న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలోని 150 సరిహద్దులను మూసివేశారు. ఈ 150 సరిహద్దుల్లోని 162 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు దిగ్బంధించారు. ఈ ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలతో పాటు, స్థానిక పోలీసులు 24 గంటలు పహారా కాస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 162 చోట్ల దిగ్బంధనాలు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులు 175 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. హోం మంత్రిత్వ శాఖ నుండి 250 కంపెనీల పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగనున్నాయి. నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పికెట్లను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ పోలీస్ ఎలక్షన్ సెల్ తెలిపిన వివరాల ప్రకారం రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగ సమావేశాల విషయంలో ముందుగా వచ్చిన వారికి తొలుత అనుమతినిస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం
Comments
Please login to add a commentAdd a comment