‘మరుగు’ ఉంటేనే పథకాలు
- 20 మండలాల్లో ఐపీపీఈ అమలు
- 476 పంచాయతీలకు ప్రయోజనం
- ఐదేళ్ల ప్రణాళిక అమలుకు కేంద్రం సిద్ధం
- డ్వామా పీడీ శ్రీరాములు
కంఠారం(కొయ్యూరు) ప్రతి ఇంటా మహిళలు వ్యక్తిగత మరుగుదొడ్లను విధిగా నిర్మించుకుంటేనే, ఆ ఇంటికి సంబంధించి మిగిలిన ఏ అభివృద్ధి పథకానికైనా కేంద్రం నిధులిస్తుందని, లేకుంటే భవిషత్తులో ప్రభుత్వ సాయం అందే అవకాశం లేదని డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములు స్పష్టం చేశారు. మండలంలోని కంఠారంలో నిర్వహించిన సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ 2014-15పై నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడారు.
ఈ ప్రణాళిక అమలుకు జిల్లాలో 20 మండలాలను ఎంపిక చేశారని, ఇందులో మన్యంలోని 11 మండలాలనూ ఎంపిక చేయడం ద్వారా చాలావరకు పేదరిక నిర్మూలన అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 476 పంచాయతీల్లో ఐదేళ్లపాటు ఇది అమలవుతుందన్నారు.
అభివృద్ధి పనుల ఎంపిక ఇలా!
ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలోనూ మూడు రోజులపాటు సిబ్బంది ఉండి ప్రణాళికలను రూపొందిస్తారని డ్వామా పీడీ శ్రీరాములు తెలిపారు. వాటిని చిత్రాల రూపంలో ఉంచి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. రోడ్లు, భవనాలు, పంట పొలాలకు రోడ్లు లేదా కాలువలు లాంటి వాటిని ప్రణాళికలో పెట్టవచ్చన్నారు. పంచాయతీకి అవసరమైన అన్ని అభివృద్ధి పనులనూ దీనిలో చేర్చవ చ్చన్నారు. వ్యక్తులు, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
బహిరంగ విసర్జన కారణంగా ప్రతి వెయ్యి మందిలోనూ 30 మంది పిల్లలు మరణిస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో చేపట్టాల్సిన పనులను అదనపు పీడీ ఆనందరావు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు గాడిశ్రీరామమూర్తి గ్రామ సమస్యలను వివరించారు. ఎంపీడీవో గోపాలరావు, ఏపీవో పవన్‌కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు మంజే సత్యవతి, సర్పంచ్ గంగాభవాని, గాడి సత్తిబాబు, పైల గంగరాజు, సాంబశివరావు పాల్గొన్నారు.