2024 లోక్‌సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. వీటిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై అజయ్‌రాయ్‌ను కాంగ్రెస్ మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది.
వారణాసి నుంచి తనకు అవకాశం కల్పించినందుకు రాయ్ కాంగ్రెస్ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి స్థానం నుండి బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేశారు. 2014లో అజయ్‌రాయ్‌కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీపై 5,05,408 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ 1,52,548 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో రాయ్ ఓట్ల శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఆయన 5,22,116 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అజయ్ రాయ్ 1996, 2002, 2007లలో వారణాసిలోని కొలాస్లా అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007లో బీజేపీని వీడిన అజయ్ రాయ్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా కొలాస్లా ఉపఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2012లో వారణాసిలోని పింద్రా స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అప్పుడు కూడా గెలుపొంది, ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2017, 2022లో వారణాసిలోని పింద్రా స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అయితే ఈ రెండు సార్లూ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అజయ్ రాయ్ ఘాజీపూర్ జిల్లాకు చెందిన భూమిహార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారణాసిలో స్థిరపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీ నుండి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వారణాసి నుంచి లోక్‌సభ టిక్కెట్ రాలేదనే కారణంతో అజయ్ రాయ్ బీజేపీని వీడారు. అయితే ఆయనకు బీజేపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటుంటారు.
అజయ్ రాయ్‌పై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పూర్వాంచల్‌లోని పేరుమోసిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ, అతని అనుచరులు 1994లో అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్‌ను కాల్చి చంపారు. అప్పటి నుంచి అజయ్‌రాయ్, అన్సారీ కుటుంబీకుల మధ్య శత్రుత్వం కొనసాగుతోందని అంటారు.
Comments
Please login to add a commentAdd a comment