
మహాకుంభ్‌నగర్: ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా రికార్డుకెక్కిన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల ఘట్టానికి తెరపడింది. 144 సంవత్సరాల తర్వాత వచి్చన ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. 45 రోజులపాటు వైభవంగా సాగిన పుణ్యక్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
చివరి రోజు బుధవారం భక్తుల పుణ్యస్నానాలతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమస్థలి కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1.32 కోట్ల మంది తరలివచ్చారు. హరహర మహాదేవ అనే మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోయింది. చివరి రోజు కావడంతో భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ ఏడాది జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజు మహా కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 26 వరకూ 66.21 కోట్ల మందికిపైగా జనం స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల ఉమ్మడి జనాభా కంటే అధికం కావడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు మహా కుంభమేళాలో పాలుపంచుకున్నారు. భూటాన్ రాజు సైతం పుణ్నస్నానం ఆచరించారు. మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ్‌నగర్‌లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment