మోదీ కోసం వారణాసిలో దక్షిణాది నేతల ప్రచారం
తెలుగు, తమిళ, కన్నడ సంఘాలను ఆకట్టుకునే యత్నం
తెలుగు రాష్ట్రాల నుంచి బండి, జీవీఎల్, పొంగులేటి తదితరులు
తమిళనాడు, కర్నాటక చీఫ్‌లు అన్నామలై, బీవై విజయేంద్ర మకాం
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు పొలోమని కాశీ బాట పడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ అధికంగా ఉండే దక్షిణాది ప్రజల ఓట్లే లక్ష్యంగా కలియదిరుగుతున్నారు. తెలుగు, తమిళ సంఘాలతో సమావేశమవుతున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాది ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్‌లు నిర్వహిస్తున్నారు.
దక్షిణాది వారే కీలకం..
వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారు. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో మోదీ 6.74 లక్షల ఓట్లు (63.62 శాతం) సాధించారు.
ఈసారి ఏకంగా 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని అధిష్టానం భావిస్తోంది. దాంతో ఆయా రాష్ట్రాల కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేస్తోంది! అంతేగాక ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహిస్తోంది. వారణాసిలో ఇలాంటి బృందాలు ఏకంగా 2,000 దాకా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు!
ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ వర్చువల్‌గా వాటిలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడకు కాశీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాశీలో నివసించే దక్షిణాది వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. వారణాసి రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన దారులు, కూడళ్లలో దక్షిణాది పర్యాటకుల సౌలభ్యం కోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రకటనలు తదితరాలు ఏర్పాటు చేయించడాన్నీ గుర్తు చేశారు.
కీలక నేతలంతా అక్కడే..
వారణాసిలో చివరిదైన ఏడో విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అక్కడి దక్షిణాది ఓటర్లతో సమన్వయ బాధ్యతలను తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌కు అధిష్టానం అప్పగించింది. ఆయన వారం రోజులుగా అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్; ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తమిళనాడు నేతలు గాయత్రీ దేవి, ఆర్.రాజలక్షి్మ, సి.టి.పళనిస్వామి, తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్, కె.గోపాలస్వామి, కేరళకు చెందిన పీకే కృష్ణదాస్, కుమ్మనం రాజశేఖర్ తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ తమిళనాడు, కర్ణాటక అధ్యక్షులు అన్నామలై, బి.వై.విజయేంద్ర కూడా వారణాసిలోనే వారం పాటు మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మోదీ కూడా ఆదివారం నుంచి వారణాసిలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోనూ ఆయన మమేకమయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేసే యోచన ఉంది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.
– సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment