న్యూఢిల్లీ: వచ్చే ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూఢిల్లీ స్థానం నుండి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతో అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరాశకు గురయ్యారని ఆరోపించారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వ వనరులను ఉపయోగించుకుంటున్నారని, మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. అలాగే పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీకి పిలిపించారని, వారు ఆప్ కార్యకర్తలుగా మారి, వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రవేశ్ వర్మ ఆరోపించారు. తాజాగా అమృత్‌సర్ నుండి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా భద్రతా దృక్కోణం నుండి చూస్తే కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు. పంజాబ్ నుండి పెద్ద సంఖ్యలో వస్తున్న వాహనాలు ఢిల్లీలో తిరుగుతున్నాయని, వాటిలోని వస్తువులను తనిఖీ చేయడం లేదని ప్రవేశ్ వర్మ ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వ ట్రక్కులలో కుర్చీలతోపాటు ఇతర వస్తువులు ఢిల్లీకి వస్తున్నాయన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేల నిధిగా ఉన్న రూ.30 కోట్లలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. న్యూఢిల్లీలో ఎలాంటి కాంక్రీట్ పనులు చేయలేదని, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ఢిల్లీలో అభివృద్ధి పనులు చేయడానికి బదులు.. పంజాబ్ మాఫియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఎన్నికల్లో గెలవాలని కేజ్రీవాల్ కలలు కంటున్నారని ప్రవేశ్‌వర్మ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో పంజాబ్ ప్రభుత్వ సాయాన్ని వెంటనే నియంత్రించాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని అన్నారు. ఢిల్లీ ప్రజలకు నిజానిజాలన్నీ తెలుసని, రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమి ఖాయమని ప్రవేశ్‌వర్మ జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment