కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ ‘నిందలు వేయరాదు’ అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! ‘వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట’ అన్నాడాయన.
సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది.
తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ‘ఏం చేస్తామండీ ఖర్మ’ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం.
కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.
పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి ‘బాల వ్యాకరణం’ వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని ‘అవును.. కాపీయే’ అని నిందించడం.
ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. ‘లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి’ అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి ‘రాధికా సాంత్వనం’ ఎంత సాంత్వనం కోల్పోయిందని?
తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, ‘నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ’ అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు.
తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.
నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు.
నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే. నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధు లతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది.
ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్ఛీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ!
నింద భోజనం
Published Mon, Sep 30 2024 12:16 AM | Last Updated on Mon, Sep 30 2024 12:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment