నారీ అదాలత్‌ ఏం చెబుతోంది? | Nari Adalats: Women Only Courts for Alternative Dispute Resolution | Sakshi
Sakshi News home page

నారీ అదాలత్‌ ఏం చెబుతోంది?

Published Wed, Jul 10 2024 12:51 AM | Last Updated on Wed, Jul 10 2024 12:51 AM

Nari Adalats: Women Only Courts for Alternative Dispute Resolution

భారతీయ న్యాయ సంహిత తాజాగా అమలులోకి వచ్చింది. అలాగే స్త్రీలకు సత్వర న్యాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నారీ అదాలత్‌’ పేరుతో ప్రత్యేక పంచాయతీ వ్యవస్థను పరిచయం చేయబోతోంది. పైలట్‌ప్రాజెక్ట్‌గా అసోం, జమ్ము–కశ్మీర్‌లలో ప్రవేశపెట్టనున్నారు.  ఇది కోర్టులా న్యాయం చేస్తుందా? లేదా ‘ఖాప్‌ పంచాయతీ’లా పంచాయతీ పెడుతుందా? అసలు ‘నారీ అదాలత్‌’ ఏంటి?

నళిని ప్రైవేట్‌ టీచర్‌. తమ ఊళ్లోనే ఉన్న కాన్వెంట్‌లో పని చేస్తోంది. వృత్తి అంటేప్రాణం. వాళ్లది గ్రామ పంచాయతీ. వ్యవసాయ కుటుంబం. ఇంట్లోనే పాడి. భార్యగా, ఇంటి కోడలిగా ఆ బాధ్యతలన్నీ నళినే చూసుకోవాలని ఆమె మీద ఒత్తిడి.. భర్త, అత్తగారి నుంచి! ఆఖరికి వాకిలి ఊడ్చి, కళ్లాపి జల్లి, ముగ్గు వేసే పనినీ నౌకరుతో చేయిస్తోందని భర్త కంప్లయింట్‌. ఆ ఒత్తిడి హింసగా మారి నళిని మానసిక ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుడంటంతో ఆమె గృహ హింస చట్టాన్ని ఆశ్రయించక తప్పలేదు. ‘విమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌’లో భర్త మీద ఫిర్యాదు చేసింది. 

భార్యాభర్తలిద్దరికీ రెండుసార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా నళిని భర్తది ఒకటే మాట.. ఆమె ఉద్యోగం మానేయాలని! దానికి నళిని ససేమిరా అన్నది. దాంతో ‘విమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ ఆ డొమెస్టిక్‌ ఇన్సిడెంట్‌ రిపోర్ట్‌’(తాము కౌన్సెలింగ్‌ చేసిన విధానం, అయినా ఫలితం రాని వైనాన్ని రాసిన నివేదిక) ను కోర్ట్‌కి సబ్‌మిట్‌ చేశారు. ఆ రిపోర్ట్‌ ఆధారంగా గృహ హింస చట్టం కింద కోర్ట్‌ ప్రొసీడింగ్స్‌ మొదలయ్యాయి. గృహ హింస చట్టంలో  ఆరోపణ రుజువైతే బాధితులకు ఆర్థిక భద్రత కల్పించాలి. వాళ్లకున్నప్రాథమిక హక్కుని గౌరవించాలి. ఇది మహిళలకు ఆ యాక్ట్‌ ద్వారా కోర్టులు అందించే న్యాయం. 

నళిని ఉండే ఊర్లో ‘నారీ అదాలత్‌’ అమలయితే ఆ పంచాయతీ ఎలా ఉండొచ్చు?
‘నారీ అదాలత్‌’లోని సభ్యుల్లో సగం మంది గ్రామ పంచాయత్‌ నుంచి ఉంటారు. మిగిలిన సగంలో టీచర్లు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సామాజిక కార్యకర్తలు మొదలైన వారుంటారు. వీళ్లను గ్రామస్థులే నామినేట్‌ చేస్తారు. ఈ కమిటీ అంతా మహిళలతోనే ఉంటుందా? లేక స్త్రీ, పురుషులతో కలసి ఉంటుందా అనేదాని మీద ఎక్కడా పూర్తి వివరం లేదు. సరే.. నళినీ కేసు నారీ అదాలత్‌ స్వీకరించినప్పుడు అదాలత్‌ సభ్యులపై నళిని అత్తగారి కుటుంబం పలుకుబడి ప్రభావం చూపదా? అలాగే పురుషస్వామ్య సంస్కృతి ప్రభావం వల్ల అదాలత్‌లోని సభ్యులకు కుటుంబం, స్త్రీ, ఆమె విధుల పట్ల సంప్రదాయ ఆలోచనలు, కచ్చితమైన అభి్రపాయాలు ఉండొచ్చు.

ఈ నేపథ్యంలో నళిని విషయంలో ఎలాంటి తీర్పు వెలువడవచ్చు? ఆమె హక్కులు, వ్యక్తిత్వాన్ని గుర్తించే, గౌరవం లభించే అవకాశం ఎంత వరకు ఉంటుంది? దీనివల్ల దళిత, గిరిజన మహిళల మీద వేధింపులు పెరగవచ్చు, రాజకీయ ప్రయోజనాలూ మిళితమవచ్చు. కరప్షన్‌కి చాన్స్‌ ఉండొచ్చు. అసలు ఇది ఊళ్లల్లో పెద్ద మనుషుల పంచాయతీకి ఏ రకంగా భిన్నమైనది? దాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.. ఈ అదాలత్‌లను ప్రభుత్వమే నిర్వహిస్తోంది అనే భేదం తప్ప! దీన్ని ఆసరాగా చేసుకుని నారీ అదాలత్‌ సభ్యులు నిందితుల లేదా వాళ్ల తరఫు పెద్ద మనుషుల ప్రలోభాలకు లొంగి బాధితురాలిని ఇబ్బంది పెట్టే ప్రమాదం మెండు.

స్థానిక పోలీసులూ రెచ్చిపోయే అవకాశమూ అంతే అధికం.  రే΄÷్పద్దున లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, స్టాకింగ్‌ లాంటి సమస్యలను తీసుకుని మహిళలు పోలీస్‌ స్టేషన్‌కి వెళితే నిందితుల ప్రలోభాలకు తలొగ్గి స్టేషన్‌కి ఎందుకు వచ్చారు? నారీ అదాలత్‌లున్నాయి కదా అక్కడే తేల్చుకు΄పొండి అనే చాన్సూ ఉంటుంది. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది? ఈ క్రమంలో మహిళల కోసం వచ్చిన ప్రత్యేక చట్టాల ఉనికే దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఏదేమైనా ఇలాంటి ప్రయోగాలు లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలతో, ఒక నిర్దిష్ట రూపం దాల్చాకే అమల్లోకి వస్తే మంచిది అని అభి్రపాయపడుతున్నారు పలువురు న్యాయప్రముఖులు, సామాజిక కార్యకర్తలు! – సరస్వతి రమ

ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌గానే... 
కోర్టులకు పనిభారం తగ్గించేందుకే కేంద్రం ఖాప్‌ పంచాయత్‌లను పోలిన నారీ అదాలత్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది ఏ రకంగానూ విమెన్‌ ఫ్రెండ్లీ కాదు. ఇప్పటివరకు విన్న, చదివిన దాన్ని బట్టి ఇదో ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌గా మిగిలిపోనున్నది. ఎందుకంటే గ్రామస్థాయిలో న్యాయవాదులచే శిక్షణ ΄పొందిన లీగల్‌ వలంటీర్‌ వ్యవస్థ ఉంది.

మండల, జిల్లా స్థాయిల్లో లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కేంద్రాలు, సఖీ సెంటర్లున్నాయి. ఇప్పటికే ప్రతి పోలీస్‌స్టేషన్‌కి అనుబంధంగా ఉన్న కౌన్సెలింగ్‌ సెంటర్స్‌ వల్ల పోలీసులు ఫిర్యాదులే తీసుకోవట్లేదు. ఎంత తీవ్రమైన సమస్యలనైనా కౌన్సెలింగ్‌ సెంటర్స్‌కే రిఫర్‌ చేస్తున్నారు. అక్కడ కొన్ని పరిష్కారం అయ్యి కొన్ని కాక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది రచ్చబండను పోలిన ఈ నారీ అదాలత్‌లు ఏం న్యాయం చేయగలవు!  – ఇ. పార్వతి, ఫ్యామిలీ కౌన్సెలర్‌

అసంబద్ధమైన ఆలోచన
‘నారీ అదాలత్‌’ లాంటి అఫీషియల్‌ ఖాప్‌ పంచాయత్‌లు మహిళల హక్కుల ఉల్లంఘనకు పాల్పడతాయి. వీటివల్ల మహిళల ప్రైవసీ, డిగ్నిటీ, మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు. అంతేకాదు పరువు పేరుతో వాళ్లప్రాణాలకూ ముప్పు ఉండొచ్చు. ఇదొక అసంబద్ధమైన ఆలోచన. జూన్‌ 30 వరకు అమలులో ఉన్న క్రిమినల్‌ చట్టాల ప్రకారం.. కుటుంబ వివాదాలకు సంబంధించిన అన్ని కేసులు ఇంకా చె΄్పాలంటే ఏడేళ్లలోపు శిక్షలు పడ్డ అందరికీ స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలి. అంటే బాధితులకు న్యాయాన్ని అందించడంతో పాటు నిందితుల హక్కులనూ గుర్తిస్తుందన్నమాట. కుటుంబ కలహాలు, గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్‌ ఫెయిలైతే సదరు కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు రిపోర్ట్‌ పంపిస్తారు. దాని ప్రకారం వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చట్టం చెబుతోంది. ఇలాంటి కేసుల్లో కొత్త శిక్షాస్మృతీ దాన్నే ఫాలో కావాలి. 

కానీ కొత్త క్రిమినల్‌ చట్టాలు, ముఖ్యంగా భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్నెస్సెస్‌) లోని కొన్ని రూల్స్‌ వల్ల అలా జరగకపోవచ్చు. సాధారణంగా ఏ ఫిర్యాదు అందినా వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. అయితే కుటుంబ కలహాల కేసులు, ఆర్థిక నేరాలు వంటి కొన్ని ఆరోపణలలో ఏడు రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేయవచ్చు. కానీ అది నిజనిర్ధారణకు కాదు. కాగ్నిజబుల్‌ కేసు అనిపిస్తే వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తీరాలి. కానీ బీఎన్నెస్సెస్‌ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వయిరీ పవర్‌ పోలీసులకు వచ్చింది. కాబట్టే వాళ్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే ఆస్కారం తక్కువుంటుంది.

 ఇదివరకైతే పోలీసులు సహకరించకపోతే ఎఫ్‌ఐఆర్‌ వేయమని జిల్లా మేజిస్ట్రేట్‌ దగ్గర పిటిషన్‌ దాఖలు చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు బీఎన్నెఎస్సెస్‌లోని సెక్షన్‌ 223 (1) ప్రకారం నిందితుడి పక్షం వినకుండా మెజిస్ట్రేట్‌.. ఎఫ్‌ఐఆర్‌ కోసం పోలీసులకు ఆదేశాలిచ్చే అవకాశం లేదు. దాంతో బలవంతులైన పురుషులకు బయటపడే మార్గాలను వెదుక్కునే చాన్స్‌ దొరుకుతోంది. వీటివల్ల 498 వంటి కేసుల్లోనూ ఎఫ్‌ఐఆర్‌ ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇలా కోర్టు పరిధిని తగ్గించే ఇలాంటి ప్రయత్నాలేవీ సమాజానికి మంచివి కావు. – శ్రీకాంత్‌ చింతల, తెలంగాణ హైకోర్టు న్యాయవాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement