పేదలకు చేసిందేమీ లేదు
కాంగ్రెస్ పాలనపై మోదీ ధ్వజం
వారణాసి: గరీబీ హఠావో అని నినదించిన కాంగ్రెస్ తన 50 ఏళ్ల పాలనలో పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు తేలేకపోయిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. పేదలకు కనీసం బ్యాంకు ఖాతాలు కూడా తెరవలేకపోయిందన్నారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందన్నారు. 8 నెలల తర్వాత శుక్రవారం తొలిసారి తన నియోజకవర్గం వారణాసికి వచ్చిన మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
నిరుపేదలకు 101 ఈ-రిక్షాలతోపాటు 501 సైకిల్ రిక్షాలను పంపిణీ చేసి, వారితో ముచ్చటించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతలు జన్‌ధన్ యోజన పథకంపై చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘వాళ్లు గత యాభై ఏళ్లలో పేదలకు కనీసం బ్యాంకు ఖాతాలు తెరవలేకపోయారు. కానీ నేను ఆ పనిని 50 రోజుల్లో చేశాను. 40-50 ఏళ్లుగా గరీబీ హఠావో అని వింటూనే ఉన్నాం. పేదలు, వారి సంక్షేమం గురించి మాట్లాడడం రాజకీయాల్లో సంప్రదాయంగా మారింది. దీన్నుంచి బయటపడాలి. నేను పేదలను పేదరికం కోరల్లోంచి బయటపడేయడంపైనే దృష్టి కేంద్రీకరించాను’ అని చెప్పారు.
విద్యతోనే పేదరికానికి చెక్.. 25 ఏళ్ల కిందటే బ్యాంకులను జాతీయీకరణ చేసినా.. అది పేదలను బ్యాంకుల వద్దకు తీసుకురాలేకపోయిందని చెప్పారు. తన ప్రభుత్వం వచ్చిన తర్వాత జన్‌ధన్ కింద పేదలకు 18 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని, వారు 30 వేల కోట్లు జమ చేసుకున్నారని వివరించారు. నిరుపేదల నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సి ఉందని, ఆధునిక టెక్నాలజీని పరిచయం చేస్తే వారి కాళ్లపై వారు నిలబడతారన్నారు. తమ ముందు తరాలకు మంచి భవిష్యత్ ఉండాలని పేదలకు కలలు కంటున్నార న్నారు. అందుకు వారు తమ పిల్లలు చదువుకునేలా చూడాలని కోరారు. విద్య ద్వారానే పేదరికం నుంచి బయటపడగలమని ఆయన సూచించారు.
విద్యుత్ పథకం ప్రారంభం.. 2022నాటికి దేశవ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా రూ. 45 వేల కోట్లతో ‘ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీం’ను మోదీ ప్రారంభించారు. దీని కింద విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుపర్చడం, సౌరశక్తి వినియోగం.. తదితర చర్యలు చేపడ్తారు. వారణాసిలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఇందులో రూ. 572 కోట్లు కేటాయించారు.