విద్వేష నిర్మూలనకు కుంభమేళాలో ప్రతిన
‘మన్ కీ బాత్’లో ప్రజలకు మోదీ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి నెలన్నర పాటు జరగనున్న మహా కుంభమేళాను ఐక్యత మహాకుంభ్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘అందరూ కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించాలి. సమాజంలో విద్వేషం, విభజనవాదాల నిర్మూలనకు సంకల్పం తీసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం 117వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మాట్లాడారు.
‘‘దేశమంతా ఏకం కావాలన్న గొప్ప సందేశాన్ని కుంభమేళా ఇస్తోంది. భారీతనంలో కాకుండా భిన్నత్వంలోనే దాని ప్రత్యేకత దాగుంది. అంతటి వైవిధ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడబోం. అవిశ్రాంత గంగా ప్రవాహంలా సమాజమంతా ఒక్కటిగా ఉండాలి’’ అన్నారు. కుంభమేళాలో 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ సేవలను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు.
‘ఆయుష్మాన్’తో క్యాన్సర్‌కు చెక్
‘‘మన దేశంలో 2015–2023 మధ్య మలేరియా కేసులు, మరణాలు 80 శాతం తగ్గినట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. ఇదో గొప్ప విజయం. మన దగ్గర క్యాన్సర్ చికిత్సను సకాలంలో ప్రారంభిస్తుండడం గణనీయంగా పెరిగిందని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద 90 శాతం మంది క్యాన్సర్ బాధితులు సకాలంలో చికిత్స పొందగలుగుతున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల విదేశీయులు ఆకర్షితులవుతున్నారు.
ఫిజిలో తమిళ టీచింగ్ ప్రోగ్రాంకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో విశిష్టమైన ఒలింపిక్స్ జరిగాయి. పేదరికం, కరువు, వలసలకు మారుపేరైన ఒడిశాలోని కలహండిలో కూరగాయల విప్లవం సాగుతోంది’’ అని మోదీ అన్నారు. వచ్చే జనవరి 26న రాజ్యాంగ 75వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ‘‘ఇది మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం వల్లే ఈ రోజు నేనీ స్థాయికి చేరుకున్నా. మన రాజ్యాంగం ప్రతి సందర్భంలోనూ కాల పరీక్షకు నిలిచింది. దారిదీపంగా, మార్గదర్శిగా ముందుకు నపుడుతోంది’’ అన్నారు.
అక్కినేనితో కొత్త శిఖరాలకు తెలుగు సినిమా
సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు చేర్చారంటూ మోదీ ప్రశంసించారు. భారతీయ సంప్రదాయాలు, విలువలను ఆయన సినిమాలు ప్రతిబింబించాయని కొనియాడారు. ‘‘ఈ ఏడాది ఆయనతో పాటు రాజ్ కపూర్, తపన్ సిన్హా, మహ్మద్ రఫీ వంటి సినీ ఉద్ధండుల శత జయంతి వేడుకలు జరగడం హర్షణీయం.
సృజనాత్మక రంగంలో మన ప్రతిభా పాటవాలను ప్రపంచానికి తెలిపేలా వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ దాకా ఢిల్లీలో తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి అగ్రశ్రేణి కంటెంట్ క్రియేటర్లు అందులో పాల్గొంటారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్‌లో ఇండియాను కేంద్రస్థానంగా మార్చే దిశగా ఈ సదస్సు మనకు చాలా కీలకం’’ అని తెలిపారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో కంటెంట్ క్రియేటర్లు చురుకైన పాత్ర పోషించాలన్నారు. దేశ ప్రజలందరికీ మోదీ నూతన సంత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంగా, సంతోషంగా ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment