13 స్థానాలకు జూన్ 1న పోలింగ్
వారణాసిపైనే అందరి దృష్టి
ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. 6 విడతల్లో 67 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగతా 13 సీట్లలో జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో వీటిలో 11 స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం కాగా బీఎస్పీకి 2 దక్కాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, సీఎం యోగి కంచుకోట గోరఖ్‌పూర్ సహా కీలక నియోజవర్గాలపై ఫోకస్...
గోరఖ్‌పూర్... భోజ్‌పురీ వార్
సుప్రసిద్ధ గోరఖ్‌నాథ్ ఆలయానికి నెలవు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట. ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ 1989 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. తర్వాత యోగి 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు నెగ్గారు. ఆయన సీఎం కావడంతో జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ ప్రముఖ భోజ్‌పురి నటుడు రవికిషన్‌ను బరిలోకి దించి 3 లక్షల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేసింది. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి భోజ్‌పురి నటి కాజల్ నిషాద్, బీఎస్పీ నుంచి జావెద్ సిమ్నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్ దన్నుతో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది.
గాజీపూర్.. త్రిముఖ పోరు
ఇక్కడ 2014లో బీజేపీ, 2019లో ఎస్పీ గెలిచాయి. ఎస్సీ నుంచి అఫ్జల్ అన్సారీ, బీఎస్పీ నుంచి ఉమేశ్ సింగ్, బీజేపీ నుంచి పరాస్ నాథ్ రాయ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 20 శాతం ఎస్సీలు, 11 శాతం ముస్లింలు ఉంటారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పారీ్టకి పట్టం కడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. గాజీపూర్ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఎస్పీ చేతిలోనే ఉన్నాయి!
వారణాసి... మోదీ హ్యాట్రిక్ గురి
కాశీ విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ లోక్‌సభ స్థానంలో 1991 నుంచి కమలనాథులు పాతుకుపోయారు. 2004లో కాంగ్రెస్ నెగ్గినా 2009లో బీజేపీ దిగ్గజం మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. 2014లో ప్రధాని అభ్యరి్థగా నరేంద్ర మోదీ ఇక్కడ తొలిసారి బరిలో దిగారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో మెజారిటీని 4.8 లక్షలకు పెంచుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ రేసులో ఉన్నారు. ఈసారి మోదీ మెజారిటీ పెరుగుతుందా, లేదా అన్నదే ప్రశ్నగా కనిపిస్తోంది.
చందౌలీ... టఫ్ ఫైట్
దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. 2014, 2019ల్లో మోదీ వేవ్‌లో బీజేపీ ఖాతాలో పడింది. సిట్టింగ్ ఎంపీ మహేంద్రనాథ్ పాండే ఈసారి హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. ఎస్పీ నుంచి వీరేంద్ర సింగ్, బీఎస్పీ నుంచి సత్యేంద్రకుమార్ మౌర్య పోటీలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.
మీర్జాపూర్... ప్రాంతీయ పారీ్టల హవా
ఒకప్పుడు బందిపోటు రాణి పూలన్ దేవి అడ్డా. 1996, 1999లో ఆమె ఎస్పీ తరఫున విజయం సాధించారు! 2001లో ఆమె హత్యానంతరం బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2014లో అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్ ఘనవిజయం సాధించారు. 2016లో పార్టీ బహిష్కరణతో అప్నాదళ్(ఎస్) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏ దన్నుతో 2019లో మళ్లీ నెగ్గారు. ఈసారి కూడా ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి రమేశ్ చంద్ర బిండ్, ఎస్పీ తరఫున మనీశ్ తివారీ రేసులో ఉన్నారు. మీర్జాపూర్‌లో వెనకబడిన వర్గాలు 49 శాతం, ఎస్సీ, ఎస్టీలు 25 శాతం ఉంటారు.
కుషీనగర్... హోరాహోరీ
గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం (శరీర త్యాగం) చేసిన చోటు కావడంతో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, పర్యాటకులు ఏటా భారీగా వస్తుంటారు. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ బోణీ కొట్టగా 2014, 2019ల్లో బీజేపీ పాగా వేసింది. సిట్టింగ్ ఎంపీ విజయ్ కుమర్ దూబే ఈసారీ బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి అజయ్ ప్రతాప్ సింగ్ (పింటూ). బీఎస్పీ నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి.
పోలింగ్ జరిగే మొత్తం స్థానాలు...
మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, కుషీనగర్, దేవరియా, బన్స్‌గావ్ (ఎస్సీ), ఘోసి, సలేంపూర్, బలియా, ఘాజిపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్ (ఎస్సీ)
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment