Domestic Violence
-
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
ఇంటి దీపాన్ని.. ఇల్లే ఆర్పుతోందా!
సాధారణంగా పేదరికం, నిరుద్యోగం, అప్పులు, అవమానాలు, కుంగుబాటు, వైవాహిక సమస్యలు.. వంటివి ఆత్మహత్యలకు పురిగొల్పుతాయి. అయితే వాటిలో గృహహింస కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది వ్యక్తిగత చర్య అయినప్పటికీ అది అనేక సామాజిక కారణాలతో ప్రభావితం అయ్యి ఉంటుంది. వ్యక్తిగత దుర్బలత్వం సామాజిక ఒత్తిళ్ల నుంచి వచ్చేదై ఉంటుంది. దీనిని మానసిక అనారోగ్యంగానూ అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుటుంబ కలహాలు, సామాజిక అస్థిరతలు సమాన పాత్ర పోషిస్తాయి.గృహహింసలో ప్రధానంగా...గృహహింస కారణంగా 64 శాతం మంది మహిళలు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్టు ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం విడాకులు, వరకట్నం, ప్రేమ వ్యవహారాలు, వివాహం రద్దు లేదా వివాహం చేసుకోలేకపోవడం (భారతదేశంలో వివాహ విధానాల ప్రకారం), అవాంఛిత గర్భం, వివాహేతర సంబంధాలు, ఈ సమస్యకు సంబంధించిన విభేదాలు.. ఇలాంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పరువు’ అనే కారణంతో కుటుంబ ఆత్మహత్య సంఘటనలు తరచు సంభవిస్తుంటాయి.మానసిక రుగ్మతలుఆత్మహత్య కారణంగా మరణించేవారిలో దాదాపు 90 శాతం మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెన్నైలో చేసిన అధ్యయనంలో 80 శాతం, బెంగళూరులో 43 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడతున్నట్లు తెలిసింది. సమాజంలో/ కుటుంబంలో అణచివేతకు గురైనవారు డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధి లక్షణాలను ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువశాతం మంది డిప్రెషన్వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు.మద్యపానం వల్ల..ఆత్మహత్యలలో మద్యపానం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆత్మహత్య చేసుకునే సమయంలో 30–50 శాతం మంది పురుషులు మద్యం మత్తులో ఉండగా, స్త్రీలను వారి భర్తల మద్యపాన వ్యసనమే ఆత్మహత్యకు పురికొల్పుతున్నట్లు వెల్లడైంది. ఆత్మహత్య అనేది ఎన్నో అంశాలు కలిసిన అతి పెద్ద సమస్య. అందుకే నివారణ చర్యలు కూడా అన్ని వైపుల నుంచి జరగాలి. ఇక జాతీయ స్థాయిలో ఆత్మహత్య నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి, సహకారం, సమన్వయం, నిబద్ధత అవసరం. మానసిక ఆరోగ్య రంగంలో సామాజిక, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్య నిపుణులు ఆత్మహత్యల నివారణలో చురుకైన పాత్ర పోషించాలి.చేయూత అవసరం..→ గృహహింస బాధితులకు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు. భరించడం అనే స్థాయి నుంచి తమ బతుకు తాము బతకగల ధైర్యం, స్థైర్యం పెం΄÷ందించుకోవాలి. → టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన జీవనం వైపుగా అడుగులు వేయాలి. ఇందుకు కుటుంబ సభ్యులు చేయూతను అందించాలి. → స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలలో అవగాహన తరగతులు నిర్వహించాలి. → ఉపాధ్యాయులు, పోలీసులు, నాయకులు, నమ్మకమిచ్చే అభ్యాసకులు... ఇలా అందరూ బాధ్యత గా వ్యవహరించాలి.→ ప్రాణాలతో బయటపడిన వారిని సంఘటితం చేసి, వారిని ఈ అవగాహన తరగతులలో పాలుపంచుకునేలా చేయాలి.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నారీ అదాలత్ ఏం చెబుతోంది?
భారతీయ న్యాయ సంహిత తాజాగా అమలులోకి వచ్చింది. అలాగే స్త్రీలకు సత్వర న్యాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నారీ అదాలత్’ పేరుతో ప్రత్యేక పంచాయతీ వ్యవస్థను పరిచయం చేయబోతోంది. పైలట్‌ప్రాజెక్ట్‌గా అసోం, జమ్ము–కశ్మీర్‌లలో ప్రవేశపెట్టనున్నారు. ఇది కోర్టులా న్యాయం చేస్తుందా? లేదా ‘ఖాప్ పంచాయతీ’లా పంచాయతీ పెడుతుందా? అసలు ‘నారీ అదాలత్’ ఏంటి?నళిని ప్రైవేట్ టీచర్. తమ ఊళ్లోనే ఉన్న కాన్వెంట్లో పని చేస్తోంది. వృత్తి అంటేప్రాణం. వాళ్లది గ్రామ పంచాయతీ. వ్యవసాయ కుటుంబం. ఇంట్లోనే పాడి. భార్యగా, ఇంటి కోడలిగా ఆ బాధ్యతలన్నీ నళినే చూసుకోవాలని ఆమె మీద ఒత్తిడి.. భర్త, అత్తగారి నుంచి! ఆఖరికి వాకిలి ఊడ్చి, కళ్లాపి జల్లి, ముగ్గు వేసే పనినీ నౌకరుతో చేయిస్తోందని భర్త కంప్లయింట్. ఆ ఒత్తిడి హింసగా మారి నళిని మానసిక ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుడంటంతో ఆమె గృహ హింస చట్టాన్ని ఆశ్రయించక తప్పలేదు. ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో భర్త మీద ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలిద్దరికీ రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా నళిని భర్తది ఒకటే మాట.. ఆమె ఉద్యోగం మానేయాలని! దానికి నళిని ససేమిరా అన్నది. దాంతో ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్’(తాము కౌన్సెలింగ్ చేసిన విధానం, అయినా ఫలితం రాని వైనాన్ని రాసిన నివేదిక) ను కోర్ట్‌కి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా గృహ హింస చట్టం కింద కోర్ట్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. గృహ హింస చట్టంలో ఆరోపణ రుజువైతే బాధితులకు ఆర్థిక భద్రత కల్పించాలి. వాళ్లకున్నప్రాథమిక హక్కుని గౌరవించాలి. ఇది మహిళలకు ఆ యాక్ట్ ద్వారా కోర్టులు అందించే న్యాయం. నళిని ఉండే ఊర్లో ‘నారీ అదాలత్’ అమలయితే ఆ పంచాయతీ ఎలా ఉండొచ్చు?‘నారీ అదాలత్’లోని సభ్యుల్లో సగం మంది గ్రామ పంచాయత్ నుంచి ఉంటారు. మిగిలిన సగంలో టీచర్లు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సామాజిక కార్యకర్తలు మొదలైన వారుంటారు. వీళ్లను గ్రామస్థులే నామినేట్ చేస్తారు. ఈ కమిటీ అంతా మహిళలతోనే ఉంటుందా? లేక స్త్రీ, పురుషులతో కలసి ఉంటుందా అనేదాని మీద ఎక్కడా పూర్తి వివరం లేదు. సరే.. నళినీ కేసు నారీ అదాలత్ స్వీకరించినప్పుడు అదాలత్ సభ్యులపై నళిని అత్తగారి కుటుంబం పలుకుబడి ప్రభావం చూపదా? అలాగే పురుషస్వామ్య సంస్కృతి ప్రభావం వల్ల అదాలత్‌లోని సభ్యులకు కుటుంబం, స్త్రీ, ఆమె విధుల పట్ల సంప్రదాయ ఆలోచనలు, కచ్చితమైన అభి్రపాయాలు ఉండొచ్చు.ఈ నేపథ్యంలో నళిని విషయంలో ఎలాంటి తీర్పు వెలువడవచ్చు? ఆమె హక్కులు, వ్యక్తిత్వాన్ని గుర్తించే, గౌరవం లభించే అవకాశం ఎంత వరకు ఉంటుంది? దీనివల్ల దళిత, గిరిజన మహిళల మీద వేధింపులు పెరగవచ్చు, రాజకీయ ప్రయోజనాలూ మిళితమవచ్చు. కరప్షన్‌కి చాన్స్ ఉండొచ్చు. అసలు ఇది ఊళ్లల్లో పెద్ద మనుషుల పంచాయతీకి ఏ రకంగా భిన్నమైనది? దాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.. ఈ అదాలత్‌లను ప్రభుత్వమే నిర్వహిస్తోంది అనే భేదం తప్ప! దీన్ని ఆసరాగా చేసుకుని నారీ అదాలత్ సభ్యులు నిందితుల లేదా వాళ్ల తరఫు పెద్ద మనుషుల ప్రలోభాలకు లొంగి బాధితురాలిని ఇబ్బంది పెట్టే ప్రమాదం మెండు.స్థానిక పోలీసులూ రెచ్చిపోయే అవకాశమూ అంతే అధికం. రే΄÷్పద్దున లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, స్టాకింగ్ లాంటి సమస్యలను తీసుకుని మహిళలు పోలీస్ స్టేషన్‌కి వెళితే నిందితుల ప్రలోభాలకు తలొగ్గి స్టేషన్‌కి ఎందుకు వచ్చారు? నారీ అదాలత్లున్నాయి కదా అక్కడే తేల్చుకు΄పొండి అనే చాన్సూ ఉంటుంది. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది? ఈ క్రమంలో మహిళల కోసం వచ్చిన ప్రత్యేక చట్టాల ఉనికే దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఏదేమైనా ఇలాంటి ప్రయోగాలు లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలతో, ఒక నిర్దిష్ట రూపం దాల్చాకే అమల్లోకి వస్తే మంచిది అని అభి్రపాయపడుతున్నారు పలువురు న్యాయప్రముఖులు, సామాజిక కార్యకర్తలు! – సరస్వతి రమట్రయల్ అండ్ ఎర్రర్గానే... కోర్టులకు పనిభారం తగ్గించేందుకే కేంద్రం ఖాప్ పంచాయత్‌లను పోలిన నారీ అదాలత్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది ఏ రకంగానూ విమెన్ ఫ్రెండ్లీ కాదు. ఇప్పటివరకు విన్న, చదివిన దాన్ని బట్టి ఇదో ట్రయల్ అండ్ ఎర్రర్‌గా మిగిలిపోనున్నది. ఎందుకంటే గ్రామస్థాయిలో న్యాయవాదులచే శిక్షణ ΄పొందిన లీగల్ వలంటీర్ వ్యవస్థ ఉంది.మండల, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీస్ అథారిటీ కేంద్రాలు, సఖీ సెంటర్లున్నాయి. ఇప్పటికే ప్రతి పోలీస్‌స్టేషన్‌కి అనుబంధంగా ఉన్న కౌన్సెలింగ్ సెంటర్స్ వల్ల పోలీసులు ఫిర్యాదులే తీసుకోవట్లేదు. ఎంత తీవ్రమైన సమస్యలనైనా కౌన్సెలింగ్ సెంటర్స్‌కే రిఫర్ చేస్తున్నారు. అక్కడ కొన్ని పరిష్కారం అయ్యి కొన్ని కాక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది రచ్చబండను పోలిన ఈ నారీ అదాలత్‌లు ఏం న్యాయం చేయగలవు! – ఇ. పార్వతి, ఫ్యామిలీ కౌన్సెలర్అసంబద్ధమైన ఆలోచన‘నారీ అదాలత్’ లాంటి అఫీషియల్ ఖాప్ పంచాయత్‌లు మహిళల హక్కుల ఉల్లంఘనకు పాల్పడతాయి. వీటివల్ల మహిళల ప్రైవసీ, డిగ్నిటీ, మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు. అంతేకాదు పరువు పేరుతో వాళ్లప్రాణాలకూ ముప్పు ఉండొచ్చు. ఇదొక అసంబద్ధమైన ఆలోచన. జూన్ 30 వరకు అమలులో ఉన్న క్రిమినల్ చట్టాల ప్రకారం.. కుటుంబ వివాదాలకు సంబంధించిన అన్ని కేసులు ఇంకా చె΄్పాలంటే ఏడేళ్లలోపు శిక్షలు పడ్డ అందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. అంటే బాధితులకు న్యాయాన్ని అందించడంతో పాటు నిందితుల హక్కులనూ గుర్తిస్తుందన్నమాట. కుటుంబ కలహాలు, గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్ ఫెయిలైతే సదరు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు రిపోర్ట్ పంపిస్తారు. దాని ప్రకారం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెబుతోంది. ఇలాంటి కేసుల్లో కొత్త శిక్షాస్మృతీ దాన్నే ఫాలో కావాలి. కానీ కొత్త క్రిమినల్ చట్టాలు, ముఖ్యంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్నెస్సెస్) లోని కొన్ని రూల్స్ వల్ల అలా జరగకపోవచ్చు. సాధారణంగా ఏ ఫిర్యాదు అందినా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అయితే కుటుంబ కలహాల కేసులు, ఆర్థిక నేరాలు వంటి కొన్ని ఆరోపణలలో ఏడు రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేయవచ్చు. కానీ అది నిజనిర్ధారణకు కాదు. కాగ్నిజబుల్ కేసు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాలి. కానీ బీఎన్నెస్సెస్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వయిరీ పవర్ పోలీసులకు వచ్చింది. కాబట్టే వాళ్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఆస్కారం తక్కువుంటుంది. ఇదివరకైతే పోలీసులు సహకరించకపోతే ఎఫ్ఐఆర్ వేయమని జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ దాఖలు చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు బీఎన్నెఎస్సెస్లోని సెక్షన్ 223 (1) ప్రకారం నిందితుడి పక్షం వినకుండా మెజిస్ట్రేట్.. ఎఫ్ఐఆర్ కోసం పోలీసులకు ఆదేశాలిచ్చే అవకాశం లేదు. దాంతో బలవంతులైన పురుషులకు బయటపడే మార్గాలను వెదుక్కునే చాన్స్ దొరుకుతోంది. వీటివల్ల 498 వంటి కేసుల్లోనూ ఎఫ్ఐఆర్ ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇలా కోర్టు పరిధిని తగ్గించే ఇలాంటి ప్రయత్నాలేవీ సమాజానికి మంచివి కావు. – శ్రీకాంత్ చింతల, తెలంగాణ హైకోర్టు న్యాయవాది -
ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్ అధికారిగా!
గృహ హింసను భరించలేక భర్త నుంచి విడిపోయి, ఆర్థిక భారాన్ని, కన్నీటి సాగరానికి ఎదురీది సక్సెస్‌ను అందుకోవడం మహిళలకు తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియదేమో. అన్ని ప్రతికూలతలను అధిగమించి అచంచల సంకల్పంతో జీవితాలను మార్చుకోవడంలో వారి పట్టుదల, శ్రమ అసాధారణం. అలాంటి స్ఫూర్తిదాయకమైన మహిళా ఐఏఎస్ అధికారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని మండై గ్రామంలోని గిరిజన కుటుంబంలో పుట్టింది సవిత ప్రధాన్. ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న ఆ కుటుంబంలో సవితకు లభించిన స్కాలర్షిప్ ఆమె చదువుకు ఆధారం. అలా కష్టపడి 10తరగతి పూర్తి చేసి తన గ్రామంలో టెన్త్ చదివిన తొలి అమ్మాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు 7 కి.మీ దూరంలో కాలేజీలో చేరింది. ఆమె ఫీజు కట్టేందుకు తల్లి పార్ట్ టైం ఉద్యోగం చేసేది. డాక్టర్ కావాలన్న ఆశయంతో సైన్స్‌ని ఎంచుకుంది. కానీ 16 ఏళ్లు వచ్చాయో లేదో పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. బాగా డబ్బున్న కుటుంబం అన్న ఒకే ఒక్క కారణంతో సవితకు ఇష్టం లేకుండానే ఆమె పెళ్లి జరిగి పోయింది. ఇక్కడే సవిత జీవితం మరో మలుపు తిరిగింది. పెళ్లి తరువాత జీవితం దుర్బరంగా మారిపోయింది. అటు అత్తమామ వేధింపులు, ఇటు భర్త హింస మొదలైంది. కొట్టి చంపేస్తానని బెదిరించేవాడు భర్త. గర్భవతిగా ఉన్నపుడు కూడా తిండి సరిగ్గా పెట్టేవారు. రొట్టెల్ని దాచుకుని దొంగచాటుగా తినేది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇది ఆగలేదు. నరకం చూసింది. ఈ బాధలు తట్టుకోలేక ఇక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంది. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకోబోతుండగా కిటికీలోంచి అత్తగారు చూసింది. అయినా ఏమాత్రం జాలి చూపలేదు సరిగదా. మరింత వేధించ సాగింది. దీనికి తోడు రాక్షసుడివగా మారిన భర్త చివరికి తన కుమారుడిని కూడా కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో ధైర్యాన్ని కూడగట్టుకున్న సవిత తన పిల్లల కోసం బ్రతకాలని గట్టిగా భావించింది. కేవలం 2700రూపాయలతో పిల్లలిద్దరితో ఇంటినుంచి బైటపడింది. తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి బ్యూటీ సెలూన్‌ను మొదలు పెట్టింది. ఇది చాలక పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. ఇళ్లలో పనిచేసేది.. దొరికిన పని అల్లా చేసేది. ఇది ఇలా సాగుతూండగానే తల్లిదండ్రులు ,తోబుట్టువుల సాయంతో భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఏ డిగ్రీ చేసింది. డిగ్రీ చదువుతుండగానే సివిల్ సర్వీసెస్ గురించి తెలిసి వచ్చింది. మంచి జీతం, జీవితం రెండూ ఉంటాయని గ్రహించింది. ఇక అంతే కృషి, సంకల్పంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. 24 ఏళ్ల వయస్సులో ఏఐఎస్ సాధించింది. తొలుత చీఫ్ మున్సిపల్ ఆఫీసర్‌గా ఆ తర్వాత వరుస ప్రమోషన్షను సాధించింది. ప్రస్తుతం, ఆమె గ్వాలియర్ అండ్ చంబల్ ప్రాంతాలకు తొలి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి కూడా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మరో పెళ్లి కూడా చేసుకుంది. అంతేకాదు తనలాంటి మహిళలకు, అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చేలా ‘హిమ్మత్ వాలీ లడ్కియాన్’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. ఏ అమ్మాయి మౌనంగా బాధపడకూడదనేదే ఆమె ఉద్దేశం. తన జీవిత పోరాటాన్నే పాఠంగా బోధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది సవిత. -
భారత సంతతి కుటుంబం మృతి కేసులో కీలక అంశాలు
న్యూయార్క్: అమెరికాలోని మసాచుసెట్స్‌లో భారత సంతతి సంపన్న కుటుంబం చనిపోయిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ కమల్ (57), ఆయన భార్య టీనా(54) కుమార్తె అరియానా(18) వారి విశాలమైన భవనంలో శవాలై కనిపించారు. రాకేష్ మృతదేహం దగ్గర తుపాకీ ఉండటంతో గృహ హింసలో వీరు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రాకేష్ కమల్ తన భార్య టీనా, కూతురు అరియానాతో మసాచుసెట్స్‌లో విశాలమైన భవనంలో నివసిస్తున్నారు. ఆ భవనంలో 11 పడక గదులు, 13 బాత్రూమ్లు ఉన్నాయి. అయితే.. వీరు గత రెండు రోజులుగా కనిపించకోవడంతో సమీప బంధువు వెళ్లి చూశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాకేష్ కుటుంబం మొత్తం మృతదేహాలుగా పడి ఉన్నారు. రాకేష్ మృతదేహం వద్ద ఆయన తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాకేష్ కుటుంబం ఆర్థిక సమస్యలతో మరణించి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. టీనా, ఆమె భర్త గతంలో ఎడునోవా అనే ఎడ్యుకేషన్ కంపెనీని నడిపారు. వారి కంపెనీ 2016లో ప్రారంభించబడింది. కానీ డిసెంబర్ 2021లో కాలేజీని రద్దు చేశారని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో భవనంలో కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అరియానా తెలివైన యువతి.. రాకేష్, టీనా కుమార్తె అరియానా మిల్టన్ అకాడమీ నుండి పట్టభద్రురాలైంది. ఆమె మరణం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించిందని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. అరియానా చాలా తెలివైన అమ్మాయి అని విద్యాలయ ఫ్రొఫెసర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాంబు దాడిలో.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మృతి? -
పెళ్లైన గంటల్లోనే భార్యపై దాడి.. వివేక్ బింద్రాపై గృహహింస కేసు
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వివేక్ బింద్రాపై కేసు నమోదైంది. పెళ్లైన కొన్ని గంటలకే భార్యను వేధింపులకు గురిచేయడంతో పోలీసులు వివేక్ బింద్రాపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. వివేక్ బింద్రాకు యానిక అనే మహిళతో డిసెంబర్ 6న వివాహం జరిగింది. వీరు నోయిడాలోని సెక్టర్ 94 సూపర్ నోవా రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 7 తెల్లవారుజామున, బింద్రా అతని తల్లి ప్రభ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు ఆయన భార్య యానికా ప్రయత్నించడంతో బింద్రా ఆమెపై దాడికి దిగాడు. యానిక శరీరంపై పలుచోట్ల గాయాలు కాగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ విషయంపై బాధితురాలు సోదరుడు వైభవ్ క్వాత్రా నోయిడాలోని సెక్టర్ 126 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక వివాహం జరిగిన కొన్ని గంటలకే, బింద్రా యానికను ఒక గదిలోకి తీసుకెళ్లి, ఆమెపై అసభ్యపదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె జుట్టును లాగి, దాడి చేసినట్లు తెలిపారు. యానికా చెవికి గాయం అవ్వడంతో వినికిడి సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. బింద్రా ఆమె ఫోన్‌ను కూడా పగలగొట్టినట్లు చెప్పారు. దీనిపై నోయిడా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం బింద్రా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక దేశంతో పేరు ప్రఖ్యాతలు సాధించినమోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా.. బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీపీఎల్) సీఈవో కూడా. అతనికి యూట్యూబ్, ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత -
Priya Varadarajan: ప్రతి స్త్రీ దుర్గ వలే...
ప్రతి స్త్రీలో ఒక దుర్గ ఉంటుంది. కాని ఆ దుర్గను అదిమి పెట్టేలా కుటుంబం, సమాజం ఆమెను తీర్చి దిద్దుతాయి. దాంతో తన మీద ఏ అన్యాయం జరిగినా చెప్పలేని స్థితికి చేరుతుంది. ‘నువ్వు దుర్గవి. పోరాడు’ అని చెప్తారు బెంగళూరులోని ‘దుర్గ ఇండియా’ టీమ్ సభ్యులు. ప్రియా వరదరాజన్ అనే యాక్టివిస్ట్ ఏర్పాటు చేసిన ఈ గ్రూప్ స్త్రీలను కుటుంబ హింస నుంచి... లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి పని చేస్తోంది. వారి పోరాటానికి శక్తినిస్తోంది. ‘ప్రతి ఒక్కరూ మార్పు కోసం ఎదురు చూస్తారు. మనమే మార్పు కోసం ప్రయత్నిద్దామని ఎందుకు అనుకోరు... ఎదురు చూస్తూ కూచుంటే మార్పు వస్తుందా?’ అంటారు ప్రియా వరదరాజన్. బెంగళూరులో ‘దుర్గ ఇండియా’ అనే సంస్థ స్థాపించి స్త్రీల సమస్యలపై పని చేస్తున్న ప్రియ ఇటీవల బెంగళూరు మాల్లో ఒక వ్యక్తి స్త్రీలను అసభ్యంగా తాకడం గురించి ప్రస్తావిస్తూ ‘పబ్లిక్ ప్లేసుల్లో– బహిరంగ ప్రదేశాల్లోగాని ఆన్‌లైన్‌లోగాని స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తే అలాంటి వారిపై చర్య తీసుకునేందుకు ఆ బాధిత మహిళకు అండగా నిలవడం మేము చేసే పని. చట్టాలు ఎన్ని ఉన్నా, పోలీసులు, మహిళా పోలీసులు ఎందరు ఉన్నా మహిళలకు సాటి మహిళ అండగా ఉంటే కలిగే ధైర్యం వేరు. తోటి మహిళలతో వారు చెప్పుకునేవి వేరు. అలాంటి వారికి యోగ్యులైన కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ చేయించి దిలాసా ఇప్పిస్తాము. అంతే కాదు బాధితులను వెంటబెట్టుకొని– ఆ స్టేషన్కుపో ఈ స్టేషన్‌కు పో అనే బాధ లేకుండా బెంగళూరులో వన్ స్టాప్ సెంటర్స్‌లో ఫిర్యాదు చేయిస్తాము. తోడుగా మేమొస్తే బాధితులు ఫిర్యాదు చేయడానికి జంకరు. ఎటొచ్చీ వారికి తోడు నిలిచే స్త్రీల బృందాలు అన్నిచోట్లా ఉండాలి’ అంటుంది ప్రియ. ఐ యామ్ ఎవ్రి ఉమన్ పదేళ్ల క్రితం ప్రియా వరదరాజన్ ‘ఐ యామ్ ఎవ్రి ఉమన్’ పేరుతో ఒక బ్లాగ్ రాయడం మార్పు కోసం ఆమె వేసిన మొదటి అడుగు. ఆ బ్లాగ్‌కు క్రమంగా చాలామంది మహిళా ఫాలోయర్లు వచ్చారు. వారు తమ అనుభవాలను ప్రియతో పంచుకోసాగారు. ‘అందరిదీ ఒకే కథ. అందరూ మరొక స్త్రీ లాంటి వారే అని నాకు అర్థమైంది. స్త్రీల కోసం పని చేయాల్సిన అవసరం తెలియజేసింది. స్త్రీల కోసం పని చేయడం అంటే వారి పట్ల భావజాలాన్ని మార్చడమే’ అంటుంది ప్రియ. మగాడు ఎందుకు అలా చేస్తాడు? ‘గతంలో సమాజంలో స్త్రీలకు ఏదైనా సమస్య వచ్చి ఆమె బయటకు చెప్పినప్పుడు– ఆమెలో ఏ దోషం ఉందో అన్నట్టుగా నిందను ఆమె మీదే వేసేవారు ఉండేవారు. వారి భావజాలాన్ని మార్చడమే చేయవలసింది. స్త్రీకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ మగాడు ఆమెతో అలా ఎందుకు చేశాడు అని ఆలోచించేలా చేస్తే సగం మార్పు వచ్చినట్టే. ఇంట్లో, వీధిలో, ఆఫీసులో స్త్రీలు ఆత్మాభిమానంతో ఉండాలంటే మగాళ్లు మారాలి. అందుకు ఒకరోజు సరిపోదు. ఒకరు పని చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరం ఏదో ఒక మేరకు పని చేయాల్సిందే’ అంటుంది ప్రియ. అందరినీ ‘దుర్గ’లుగా మారుస్తూ అన్యాయం జరిగితే వెరవకుండా ప్రతిఘటించమని ప్రియ ఆధ్వర్యంలో ‘దుర్గల’ బృందం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కూళ్లలో, కాలేజీలలో, బస్తీలలో తిరుగుతూ స్త్రీలకు తమ హక్కులను, చట్టపరమైన రక్షణను, సహాయం చేసే బృందాలను తెలుపుతుంది. ‘నేను ఒంటరిదాన్ని కాను అని స్త్రీ అనుకుంటే చాలు... ఆమె పోరాడగలదు’ అంటుంది ప్రియ. ఇంత ప్రయత్నం చేసే ప్రియ లాంటి వారి సంఖ్య ఎంత పెరిగితే దుర్గలకు అంత శక్తి పెరుగుతుంది. -
'అసహజ శృంగారం కోసం వేధిస్తున్నాడు' ఐఏఎస్ అధికారిపై ఆమె ఫిర్యాదు!
ఛత్తీస్‌గఢ్: గృహ హింసకు పాల్పడుతున్నాడని ఓ ఐఏఎస్ అధికారిపై అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకురావాలని, అసహజ శృంగారం చేయాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 2014 తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సందీప్ ఘా. 2021లో బాధితురాలితో బిహార్‌లోని దర్భాంగ జిల్లాలో వివాహం జరిగింది. అయితే.. ఇటీవల తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన భార్య పోలీసులను ఆశ్రయించింది. అసహజ శృంగారం, కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు కోర్బా జిల్లాలో ఆయనపై గృహ హింస కేసు నమోదైంది. ఇదీ చదవండి: ఇతర మతస్థుడితో కుమార్తె పెళ్లి.. పిండ ప్రదానం చేసిన తల్లిదండ్రులు -
పెరుగుతున్న గృహ వేధింపులు!
సామాజికంగా ఎన్ని మార్పులు చేసుకుంటున్నా.. గృహ హింసలో మాత్రం తగ్గుదలఉండడం లేదు. అదనపు కట్నం కోసం వేధింపులు, తాగుబోతు భర్తలు, అత్తింటి వారి వేధింపులకు గురయ్యే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఏటా పెరుగుతున్న గృహ హింస సంబంధిత ఫిర్యాదుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అయితే గతంలో మాదిరిగా ఇంటి పరువు, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న భయాన్ని గృహిణులు వీడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ గత ఐదేళ్లలో నమోదైన గృహ హింస ఫిర్యాదులను పరిశీలిస్తే.. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 43 ఫిర్యాదుల నమోదైతే..ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 162 మంది మహిళలు గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో కొందరు నేరుగా మహిళా భద్రత విభాగానికి, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, మరికొందరు మహిళా భద్రత విభాగం వాట్సాప్ నంబర్‌కు, ఈ–మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకించి మహిళా భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, షీటీమ్స్, ఇతర చర్యలతో మహిళల్లో పోలీసులపై భరోసా పెరగడం వల్ల కూడా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గృహ హింస ఫిర్యాదులు పెరగడానికి, మహిళల్లో పెరిగిన అవగాహన, భరోసాయే కారణమని పేర్కొన్నారు. మహిళా భద్రత విభాగానికి వచ్చే గృహ హింస ఫిర్యాదులపై సఖి, భరోసా సెంటర్ల ద్వారా, అవి అందుబాటులోని లేని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో ప్రైవేటు కౌన్సిలర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో కొన్నిటిని కుటుంబీకుల మధ్య సయోధ్య కుదుర్చడం ద్వారా పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
వీధినపడిన బొలంగీర్ రాజ కుటుంబీకుల అంతర్గత విబేధాలు
భువనేశ్వర్: బొలంగీర్ జిల్లా రాజ వంశీకుల కుటుంబ కలహాలు వీధికెక్కాయి. ఈ కుటుంబంలో యువరాజు అర్కేష్ నారాయణ సింఘ్‌దేవ్ దంపతుల వివాదం రాజభవనం దాటి పోలీసు ఠాణాకు చేరింది. అర్కేష్ వ్యతిరేకంగా ఆయన భార్య అద్రిజా గృహహింస ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను అర్కేష్ సింఘ్‌దేవ్ ఖండించారు. దాదాపు 6నెలల క్రితం ఈ ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో తాను ఇల్లు వదిలి వెళ్లిపోయానని ఆయన తెలిపారు. ‘ఆమె నాపై గృహహింస కేసు పెట్టడంతో నేను ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ప్రస్తుతం, ఆమె సోదరి అక్కడ నివసిస్తున్నారు. ఆమె తండ్రి కూడా ప్రతినెలా 15 రోజులు రాజ భవానాన్ని సందర్శించేవారు. అవసరమైన వస్తువులు తీసుకునేందుకు నెలకోసారి మాత్రమే ఇంటికి వెళ్తున్నాను. పోలీసుల సలహా మేరకు ఆమె, నా భద్రతను నిర్థారించడానికి ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయించా. అయితే వాటిని అద్రిజా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులకు పంపించా’నని అర్కేష్ వివరించారు. మూడు రోజుల క్రితం అద్రిజా తండ్రి తమ వద్దకు వచ్చి చేసిన డిమాండ్ పట్ల ప్రతికూలించినట్లు అర్కేష్ నారాయణ సింఘ్‌దేవ్ తెలిపారు. వివాదం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున న్యాయస్థానం నిర్ణయం మేరకు కొనసాగడం జరుగుతుందని పదేపదే ప్రాధేయపడినా.. ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సహరాపూర్‌లోని కొందరు ల్యాండ్ మాఫియాతో తన మామకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తన ఇంటిపైకి దౌర్జన్యంగా 10మంది వ్యక్తులను పంపించారని, ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించగా.. అవసరమైతే 100 మందితో వస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అద్రిజా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ తన భర్త 2022 ఆగస్టులో విడాకులు కోరినట్లు తెలిపారన్నారు. డీజీపీని కలిసి.. ఇదిలా ఉండగా.. అర్కేష్ సింఘ్‌దేవ్ భార్య అద్రిజా భర్తతో పాటు మామ అనంగ ఉదయసింఘ్ దేవ్, బావ కళికేష్ నారాయణ్ సింఘ్‌దేవ్, అత్త విజయ లక్ష్మీదేవి, మేఘనా రాణా లపై 2022 సెప్టెంబర్ 30న రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్తింటి వారు తనను ఇంటి నుంచి బయటకు నెట్టేయాలని, ఒడిశాను సందర్శించకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెట్టినింటి వారి సిబ్బంది కూడా దుర్భాషలాడుతూ గోప్యతకు భంగం కలిగించడంతో పాటు తన గదివైపు కెమెరా ఏర్పాటు చేసి ప్రతి కదలికపై నిఘా ఏర్పాటు చేశారని ఆరోపించారు. అయితే తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఇటీవల ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సునీల్ బన్సాల్‌ను కలిశారు. ఈ కేసును ప్రస్తుతం డెహ్రాడూన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏస్పీ)కి అప్పగించారు. వీపీ సింగ్ మనుమరాలు.. అర్కేష్ సింఘ్‌దేవ్ గతంలో కాంట్రాక్ట్ కిల్లర్‌తో తనను చంపడానికి ప్రయత్నించారని అద్రిజా డెహ్రాడూన్ లోని స్థానిక మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పోలీసుల వద్దకు వెళ్లి, రక్షణ కోరారు. మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్(వీపీ సింగ్) మనవరాలైన అద్రిజా ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్‌లో ఉంటున్నారు. అర్కేష్, అద్రిజాల 2017 నవంబర్‌లో జరిగింది. -
అలాంటి వాడు మీకూ అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా?
స్త్రీ గడప దాటితే పదిలం కాదని పెద్దలు నూరిపోశారు. కాబోలు అని స్త్రీలు అనుకున్నారు. నేడు స్త్రీలు ఇంటిలోనే తీవ్ర అభద్రతను ఎదుర్కొంటున్నారని ఉదంతాలు చెబుతున్నాయి. ‘మహిళలపై హింస–నివారణ చర్యల అంతర్జాతీయ దినం’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకు ఒక స్త్రీ అయిన వారి చేతిలో ప్రాణాలు కోల్పోతోంది. అంటే గంటకు ఐదుగురు ఇంట్లోని వాళ్ల వల్ల చనిపోతున్నారు. ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న శ్రద్ధా వాకర్ హత్య ఇల్లు ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పింది. స్త్రీని సొంత ఆస్తిగా తాము దండించదగ్గ ప్రాణిగా మగవాడు భావించే వరకు ఈ హింస పోదు. విస్తృత చైతన్యం కోసం ప్రయత్నించడమే ఇప్పుడు చేయవలసిన పని. సామూహిక నిరసన దీనికి విరుగుడు. కుమార్తెను చంపి ‘పరువు’ను నిలబెట్టుకున్నాననుకుంటాడు తండ్రి. భర్త భార్యను ముక్కలు ముక్కలు చేసి ‘క్షణికావేశం’లో చేశానని వ్యాఖ్యానిస్తాడు. అన్నయ్యకు ఎప్పుడూ చెల్లెల్ని చెంపదెబ్బ కొట్టే హక్కు ఉంటుంది. బయట భయం వేస్తే స్త్రీలు ఇంట్లో వారికి చెప్పుకుని ధైర్యం పొందాలనుకుంటారు. ఇంట్లో వాళ్లే హింసాత్మకంగా మారితే ఆమె ఎవరితో చెప్పుకోవాలి? భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలకు ‘అయిన వారి’ బెడద ఎక్కువైందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక– అంటే రెండు రోజుల క్రితం నివేదిక తెలియచేస్తోంది. 2021 లో ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన స్త్రీలు 81,000 మంది. వీరిలో 56 శాతం అంటే 45,000 మంది అయిన వారి (భర్త, తండ్రి, సోదరుడు, బంధువు, స్నేహితుడు) చేతిలో మృత్యువాత పడ్డారు. ‘ఇది చాలా ఆందోళన కలిగించే విషయం’ అని ఐక్యరాజ్య సమితి సర్వోన్నత ప్రతినిధి ఆంటోనియో గుట్రెస్ అన్నారు. 2021లో సహజ మరణం పొందే స్త్రీలు ఎలా ఉన్నా ప్రతి పదిమందిలో నలుగురు కేవలం ఉద్దేశపూర్వకంగా చంపబడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వాడు అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా? అసలు స్త్రీ మీద హింస ఎందుకు చేయాలి? అదీ మన కుటుంబ సభ్యురాలిపై ఎందుకు చేయాలి? దీనికి అనుమతి ఉందని పురుషుడు ఎందుకు అనుకోవాలి? భర్త భార్యను కొడుతూ ఉంటే ‘వాడి పెళ్లాం... వాడు కొట్టుకుంటాడో కోసుకుంటాడో’ అని ఇరుగు పొరుగువారు ఎందుకు అనుకోవాలి. ఇంకా ఎంతకాలం అనుకోవాలి. ఇంట్లో బాల్యంలో ఆడపిల్ల తప్పు చేస్తే ఇంటి మగపిల్లాణ్ణి పిలిచి ‘నాలుగు తగిలించరా’ అని చెప్పే తల్లులు, తండ్రులు ఆ నాలుగు తగిలించి మరో ఇంట్లో పెరిగినవాడు తమకు అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా? హింస ద్వారా స్త్రీని అదుపు చేయాలని పురుషుడు అనుకున్నంత కాలం ఇలాంటి ధోరణి కొనసాగుతూనే ఉంటుంది. కుటుంబంలో అందరూ కుటుంబ మర్యాదకు బాధ్యులే. కాని స్త్రీకి ఆ భారం ఎక్కువ ఉంచారు. ఆమె ఎప్పటికప్పుడు తన ప్రవర్తనతో, పరిమితం చేసుకున్న ఇష్టాలతో, అనుమతించిన మేరకు నడుచుకుంటూ కుటుంబ మర్యాద కాపాడాలి. ‘మగాడికి ఎదురు తిరగడం’ అంటే అంటే ఆమె జీవితం ఆమె పూర్తిగా జీవించడానికి వీల్లేదు. అలాంటి ప్రయత్నం ‘మగాడికి ఎదురు తిరగడం’గా భావించబడుతుంది. ‘మగాడికి ఎదురు తిరగడం’ అంటే ‘సమాజానికి ఎదురు తిరగడమే’. ఎందుకంటే సమాజం కూడా ‘మగ స్వభావం’ కలిగినదే. అందువల్ల మగాడు, సమాజం కలిసి స్త్రీకి ‘బుద్ధి’ చెప్పాలనుకుంటాయి. అంటే భౌతికంగా దండించాలనుకుంటాయి. మనిషి నాగరికం అయ్యాడనుకున్న ఇంత కాలం తర్వాత కూడా పురుషుడితోపాటు సమాన సంఖ్యలో ఉన్న ఒక జాతి జాతంతా హింసాయుత పీడనకు లోను కావడం విషాదం. ఇల్లు హింసకు ఆలవాలం కావడం పెను విషాదం. దీనిని మార్చాలి. పురుషులను సరిదిద్దడానికి స్త్రీలు నోరు తెరవాలి. చట్టాల మద్దతు తీసుకోవాలి. ధైర్యంగా తమపై హింసను ఎదిరించగలగాలి. మహిళలపై జరిగే హింస నశించాలని ఆశిద్దాం. చదవండి: 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో! Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? సినామాల్డెహైడ్ అనే రసాయనం వల్ల -
బాబోయ్ కాపాడండి.. నా భార్య హింసిస్తోంది.. ట్విట్టర్లో ఓ భర్త ఫిర్యాదు
సాక్షి, బెంగళూరు(కృష్ణరాజపురం): నా భార్య నాపై కత్తితో దాడి చేసింది, ఎవరైనా సాయం చేయండి అని ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. ఇంటి గుట్టును బయటపెట్టుకున్న బాధితునిపై సానుభూతి వ్యక్తమవుతోంది. వివరాలు... యదునంద్ ఆచార్య అనే వ్యక్తి తన భార్య తనపై దాడికి పాల్పడిందని ట్విట్టర్ ద్వారా ఘోష వినిపించాడు. తనకు సహాయం అందదని, ఎందుకంటే తానొక పురుషుడనని, నారి శక్తి ప్రభావం వల్ల తన చేతికి గాయం అయిందని రక్తమోడుతున్న అరచెయ్యి ఫోటోను ట్వీట్ చేశాడు. గృహహింస కింద ఫిర్యాదు స్వీకరించాలని ప్రధాని ఆఫీసును, కేంద్ర మంత్రిని, బెంగళూరు పోలీస్ కమిషనర్ని కోరాడు. భార్య తనపై గృహ హింసకు పాల్పడుతోందని మొర పెట్టుకున్నాడు. అయితే దీనికి భౌతికంగా ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనరేట్ సూచించడం విశేషం. ఆచార్య ట్వీట్‌కు రామదాస్ అయ్యర్ అనే మరో వ్యక్తి స్పందించాడు. చేతికి కట్టుకట్టిన ఫోటోను పోస్టు చేస్తూ దసరాకు తన భార్య ఇచ్చిన బహుమానం ఇది అని పేర్కొన్నాడు. -
ముక్కలవుతున్న మూడుముళ్ల బంధం.. తాళి బంధాన్ని తెంచేస్తూ..
ధర్మేచ..అర్థేచ..కామేచ..మోక్షేచ..అహం ఏవం నాతిచరామి..అని పెళ్లి ప్రమాణం చేసి ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల బంధంలో రెండు మనసుల గుండె చప్పుడు ఏకమైతే వివాహ బంధం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. వివాహ బంధం అందమైన పుస్తకం లాంటిది. ఏదైనా జరిగే పొరపాటు పుస్తకంలో ఒక పేజీ మాత్రమే. అటువంటప్పుడు పుస్తకాన్ని సవరించుకోవాలి. పొరపాటు ఉందని మొత్తం పుస్తకాన్నే చించేయకూడదు. జీవితాంతం తోడుంటానని అగి్నసాక్షిగా తాళిబంధంతో ఒక్కటైన దంపతులు ముచ్చటగా మూడేళ్లయినా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సిన వారు అపోహలు, అనుమనాలతో విడిపోతూ తాళి బంధాన్ని ఎగతాళి చేస్తున్నారు. విజయనగరం: నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతానంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపే వారు..తర్వాత అన్నీ మరిచిపోయి ఒకరిని ఒకరు చీదరించుకుంటూ.. కోపగించుకుంటూ..చివరికి విడాకుల వరకు వెళ్తున్నారు. స్వల్ప కారణాలతో కొందరు కోర్టు మెట్లు ఎక్కుతుంటే, అవగాహన లేక కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు. గృహహింస విభాగం, పోలీసుల కౌన్సెలింగ్‌తో మరి కొందరు సర్దుకుపోతున్నారు. మరి కొందరైతే మూర్ఖంగా వ్యవహరిస్తూ భవిష్యత్తు అంధకారం చేసుకోవడంతో పాటు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయతలను దూరం చేస్తున్నారు. ఎన్ని కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం శూన్యం విభేదాలు వచ్చిన దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల సంప్రదాయాలు, సత్ససంబంధాల గురించి తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకోకపోవడంతో పాటు కొందరు మొండిగా వ్యవహరిస్తున్న కారణంగా భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. నేను చెప్పిందే వినాలనే ధోరణిలో అధికంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. వారికి సర్దిచెప్పేందుకు పెద్దలు లేకపోవడం, ఒక వేళ ఉన్నా వారి దృష్టికి సమస్యలు తీసుకు వెళ్లేందుకు భార్యాభర్తలు ఇష్టపడని కారణంగా రోజురోజుకు విడాకుల పెరుగుతూ వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడిపోవాలనుకునే భార్యాభర్తలకు పోలీసులు, గృహాహింస విభాగం కౌన్సిలర్లు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే కలిసి జీవించేందుకు ఇష్టపడుతున్నారు. మరి కొంతమంది విడాకులు తీసుకోవడంకోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వేరు కాపురాలపై యువతుల ఆసక్తి ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకుఅధికశాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామాలు, అడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని అలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు. ఎవరికి వారే మొండి పట్టు గతంలో సంప్రదాయలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏవైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్ధలను తొలగించడానికి కుటుంబ పెద్దలు ప్రయతి్నంచేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి భార్యభర్తలను ఒక్కటి చేసేవారు. ప్రస్తుతం వివాహ బంధం అందుకు విరుద్ధంగా ఉంది. గృహహింసకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు 2006వ సంవత్సరంలో గృహహింస విభాగాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈఏడాది ఆగస్టు నెలాఖరు వరకు జిల్లాలో 858 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 150 మంది కౌన్సెలింగ్‌తో రాజీపడ్డారు. 128 మంది ఫిర్యాదులు ఉపసంహరించుకున్నారు. 580 ఫిర్యాదులు కోర్టులో కేసు ఫైల్ అయ్యాయి. వాటిలో 74 కేసులు కోర్టుకు హాజరైన తర్వాత రాజీ అయ్యాయి. మరో 93 కేసులు కోర్టులో విత్‌డ్రా అయ్యాయి. 107 కేసులు డిస్మిస్ అయ్యాయి. 72 కేసులు కోర్టులో పరిష్కారమయ్యాయి. 122 మంది విడాకులు తీసుకున్నారు. 78 మంది మనోవర్తి తీసుకుంటున్నారు. సర్దుకుపోయే గుణం అవసరం సర్దుకుపోయే గుణం భార్యాభర్తలు అలవర్చుకున్నప్పుడు కాపురం సాఫీగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న నెలకొన్న సల్ప వివాదాలకు సర్దిచెప్పేవారు ఆయా కుటుంబాల్లో నేడు ఉండడం లేదు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జి.మాధవి, లీగల్ కౌన్సిలర్, గృహహింస విభాగం -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
AGWA: నీ జీవితానికి నువ్వే కథానాయిక
జీవితంలో ఎదురయ్యే అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మరోసారి పొరపాట్లు చేయకుండా సమస్యల సుడిగుండాల్ని అధిగమిస్తుంటారు చాలామంది. శుభాపాండియన్ కూడా సమస్యల నుంచి బయట పడేందుకు చాలానే కష్టపడింది. తన జీవితంలో నేర్చుకున్న పాఠాలను మరికొందరి జీవితాలకు అన్వయించి వారి జీవితాలను సుఖమయం చేస్తోంది. తనతోపాటు వేలమంది మహిళలను చేర్చుకుని ఎంతో మందికి చేయూతనిస్తోంది. మధురైలో పుట్టిపెరిగిన శుభా పాండియన్ పెళ్లయ్యాక చెన్నై వచ్చింది. బీకామ్ చదివిన శుభా చెన్నై నగరంలో ఎన్నో ఆశలు, కలలతో అడుగుపెట్టింది. ఇంగ్లిష్ రాదు. ఎటువంటి ఉద్యోగానుభవం లేదు. కానీ ఎలాగైనా ఎదగాలన్న తపన ఉంది. చెన్నై వచ్చిన ఏడాదిలోపే భర్త మరణం శుభాను రోడ్డున పడేసింది. పసిగుడ్డును పోషించుకునే భారం తనమీదే పడడంతో కష్టం మీద చిన్న ఉద్యోగం వెతుక్కుంది. ఒంటరి తల్లిగా అనేక అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటోన్న శుభాకు తోటి మహిళా ఉద్యోగులు అండగా నిలబడి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. దీంతో కార్పొరేట్ సెక్టార్లో తనకంటూ ఒకస్థానాన్ని ఏర్పరచుకుని ఉద్యోగిగా నిలదొక్కుకుంది. ఆగ్వా... అనేక సమస్యలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న శుభకు తోటి మహిళలు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ప్రేరణ ఇచ్చింది. ఈ ప్రేరణతోనే తనలాగా ఒంటరిగా బాధపడుతోన్న ఎంతోమంది మహిళలకు చేయూతనిచ్చేందుకు కొంతమంది మహిళల సాయంతో 2008లో ‘ఆగ్వా’ పేరిట నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. సాయంకోసం ఎదురు చూస్తున్న వారికి సాయమందిస్తూ, వారిని మానసికంగా దృఢపరిచి, ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ ఇప్పించి నిస్సహాయ మహిళలకు అండగా నిలబడింది. గృహహింసా బాధితులను ఆదుకోవడం, ‘క్యాంపస్ టు కార్పొరేట్’ పేరిట ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణించేందుకు మెళకువలు నేర్పించడం, అల్పాదాయ మహిళలను ఒకచోటకు చేర్చి వారితో చిన్నచిన్న వ్యాపారాలు చేయించడం, కుట్టుమిషన్లు, వెట్గ్రైండర్స్ ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడడం, కంప్యూటర్ స్కిల్స్ నేర్పించడం, టైలరింగ్, పేపర్ బ్యాగ్‌ల తయారీ వంటి వాటిద్వారా ఆగ్వా ప్రారంభించిన ఐదేళ్లల్లో్లనే ఎనిమిదివేలకుపైగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు చేయూతనిచ్చింది. కేవలం పన్నెండు మందితో ప్రారంభమైన ఆగ్వా క్రమంగా పెరుగుతూ నేడు తొమ్మిదివేల మందికి పైగా మహిళలతో పెద్దనెట్వర్క్గా విస్తరించింది. మహిళాసాధికారత.. గిఫ్టింగ్ స్మైల్స్ ఆగ్వా నెట్వర్క్ 2016 నుంచి ఇప్పటిదాకా కష్టాలలో ఉన్న మహిళలకు మానసిక బలాన్నిచ్చి వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు 31 కాన్ఫరెన్స్‌లు, 270 ఉచిత వెబినార్లు నిర్వహించి ఇరవై ఏడు వేలమంది మహిళలకు పరోక్షంగా దారి చూపింది. ఇవేగాక ఫుడ్ బ్యాంక్‌లకు ఆహారం అందించడం, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, పిల్లల ఆటవస్తువులు, పుస్తకాలు, స్వీట్లు, కలర్ బాక్స్‌లు, షూస్, విరాళాలు సేకరించి చెన్నై వ్యాప్తంగా ఉన్న నిరుపేద పిల్లలకు అందించింది. ప్రారంభంలో మహిళాభ్యున్నతికోసం ఏర్పాటైన ఈ నెట్వర్క్ నేడు దేశవ్యాప్తంగా ఉన్న వందలమంది వలంటీర్లు, సామాజిక వేత్తలతో కలసి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కెరీర్లో ఎదుగుతూనే... శుభా తన కెరీర్లో ఎదుగుతూనే ఆగ్వాను సమర్థంగా నడిపించడం విశేషం. బహుళ జాతి కంపెనీలైన.. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్ఎస్, డియా సెల్యూలార్ వంటి పెద్ద కంపెనీలలో ఉన్నతస్థాయి పదవుల్లో పనిచేసింది. ఈ అనుభవంతో మరింత మందిని కార్పొరేట్ కెరీర్లో ఎదిగేందుకు ప్రొఫెషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌లు నిర్వహించి, ఎంతో మందిని కార్పొరేట్ వృత్తినిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో మహిళలేగాక, దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఏదైనా సాధించగలవు ఈ ప్రకృతిలో నీటికి చాలా శక్తి ఉంది. మహిళ కూడా నీరులాంటిది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుని తన శక్తిని పుంజుకుంటుంది. అందుకే స్పానిష్ పదం ఆగ్వా అనే పేరును నా నెట్వర్క్కి పెట్టాను. మా నెట్ వర్క్‌లో 25 నుంచి 73 ఏళ్ల వయసు మహిళలంతా కలిసి పనిచేస్తున్నాం. వివిధ వృత్తి వ్యాపారాల్లో రాణిస్తోన్న వీరంతా నెట్‌వర్క్‌లో పనిచేస్తూ ఎంతో మందికి సాయం అదిస్తున్నారు. ఆగ్వా ఉమెన్ ఫౌండేషన్, అగ్వా ఉమెన్ లీడర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మా నెట్‌వర్క్‌ను విస్తరించాం. మనకుంది ఒకటే జీవితం. దానిని పూర్తిగా జీవించాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనేది అనవసరం. నీ కథను నువ్వే రాసుకునే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీ జీవితానికి నువ్వే హీరోయి¯Œ వని ఎప్పుడూ మర్చిపోకూడదు. అప్పుడే ఏదైనా సాధించగలవు. – శుభా పాండియన్ -
Google: గూగుల్ కీలక నిర్ణయం
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సమాచారం గోపత్య విషయంలో కీలక ప్రకటన చేసింది. గూగుల్ వినియోగదారులు అబార్షన్ క్లినిక్‌లు, గృహ హింస షెల్టర్స్, ప్రైవసీ కోరుకునే ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారి లోకేషన్ హిస్టరీనీ తొలగిస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రదేశాల్లో ఎవరైనా వినియోగదారులు సందర్శించినట్టు తమ సిస్టమ్స్ గుర్తిస్తే వెంటను ఆ ఎంట్రీలను తొలగిస్తామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెన్ ఫిట్జ్‌పాట్రిక్ వెల్లడించారు. రాబోయే కొన్ని వారాల్లో ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక.. సంతానోత్పత్తి కేంద్రాలు, పలు వ్యసనాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలకు సంబంధించి చికిత్స తీసుకునే ప్రదేశాలు, బరువు తగ్గించే క్లినిక్స్‌కు వెళ్లిన డేటాను కూడా సేవ్‌లో ఉండదని ఆయన తెలిపారు. అయితే, అగ్రరాజ్యం అమెరికాలో అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, మే నెలలో డెమోక్రటిక్ చట్టసభ సభ్యుల బృందం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈవో) సుందర్ పిచాయ్‌కు లేఖ రాశారు. సంతానోత్పత్తి కేంద్రాలకు వెళ్లే వారి స్మార్ట్‌ఫోన్ లొకేషన్ డేటాను బహిర్గతం చేయకుండా నిలిపివేయాలని వారు ఆ లేఖలో కోరినట్టు సమాచారం. #abortionishealthcare More good news related to tech and abortions. Google said Friday that it would delete its users’ location history whenever they visit an abortion clinic, domestic violence shelter or other similarly-sensitive…https://t.co/kLFFTLsVMZ https://t.co/ipM5X5gN5c — Regina Phelps 🇺🇦 (@ReginaPhelps) July 1, 2022 -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: హింసించే భర్తకు గుడ్‌బై
గృహ హింస అంటే భార్య ఒంటి మీద గాయాలు కనిపించాలి అనుకుంటారు చాలామంది. బాగనే కనిపిస్తున్నావుగా... కాపురం చేసుకోవడానికి ఏం నొప్పి అంటారు చాలామంది. ‘కాని మనసుకు తగిలే గాయాల సంగతి ఏమిటి అని అడుగుతుంది’ మేఘనా పంత్. గృహ హింస అంటే భర్త కొట్టకుండా తిట్టకుండా పెట్టే హింస కూడా అంటుందామె. మానసిక భావోద్వేగాలు అదుపు చేసుకోలేని భర్తతో ఐదేళ్లు బాధలు పడి ఆ పెళ్లి నుంచి బయటపడి ఆ అనుభవాలతో ‘బాయ్స్ డోన్ట్ క్రై’ నవల రాసింది మేఘనా. ‘ఒక స్త్రీ విడాకులు తీసుకుంటూ ఉంటే హాహాకారాలు చేసే సమాజం ధోరణి మారాలి’ అంటున్న మేఘన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో తన/వివాహిత స్త్రీల జీవితాలలోని సంఘర్షణలపై వ్యాఖ్యానం చేసింది. ‘నాకు చదువుంది. చైతన్యం ఉంది. లోకజ్ఞానం ఉంది. అయినా నేను నా వివాహంలో గృహ హింసను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టింది’ అంది మేఘనా పంత్. తాను రాసిన నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ గురించి జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడింది. ‘మన దగ్గర బాధితురాలిని కూడా ఒక స్టీరియోటైప్‌ను చేశారు. గృహ హింస ఎదుర్కొంటున్న గృహిణి అనగానే భర్త కొట్టిన దెబ్బలకు కన్ను వాచిపోయి, చర్మం కమిలిపోయి లేదా ఎముకలు విరిగి హాస్పిటల్ పాలయ్యి... ఇలా అయితేనే సదరు గృహిణి బాధ పడుతున్నదని భావిస్తారు. పైకి అంతా బాగున్నా మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. కాని పెళ్లిలో ఆ మాత్రం భర్త చేతి లెంపకాయలు మామూలే అన్నట్టు సర్దుకుపోతుంటారు’ అందామె. మేఘనా పంత్ ముంబైలో చదువుకుంది. ఎన్డిటివిలో రిపోర్టర్‌గా పని చేసింది. కథా రచయిత. 2007లో ఆమెకు వివాహం అయితే 2012లో ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చింది. ‘నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అని మొదట అన్నది మా అమ్మ. నేను వైవాహిక జీవితంలో పడుతున్న బాధను చెప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చెయ్ అని మొదట చెప్పిందీ మా అమ్మే. ఇప్పుడు పర్వాలేదు కాని పదేళ్ల క్రితం వరకూ కూడా విడాకులు అనగానే ఇక ఆ స్త్రీ జీవితం నాశనం అని, ఆ స్త్రీ ఏదో తప్పు చేస్తున్నదని భావించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ భావించే వర్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులే అందుకు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి అని’ అంటుందామె. మేఘనా కథనం ప్రకారం ఆమె భర్తకు మానసిక భావోద్వేగాలపై అదుపు లేదు. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. నా భర్తకు బైపోలార్ డిజార్డర్ ఉండేది. అతను నా పెళ్లికి రెండు వారాల ముందే నా మీద చేయి చేసుకున్నాడు. అసలు అప్పుడే పెళ్లి ఆపాల్సింది. కాని భారీ ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేయడం మన దేశంలో ఆనవాయితీ. అదంతా నష్టపోవాలా అనే పాయింటు ముందుకు వస్తుంది. పెళ్లి ఆపేయడం పెద్ద నామోషీ కూడా. అయితే మన ఇంటి అమ్మాయి నరకం పాలవ్వడం కంటే పెళ్లి ఆగి నామోషీ ఎదుర్కొనడం మంచిది. అలానే నా సలహా– పెళ్లికి పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గించి ఆ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు గురించి ఆమె కెరీర్ గురించి వెచ్చిస్తే చాలా మేలు. ముంబై నుంచి మా కాపురం న్యూయార్క్‌కు మారాక నా భర్త నన్ను నా తల్లిదండ్రుల నుంచి స్నేహితుల నుంచి కూడా దూరం చేశాడు. స్త్రీని ఒంటరి చేయడం హింస అవునా కాదా? 2012లో నా తొలి నవల ‘ఒన్ అండ్ ఏ హాఫ్ వైఫ్’ విడుదలైన రోజు రాత్రి అతను ఎంతో వింతగా ప్రవర్తించాడు. నాకు పిరియడ్స్ మొదలైతే నాప్కిన్ కూడా పెట్టుకోనివ్వలేదు. ఆ క్షణమే అనుకున్నాను ఈ జీవితం నుంచి బయటపడాలని’ అందామె. వివాహం నుంచి బయటకు వచ్చాక మేఘనా పూర్తి స్థాయి రచయితగా మారింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు, షోస్ చేసింది. ఆమె నవల ‘ది టెర్రిబుల్, హారిబుల్, వెరి బ్యాడ్ గుడ్ న్యూస్’ నవల ‘బద్నామ్ లడ్డు’ పేరుతో సినిమాగా రానుంది. ఆమె తాజా నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ కూడా వెబ్ సిరీస్‌కు ఎంపికైంది. ‘ఈ పేరు ఎందుకు పెట్టాను. అబ్బాయిలను చిన్నప్పటి నుంచి నువ్వు ఏడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మగాడంటే స్త్రీలతో ఇలా వ్యవహరించాలి అని పెంచుతాము. వాళ్లు కూడా తాము స్త్రీలతో మోటుగా వ్యవహరించడానికి అర్హులు అన్నట్టుగానే పెరుగుతారు. ఇది మారాలి. మగాళ్లు ఏడిస్తే ఏం పోతుంది? పెళ్లి నచ్చని ఆడాళ్లు విడాకులు తీసుకుంటే ఏం పోతుంది? మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకునే హక్కు ఉంది. ఇప్పుడు నాకు వివాహం అయ్యింది. నన్ను గౌరవించే భర్త దొరికాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. అఫ్కోర్స్.. వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొంటున్న భర్తలు కూడా ఉన్నారు. వారి బాధను కూడా పరిగణించాలి. స్త్రీలన్నా బయటకు చెప్పుకుంటారు. మగాళ్లకు ఆ ఓదార్పు కూడా లేదు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ బాధ అక్కర్లేదు’ అంటుందామె. ‘సర్దుకుపోవడం’ అనే ఒక సనాతన ధోరణిలోనే ఉన్న మన సమాజం మేఘనా వంటి రచయిత్రుల మాటలకు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. కాని పెళ్లిలోని ఉక్కిరిబిక్కిరి భరించలేనిదిగా మారినప్పుడు కూడా ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ‘బాయ్స్ డోన్ట్ క్రై’ దాదాపుగా మేఘనా జీవిత కథ. మార్కెట్లో ఉంది. చదవండి. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. వేదికపై మేఘనా పంత్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మేఘనా పంత్ -
అదర్ సైడ్.. నేను సైతం...
బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు... యామీ గౌతమ్. ‘ఇప్పుడు నా కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’ అనే మాట సెలబ్రిటీల నోటి నుంచి వింటుంటాం. యామీ మాత్రం తన కెరీర్‌తో పాటు సామాజిక విషయాలపై దృష్టి కేటాయించాలనుకుంటుంది. అందుకు ఉదాహరణ... మజిలీస్, పరి అనే స్వచ్ఛందసంస్థలతో కలిసి ఆమె పనిచేయాలని నిర్ణయించుకోవడం. అత్యాచార, లైంగికదాడి బాధితులకు అండగా నిలిచే సంస్థలు ఇవి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మజిలీస్ విషయానికి వస్తే, 1991లో ఫ్లావియ ఈ సంస్థను ప్రారంభించారు. ఆమె ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ‘మజిలీస్’లో 25 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కువమంది లాయర్లే. దిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ కార్యాలయంలో యామీ గౌతమ్ అత్యాచార బాధితులకు అండగా నిలవడమే కాదు, స్త్రీ సాధికారత, హక్కులు, చట్ట, న్యాయ సంబంధిత విషయాల గురించి అవగాహన కలిగించడంతోబాటు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ చేపడుతుంది మజిలీస్. అయితే చాలాసార్లు ఈ సంస్థకు నిధుల కొరత అవరోధంగా ఉంటోంది.. యామీలాంటి పేరున్న నటులు చేయూత ఇస్తే ఆ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ‘అత్యాచారాలకు సంబంధించిన వార్తల గురించి వింటున్నప్పుడు మనసు బాధతో నిండిపోయేది. ఆ మానసిక పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉండేది. పని ఒత్తిడిలో ఆ బాధను తాత్కాలికంగా మరిచిపోయినా నా ముందు ఎప్పుడూ ఒక ప్రశ్న మాత్రం నిలుచుండేది. మనం ఏమీ చేయలేమా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఆరంభం మాత్రమే. మహిళల భద్రతకు సంబంధించిన విషయాలలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది యామీ. బాలీవుడ్లో పది సంవత్సరాల అనుభవాన్ని గడించిన యామీ గౌతమ్ తొలి రోజులు నల్లేరు మీద నడకేమీ కాదు. రక రకాల సమస్యలు ఎదుర్కొంది. ఇదంతా ఒక ఎత్తయితే తన మీద తనకు అపనమ్మకం. ‘మన మీద మనకు అపనమ్మకం ఏర్పడ్డప్పుడు, ఇక వేరే శత్రువు అంటూ అక్కర్లేదు. మనల్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లే ప్రతికూలశక్తి దానికి ఉంది. మా అమ్మ మాటల బలంతో ఆ ప్రతికూల భావన నుంచి బయటికి రాగలిగాను. అందుకే నా మాట సహాయం కోరి వచ్చే వారికి నువ్వు కచ్చితంగా నెగ్గగలవు, నీలో ఆ శక్తి ఉంది అని ధైర్యం ఇస్తుంటాను’ అంటున్న యామీ తొలిరోజుల్లో స్క్రిప్ట్ వినేటప్పుడు... ‘ఈ సినిమాలో నా పాత్ర ఏమిటీ?’ అనే వరకు పరిమితమయ్యేది. ఇప్పుడు మాత్రం ‘ఈ సినిమాలో నా పాత్ర ఇచ్చే సందేశం ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?’ అనే కోణంలో ఆలోచిస్తుంది. ‘లాస్ట్’ సినిమాలో క్రైమ్ రిపోర్టర్, ‘దాస్వీ’లో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలు పోషించడం ఆమె ఆలోచన« దోరణిలో వచ్చిన మార్పుకు అద్దం పడతాయి. తాజా చిత్రం ‘ఏ థర్స్ డే’కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నైనా జైస్వాల్ అనే అత్యాచార బాధితురాలి పాత్రలో నటించింది యామీ గౌతమ్. వ్యవస్థ లోపాలను ప్రశ్నించడంతో పాటు, మన కర్తవ్యాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. -
నిశ్శబ్దం గొంతు విప్పింది!
కోవిడ్ నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ విధించిన కాలం అది. జాతీయ మహిళా కమిషన్‌కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి. ఇవన్నీ గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులే! రోజురోజుకూ ఫిర్యాదుల వరద పెరుగుతుందే తప్ప తగ్గలేదు... ఈ విషయం పుణేకి చెందిన ఫిల్మ్‌మేకర్ దీప్తి గాడ్గేను ఆలోచనల్లోకి తీసుకువెళ్లింది. ‘లాక్డౌన్ సమయంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గృహహింసకు గురయ్యారు...అనే విషయం తెలిసినప్పుడు బాధ అనిపించింది. నాలోని బాధను వ్యక్తీకరించడానికే ఈ లఘుచిత్రాన్ని తీశాను’ అని చెబుతుంది దీప్తి. ‘స్వమాన్’ పేరుతో ఆమె తీసిన అయిదు నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు... రోమ్‌లో జరిగే గోల్డెన్ షార్ట్ ఫిల్మ్‌ఫెస్టివల్, కాలిఫోర్నియాలో జరిగే ఉమెన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, టోక్యో షార్ట్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ‘ఇది ఎవరి కథా కాదు. పూర్తిగా కల్పితం’ అని దీప్తి చెబుతున్నప్పటికీ... గృహహింస ఎదుర్కొన్న ఎంతోమంది బాధితుల జీవితానికి దర్పణంగా అనిపిస్తుంది. ఒకరోజు దీప్తి మార్నింVŠ వాక్కు వెళుతున్నప్పుడు ఒక మహిళ రోడ్డుపక్కన దిగాలుగా కూర్చొని ఉంది. పెద్దింటి మహిళ అని ఆమె ఆహార్యం సూచిస్తుంది. రాత్రంతా నిద్ర లేనట్లు కళ్లు చెబుతున్నాయి. ఉండబట్టలేక...‘మీకు ఏమైనా సహాయం చేయగలనా?’ అని అడిగింది. ‘లేదు’ అంది ఆమె ముక్తసరిగా. కాస్త ముందుకు వెళ్లిన దీప్తి వెనక్కి తిరిగిచూస్తే... ఆమె కనిపించలేదు! ఆ బాధితురాలి గురించే ఆలోచిస్తూ నడుస్తోంది...ఆమె బాధితురాలు అనేది కాదనలేని వాస్తవం. అయితే ఆమెకు తాను ఎదురొన్న హింస గురించి చెప్పుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే పరువు సమస్య. గృహహింస ఎదుర్కొంటున్న వాళ్లలో చాలామంది మహిళలు ‘లోకం ఏం అనుకుంటుందో!’ ‘భర్తపై ఫిర్యాదు చేస్తే పిల్లల భవిష్యత్ ఏమిటీ’... ఇలా రకరకాల కారణాలతో రాజీ పడుతుంటారు. ఈ ధోరణి గృహహింసను మరింత పెంచుతుంది. తన ఆలోచనలకు అయిదునిమిషాల వ్యవధిలో చిత్రరూపం ఇవ్వడం అనేది కత్తి మీద సామే. అయితే ‘స్వమాన్’ రూపంలో ఆ పని విజయవంతంగా చేసి శభాష్ అనిపించుకుంది దీప్తి. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా షార్ట్‌ఫిల్మ్‌కు చక్కటి ప్రశంసలు లభించడం ఒక ఎత్తయితే, సామాన్య మహిళల మెప్పు పొందడం అనేది మరో ఎత్తు’ అంటుంది ఈ లఘుచిత్ర నిర్మాణ బాధ్యతలు చూసిన డా.అనిత. ‘కథలో నాటకీయతకు తావు ఇవ్వకూడదు అనుకున్నాను. చిన్న సంభాషణ లు మాత్రమే ఉపయోగించాను. ఇందులో కథానాయిక ఆశ గృహ హింస ను ఎదుర్కొంటుంది. అందరిలాగే తనలో తాను కుమిలిపోతుంది. చివరికి మాత్రం గొంతు విప్పి గర్జిస్తుంది. ఈ చిత్రం చూసి ఒక్క మహిళ స్ఫూర్తి పొందినా నేను విజయం సాధించినట్లే’ అంటుంది దీప్తి. -
Michael Slater: గృహహింస ఆరోపణలు.. మాజీ క్రికెటర్ అరెస్టు
Ex-Cricketer Michael Slater Arrested: గృహహింస ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్ అరెస్టైనట్లు సమాచారం. సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లాటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు... ‘‘అక్టోబరు 12న... గృహహింస ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈస్టర్న్ సబర్బ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా బుధవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు అతడిని అరెస్టు చేశాం’’అని ప్రకటన విడుదల చేశారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మైకేల్ స్లాటర్.. టెస్టు బ్యాటింగ్ టాపార్డర్‌లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో మొత్తంగా 5312 పరుగులు చేసిన స్లాటర్.. 2004లో ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రాడ్‌కాస్టర్‌గా, టెలివిజన్ పండిట్‌గా గుర్తింపు సంపాదించాడు. చదవండి: T20 World cup 2021: ధోనికి వయస్సు అయిపోలేదు.. మాకు పోటీ ఇవ్వగలడు: కేఎల్ రాహుల్ -
స్టార్ సింగర్ అక్రమ సంబంధాలు: అడిగితే మందు బాటిల్‌తో
Yo Yo Honey Singh Domestic Violence Case: స్టార్ సింగర్ యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం ఆమె పిటిషన్ సైతం దాఖలు చేసింది. 120 పేజీలున్న ఈ పిటిషన్లో హనీసింగ్ ఆగడాల గురించి షాలిని వివరించింది. అతడి యాటిట్యూడ్ వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించాననేది పేర్కొంది. '2011లో హనీమూన్ అయిపోయిన తర్వాత హర్దేశ్ సింగ్(హనీ సింగ్ అసలు పేరు) సడన్‌గా మారిపోయాడు. ఏమైంది? ఎందుకిలా మారిపోయావని ప్రశ్నిస్తే.. తనకు ఇష్టం లేకపోయినా కేవలం నాకిచ్చిన మాట కోసం ఈ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. హనీమూన్ ట్రిప్‌లో నన్ను ఒంటరిగా వదిలేసి తాగుబోతులా తిరిగేవాడు. ఈ ప్రవర్తన గురించి అడిగితే నా జుట్టు పట్టుకుని కొట్టి, నోరు మూసుకోమని చెప్పేవాడు. అతడికి ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది, అందుకే నన్ను తనవెంట టూర్లకు తీసుకెళ్లేవాడు కాదు. మా పెళ్లి విషయాన్ని ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచాలనుకునేవాడు. అందుకే వేలికి రింగ్ కూడా పెట్టుకునేవాడు కాదు. కానీ ఇంటర్నెట్లో మా ఫొటోలు లీక్ అవడంతో దానికి నేనే కారణమంటూ నన్ను దారుణంగా కొట్టాడు. అవి ఓ సినిమా షూటింగ్ స్టిల్స్ అని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. 'బ్రౌన్ ర్యాంగ్' పాట కోసం వర్క్ చేసిన ఒక మహిళతోనూ హనీ సింగ్‌కు అఫైర్ ఉంది. ఈమేరకు ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అభ్యంతరకర ఫొటోలు నా కంటపడ్డాయి. వాటి గురించి నిలదీస్తే నా మీదకు మందు బాటిళ్లు విసిరాడు. ఆ తర్వాత వేరే ఆడవాళ్లతో కలిసి దిగిన ఫొటోలు చాలానే కనబడ్డాయి. నా పట్ల నా భర్త అతి క్రూరంగా ప్రవర్తించాడు. ఇదిలా వుంటే ఒకరోజు నేను బట్టలు మార్చుకుంటుంటే మామయ్య నేరుగా నా గదిలోకి వచ్చి నన్ను అసభ్యంగా తాకాడు. ఆ ఇంట్లో నన్ను హింసించారని నిరూపించేందుకు నా దగ్గర ఇంకా ఎన్నో సాక్ష్యాలున్నాయి' అని షాలిని తెలిపింది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టం కింద హనీ సింగ్ నుంచి రూ.10 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని పిటిషన్లో డిమాండ్ చేసింది. దీనిపై ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాలంటూ హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే! -
నా కడుపులో తన్నాడు, మెడ పట్టుకుని గెంటేశాడు!: నటి
Arzoo Govitrikar: భర్త వేధింపులు, హింసను భరించలేకపోతున్నానంటోంది హిందీ నటి అర్జూ గోవిత్రికర్. ఈ క్రమంలో భర్త సిద్ధార్థ్ శబర్వాల్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. కాగా అర్జూ 2019లో గృహహింస కింద భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈ రెండేళ్ల కాలంలో అతడిలో మార్పు లేకపోగా మరింత హింసకు పాల్పడుతుండటంతో విడిపోవడానికే నిశ్చయించుకుంది. ఈ సందర్భంగా అర్జూ గోవిత్రికర్ మీడియాతో మాట్లాడుతూ.. 'అవును, నేను విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఇప్పటివరకు నేను భరించింది చాలు. ఎంతో ప్రయత్నించి చూశాను కానీ సిద్దార్థ్‌తో కలిసుండటం సాధ్యపడదు అనిపిస్తోంది. మా మధ్య పెరుగుతున్న దూరం గురించి నేనెప్పుడూ మీడియాతో మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడి తీరతాను. నా భర్త నన్ను మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి ప్రయత్నించాడు. అతడు నాపై చేయి చేసుకున్నాడు, కట్టుకున్నదాన్ని అని చూడకుండా కడుపులో తన్నాడు. అంతెందుకు, నన్ను విచక్షణారహితంగా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేనెప్పుడూ ఆ గాయాలను బయటకు చూపించాలనుకోలేదు. పెళ్లైన రెండేళ్ల తర్వాత సిద్ధార్థ్ తొలిసారిగా నా మీద చేయెత్తాడు. ఆ తర్వాత కొడుకు పుట్టిన మూడేళ్లకు అతడు వేరే గదిలో నిద్రించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో అతడికో రష్యన్ ప్రియురాలు ఉందని తెలిసింది. అతడు ఒంటరిగా ఆ గదిలో ఆమెతో చాటింగ్ చేస్తున్నాడని అర్థమైంది. ఇదే విషయాన్ని నేరుగా అతడి దగ్గరకు వెళ్లి నిలదీశాను, కానీ ప్రయోజనం లేకపోయింది. కానీ వాళ్లు కలిసుంటున్నారా? విడివిడిగా ఉంటున్నారా? అన్నది నాకు తెలీదు. అతడి చాటింగ్, నా మీద దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలే నాకు అంతో ఇంతో న్యాయం చేస్తాయని ఆశిస్తున్నాను' అని అర్జూ చెప్పుకొచ్చింది. తనను కులం పేరుతో కూడా దూషించేవాడని ఆమె ఆరోపిస్తోంది. ఇక ఈ ఆరోపణలను సిద్ధార్థ్ తోసిపుచ్చాడు. 'ఆమెకు ఏం కావాలో అది చెప్పనివ్వండి. ఈ విషయంపై నేనేమీ మాట్లాడదల్చుకోలేదు' అని పేర్కొన్నాడు. కాగా అర్జూ గోవిత్రికర్ బాగ్బాన్, నాగిని 2లో నటించింది. -
ప్రముఖ సింగర్‌పై గృహహింస, లైంగిక వేధింపుల కేసు
ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలో కోర్టు హనీ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా ఆదేశించింది. హనీ సింగ్, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడేళ్ల క్రితం అనగా 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను జనాలకు పరిచయం చేశాడు. బాలీవుడ్‌లోని పలు భారీ ప్రాజెక్ట్స్‌లో పని చేయడానికి ముందే హనీ సింగ్ వివాహం అయిందని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక దీపికా పదుకోనె, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన ‘కాక్టెయిల్’ చిత్రంలోని ఆంగ్రేజీ బీట్ పాటతో హనీ సింగ్ బాగా ప్రాచుర్యం పొందారు. ఈ పాట సూపర్ హిట్ అవ్వడమే కాకా 2011లో టాప్ సాంగ్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హనీ సింగ్ బాలీవుడ్ కెరీర్ సాఫీగా కొనసాగుతుంది. ఇక భార్య ఇచ్చిన ఫిర్యాదులతో అతడి కెరీర్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. భార్య ఫిర్యాదు మీద హనీ సింగ్ ఇంకా స్పందించలేదు. -
పింక్ ప్రొటెక్షన్ ‘సర్వే’యలెన్స్ చెక్ చేస్తారు... చెక్ పెడతారు
జ్వరాలు ఉన్నాయేమోనని ఇంటింటి సర్వే చేయడం తెలుసు. కాని ఇక మీదట కేరళలో గృహ హింస జరుగుతున్నదా అని ఇంటింటినీ చెక్ చేస్తారు. కాలేజీల దగ్గర పోకిరీల పని పడతారు. కట్నం మాటెత్తితే లోపల వేస్తారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే చిప్పకూడు తినిపిస్తారు. స్త్రీలకు విరోధులుగా మారిన పురుషులకు గుణపాఠం చెప్పడానికి కేరళ ప్రభుత్వం సోమవారం ‘పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్’ ప్రారంభించింది. ఆ వివరాలు... పోలీస్ వెహికిల్ అంటే మగ డ్రైవర్, మగ ఇన్స్పెక్టర్, మగ కానిస్టేబుల్స్... ఇలాగే ఉంటుంది అన్ని చోట్లా. కాని కేరళలో ఇక మీదట ‘పింక్’ కార్లు కూడా కనిపిస్తాయి. లేడీ డ్రైవర్, లేడీ ఇన్స్పెక్టర్, లేడీ కానిస్టేబుల్స్.... వీళ్లే ఉంటారు. ఈ పింక్ కార్లు రోడ్ల మీద తిరుగుతుంటాయి. తమ కోసం ఈ వాహనాలు రక్షణకు పరిగెత్తుకొని వస్తాయి అనే నమ్మకాన్ని స్త్రీలకు ఇస్తాయి. కేరళలో ఇటీవల గృహ హింస కేసులు, వరకట్న చావులు మితి మీరాయి. ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణకు వివిధ మహిళా పోలీసు దళాలు విధుల్లో ఉన్నా సోమవారం (జూలై 19) ‘పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్’ పేరుతో అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృఢమైన సందేశం ఇచ్చేలా కొత్త దళాలను తిరువనంతపురంలో ప్రారంభించారు. మూడు సంరక్షణలు స్త్రీలకు మూడుచోట్ల భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఒకటి పబ్లిక్ ప్లేసుల్లో (రోడ్లు, పార్కులు, బస్‌స్టాప్‌లు..), రెండు ప్రయివేటు ప్లేసుల్లో (నివాస గృహాలు, హాస్టళ్లు...), మూడు సోషల్ మీడియాలో (ఫేస్బుక్, ట్విటర్..)... ఈ మూడు చోట్ల స్త్రీలకు ఏ మాత్రం అసౌకర్యం జరగడానికి వీల్లేకుండా ‘పింక్ ప్రొటెక్షన్’ కింద మహిళా దళాలు అలాగే పురుష దళాలు పరస్పర సహకారంతో పని చేయాలని అక్కడ చర్యలు మొదలయ్యాయి. ఇంటికి వచ్చే ‘పింక్ జనమైత్రి’ గృహ హింస, వరకట్న వేధింపులకు చెక్ పెట్టడానికి కేరళలో మొదలెడుతున్న వినూత్న రక్షణ చర్య ‘పింక్ జనమైత్రి’. సాధారణంగా ఇళ్లల్లో గృహ హింస జరుగుతూ ఉన్నా, వరకట్న వేధింపు జరుగుతూ ఉన్నా అది ఆ ఇంటికి, ఇరుగు పొరుగు వారికీ తెలుస్తూ ఉంటుంది తప్ప స్టేషన్ వరకూ చేరదు. అనేక కారణాల వల్ల, చట్టం సహాయం తీసుకోవచ్చని స్త్రీలకు తెలియకపోవడం వల్ల పోలీసులకు ఈ వేధింపు తెలియదు. అది దృష్టిలో పెట్టుకుని కేరళలోని ప్రతి జిల్లాలోని ప్రతి ఊళ్లోని పంచాయితీ సభ్యులతో ‘పింక్ జనమైత్రి’ కార్యక్రమం కింద మహిళా పోలీసులు ‘టచ్’లో ఉంటారు. ఊళ్లో ఏ ఇంట్లో అయినా స్త్రీలపై హింస జరుగుతుందా ఆరా తీస్తారు. అలాగే ఇంటింటిని సర్వే చేస్తూ ఆ ఇంటి మహిళలతో మాట్లాడతారు. మహిళలు విషయం దాచాలనుకున్నా వారి వొంటి మీద దెబ్బపడి ఉంటే ఆ దెబ్బ పెద్ద సాక్ష్యంగా నిలిచే అవకాశం ఉంది. దాంతో ఆ హింసకు పాల్పడిన కుటుంబ సభ్యులపై చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇది వరకట్న వేధింపులు ఎదుర్కొనే కోడళ్లకు పెద్ద తోడు అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులను కూడా ఇంట్లో అడుగుపెట్టనీకుండా కోడళ్లను రాచి రంపాన పెట్టే భర్త, అత్తామామలు ఉంటారు. కాని పోలీసులను రావద్దు అనడానికి లేదు. కోడలు నోరు విప్పి ఏం చెప్పినా అంతే సంగతులు. పింక్ షాడో పెట్రోల్, పింక్ రోమియో కేరళలో స్త్రీలకు నీడలా ఉంటూ వేధించే పురుషులకు సింహ స్వప్నంగా నిలిచేదే ‘పింక్ షాడో పెట్రోల్’. ఇందుకోసమే పింక్ వెహికిల్స్‌ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్లు పూర్తిగా మహిళా పోలీసులతో తిరుగుతాయి. ‘మా వెహికిల్ వస్తుంటే అల్లరి వెధవలు తోక ముడిచి పారిపోతున్నారు’ అని ఆ వెహికల్స్‌లో విధి నిర్వహిస్తున్న ఒక మహిళా ఇన్స్పెక్టర్ చెప్పింది. ‘అమాయక యువతులకు మాయమాటలు చెప్పి పార్కులకు సినిమాలకు తిరిగే మేక వన్నె పులులు కూడా ఇప్పుడు మా బండ్లు ఎక్కడ పసి గడతాయోనని ఒళ్లు దగ్గర పెట్టుకుంటున్నారు.’ అని కూడా ఆమె అంది. పింక్ షాడో పెట్రోల్ మొదలయ్యాక కేరళలో బీచ్‌ల వద్ద జరిగే క్రైమ్ బాగా తగ్గింది. ఇక ఆడపిల్లలను సిటీ బస్సుల్లో, కాలేజీల దగ్గర, స్కూళ్ల దగ్గర అల్లరి పెట్టేవారి భరతం పట్టడానికే ‘పింక్ రోమియో’ మహిళా పోలీసు దళం పని చేస్తుంది. వీరికి బుల్లెట్లు, సైకిళ్లు కూడా పోలీసు శాఖ సమకూర్చింది. పింక్ హెల్మెట్లతో వీరు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ విధులలో ఉంటారు. అలాగే 24 గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఉంటుంది. భావజాలం మారాలి ‘ఎన్ని దళాలు ఎన్ని విధాలుగా పని చేసినా అవి దుర్మార్గ పురుషులను నియంత్రించొచ్చుగాని వారిని పూర్తిగా మార్చలేవు. మారాల్సింది పురుషులే. తమకు తాముగా వారు స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలో వారిని ఎంత గౌరవించాలో తెలుసుకోవాలి. అప్పుడే అత్యాచారాలు, హింస, వేధింపులు ఆగుతాయి’ అని పింక్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఒక మహిళా ఆఫీసర్ అన్నారు. అవును. అబ్బాయిలకు హైస్కూలు వయసు నుంచే ఇంట్లో, బయట స్త్రీలతో ఎలా వ్యవహరించాలో నేర్పించాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది. వారిని జెండర్ సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థకు ఉంది. ఈ రెండు చోట్ల పురుష భావజాలం సంస్కరింపబడిన నాడు పింక్ ప్రొటెక్షన్ అవసరమే ఉండదు. -
కర్ణాటకలో మహిళల దైన్యం.. పోలీసుస్టేషన్లకు క్యూ
సాక్షి, బెంగళూరు: కరోనా మహమ్మారితో ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు, లాక్డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం తదితర కారణాలతో గృహహింస పెచ్చరిల్లుతోంది. అందుకు అతివే బాధితురాలు అవుతోంది. ఇది కర్ణాటకలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 3 నెలల్లో 458 వరకట్న కేసులు,52 మంది మృతి మూడు నెలల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 458 వరకట్న కేసులు నమోదు కాగా వీరిలో 52 మంది మహిళలు మరణించారు. భర్త చేతిలో హత్యకు గురికావడమో, లేదా ఆత్మహత్య చేసుకోవడమో జరిగింది. మహిళలపై దౌర్జన్యాలకు సంబంధించి మొత్తం 574 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ అమలైన సుమారు 10 రోజుల నుంచి 159 మందికి పైగా మహిళలు వరకట్న వేధింపులతో పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కారు. మే నెలలో కేసులు ఇంకా పెరగవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. కొన్ని కేసులను పరిశీలిస్తే కట్నం కోసం వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. డబ్బు తేలేదని విడాకుల నోటీస్ బెంగళూరులోని జయనగరలో 28 ఏళ్ల మహిళకు నాలుగేళ్ల కిందట ప్రైవేటు ఉద్యోగి శ్రీకాంత్‌తో వివాహమైంది. కరోనా వల్ల ఏర్పడిన లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటూ భార్యను వేధించసాగాడు. కనీసం తిండి కూడా పెట్టకుండా, పుట్టింటి నుంచి రూ. 3 లక్షలు తేవాలని ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బు తేలేదని విడాకులు నోటీస్ పంపాడు. రూ.64 లక్షలు ఇచ్చినా తృప్తి లేదు బెంగళూరు కేఆర్ పురానికి చెందిన 34 ఏళ్ల మహిళకు 2015లో ఇంజనీర్ ప్రకాష్‌తో వివాహమైంది. ఇల్లు కొందామంటే ఆమె రూ. 64 లక్షలు అప్పుచేసి భర్తకు ఇచ్చింది. అయినప్పటికీ మళ్లీ డబ్బు తేవాలని భర్త వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలింతపై పాశవిక దాడి పట్టెగారేపాళ్యకు చెందిన 25 ఏళ్ల మహిళకు మూడేళ్ల కిందట ప్రైవేటు కంపెనీ ఉద్యోగి శివకుమార్‌తో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్న కానుకలు భారీగానే ముట్టజెప్పారు. అయినా మళ్లీ తేవాలని ఒత్తిడి చేయసాగాడు. గర్భిణి అని కూడా చూడకుండా సతాయించాడు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లి తిరిగిరాగా, డబ్బులు, బంగారం తీసుకురాలేదని రక్తం వచ్చేలా కొట్టాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కర్ణాటకలో గృహహింస కేసుల వివరాలు ఏడాది కేసులు మృతులు 2017 1,532 206 2018 1,524 198 2019 1,716 189 2020 1487 177 2021 (మార్చి) 458 52