ఇది ఓ జనతా గ్యారేజ్2
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.
వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.
వారణాసి చుట్టుపక్కల
గ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.
270 పల్లెల్లో...
వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్‌కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.
ఆడపిల్లే అదృష్టం
కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే.
Comments
Please login to add a commentAdd a comment