
వారణాసి: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో సంచలన సృష్టించిన అత్యాచార ఘటనపై ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీశారు.
ఆ దారుణ ఘటనకు సంబంధించిన నిందితుల్ని అందరన్నీ అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పోలీస్ కమిషనర్ ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా ఆయనకు మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన సిటీ పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లను ప్రధాని మోదీ ప్రశ్నించారు. అత్యాచార ఘటన కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చిందని మోదీ అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే నిందితులకు ఏమైతే శిక్షలు ఉంటాయో అవి అమలయ్యేలా చూడాలన్న మోదీ.. భవిష్యత్ లో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమాధానమిచ్చిన పోలీస్ కమిషనర్.. కేసులో పురోగతి ఉందని స్పష్టం చేశారు. పలువుర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నారు.
కాగా, ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేసింది.. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే కొన్నిరోజుల పాటు తిరిగి రాలేదు. దీనిపై ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు పోలీసులు. అనంతరం ఆమెసొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది.కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్‌పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు.