ఒకప్పుడు మోదీ ఫాలోవర్‌.. ఇప్పుడు వారణాసిలో పోటీ | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు మోదీ ఫాలోవర్‌.. ఇప్పుడు వారణాసిలో పోటీ

Published Thu, May 2 2024 9:25 AM

Mimicry artist Shyam Rangeela to contest against PM Modi in Varanasi

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ  ప్రచార స్పీడ్‌ పెంచుతున్నారు.  స్వతంత్ర అభ్యర్థులు కూడా  మేము సైతం అంటూ.. ప్రధాని పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారు. తాజాగా మిమిక్రీ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ శ్యామ్ రంగీలా (29) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేసే వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. 

‘‘ నేను వారణాసి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను.  ఈ రోజుల్లో ఎవరినీ  నమ్మడానికి లేదు. ఎప్పుడైనా నామినేషన్‌ ఉపసంహరించుకుంటారు’’ అని   శ్యామ్‌ రంగీలా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ పాపులారిటీ సంపాధించిన శ్యామ్‌ రంగీలా తన మద్దతుదారుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను వారణాసిలో పోటీ చేస్తానని ప్రకటించటంతో వచ్చిన స్పందనకు చాలా  సంతోషంగా ఉంది. నేను  నా వీడియోల ద్వారా నామినేషన్‌కు సంబంధించిన విషయాలు పంచుకుంటా’’ అని అన్నారు.

 

‘‘2014లో నేను ప్రధాని మోదీ ఫాలోవర్‌ను.నేను మోదీకి మద్దతుగా వీడియోలు చేశాను. అదేవిధంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు  వ్యతిరేకంగా వీడియోలు షేర్‌ చేశాను. ఆ సమయంలోనే మరో 70 ఏళ్లు బీజేపీ  ఓటు  వేస్తాననుకున్నా. కానీ, గత పదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. నేను ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో ఎంపీగా పోటీ  చేస్తున్నా. నేను వారం రోజుల్లో వారణాసికి వేళ్లి నామినేషన్‌ ఫైల్‌ చేస్తాను’’ అని కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా తెలిపారు. 

మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ పూర్వాంచల్‌లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్‌రాయ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. గత రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి మోదీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement