకుముందు దుంగార్పూర్ జిల్లాలోని సాగ్వారా పట్టణంలో ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు, మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీతో పాటు సచిన్ పైలట్ కూడా ఖండించారు. ఆయన సొంత పార్టీపై దృష్టి పెడితే మంచిదని సచిన్ సూచించారు. -
పంజాబ్‌ను నీళ్లడిగాం..పొగ కాదు: హరియాణా మినిస్టర్
చండీగఢ్: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై హరియాణా మంత్రిప్రకాష్ దలాల్ మండిపడ్డారు.తాము పంజాబ్‌ను నీళ్లడిగామని, పొగ కాదని సెటైర్ వేశారు. మూడురోజులుగా పంజాబ్,హరియాణాల్లోని పొలాల్లో తగలబెడుతున్న పంటవ్యర్థాల గణాంకాలను దలాల్ శనివారం ట్విటర్లో వెల్లడించారు.పంజాబ్‌లోనే ఎక్కువగా పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారని ఆరోపించారు. కాగా,దలాల్ ఆరోపణలపై పంజాబ్ సర్కారు స్పందించింది.హరియాణా మంత్రి అన్నీఅబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. దేశంలోని 52 అత్యంత కాలుష్య జిల్లాల్లో ఎక్కువ హర్యానాలో ఉన్నవేనని కౌంటర్ ఇచ్చింది. -
సామాన్యుడి సమయం... సోదాహరణం
ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న సోదాలు, హడావుడి ఈ సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లు సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులకు తీవ్రమైన చికాకు తెప్పిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు రవాణా, పంపిణీని నిలువరించేందుకు పటిష్టమైన ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే బదులు.. అడుగడుగునా ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద రోజూ సాధారణ జనం నుంచి సైతం నిత్యం నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంతా చేస్తే.. ఈ తతంగమంతా వృథా ప్రయాసగానే మారుతోందని, చాలావరకు కేసుల్లో అసలు దోషుల్ని గుర్తించడం లేదని, కొన్ని కేసులు విచారణకు సైతం నోచుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 90% డబ్బులు వెనక్కే.. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన ఎన్నికల యంత్రాంగం.. ఎన్నికల అనంతరం నూటికి 96 శాతం తిరిగి సంబంధిత వ్యక్తులకు అప్పగించేశారు. ప్రస్తుతం కూడా వివిధ చెక్‌పోస్టుల్లో స్వాదీనం చేసుకుంటున్న కేసుల్లో 90 శాతం డబ్బును జిల్లా స్థాయి కమిటీలే తిరిగి సంబంధిత వ్యక్తులకు అందజేస్తున్నా..ఈ సందర్భంగా చిన్నా చితక వ్యాపారులు, సాధారణ జనాన్ని రోజుల తరబడి జిల్లా కలెక్టరేట్ల చుట్టూ తిప్పుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో ప్రలోభాల కోసం రాజకీయ పక్షాలు అత్యధికంగా హవాలా, ప్రైవేటు బ్యాంకులు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల నుండి భారీగా రవాణా చేస్తున్నా..అలాంటి వాటిని వదిలి పోలీసులు సాధారణ జనం మీద పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక సాధారణ ట్రాఫిక్ సాఫీగా ముందుకు సాగిపోయే వీల్లేకుండా రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. పన్ను కట్టించుకుని వదిలేస్తున్న ఐటీ 2014–2018 సాధారణ ఎన్నికల సందర్భంలోనూ స్వా«దీనం చేసుకున్న డబ్బు – శిక్షలు తదితర అంశాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఆర్ఐటీ ద్వారా సమాచారం సేకరించగా, పది లక్షల లోపు అయితే జిల్లా అధికారులు, పది లక్షలు దాటితే ఐటీ అధికారులు పరిశీలించారు. ఐటీకి సంబంధించి ఒక వేళ పన్ను కట్టకపోతే పన్ను కట్టించుకుని, మరికొన్ని కేసుల్లో అడ్వాన్స్ పన్ను కట్టించుకుని ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేసినట్లు తేలింది.హవాలా ద్వారా భారీ ఎత్తున వెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకున్న మెజారిటీ కేసుల్లో ఇంకా న్యాయ విచారణలే మొదలు పెట్టకపోవటంతో ఒక్కరికీ శిక్ష పడలేదు. అడ్వాన్స్ ట్యాక్స్‌లు.. సాగని విచారణలు ♦ 2018 ఎన్నికల్లో జనగామ వద్ద రూ.5.8 కోట్లతో వెళుతున్న కంటెయినర్‌ను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు (576–2018) చేసి కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు నమోదు చేసినా.విచారణ ముందుకు సాగలేదు. ♦ ములుగు పరిధిలో పట్టుకున్న రూ.19.95 లక్షల కేసులోనూ రాజకీయ పార్టీ కి సంబంధించిన ఆధారాలున్నా ఆ దిశగా విచారణ ముందుకు సాగటం లేదు. ♦ 2104 ఎన్నిక సమయంలో బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విశ్వాస్‌కుమార్ అనే వ్యక్తి నుండి స్వాదీనం చేసుకున్న రూ.8.38 లక్షల డబ్బును ఐటీ విభాగానికి అప్పగించగా, అందులోనుండి రూ.3.38 లక్షలు అడ్వాన్స్‌ట్యాక్స్‌గా కట్టించుకుని మిగిలిన డబ్బును తిరిగి అప్పగించారు. ♦ 2018లో కొడంగల్ నియోజకవర్గం మిర్జాపూర్‌లో రూ.17.5 కోట్ల నగదు ఉందని సమాచారం వస్తే ఐటీ అధికారులు దాడి చేసి నగదు స్వాదీనం చేసుకున్నారు. తీరా రూ.51 లక్షలు మాత్రమే స్వాదీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ♦ 2018లో పోలీసులు రూ.79.23 లక్షలు (500 డినామినేషన్) స్వాదీనం చేసుకుని కేసు నమోదు (190–2018) చేశారు. ఎన్నికలయ్యాక..అందులో రూ.23,000 మాత్రమే ఒరిజినల్ నోట్లుగా తేల్చి మిగిలినవి నకిలీగా పేర్కొన్నారు. రాజకీయ లింకులు పరిశీలించాలి ఎన్నికల సమయంలో యంత్రాంగం స్వాధీనం చేసుకునే మొత్తం రూ.10 లక్షల లోపు అయితే జిల్లా కమిటీకి, రూ.10 లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖకు పంపుతున్నారు. కాగా జిల్లా స్థాయి కమిటీలు తగు రశీదులు సమర్పిస్తే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాయి. అలా కాకుండా ప్రతి వ్యక్తి వెనుక రాజకీయ లింకులను లోతుగా పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటీకి వెళ్లిన డబ్బు విషయంలో కూడా రవాణా చేస్తున్న వ్యక్తుల వివరాలు, ఇతరత్రా లోతుల్లోకి వెళ్లకుండా..కేవలం నల్లధనమా లేక తెల్లధనమా అనేది చూస్తున్నారు. ఒక వేళ నల్లధనమైతే పన్ను కట్టించుకుని వదిలేస్తున్నారు. డబ్బును తీసుకువెళుతున్న కారణాన్ని విశ్లేషించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక భారీ మొత్తాలు దొరికిన సమయాల్లో రాజకీయ పార్టీ ల కార్యకర్తలు, వారు నియమించిన కూలీలు దొరికిన సందర్భాల్లో లోతైన విచారణలు చేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇన్వాల్వ్ చేయాలని సూచిస్తున్నారు. -
అలవికాని హామీలు.. అబద్ధపు ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: అలవికాని హామీలు.. అబద్ధాల ఆరోపణలు.. చరిత్ర వక్రీకరణలతో కాంగ్రెస్ సభ సాంతం పరనిందగా సాగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్‌కే ఓట్లు పడతాయనే గ్యారంటే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగసభపై హరీశ్‌రావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టే కాంగ్రెస్ నాయకులు బూటకపు హామీలను ఇస్తున్నారని, ఆ పార్టీ ఇస్తున్న గ్యారంటీలు అన్నీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవేనని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయితే..రాష్ట్రానికో మేనిఫెస్టో కాకుండా, హైదరాబాద్ సభలో చెప్పిన గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా.. ఎందుకు చేయలేదు? తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్ ఇలానే బూటకపు హామీలిస్తే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 44 ఎంపీ సీట్లు వచ్చాయని, 2019లో 52 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అజ్ఞానానికి జోహార్లు అని, రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వలేదని, యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చామని చెప్పారు. కావాలంటే పేపర్లు తిరగేసి తెలుసుకోవాలని సూచించారు. ‘ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా? గుజరాత్ ఎన్నికలపుడు భారత్ జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లలేదు..? హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేరుగా.. సిగ్గులేకుండా బీజేపీకి మద్దతివ్వడం మీకు తెలియదా? ఈడీ, సీబీఐలు వేటకుక్కల్లా మా నేతలను వేధించడం మీకు కనిపిస్తలేదా’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఎందుకు అటకెక్కిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మిలాఖాత్ అవడం అన్నది ప్రపంచానికి తెల్సిన విషయమేనని అన్నారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని, పోరాడి గెలుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ దయతో ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నారో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
పవన్ క్షమాపణ చెప్పాలి
ఏయూ క్యాంపస్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయంపై చౌకబారు విమర్శలు చేయడం పవన్‌కళ్యాణ్ మానుకోవాలని ఏయూ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి.రవికుమార్ ఘాటుగా బదులిచ్చారు. ఏయూ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఆయన ఖండించారు. ఉద్యోగులు, విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేన అధినేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలకు అందించే ర్యాంకింగ్ అనేది ప్రధానంగా విద్యార్థులు, ఆచార్యుల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ♦ ర్యాంకింగ్‌లో పాల్గొనే విద్యా సంస్థల సంఖ్యపై కూడా వర్సిటీల ర్యాంకులు ఆధారపడి ఉంటుంది. 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌కి కేవలం వెయ్యి విద్యా సంస్థలు పాల్గొంటే, 2023లో 2,478 సంస్థలు పాల్గొన్నాయి. ♦ తొలి 100 స్థానాల్లో నిలిచే విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ 2.5 నుంచి 4 మార్కుల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. ర్యాంకింగ్ విధానంలో ఐఐటీలు, కేంద్రీయ, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కొంతమేర ప్రయోజనం పొందుతున్నాయి. ♦ గతంలోనే ఐఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆచార్య రాంగోపాల్ ర్యాంకింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు పరిమితులు (పారామీటర్స్) వేరుగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. ♦ ఇక ఏయూలో విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించే వారి సంఖ్య 2018తో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. 2023లో ఏయూ విద్యార్థులు పొందిన అత్యధిక వార్షిక వేతనం రూ.84.5 లక్షలు. 2018లో విద్యార్థులు సాధించిన అత్యధిక వార్షిక వేతనం కేవలం రూ.22 లక్షలు మాత్రమే. ♦ కేంద్ర విశ్వవిద్యాలయాల కంటే మిన్నగా ఏయూలో ఏర్పాటుచేసిన టెక్ స్టార్టప్, ఇంక్యుబేషన్ సెంటర్ పనిచేస్తున్నాయి. ఇప్పటికే 124కి పైగా సాఫ్ట్వేర్ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఏయూ స్టార్టప్–ఇంక్యుబేషన్ సెంటర్ 14వ ర్యాంకు సాధించింది. తొలి 13 స్థానాల్లో ఐఐటీలు మాత్రమే నిలిచాయి. ♦ జాతీయ విశ్వవిద్యాలయాల తరహాలో 18 చెయిర్ ప్రొఫెసర్లు కలిగిన ఏకైక విశ్వవిద్యాలయం ఏయూ. దీనిపై ఉన్న నమ్మకంతో నవరత్న కంపెనీల నుంచి అమెరికాలో స్థిరపడిన భారతీయులు, ఏయూ పూర్వవిద్యార్థులు ఐఐటీ ఢిల్లీ తరహాలో ఇక్కడ చెయిర్ ప్రొఫెసర్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇలా.. వర్సిటీలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని పవన్ చదవడం సరికాదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఏయూకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్య, వివేకంలేని వ్యక్తిలా పవన్ విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏయూ క్యాంపస్ : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు విద్య, వివేకంలేని వ్యక్తి మాటల్లా ఉన్నాయని విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ విమర్శించారు. ఏయూపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏయూను శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. ప్రజలు హర్షించేలా పవన్ మాట్లాడాలని హితవు పలికారు. నిజమైన విద్యావంతుడు, సంస్కారవంతులెవరూ ఏయూని ఉద్దేశించి ఇలా మాట్లాడరన్నారు. పవన్ ఈ ప్రశ్నలకు బదులివ్వు.. ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు భారతీయ విద్యావ్యవస్థపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థపై ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఇన్ని అసత్య ఆరోపణలు చేసిన పవన్‌కు తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానని.. వాటికి ఆయన సమాధానం చెప్పాలని షారోన్‌రాజు సవాల్ విసిరారు. అవి.. ♦ ఏయూకి 2018లో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.150 కోట్లు నిధులను పసుపు–కుంకుమ పథకానికి ఎందుకు మళ్లించారు. అప్పుడు మీరు దీనిపై ఎందుకు ప్రశ్నించలేదు? ♦ ఏయూ సొంత నిధుల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జ్ఞానభేరి సభను చంద్రబాబు నిర్వహించారు. వాటిని ఎందుకు తిరిగి చెల్లించలేదు? ♦విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలపై 1996 నుంచి 2006 వరకు, తిరిగి 2014 నుంచి 2018 వరకు ఎందుకు నిషేధం విధించారు? ♦పోలమాంబ ఆలయం పక్కనే, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.300 కోట్లు విలువైన స్థలాన్ని ఇటీవల ఏయూ స్వాధీనం చేసుకుంది. ఇంతకాలం ఈ స్థలం ఎవరి గుప్పిట్లో ఉందో మీకు తెలుసా? ♦ 2019–2023 మధ్య 200 మందికిపైగా ఆచార్యులు ఏయూలో పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఏయూ జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు, స్కోర్‌ను మెరుగుపర్చుకుంటూ వస్తోంది. దార్శనికత కలిగిన రాష్ట్ర సీఎం ప్రపంచ స్థాయి విధానాలను అమలుచేయడంవల్లే ఇది సాధ్యపడింది. ఈ విషయం మీకు తెలుసా? -
రైళ్లలో అరకొరగా ఆన్‌బోర్డు సేవలు
సాక్షి, హైదరాబాద్: రైలు బోగీల పరిశుభ్రత, ఇతర నిర్వహణకు సంబంధించిన ఆన్‌బోర్డు సేవలు సరిగా లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. బోగీల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, ప్రయాణికులు తిని వదిలేసిన, పడేసిన తినుబండారాల వల్ల ఎలుకలు, బొద్దింకలు వంటివి పెరిగిపోతున్నాయి. విద్యుత్ వైర్లను ఎలుకలు కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. బోగీల్లో ఎలుకలు, బొద్దింకలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఆన్‌బోర్డు సేవలు దెబ్బతిని కోవిడ్ సమయంలో కొన్ని నెలలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని రకాల ప్రయాణికుల సేవలకూ బ్రేక్ పడింది. తర్వాత దశలవారీగా రైళ్లన్నీ పట్టాలెక్కినా.. ఆన్ బోర్డు సేవలను అందజేసే ప్రైవేట్ సంస్థలతో పూర్తిస్థాయి ఒప్పందాలు మాత్రం కుదుర్చుకోలేదు. ఒప్పందం చేసుకున్న పలు కాంట్రాక్టు సంస్థలు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయక బోగీల నిర్వహణ అధ్వానంగా మారుతోందని.. దీనితో కొన్ని రైళ్లలో ఆన్‌బోర్డు సేవలు సరిగా అందడం లేదని, చాలా రైళ్లలో ఇటీవలివరకు బెడ్‌రోల్స్‌ను కూడా అందజేయలేకపోయారని అధికారులు చెప్తున్నారు. తరచూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండగానే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు వచ్చాయి. మరోసారి సికింద్రాబాద్ స్టేషన్లోనే చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా షార్ట్‌సర్క్యూట్ జరిగి బోగీలు దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఇదే తరహా ప్రమాదానికి గురైంది. తాజాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోనూ ఐదు బోగీలు కాలిపోయాయి. -
OceanGate: మళ్లీ ఛలో టైటానికా? సిగ్గుండాలి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అండర్‌వాటర్ టూరిజం కంపెనీ ఓషన్‌గేట్ తీరుపై మరోసారి తారాస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం జరిగి పట్టుమని పదిరోజులు గడవక ముందే.. టైటానిక్ శకలాలు చూద్దమురారండి అంటూ యాడ్స్‌తో మళ్లీ ఊదరగొడుతోంది. అట్లాంటిక్‌లో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానమంటూ తాజాగా ఓషన్‌గేట్ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. ఒక వైపు శకలాలను బయటకు తీసుకురావడం.. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓషన్‌గేట్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్‌గేట్ కంపెనీ ఆ ప్రకటనల్లో పేర్కొంది. టికెట్ ధరను 2,50,000 డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్‌లోనా? మరేయిత సబ్‌మెర్సిబుల్‌లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక సబ్ పైలట్ పొజిషన్ కోసం సైతం కంపెనీ ఓ యాడ్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే.. టైటాన్ శకలాల గాలింపు కొనసాగిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోగా.. విమర్శల నేపథ్యంలో ఆ జాబ్ యాడ్‌ను తొలగించింది ఓషన్‌గేట్. టైటాన్ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఓషన్‌గేట్ ఇకపై ఇలాంటి టూర్లు నిర్వహించదని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే కదా. కానీ, అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్ టూర్‌ను నిర్వహించేందుకు రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓషన్‌గేట్ టైటాన్ ప్రయాణంపై గతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. సబ్ మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదంటూ పలువురు నిపుణులు తేల్చేశారు కూడా. పైగా వీడియో గేమ్‌ల తరహా రిమోట్‌కంట్రోల్‌తో టైటాన్‌ను కంట్రోల్ చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ టైటాన్‌తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ. ఇదీ చదవండి: ఐదు కోట్ల మందికి మూడేసి చొప్పున పుట్టిన తేదీలు!