sriramulu
-
బీజేపీ నాకు తల్లిలాంటిది.. మారే ఆలోచన లేదు
సాక్షి,బళ్లారి: బీజేపీ తనకు తల్లిలాంటిదని, రాజకీయంగా ఎదగడానికి ఎంతో తోడ్పాటును అందించిందని, ప్రస్తుతం పార్టీని వీడే ఆలోచన లేదని, ఒక వేళ పార్టీని వీడే సందర్భమే ఏర్పడితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ గాలి జనార్దనరెడ్డిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సండూరు ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి తాను కారణమని పేర్కొనడంలో అర్థం లేదన్నారు. తాను నిజాయితీగా పార్టీ అభ్యర్థి గెలుపునకు శ్రమించానన్నారు. తల్లిలాంటి పార్టీకి తాను ఎన్నటికీ ద్రోహం చేయబోనన్నారు. తనను రాజకీయంగా ముగించేందుకు కొందరు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్కరి శక్తి, సహకారంతో రాజకీయాల్లో రాణించలేదన్నారు. ఉద్ధండులతో పోరాడి పైకెదిగా కష్టపడి, ఎందరో ఉద్ధండులకు వ్యతిరేకంగా పోరాడి ముందుకు వచ్చానన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించానని గాలి జనార్దనరెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ, ఆయనేమైనా మ్యాజిక్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు తన వెంట ఉండటం వల్లనే గెలిచానని, రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనన్నారు. గాలి జనార్దనరెడ్డి అబద్ధాలు చెబుతూ రాజకీయ కోటను నిర్మించుకోవాలని చూస్తున్నారన్నారు. ఏ ఒక్కరి ఆశీర్వచనంతో తాను రాజకీయాల్లో రాణించలేదన్నారు. 40 ఏళ్లుగా ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు పడుతూ రాజకీయాల్లో పైకెదిగానన్నారు. తనకు ఏకకాలంలో మొళకాల్మూరు, బాదామి రెండు అసెంబ్లీ సీట్లు బీజేపీ కేటాయించిందన్నారు. తన శక్తి ఏమిటో పార్టీ అగ్రనేతలకు తెలుసన్నారు. తన సమాజానికి చెందిన వారు, ఇతర కులాలకు చెందిన వారి సహకారం తనకు ఎంతో ఉందన్నారు. ఆయన అబద్ధాలు చెబితే వినడానికి నేనేమి చిన్న పిల్లవాడిని కాదన్నారు. ప్రజలు చాలా మేధావులు ప్రజలు కూడా చాలా బుద్ధివంతులని, ఆయన మాటలను వినే పరిస్థితిలో లేరన్నారు. కోర్ కమిటీ సమావేశంలో పార్టీ ఇన్‌ఛార్జి తనపై తీవ్ర ఆరోపణ చేశారన్నారు. సండూరులో పార్టీ ఓటమికి తానే కారణమని పేర్కొనడంతో తాను సంజాయిషీ ఇచ్చానన్నారు. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర తన గురించి ఎందుకు స్పందించలేదో తెలియదన్నారు. సదానంద గౌడ మినహా తనకు మద్దతుగా ఎవరూ మాట్లాడలేదన్నారు. గాలి జనార్దనరెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు.› ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వారి స్వశక్తి ఉంటుందన్నారు. తన వల్ల అంతా రాజకీయంగా ముందుకు వెళుతున్నారనే భ్రమను ఆయన వీడాలన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అప్పట్లో పార్టీ అగ్రనాయకురాలు దివంగత సుష్మాస్వరాజ్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. అప్పటి నుంచి తాను బీజేపీలో తనదైన ముద్ర వేసుకుని కష్టపడి పని చేసి ముందుకు వచ్చానన్నారు. పలువురు శ్రీరాములు అభిమానులు పాల్గొన్నారు. -
శ్రీరాములును పైకి తెచ్చింది నేనే
సాక్షి, బళ్లారి: రాష్ట్ర బీజేపీలో, అందులోను ఉమ్మడి బళ్లారి కాషాయ దళంలో చీలికలు ప్రస్ఫుటమయ్యయి. ఒకనాటి ఆప్త మిత్రులు నేడు కత్తులు నూరడం గమనార్హం. మాజీ మంత్రులు శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి మధ్య విమర్శలు తీవ్ర తరమయ్యాయి. శ్రీరాములు ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు, ఆయన రాజకీయంగా ఎదిగేలా చేసింది నేనే. బీజేపీ నుంచి వెళ్లాలనుకుంటే వెళ్లని, కానీ నాపై ఆరోపణలు ఎందుకు చేయాలి? ఆయన రాజకీయంగా ఎలా ఎదిగారన్నది ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం బెంగళూరులో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కర్మ ఎవరిని వదలదని, తనను కూడా వదలదని, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందేనని వేదాంతధోరణిలో అన్నారు. శ్రీరాములుకు బీజేపీలో ఉండడం ఇష్టం లేకపోతే ఏ నిర్ణయమైనా తీసుకోనీ, నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఢిల్లీ నాయకుల సహకారంతోనే తాను మళ్లీ బీజేపీలోకి వచ్చానన్నారు. 40 ఏళ్ల కిందట పరిస్థితి ఏమిటి? 40 సంవత్సరాల క్రితం శ్రీరాములు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని, ఆయన ఎదగడానికి తాను ఎంతో శ్రమించానని గత పరిణామాలను జనార్దనరెడ్డి ఏకరువు పెట్టారు. అప్పట్లో శ్రీరాములుపై ఓ మర్డర్ కేసు ఉండేదని, ఆయన్ను సన్మార్గంలోకి తీసుకుని వచ్చాను. ఎమ్మెల్యే, మంత్రి కావడానికి పాటుపడ్డాను. మొళకాల్మూరులో నిలబడినప్పుడు ఒక్క రోజు అయినా అక్కడ ప్రచారం చేశారా? మరి నేను అక్కడే మకాం వేసి గెలిపించలేదా అని అన్నారు. శ్రీరాములు కాంగ్రెస్‌లో చేరే యత్నాల్లో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోందని జనార్దనరెడ్డి చెప్పడం విశేషం. తాను నోరు విప్పితే విచారణ సంస్థలు వచ్చి తనిఖీ చేయాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. శ్రీరాములుకు ఢిల్లీ పెద్దల పిలుపు సండూరు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి శ్రీరాములు పనిచేయకపోవడమే కారణమని పార్టీ ఇన్చార్జి రాధామోహన్‌దాస్ అగర్వాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం, దీంతో శ్రీరాములు.. గాలి జనార్దనరెడ్డిపై విమర్శలు గుప్పించడంతో బీజేపీ అధిష్టానం మేలుకుంది. గురువారం బళ్లారిలో ఉన్న శ్రీరాములుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు. మాటల యుద్ధం ఆపాలని, ఢిల్లీకి వచ్చి అంతా మాట్లాడాలని సూచించారు. వచ్చే వారంలో తాను ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలను కలిసి జరిగిన వాస్తవాలను వివరిస్తానని శ్రీరాములు బదులిచ్చినట్లు సమాచారం. అలాగే పలువురు రాష్ట్ర సీనియర్లతోనూ ఫోన్ చర్చలు జరిగాయి. -
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ (38) మృతి చెందారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఇక, ఈ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్‌రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి ఏడేళ్ల వయసున్న కుమార్తె, ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. ఎస్సై శ్రీను స్వగ్రామం నారక్కపేట. కాగా, శ్రీనివాస్ ఆత్మహత్య నేపథ్యంలో సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జితేందర్ రెడ్డి సతీమణి శైలజ ఒక వీడియో సందేశం పంపించారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ..‘జితేందర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం అన్యాయం. ఎస్సీ మాదిగ కులానికి చెందిన నన్ను ఆయన తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి మంచి వ్యక్తి నా భర్త. ఎస్ఐ శ్రీనివాస్‌ను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. కుల సంఘాలు ఆలోచన చేసి వాస్తవాలను గుర్తించి న్యాయం చేయాలి. జితేందర్ రెడ్డిపై ఆరోపణలను విరమించుకోవాలని విజ్ఞప్తి’ చేశారు. -
అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం
అశ్వారావుపేటరూరల్/మహబూబాబాద్‌రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన ఆదివారం కలకలం రేపింది. ఉదయం నుంచి ఆయన రాకుండా పోగా.. రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుతున్న సమయాన స్వయంగా ఆయనే 108కు ఫోన్ చేశాడు. దీంతో సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో ఐదు నెలలుగా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా, ఆదివారం ఉదయం 8గంటలకు స్టేషన్‌కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారు నడుపుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన వద్ద రెండు సెల్ నంబర్లు స్విచ్చాఫ్ రావడంతో సిబ్బంది సీఐ జితేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన విచారణ చేపట్టగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్చాఫ్ అయ్యాయని గుర్తించినట్లు తెలిసింది. రాత్రి 10.30 గంటల వరకు కూడా ఎస్సై ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా ఎస్సైపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుండగా.. స్టేషన్‌లోని సిబ్బందికి, ఎస్సై మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నాలుగు రోజులు సెలవులో వెళ్లి బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది.పురుగుల మందు తాగి.. 108కు ఫోన్అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 11గంటల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన పురుగుల మందు తాగిన ఎస్సై.. స్వయంగా 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్, గూడూరు సీఐలు సర్వయ్య, బాబురావుతోపాటు 108 సిబ్బంది చేరుకుని ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఎస్సై పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి 12గంటలకు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
శ్రీరాములు ఆస్తి రూ.72 కోట్లు.. సతీమణి భాగ్యలక్ష్మి ఆస్తి రూ.22కోట్లు
సాక్షి బళ్లారి: బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు తన స్థిర, చర ఆస్తి వివరాలను ప్రకటించారు. ఆయన లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈసందర్భంగా నామినేషన్ పత్రాల్లో ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద రూ.72.45 కోట్ల చర, స్థిర ఆస్తులు ఉన్నట్లు, తన భార్య భాగ్యలక్ష్మి నామినేషన్ సమర్పించిన నేపథ్యంలో ఆమె తన పేరుమీద రూ.22.57 కోట్ల చర, స్థిర ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. శ్రీరాములు అఫిడవిట్లో పేర్కొన్న విధంగా మొత్తం తన ఆస్తుల్లో రూ.32.88 కోట్లు చర, రూ.39.65 కోట్ల స్థిరాస్తి ఉందని, దీంతో పాటు రూ.6.70 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే తన భార్య భాగ్యలక్ష్మి పేరు మీద రూ.2.57 కోట్ల చరాస్తి, రూ.20 కోట్ల స్థిరాస్తి ఉందని వివరించారు. మొత్తం మీద గత ఏడాది దాదాపు రూ.50 లక్షలు వివిధ రూపాల్లో ఆదాయం వచ్చిందని, భార్య పేరుతో రూ.9లక్షలు, కుమారుడి పేరుతో దాదాపు రూ.2 లక్షలు ఆదాయం లభించిందని తెలిపారు. -
ఆ పాదాలకు నూటొక్క వసంతాలు
రోజూ రెండు మూడు గంటల నడక.. ఎనిమిది గంటల నిద్ర.. వ్యాయామం.. ఒంటిపూట భోజనం.. మితాహారం.. ఇదంతా దాదాపు యాభై ఏళ్ల నుంచి అలవాటు చేసుకున్నారాయన! ఇప్పుడాయనకు వందేళ్లు దాటాయి. అయినా.. ఇప్పటికీ నడక మానలేదు. వ్యాయామం ఆపలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో రోజుకి 12 కిలోమీటర్లు నడుస్తున్నారు. మంగళవారం 101 ఏట అడుగు పెడుతున్న ఆయన పేరు వి.శ్రీరాములు. ఊరు మచిలీపట్నం. స్థిరపడింది విశాఖపట్నం. సాక్షి, విశాఖపట్నం: అరవై డబ్భై ఏళ్లకే జీవితం అయిపోయిందనుకుంటూ నిట్టూరుస్తున్న రోజులివి. కానీ.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వి.శ్రీరాములు అలా అనుకోవడం లేదు. వయసు నూరేళ్లు దాటినా.. ఇంకా విదేశాల్లో జరిగే అథ్లెటిక్ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. 1923 జూలై 18న దిగువ మధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ఆయన తన 21వ ఏట (27 మార్చి 1944లో) అప్పటి రాయల్ ఇండియన్ నేవీలో చీఫ్ పెట్టీ ఆఫీసర్‌గా చేరారు. 1979 డిసెంబర్ 31న కమాండర్ హోదాలో పదవీ విరమణ చేసి విశాఖలో స్థిరపడ్డారు. ఆపై ఆరోగ్యాన్నిచ్చే నడకను అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత రేస్ వాకింగ్‌తో పాటు రన్నింగ్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో వంటి ఆటల్లోనూ సత్తా చాటుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో లెక్కకు మిక్కిలి బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్íÙప్ 5, 10, 20 కి.మీ. రేస్ వాకింగ్ పోటీల్లో 9 బంగారు, 5 రజత, 2 కాంస్య పతకాలు, వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ప్స్లో 5 బంగారు, 3 రజత పతకాలను కైవసం చేసుకున్నారు. వెటరన్స్ (మాస్టర్స్) కేటగిరీలో ఇప్పటికీ ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొంటూ బంగారు, రజత, కాంస్య పతకాలను సాధిస్తూనే ఉన్నారు. అంతేనా? పర్వతారోహణంపైనా మక్కువ ఉన్న శ్రీరాములు 79వ ఏట తన కుమారుడు సాగర్‌తో కలిసి 2002లో ఆఫ్రికాలోని కిలీమాంజారో, 81వ ఏట 2004లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు, 83వ ఏట హిమాలయాల్లోని పిండారీ గ్లేసియర్లను అధిరోహించారు. ఇంకా అంతర్జాతీయ పోటీలకు సై.. శ్రీరాములు 101వ ఏట ఈ ఏడాది నవంబరు 8–12 వరకు ఫిలిప్పీన్స్‌లో జరిగే ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ కాంపిటిషన్స్‌లో, వచ్చే ఏడాది జూన్‌లో స్వీడన్లో నిర్వహించే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్íÙప్–2024 పోటీలకు సిద్ధమవుతున్నారు. శ్రీరాములుది విభిన్న జీవనశైలి. మితంగా తింటారు. ఉదయం మొలకల చట్నీతో ఒక బ్రెడ్ టోస్ట్, కాఫీ లేదా మజ్జిగ తీసుకుంటారు. మధ్యాహ్నం పెరుగన్నమే తింటారు. అందులో కూరలు నంజుకుంటారు. సాయంత్రం కప్పు మజ్జిగ లేదా అరటిపండు తీసుకుంటారు. రాత్రికి ఏమీ తినకుండా 7.30కే నిద్రకు ఉపక్రమిస్తారు. మర్నాడు తెల్లవారుజామున 3.15కి బీచ్‌లో నడకకు బయలుదేరి (12 కి.మీ.) ఉదయం 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంటారు. వందేళ్ల ప్రాయంలో ఆయన పుస్తకాలు బాగా చదువుతారు. ఆ్రస్టానమీ, జియో పాలిటిక్స్, నేవీకి సంబంధించిన అంశాలపై ఆసక్తి కనబరుస్తారు. పిల్లలు స్థిరపడటంతో సతీమణితో కలిసి విశాఖలో ఉంటున్నారు. నేడు శతాధిక సంబరాలు.. శ్రీరాములు 101 ఏటలోకి అడుగిడుతున్న సందర్భంగా విశాఖ బీచ్‌లో సాటి వాకర్ స్నేహితులు మంగళవారం ఉదయం ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు. మరో విశేషం ఏమంటే.. దేశంలో నేవీలో పనిచేసి వందేళ్లకు పైగా జీవించి ఉన్న ఏకైక అథ్లెట్ శ్రీరాములే కావడం విశేషం. హ్యాపీగా జీవించడమే లక్ష్యం.. నాకేమీ లక్ష్యాలు లేవు. ఉన్నదల్లా ఉన్నన్నాళ్లూ హ్యాపీగా జీవించడమే. నేను ఇప్పటివరకు ఆస్పత్రి మెట్లెక్కలేదు. రక్తపోటు, మధుమేహం సహా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆఖరి ఘడియాల్లోనూ ఆస్పత్రికి వెళ్లకూడదన్నది నా ఆశ. క్రమశిక్షణతో కూడిన జీవితం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. తక్కువ తిని, ఎక్కువ వ్యాయామం చేయాలని ఈ తరం వారికి నేనిచ్చే సలహా. నా ఆరోగ్య రహస్యం కూడా అదే. త్వరలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని మెడల్స్ సాధిస్తానన్న నమ్మకం ఉంది. – వి.శ్రీరాములు, శతాధిక అథ్లెట్ -
ఎన్వై పార్టీని వీడటం బాధాకరం
సాక్షి,బళ్లారి: కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్వై గోపాలకృష్ణ పార్టీని వీడటం తనను ఎంతో బాధించిందని, ఆయనకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే తాము పిలిచి బీజేపీలో చేర్పించుకుని కూడ్లిగి నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఇప్పించి గెలిపించామని మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్వై గోపాలకృష్ణ పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారో స్పష్టత లేదన్నారు. కారణాలు లేకుండా పార్టీని వీడటం రాజకీయ పదవీ కాంక్షతోనే అయి ఉంటుందని గుర్తు చేశారు. ఆయన పార్టీ వీడటంపై కార్యకర్తల్లో కూడా ఆవేదన ఉందన్నారు. తాను బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దరఖాస్తు చేసుకున్నానని, ఇంకా పార్టీ పెద్దలు ఖరారు చేయలేదన్నారు. అయితే ఎక్కడ నుంచి పోటీ చేయాలని సూచించినా పార్టీ ఆదేశాలు పాటిస్తానన్నారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలోనే ఎక్కువగా పర్యటించి, ప్రచారం చేస్తున్నాననేదాంట్లో నిజం లేదన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రమిస్తానన్నారు. రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తన పేరు కూడా ఉంటే తన నియోజకవర్గంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఎన్నికల ప్రచారం చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినా విజయం బీజేపీనే వరిస్తుందన్నారు. -
Karnataka: డిప్యూటీ సీఎంగా శ్రీరాములు, ఆయనేమన్నారంటే..
సాక్షి, బెంగళూరు: నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బళ్లారికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు పాల్గొనక పోవడంతో మీడియాల్లో పలు కథనాలు రావడంతో ఆయన స్పందించారు. తనకు పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదని, మూడుసార్లు మంత్రిని చేసిందని గుర్తు చేశారు. గురువారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ... ఇంట్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశానని, ఎవరిపైన ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేది లేనిది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు విజయేంద్రను షాడో సీఎం అంటూ ప్రతిపక్షాలు మాట్లాడారని, ప్రస్తుతం బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపడితే యడియూరప్పను షాడో సీఎం అంటూ సంభోదిస్తున్నారని మండిపడ్డారు. -
ఆటో డాక్టర్‌కు పోస్టింగ్
సాక్షి, బెంగుళూరు: ఉన్నతాధికారుల కక్ష సాధింపులకు నిరసనగా ఆటో నడుపుతున్న మాజీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవీంద్రనాథ్‌కు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది. ఆయన కొన్నిరోజులుగా దావణగెరెలో ఆటో నడుపుతూ నిరసన తెలియజేస్తున్న వైనం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు స్పందించి రవీంద్రనాథ్‌కు కొప్పళ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారిగా పోస్టింగ్ కేటాయించారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్లో తెలిపారు. ಜಿಲ್ಲಾ ಆರ್ ಸಿಹೆಚ್ ಅಧಿಕಾರಿ ಡಾ. ಎಂ ಎಚ್ ರವೀಂದ್ರನಾಥ್ ಅವರು ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಬದುಕು ನಿರ್ವಹಣೆಗಾಗಿ ಆಟೋ ಓಡಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬ ಮಾಧ್ಯಮ ವರದಿಗಳು ಗಮನಕ್ಕೆ ಬಂದಕೂಡಲೇ ಈ ಬಗ್ಗೆ ಹಿರಿಯ ಅಧಿಕಾರಿಗಳಿಂದ ವರದಿ ಕೇಳಿದ್ದೆ. 1/2 pic.twitter.com/Jdjr3Smy47 — B Sriramulu (@sriramulubjp) September 10, 2020 ఆరోగ్య శాఖలో జిల్లా స్థాయి వైద్యాధికారిగా పని చేసిన తాను ఉన్నతాధికారుల స్వార్థానికి, అధికార దాహానికి బలై కొన్నేళ్లుగా వైద్య వృత్తికి దూరమైనట్లు దావణగెరెలో ఆటోడ్రైవర్‌గా మారిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎంహెచ్ రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బళ్లారి జిల్లాలో జిల్లాస్థాయిలో వైద్యాధికారిగా ఉన్న తనను 2017–19లో అప్పటి జడ్పీ సీఈవో ఆయన స్నేహితున్ని ఆర్సీహెచ్ వైద్యునిగా నియమించాలని సూచించారు. దీనికి తాను నిరాకరించడంతో అప్పటి నుంచి వేధించడం ప్రారంభించారని ఆరోపించారు. చదవండి: ఉన్నతాధికారుల స్వార్థానికి బలయ్యా -
భౌతిక దూరం గోవింద..! మంత్రిపై విమర్శలు
సాక్షి, బెంగళూరు: కరోనా నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని చెబుతున్నాయి. అయినా కొంత మంది ఉన్నత స్థానంలో ఉన్నవారే ఈ నిబంధనలు పాటించకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు మరోసారి భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చిత్రదుర్గానికి వెళ్లిన మంత్రి శ్రీరాములుకు స్వాగతం పలకడానికి బీజేపీ కర్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఆయన భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, కనీసం ముఖానికి మాస్క్ కూడా ధరించకుండా కార్యకర్తలతో కలిసిపోయారు. (మిస్సింగ్ పోస్టర్లు: 'స్మృతి ఇరానీ ఎక్కడ?') అదేవిధంగా మంత్రి శ్రీరాములు తన చుట్టూ చేరినవారికి భౌతిక దూరం పాటించాలని సూచించకపోవటం గమనార్హం. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిలిగిన ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలను లాక్డౌన్ నిబంధనలకు లోబడి దశల వారిగా తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3408 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంత్రి లాక్డౌన్ ఉల్లంఘన చర్యపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. మంత్రి శ్రీరాములు ఇలా భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించటం ఇది రెండోసారి. -
రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం
సాక్షి, బళ్లారి: రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీరాములు తన కుమార్తె పెళ్లికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. దీంతో స్వయాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వధూవరులకు ఆశీస్సులు, అభినందన లేఖను పంపారు. మార్చి 5న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శ్రీరాములు కుమార్తె రక్షితకు హైదరాబాద్‌కు చెందిన సంజీవ్‌రెడ్డితో జరగనున్న పెళ్లికి ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని లేఖలో కొత్త జీవితంలో అన్ని రకాలుగా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ నూతన వధూవరులతో పాటు మంత్రి శ్రీరాములుకు అభినందనలు తెలిపారు. వధూవరులకు ప్రధాని ఆశీస్సులు, అభినందన లేఖ నిశ్చితార్థ వేడుకకు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి (ఫైల్ ఫోటో) -
వరదలు వస్తుంటే.. ఢిల్లీలో డిన్నర్లా?
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య గత శాసనసభ ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఓటమి భయంతో బాదామికి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలుపొంది, రాజకీయ పునర్జన్మ కల్పించిన బాదామిని నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.శ్రీరాములు ఆరోపించారు. శ్రీరాములు మంగళవారం బాదామి నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించారు. రాష్ట్రంలో వరద విలయతాండం చేస్తోంది, 17 జిల్లాల్లో వరదలతో జనం ఉక్కిరికిబిక్కిరి అయ్యారన్నారు. బాదామి ఎమ్మెల్యే సిద్ధరామయ్య అనారోగ్యం సాకుతో పర్యటనలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, అయితే ఢిల్లీలో డిన్నర్లకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి డిన్నర్లు చేయడానికి సమయం ఉంటుంది కాని రాజకీయ పునర్జన్మ ఇచ్చిన బాదామిని సందర్శించడానికి వీలు దొరకదా? అని ప్రశ్నించారు. ఆయన కుమారుడు యతీంద్ర బాదామిలో పర్యటించడం మంచిదే, అయితే సిద్ధరామయ్య రాకపోవడంతో ఈ ప్రాంతంలోని జనం దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. వరదలతో అల్లాడిపోతున్న జనానికి స్థానిక ఎమ్మెల్యే అయినా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం యడియూరప్ప వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి తగినన్ని నిధులు తెప్పించుకుని వరద బాధితులను ఆదుకుంటామన్నారు. -
భువనగిరి సీపీఐ అభ్యర్థిగా శ్రీరాములు
సాక్షి, హైదరాబాద్: భువనగిరి పార్లమెంటు స్థానానికి సీపీఐ అభ్యర్థిగా గోదా శ్రీరాములుగౌడ్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకుంది. భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా తొలుత పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిని ప్రతిపాదించగా, ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో గోదా శ్రీరాములుతోపాటు మరో ఇద్దరి పేర్లను పార్టీ నాయకులు ప్రతిపాదించారు. వారి నుంచి శ్రీరాములు పేరును అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం శ్రీరాములు యాదాద్రి– భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీపీఎంతో పొత్తుపైనా చర్చ సీపీఎంతో పొత్తు గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్చల్లో టీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవాలని, బీఎల్ఎఫ్ నుంచి వైదొలగాలని సీపీఎంకు సీపీఐ సూచించింది. దీనిపై మరో రెండురోజుల్లో నిర్ణయం చెబుతామని సీపీఎం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే చెరో రెండు స్థానాల్లో పోటీచేయాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించిన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు కాంగ్రెస్‌కు మద్ధతివ్వాలని సీపీఐ నిర్ణయించింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకవాదం, లౌకికవాద అనుకూలశక్తులతో నడవాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
ప్రత్యేక తెలంగాణ తరహాలో..
సాక్షి, బెంగళూర్ : పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు మద్దతు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా ఆగస్ట్ 2న కొన్ని సంస్థలు ఇచ్చిన బంద్ పిలుపును ఆయన సమర్ధించారు. ఉత్తర కర్ణాటకకు జరుగుతున్న అన్యాయంపై తాము మౌనంగా ఉండలేమని, ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని తదుపరి ఏం చేయాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని శ్రీరాములు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ఉద్యమం ఊపందుకుంటుందన్నారు. సంకీర్ణ సర్కార్ ఉత్తర కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యమంత్రి కుమారస్వామి పక్షపాత రాజకీయాలను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కుమారస్వామి కేవలం రెండు జిల్లాలకే సీఎంగా ప్రవరిస్తున్నారని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రాంత ప్రయోజనాలను సీఎం విస్మరిస్తున్నారని ఉత్తర కర్ణాటకకు చెందిన పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప తోసిపుచ్చారు. -
బాధితురాలిని పరామర్శించిన కె రాములు
సాక్షి, అక్కయ్యపాలెం (విశాఖ ఉత్తర) : నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా సరోగసి పేరిట అద్దె గర్భాల అక్రమ వ్యాపారం సంచలనం రేపుతోంది. మధ్యవర్తుల చేతుల్లో మోసపోయిన మహిళ ఫిర్యాదుతో ఈసంఘటన వెలుగుచూసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు నాగలక్ష్మి, మహిళా సంఘాలతో కలసి బుధవారం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు కె రాములు బాధితురాలిని పరామర్శించారు. జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై కేజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ అర్జునను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ బాధితురాలి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న పద్మజ ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్ విచారణ వేయాలని, బాధ్యులైన డాక్టర్లపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని రాములు డిమాండ్ చేశారు. సరోగసి వివాదంపై ఐదుగురు సీనియర్ వైద్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అందులో దళిత వైద్యుడు సభ్యుడిగా ఉండాలని అన్నారు. బాధితురాలుకి ప్రభుత్వం తక్షణమే ఎనిమిది లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ముగ్గురు పిల్లలకు డిగ్రీ వరకూ సాంఘీక సంక్షేమ శాఖ ఉచిత విద్య అందించాలని అన్నారు. దర్యాప్తుకు సహకరించని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. -
ఎంపీ పదవులకు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు శనివారం తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరిరువురి రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప, మొళకాల్మూరు నియోజకవర్గం నుంచి శ్రీరాములు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం విధాన సౌధలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకూ శ్రీరాములు బళ్లారి, యడ్యూరప్ప షిమోగా ఎంపీలుగా కొనసాగారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ సాయంత్రం బలపరీక్షకు సిద్ధం అవుతున్నారు. -
బీజేపీలో కొత్త ధీమా, బోపయ్యకు ఓకే..
సాక్షి, బెంగళూరు : బలపరీక్ష నిరూపణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీలో కొత్త ధీమా కనిపిస్తోంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 10 నుంచి 15మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బలపరీక్షలో ఎలాగైనా నెగ్గేందుకు బీజేపీ తన విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడం, మరోవైపు 14మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యే విధంగా చేసేందుకు పావులు కదుపుతోంది. సాయంత్రం జరిగే బలపరీక్షలో తాము గెలిచి తీరుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఆదివారమే మంత్రివర్గ సమావేశం ఉంటుందని, రైతులకు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. సాయంత్రం సంబురాలు జరుపుకుంటామని ఆయన అన్నారు. కాగా బలపరీక్ష చేపట్టేందుకు ప్రొటెం స్పీకర్ బోపయ్యకే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కర్ణాటక అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ బోపయ్య...నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. కర్ణాటక అసెంబ్లీలో బలబలాలు బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 36, ఇతరులు 3 మొత్తం 222 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 111 రెండు స్థానాల్లో గెలిచిన కుమారస్వామికి ఒకే ఓటు బలపరీక్షలో విజయంపై రెండు పక్షాల్లో ధీమా ఇంకా తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటున్న కాంగ్రెస్-జేడీఎస్ సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష తమకు 116 ఎమ్మెల్యేలు ఉన్నారంటున్న కాంగ్రెస్-జేడీఎస్ భద్రతా వలయంలో కర్ణాటక విధాన సౌధ రంగంలోకి 200మంది మార్షల్స్ -
సీట్లెందుకు రాలేదంటే..
ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని ఎన్నికలకు ముందు అంచనాలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగానే 2013తో పోల్చి చూస్తే కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో 1.4 శాతం ఓట్లు ఎక్కువే వచ్చాయి. గత ఎన్నికల్లో 36.6 శాతం ఓట్లతో ఏకంగా 122 స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఇప్పడు మాత్రం 38 శాతం ఓట్లను దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితమవాల్సి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొనడం, గత ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసిన యడ్యూరప్ప, శ్రీరాములు ఈసారి బీజేపీ గూటికి చేరుకోవడం వంటి కారణాలు కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బకొట్టాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ, యడ్యూరప్ప, శ్రీరాములు విడివిడిగా పోటీ చేయ డంతో వారి ఓట్లు చీలిపోయాయి. అందరికీ కలిపి 32 శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఈ ఎన్నికల్లో అందరూ కలిసిపోవడంతో 4 శాతం అధిక ఓట్లు సాధించడమేగాక, వాటిని సీట్లుగా మార్చుకోవడంలోనూ బీజేపీ విజయం సాధించింది. అతి తక్కువ ఓట్ల తేడాతో కూడా ఎలా విజయం సాధించాలని కమలనాథులు క్షేత్రస్థాయిలో చేసిన కసరత్తు ఫలించి బీజేపీకి ఓట్లు రాకపోయినా సీట్లయినా వచ్చేలా చేసింది. బీజేపీతో పోల్చి చూస్తే కాంగ్రెస్‌కు పాత మైసూరు, హైదరాబాద్ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో అత్యధికంగా ఓట్లు వచ్చాయి. కానీ మిగతా ప్రాంతాల్లో బీజేపీతో పోటీ పడలేక కాంగ్రెస్ చతికిలపడిపోయింది. ఇలా కాంగ్రెస్ మూడు ప్రాంతాల్లో అత్యధికంగా ఓట్లు సంపాదించడంతో గెలిచిన అభ్యర్థులు ఎక్కువ ఆధిక్యం పొందారు. కానీ బీజేపీ గెలిచిన స్థానాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ తక్కువగా ఉంది. ఎస్సీ అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఓటు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, సీట్లు గెలవడంలో వెనకపడిపోయింది. లింగాయత్‌ల ప్రభావం ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్‌కు ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం రాలేదు. ఇక జేడీఎస్ 2013 ఎన్నికల్లో 20.2 శాతం ఓట్లు సాధించింది. ఈ ఎన్నికలకు వచ్చేసరికి 18.3 శాతానికి తగ్గిపోయింది. కానీ కాంగ్రెస్‌తో పోల్చిచూస్తే ఓట్లను సీట్లుగా మార్చుకోవడంలో సఫలమైంది. ఒక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జేడీ(ఎస్)గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం కూడా కాంగ్రెస్‌ను దెబ్బ తీసింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అప్పుడు బీజేపీని దెబ్బకొట్టినోళ్లే...
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే బీజేపీ మాత్రం అత్యధిక సీట్లను గెల్చుకుని హస్తానికి షాక్ ఇచ్చింది. బీజేపీ విజయంలో బీఎస్ యెడ్యూరప్ప, శ్రీరాములు ఇద్దరూ ముఖ్యభూమిక పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వేరుపడి సొంతకుంపట్లతో పార్టీని దెబ్బ కొట్టిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు కీలకంగా వ్యవహరించటం విశేషం. 2012లో బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన యెడ్యూరప్ప, శ్రీరాములు సొంత పార్టీలు స్థాపించుకున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బకొట్టారు. గత ఎన్నికల్లో యెడ్యూరప్ప పార్టీ కర్ణాటక జనతా పక్ష(కేజేపీ) 9.8 శాతం ఓటింగ్‌తో ఆరు సీట్లు గెలుచుకోగా, శ్రీరాములు పార్టీ బదగర శ్రామిక రైతల కాంగ్రెస్ 2.7 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. చివరకు బీజేపీ 20 శాతం ఓటింగ్‌తో కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకుంది. యెడ్యూరప్ప, శ్రీరాములు దెబ్బకి బీజేపీకి లింగాయత్, గిరిజన తెగల ఓట్లు అప్పుడు దూరం అయ్యాయి. అంటే ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలో పడి ఉంటే సీట్ల సంఖ్య పెరిగి ఉండేది. దీనికితోడు మిగతా ప్రాంతాల్లోనూ ఆయా పార్టీలకు పోలైన ఓట్లు, అన్ని కలుపుకుని బీజేపీకిమళ్లి ఉండిఉంటే సీట్లు కనీసం 80 వరకు గెలుచుకుని ఉండేదని విశ్లేషకులు ఆనాడు అభిప్రాయపడ్డారు. తిరిగి ఐదేళ్ల తర్వాత ఆ ఇద్దరు నేతలే బీజేపీ ఓటు శాతం పెరిగేందుకు సాయపడ్డారు. ముఖ్యంగా తమ తమ సామాజిక వర్గాల ఓట్లతోపాటు, తమ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు ఈ ఇద్దరు దోహదపడ్డారు. లింగాయత్ వర్గానికి సిద్ధరామయ్య ఇచ్చిన హామీని అంతగా పట్టించుకోని ప్రజలు, యెడ్డీ వైపే మొగ్గు చూపగా, మైనార్టీలు ఎక్కువగా ఉన్న తీర ప్రాంతంలో కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలు కావటం గమనార్హం. -
బీజేపీకి కొత్త చిక్కులు
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ నేత బల్లారి ఎంపీ శ్రీరాములుకు అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. గాలి జనార్ధన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు మాజీ సీజే కేజీ బాలకృష్ణన్ మేనల్లుడు శ్రీనిజన్కు లంచం ఇస్తున్నట్లుగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శ్రీరాములు వీడియోలు బయటకు రావడంతో అతన్ని పోటీ నుంచి అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. శ్రీరాములు ప్రస్తుతం సిద్దరామయ్య పై బాదామి నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాములును పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ తెలిపారు. శ్రీరాములు గాలిజనార్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడని, ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీరాములుకి సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రేదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు గాలి జనార్ధన్‌రెడ్డి పలు కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీడియోలో ఉన్నది శ్రీరాములు కాదని, కాంగ్రెస్ దురుద్ధేశంతో ఫేక్ వీడియోలను సృష్టించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. -
సిద్దరామయ్యను నేను ఓడిస్తా..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఓడించేందుకే బాదామి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నానని బీజేపీ నేత బళ్లారి శ్రీరాములు తెలిపారు. ఓటమి భయంతోనే సిద్ధరామయ్య రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఒక రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. ఓటమి భయంతోనే 21 నెలల తర్వాత సోనియాగాంధీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారని అన్నారు. బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని తెలుగు ప్రజలు విజ్ఞులని, స్థానిక సమస్యల పరిష్కారానికే తెలుగు ఓటర్లు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. బీజేపీపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను విభజించే కుట్రలో భాగంగానే లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంటూ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని శ్రీరాములు విమర్శించారు. -
‘శ్రీరామ’ బాణం పదునెంత?
శ్రీరాములును ముందుకు తీసుకురావడం ఆచితూచి రచించిన వ్యూహంలో భాగమే. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో ఇన్నాళ్లూ తమకు అండగా ఉన్న ఆ వర్గం ఓట్ల మీదే పూర్తిగా ఆధారపడడం సాధ్యం కాదని బీజేపీ గుర్తించింది. ఈ ఎన్నికలలో లింగాయత్‌లలో ఒక వర్గం కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శ్రీరాములు కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును ఆకర్షించగలరని బీజేపీ ఆశిస్తున్నది. ఆ విధంగా 2019 ఎన్నికలలో ట్రంప్‌కార్డుగా ఉపయోగపడతారని భావిస్తున్నది. రెండు వారాల క్రితం వరకు కూడా కర్ణాటక బీజేపీలో తిరుగులేని నాయకుడు ఎవరంటే అందరికీ బీఎస్ యడ్యూరప్ప కనిపించారు. పత్రికలలో కనిపిస్తున్న రాతల ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే కూడా. కానీ గడచిన పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆయన స్థాయిని దిగజార్చినట్టు కనిపిస్తున్నది. వరుణ అసెంబ్లీ నియోజక వర్గ పరిణామాలే చూద్దాం. ఆ నియోజక వర్గంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రతో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర తలపడవలసి ఉంది. కానీ విజయేంద్ర నామినేషన్‌ను చివరిక్షణంలో రద్దు చేశారు. ఈ పరిణామం యడ్యూరప్ప మద్దతుదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లింగాయత్ వర్గంలో బలమైన నాయకుడి పట్ల, మొత్తం కర్ణాటక గౌరవించే నాయకుడి విషయంలో, పార్టీని విధాన సౌధలో ప్రతిష్టిం గల నేత పట్ల చూపించవలసిన మర్యాద ఇదేనా అని ఆయన మద్దతుదారులు నిలదీస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్టు మరో పరిణామం కూడా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే బహిరంగ సభలలో స్థానం కల్పించడంలేదని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా యడ్యూరప్పకు తెలియచేశారు. ఇదంతా చూస్తుంటే యడ్యూరప్పను నెమ్మదిగా పక్కన పెడుతున్నట్టు కార్యకర్తలకు సంకేతాలు వెళుతున్నాయి. ఈ పరిణామాలను కాంగ్రెస్ సంబరంగా పరికిస్తున్నది. అంతేకాకుండా, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి జరిగినట్టే యడ్యూరప్పకు కూడా జరుగుతుందని ఎద్దేవా చేస్తోంది. శ్రీరాములు వైపు బీజేపీ చూపు రాష్ట్ర బీజేపీ ప్రస్తుతం బి. శ్రీరాములు వైపు మొగ్గు చూపుతోంది. ఈ పరిణామాన్ని గమనిస్తే ఆ పార్టీలో వచ్చిన మార్పు ఏమిటో మరింత సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఆధిక్యత సాధిస్తే అందరికీ కనిపించే వ్యక్తి శ్రీరాములేనని వినిపిస్తున్నది కూడా. భవిష్యత్తులో ఇలాంటి స్థానం దక్కుతుందని భావించడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే శ్రీరాములు గతాన్ని చూడాలి. శ్రీరాములు తండ్రి రైల్వే ఉద్యోగి. ఆయనకు ఏడుగురు పిల్లలు. అయితే తనకు ఉన్న ఆస్తి, బళ్లారిలో ఉన్న ఖరీదైన భవనం సహా అంతా పూర్వీకుల నుంచి సంక్రమించినదేనని శ్రీరాములు చెబుతారు. అలాగే ఈ ఆస్తి తమకు గనుల తవ్వకాల ద్వారా వచ్చింది కాదని కూడా అంటారు. ఆయన తన ఆస్తి మొత్తం రూ. 23 కోట్లని ప్రకటించారు (2013లో ఆయన తన ఆస్తి మొత్తం రూ. 43 కోట్లుగా చూపారు). ఎన్నికలలో బాగా డబ్బు ఖర్చు పెట్టే అభ్యర్థులలో ఆయన కూడా ఒకరు. ఆయనపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే ఆయన చేసే దానధర్మాల కారణంగా రాబిన్‌హుడ్ తరహా మనస్తత్వమని చెబుతూ ఉంటారు. శ్రీరాములుకు ఆయన కులమే పెద్ద ఆసరా. 46 సంవత్సరాల శ్రీరాములు వాల్మీకి నాయక్ కులం నుంచి వచ్చిన నాయకుడు (వీరు కర్ణాటక జనాభాలో ఏడు శాతం ఉన్నారు). దీనితో షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గం నుంచి అత్యధికంగా ఓట్లను ఆకర్షించవచ్చునని బీజేపీ అంచనా. అలాగే బీజేపీ అంటే సద్భావం లేని దళితులకు శ్రీరాములు ద్వారా దగ్గర కావచ్చునని కూడా ఆ పార్టీ ఆలోచన. ఆ విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రూపొందించిన ‘అహిందా’(దళితులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలను కలిపి చెప్పడానికి కన్నడలో ఉపయోగించే హ్రస్వనామం) ఓటు బ్యాంకును బద్దలు కొట్టవచ్చునని కూడా ఆ పార్టీ యోచిస్తున్నది. శ్రీరాములును ముందుకు తీసుకురావడం ఆచితూచి రచించిన వ్యూహంలో భాగమే. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తామంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో ఇన్నాళ్లూ తమకు అండగా ఉన్న ఆ వర్గం ఓట్ల మీదే పూర్తిగా ఆధారపడడం సాధ్యం కాదని బీజేపీ గుర్తించింది. ఈ ఎన్నికలలో లింగాయత్‌లలో ఒక వర్గం కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కూడా. శ్రీరాములు కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును ఆకర్షించగలరని బీజేపీ ఆశిస్తున్నది. ఆ విధంగా 2019 ఎన్నికలలో ఆయన ట్రంప్‌కార్డుగా కూడా ఉపయోగపడతారని భావిస్తున్నది. ఈ కారణంగానే కావచ్చు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఏకైక ఎంపీ యడ్యూరప్ప అని ముందు ప్రకటించినప్పటికీ, తరువాత శ్రీరాములుకు కూడా అలాంటి అవకాశమే కల్పించడం ఇందుకే కాబోలు. అంతేకాదు. బళ్లారి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీరాములు యడ్యూరప్పతో సమంగా ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ అందుబాటులో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుడు. ఏకంగా 80 నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు చూసుకోవలసిందని శ్రీరాములును బీజేపీ ఆదేశించింది. ఇంతటి గురుతర బాధ్యత మరొక నాయకుడు ఎవరికీ అప్పగించలేదు కూడా. బాదామి నియోజకవర్గంలో సిద్ధరామయ్య మీద తన అభ్యర్థిగా బీజేపీ శ్రీరాములును ఎంపిక చేయడం కూడా ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలియచేస్తున్నది. నల్లేరు మీద బండి నడక కాదు.. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ఉప ముఖ్యమంత్రి పదవి శ్రీరాములునే వరిస్తుందని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఆ పదవి కోసం పలువురు రంగంలో ఉన్నప్పటికీ ఎక్కువ అవకాశాలు శ్రీరాములుకే ఉన్నాయని వారి వాదన. అంతకుమించి బాదామి నియోజకవర్గంలో సిద్ధరామయ్యను కనుక ఓడించగలిగితే, జెయింట్ కిల్లర్‌గా అవతరిస్తే అంతకు మించిన స్థానమే ఆయనకు దక్కవచ్చు కూడా. కానీ బీజేపీ శ్రీరాములును ఎంతగా ముందుకు తీసుకువచ్చినా, ఆయనకు వ్యవహారమంతా నల్లేరు మీద బండినడక కాకపోవచ్చు. శ్రీరాములు అంటే గాలి జనార్దనరెడ్డి మనిషి అన్న మచ్చ ఉంది. గనుల అక్రమాలతో అపకీర్తి పాలైన గాలి జనార్దనరెడ్డి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కలిపి ఏడు టికెట్లను బీజేపీ కేటాయించింది. ఆ విధంగా కాంగ్రెస్‌కు విమర్శించడానికి అవకాశం అందించింది. అలాగే జనార్దనరెడ్డి పట్ల తనకున్న విధేయతను దాచి పెట్టేం దుకు శ్రీరాములు కూడా ప్రయత్నించలేదు. నిజానికి ముడి ఇనుము అవినీతి ఆరోపణలతో జనార్దనరెడ్డిని సీబీఐ అరెస్టు చేసినప్పుడే శ్రీరాములు 2011లో బీజేపీకి రాంరాం చెప్పి, బీఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించుకున్నారు. బళ్లారి జిల్లాలో విజయం సాధించాలంటే బీఎస్ఆర్ కాంగ్రెస్ సాయం ఉండాలని 2013లో బీజేపీకి తెలిసి వచ్చింది. బీజేపీ కూడా శ్రీరాములు లేకుండా ముందుకు వెళ్లడం సాధ్యం కాదని తీర్మానానికి వచ్చింది. దీనితో 2014 లోక్‌సభ ఎన్నికలలో బళ్లారి స్థానం కేటాయించేందుకు ముందుకు వచ్చింది. నిజానికి గాలి జనార్దనరెడ్డితో ఇప్పుడు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మార్చి 31న అమిత్‌షా ప్రకటించడంతో శ్రీరాములు నిరాశకు గురయ్యారని తెలుస్తున్నది. దీనితో ఆయన పార్టీకి నిరసన తెలిపారని కూడా తెలియవచ్చింది. తాను పార్టీకి అవసరమైతే, జనార్దనరెడ్డి వర్గంతో కూడా జత కట్టవలసిందేనని శ్రీరాములుకు స్పష్టత ఉంది. శ్రీరాములుకు ప్రాధాన్యం కల్పించడమంటే జనార్దనరెడ్డి రాకకు తలుపులు తెరవడమే. అయినా తాను సచ్చీలంగానే ఉన్నట్టు చెప్పడానికి బీజేపీ జనార్దనరెడ్డికి టిక్కెట్టు ఇవ్వలేదని, ఆయన సన్నిహితులకు మాత్రమే ఇచ్చామని చెప్పుకుంటున్నది. కానీ బళ్లారిలో ప్రవేశించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ జనార్దనరెడ్డి బీజేపీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చిత్రదుర్గ–బళ్లారి సరిహద్దులలోని తన భవనం నుంచే వ్యూహాలు పన్నుతున్నారు. శ్రీరాములు తన నామినేషన్ పత్రాలను సమర్పించిన తరువాత జరిగిన బహిరంగ సభలో కూడా జనార్దనరెడ్డి దర్శనమిచ్చారు. చిత్రదుర్గ్ జిల్లా మొలకల్మూరులో శ్రీరాములు కోసం ప్రచారం నిర్వహించారు. అలాగే తన మేనకోడలు లల్లేశ్ రెడ్డి బెంగళూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసినప్పుడు కూడా హాజరయ్యారు. జనార్దనరెడ్డి తన పేరును బీజేపీ అధిష్టానానికి సిఫారసు చేయడం వల్లనే టిక్కెట్టు వచ్చిందని లల్లేశ్ చెప్పారు. బళ్లారి బరితోనే దేశం దృష్టికి.. 1999లో బళ్లారి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేసినప్పుడు, సుష్మ స్వరాజ్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఆ సమయంలోనే జనార్దనరెడ్డితో కలసి, శ్రీరాములు పేరు ఒక్కసారిగా జాతీయ స్థాయి పత్రికలలో పతాక శీర్షికలలో కనిపించింది. ఒక దశాబ్దం తరువాత కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారిద్దరు సహకరించారు. ఆ విధంగా దక్షిణాదిన ఆ పార్టీ మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాటుపడిన వారు అయ్యారు. ఈసారి కూడా ఈ బళ్లారి ద్వయం బెంగళూరులో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తున్నది. మొలకల్మూరు ప్రచారం తరువాత గగ్గోలు రేగడంతో ప్రచారానికి దూరంగా ఉండవలసిందని జనార్దనరెడ్డిని ఆదేశించారు. అయినప్పటికీ కూడా బళ్లారి ద్వయం తమకు ఉపయోగపడాలనే పార్టీ భావిస్తున్నది. కర్ణాటక ప్రజానీకం జనార్దనరెడ్డి మీద పడిన మచ్చను మరచిపోవాలని కూడా కోరుకుంటున్నది. నిజానికి గనుల అక్రమాల వ్యవహారం చాలా తీవ్రమైనదే అయినా, బళ్లారి పరిసరాలు దాటితే దాని ప్రభావం తక్కువ. దీనికి తోడు కాంగ్రెస్ కూడా అనంద్‌సింగ్, నాగేంద్ర అనే ఇద్దరికి టిక్కెట్లు ఇచ్చింది. వీరి ద్దరు గతంలో బీజేపీలో పనిచేసినవారే. అలాగే గనుల అక్రమాలలో సీబీఐ వీరి మీద కేసులు నమోదు చేసింది కూడా. ఈ నేపథ్యంలో శ్రీరాములు విజ యం సాధిస్తే ఎలాంటి సంకేతాలు వెళతాయి? జనార్దనరెడ్డి తన అభ్యర్థుల కోసం పనిచేస్తున్నారు. వారు నెగ్గితే ఆ ఘనత ఆయన ఖాతాలోకే వెళుతుంది తప్ప, బీజేపీకి చెందదు.అయినా ఈ పరిణామం ద్వారా వచ్చే చిక్కులను స్వీకరించడానికే బీజేపీ సిద్ధంగా ఉందని అనిపిస్తున్నది. బాదామిలో శ్రీరాములు విజయం సాధిస్తే ఆయనకు ఆకర్షణ బళ్లారికి అవతల కూడా పనిచేస్తుందని రుజువవుతుంది. కాబట్టి ఎలాంటి నింద అయినా ఎన్నికల అంశం కాలేదని కూడా రూఢి అవుతుంది. శ్రీరాములు ఎదుగుదల పార్టీలోని సీనియర్లకు కం టగింపుగా మారే అవకాశం ఉంది. నిజానికి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన బెంగళూరుకు ముఖ్యమంత్రి అని, జనార్దనరెడ్డి బళ్లారిని అదుపు చేస్తారని అనేవారు. జనార్దనరెడ్డి కూడా తాను బళ్లారి ముఖ్యమంత్రి అని చెప్పుకునేవారు. మే 12న జరిగే ఎన్నికలు రెడ్డి, శ్రీరాములు భవితవ్యాన్నే కాదు, రాష్ట్రం దిశ ఏమిటో కూడా చెబుతుంది. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
సిద్దరామయ్య వెర్సస్ శ్రీరాములు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో రసవత్తర పోటీకి తెరలేచింది. అత్యంత వెనుకబడిన బాగలకోట జిల్లాలోని బాదామి నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. చాముండేశ్వరి నియోజకవర్గంలో జేడీ(ఎస్) నుంచి గట్టి పోటీనెదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనకు సేఫ్ జోన్ అని భావించిన బాదామి నుంచి ఎన్నికల బరిలోకి దిగడం, ఆయనను ఎలాగైనా ఓడించడానికి బీజేపీ బి. శ్రీరాముల్ని తమ అభ్యర్థిగా దించడంతో ఈ పోటీ ఎలాంటి మలుపు తిరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకప్పుడు వాతాపి అని పిలుచుకునే బాదామికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. బాదామి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని క్రీ.శ.540 నుంచి 757వరకు పరిపాలించారు. అగస్త్య మహాముని ఈ ప్రాంతంలోనే వాతాపి అనే రాక్షసుడిని మట్టుబెట్టాడని అందుకే దీనికి వాతాపి అన్న పేరు కూడా ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి. సంకుల సమరం బాదామిలో మొదట్నుంచి కుల రాజకీయాలకే ప్రాధాన్యం. అభ్యర్థి కులాన్ని బట్టి ఓట్లు వెయ్యడం ఇక్కడ సర్వసాధారణమని చరిత్ర చెబుతోంది. కురబ సామాజిక వర్గం ఇక్కడ అత్యంత కీలకం. మొత్తం 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కురబలు 55 వేలు వరకు ఉన్నారు. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్దరామయ్య అందుకే బాదామిని సురక్షితంగా భావించి పోటీలోకి దిగారు. బాదామిలో ఎస్టీలు కూడా అత్యధికంగా 36 వేల మంది వరకు ఉండడంతో బీజేపీ వాల్మీకి నాయక (ఎస్టీ) వర్గానికి చెందిన శ్రీరాముల్ని పోటీకి దించింది. ఎస్టీలతో పాటు వీరశైవుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. మరోవైపు జేడీ(ఎస్) లింగాయత్ ఓటర్లను ఆకర్షించడానికి అదే సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు హనుమంత మావిన్మరద అభ్యర్థిత్వాన్ని గత నవంబర్లోనే ప్రకటించింది. అప్పట్నుంచి హనుమంత నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి ఓటర్లలో లింగాయత్‌లు కూడా 45 వేల వరకు ఉండడంతో బాదామిలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఒక వెనుకబడిన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి స్వయంగా పోటీకి దిగడం, సిద్దరామయ్య ప్రవేశపెట్టిన భాగ్య పథకాలు ఆయనను సులభంగా గెలిపిస్తాయనే అంచనాలున్నాయి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిమ్మనకట్టిపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ఆయన విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొని విజయపథంలో దూసుకుపోవడానికి సిద్దరామయ్య తన సామాజిక వర్గానికి చెందిన కురబలపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. మొత్తం ఓటర్లు : 2.5 లక్షలు కురబ : 55,000 లింగాయత్‌లు : 45,000 ఎస్సీలు : 17,000 ఎస్టీలు : 36,000 ముస్లింలు : 25,000 - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం
-
బీజేపీ ఎంపీ శ్రీరాములు నివాసంలో అగ్నిప్రమాదం
ఢిల్లీ : బీజేపీ ఎంపీ బి శ్రీరాములు నివాసంలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎంపీ కుటుంబం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డులోని ఎంపీ నివాసంలో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. ‘తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.’ అని తెలిపారు. కాగా అగ్నిప్రమాదంలో నివాసంలోని ఫర్నిచర్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శాలిగౌరారం ఎస్ఐకి పుత్రికాశోకం
డెంగీ జ్వరంతో కుమార్తె ఉషారాణి మృతి శాలిగౌరారం (తుంగతుర్తి) : శాలిగౌరారం ఎస్ఐ శ్రీరాముల అయోధ్య రెండో కుమార్తె ఆకుల ఉషారాణి(28) డెంగీతో బాధపడుతూ మంగళవారం మృతిచెందింది. నిండు గర్భిణిగా ఉన్న ఉషారాణి హైదరాబాద్‌లో తన తల్లిదండ్రుల వద్ద ఉండగా డెంగీ జ్వరం వచ్చింది. ఆమెను హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం డెంగీ జ్వరం అధికం కావడంతో పాటు ఇన్ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందారు. ఉషారాణి మృతదేహాన్ని ఎస్ఐ స్వగ్రామమైన అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరుకు తరలించారు. బంధువులు, స్నేహితుల సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం ఉషారాణి మృతదేహాన్ని వారి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలికి తరలించారు. బుధవారం కావలిలో ఉషారాణి అంత్యక్రియలు జరుపనున్నట్లు బాధిత కుటింబీకులు తెలిపారు. నివాళులర్పించిన మందుల సామేల్.. శాలిగౌరారం ఎస్ఐ శ్రీరాముల అయోధ్య కుమార్తె ఉషారాణి మృతదేహాన్ని చిర్రగూడూరులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ సందర్శించి.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతమవుతున్న ఎస్ఐ అయోధ్యను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
ఓడీ చెరువు : ఓడీచెరువు మండలం మద్దకవారిపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ శ్రీరాములు (50) కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలూకా మారగానికుంట్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమీప బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మద్దకవారిపల్లికి చెందిన ఆయన మారగానికుంట్ల మీదుగా బెంగళూరుకు బయలు దేరాడు. తెలిసిన వ్యక్తి ద్విచక్రవాహనం రావడంతో శ్రీరాములు వాహనం వెనక కూర్చొన్నాడు. కొంత దూరం వెళ్లగానే వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న శ్రీరాములు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య ప్రమీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొట్ట కూటి కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి పోయాడని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
మరణమూ విడదీయలేదు
శ్రీకాకుళం: అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరం తోడుగా ఉంటామని బాసలు చేసుకున్నారు. జీవన మలి సంధ్య వరకు చేసిన బాసలను నిలబెట్టుకుంటూ ఒకరి కోసం ఒకరు బతికారు. ఆఖరుకు మరణంలోనూ విడిపోకుండా ఒకరి వెంట మరొకరు నడిచారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం ధనుకువాడ గ్రామానికి చెందిన మెండ సావిత్రి(65) బుధవారం వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఆమె మృతితో భర్త శ్రీరాములు(70) విలవిలలాడిపోయారు. తల్లి మరణించిన విషయాన్ని కందుకూరులో ఉంటున్న వారి కుమారుడు విశ్వనాథంకు స్థానికులు తెలియజేశారు. గురువారం ఉదయానికి గ్రామానికి చేరుకుంటానని, అప్పటి వరకు మృతదేహాన్ని ఉంచాలని ఆయన కోరడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే, భార్య మృతి చెందినప్పటి నుంచి ఆమె పార్థివ దేహం పక్కనే ఉన్న భర్త శ్రీరాములు చాలా సేపటి నుంచి కదలకుండా ఉండడం స్థానికులు గమనించారు. ఏమైందని పరిశీలించి చూస్తే ఆయన కూడా తుది శ్వాస విడిచారని వారికి అర్థమైంది. ఈ భార్యాభర్తలు మరణించడంతో ధనుకువాడ గ్రామంలో విషాదం అలముకుంది. వీరికి ఒక కొడుకు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
కామ్రేడ్ శ్రీరాముల అంతిమ యాత్ర
రొద్దం : ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేస్తూ మండల ప్రజల మన్ననలు పొందిన సీఐటీయూ మండల క్యారదర్శి శ్రీరాముల అంతిమయాత్రలో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి మండలంలోని పురవీధుల్లో శనివారం అంతిమ యాత్ర చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి రొద్దం నరసింహులు, మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మినారాయణరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరహరిప్రసాద్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్, నర్సింగరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాంభూపాల్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు హనుమంతరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, జిల్లా కార్యదర్శి వెంకటేశులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు శ్రీరాములు మతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మతుడి కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామన్నారు. -
అక్రమ ఆయుధాల కేసులో ఎంపీకి నోటీసులు
అనంతపురం: అక్రమ ఆయుధాల కోనుగోలు వ్యవహారంలో ఓ ఎంపీకి అనంతపురం జిల్లా పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 20వ తేదీలోపు అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని బళ్లారి (కర్ణాటక) ఎంపీగా కొనసాగుతున్న శ్రీరాములుకు శుక్రవారం పోలీసులు నోటీసులు అందించారు. మూడు రోజుల కిందట అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తుపాకీ కొనుగోలు వ్యవహారం బయటికొచ్చింది. అయితే పట్టుబడ్డ నలుగురూ తాము బళ్లారి ఎంపీ శ్రీరాములు సంబంధీకులమని చెప్పారు. దీంతో ఎంపీని ప్రశ్నించాలని పోలీసులు భావించారు. ఈ మేరకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. -
భద్రత గాలిలోకి.. నిఘా నిద్రలోకి
క్రైం( కడప అర్బన్): జిల్లాలో ప్రజలు ఎక్కడికైనా పనిమీద వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇళ్లకు తాళాలు భద్రంగా వేసినా దొంగ లు ఎంచక్కా వాటిని బద్దలు కొట్టి దర్జాగా దోపిడీలకు పాల్పడుతున్నారు. కనీసం దైవ దర్శనాలకు, బంధువుల వేడుకలకు వెళ్లాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించి వెళ్లాల్సి వస్తోంది. తాళాలు వేసిన ఇళ్లు పదిలంగా ఉంటాయన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. పోలీసు కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి వరకు రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా దొంగలు మాత్రం తమపని ముగించేస్తున్నారు. గత మూడేళ్లలో దోపిడీలు, పగటిపూట దొంగతనాలు తగ్గినా రాత్రి వేళల్లో మాత్రం దొంగలు చెలరేగిపోతున్నారు. పగలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ సంఘటనలు చూస్తుంటే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారా మొద్దు నిద్రలో ఉన్నారా అనే అనుమానం కలుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని దొంగతనాల వివరాలు ఇలా ఉన్నాయి... కడప నగరంలోని వైవీ స్ట్రీట్‌లో నివసిస్తున్న ఫర్నీచర్ వ్యాపారి శ్రీరాములు ఈ నెల 8న తన కుటుంబంతో కలిసి దైవదర్శనం కోసం తిరుమలకు వెళ్లగా అదే రోజు రాత్రి ఆ ఇంటి తాళాలు పగులగొట్టి దాదాపు రూ. 2 లక్షల 80 వేలు నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు, దోచుకెళ్లారు. అదే రోజు కో ఆపరేటివ్ కాలనీ సమీపంలో ఇన్నోవా వాహ నానికి సంబంధించిన టైర్లను దొంగిలించారు. ఎర్రగుంట్లలోని జువారి కాలనీలో ఏడు ఇళ్లను దొంగలు కొల్లగొట్టారు. ఈ సంఘటన ఈ నెల 6న జరిగింది. మొత్తం 80 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి దోచుకెళ్లారు. ఈ నెల 4వ తేదీన ప్రొద్దుటూరు శ్రీరాములపేటలోని ఓ ఇంటి తాళం పగులగొట్టి 17 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి దొంగిలించారు. ఈ నెల 2న ప్రొద్దుటూరులోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి 40 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. -
పీఎస్‌లో ఏఎస్ఐ మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐ శ్రీరాములు గుండెపోటుతో మృతి చెందారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయనకు గత అర్థరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. దాంతో పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి... ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. శ్రీరాములు మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. దీంతో శ్రీరాములు మృతదేహన్ని ఆయన నివాసానికి తరలించారు. శ్రీరాములు మృతి పట్ల ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోకనాథ్ సంతాపం తెలిపారు. -
గురువా.. నీకిది తగునా!
పెద్దపంజాణి: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం పెద్దపంజాణి మండలంలోని రాయలపేట ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం మేరకు.. రాయలపేట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు శ్రీరాములు కొంత కాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఏడాది క్రితం ఈ విషయం గమనించిన ప్రధానోపాధ్యాయుడు అత న్ని మందలించారు. మార్పు రాలేదు. ఆరు నెలలుగా తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించేవాడు. వేధిం పులు భరించలేక ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పాఠశాలకు వెళ్లనని మొండికేసింది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. శనివారం పాఠశాలకు వెళ్లిన గ్రామస్తులు సదరు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని హెచ్ఎం నారాయణ డీఈవో ప్రతాప్‌రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. పెద్దపంజాణి ఎంఈవో వెంకట్రమణ విచారణ చేపట్టారు. అతను వేధింపులకు పాల్పడింది నిజమేనని, అతనికి మరో ముగ్గురు ఉపాధ్యాయులు సహకరించారని విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఎంఈవోకు తెలియజేశారు. ఎంఈవో నివేదిక మేరకు సదరు హిందీ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తూ డీఈవో ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై సోమవారం క్షేత్రస్థాయి విచారణ చేపడతామని, అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు. అదే పాఠ శాలకు చెందిన ఇంగ్లిషు టీచర్ అక్బర్ హుస్సేన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఉపాధ్యాయులకు ఎంఈవో క్లాస్.. పాఠశాలలో ఆరు నెలలుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఉపాధ్యాయులపై ఎంఈవో వెంకట్రమణ మండిపడ్డారు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని హితబోధ చేశారు. -
ఆదాయం పెరిగితేనే అదనపు రైళ్లు
సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు గిద్దలూరు : రైల్వేస్టేషన్ రోజు వారీ ఆదాయం పెరిగితేనే గిద్దలూరు మీదుగా అదనపు రైళ్లను నడపగలమని సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు చెప్పారు. స్థానిక రైల్వేస్టేషన్‌ను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించిన ఆయన.. స్టేషన్‌లోని అన్ని ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. రికార్డులను తనిఖీ చేసి టికెట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తోందని ఆరా తీశారు. అక్టోబర్ నెలలో తక్కువ ఆదాయం రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో రూ.17.60 లక్షల ఆదాయంరాగా, ఈ నెలలో ప్రస్తుతానికి రూ.13.87 లక్షలు వచ్చినట్లు శ్రీరాములు గుర్తించారు. ఇలా ప్రతి నెలా ఆదాయం తగ్గుతుంటే అదనపు బోగీలు, రైళ్లు నడపడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిం చారు. గిద్దలూరు ప్రాంతంలో ఎక్కువ మంది ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారని, గరీభ్థ్ ్రరైలును ఇక్కడ ఆగేలా చర్యలు తీసుకోవాలని విలేకరులు కోరగా కనీసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించేందుకు టికెట్లు అమ్ముడుపోతేనే ఆ రైలును ఇక్కడ ఆపుతామని చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటే అదనపు సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే వారు గిద్దలూరులోనే పూర్తిస్థాయి టిక్కెట్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నడుస్తున్న రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, బోగీలు సిద్ధం కావాల్సి ఉందని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలి పారు. యడవల్లి రైల్వేస్టేషన్లో టిక్కెట్లు ఇచ్చేందుకు చొరవ చూపాలని కోరగా అక్కడ ఎంతమేర ఆదాయం వస్తుందో పరిశీలించి నివేదిక ప్రకారం టిక్కెట్లు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఎక్కువ సమయం పనిచేసేలా చూడాలని, చాలా మంది నంద్యాల వెళ్లి రిజర్వేషన్ చేయించుకుంటున్నారని, రైల్వే విచారణ కోసం ఫోన్ చేస్తే సిబ్బంది ఫోన్ తీసి సమాధానం చెప్పడం లేదని విలేకర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్టేషన్లో గంటకొట్టే వద్ద ఉన్న బూజు, దుమ్మును గమనించిన శ్రీరాములు.. స్టేషన్ మాస్టర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆయనతో పాటు పలువురు టిక్కెట్ కలెక్టర్లు, స్క్వాడ్ అధికారులు ఉన్నారు. -
మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కు చెంప పెట్టు
కంప్లి : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పి బీజేపీకి పట్టం కట్టారని ఎంపీ శ్రీరాములు తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీరాములు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, హర్యాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అవినీతి పాలనపై ప్రజలు కన్నెర్ర చేశారని తెలిపారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పారన్నారు. దేశంలో నరేంద్రమోడీ గాలులు బలంగా వీస్తున్నాయని, వాటిని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు. యూపీఏ హయాంలో ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. అది గ్రహించే ప్రజలు కాంగ్రెస్‌ను తరిమికొడుతున్నారన్నారు. త్వరలో గ్రామ, తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలు రానున్నాయని, బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపినిచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు కేఎస్.భవన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
‘మరుగు’ ఉంటేనే పథకాలు
20 మండలాల్లో ఐపీపీఈ అమలు 476 పంచాయతీలకు ప్రయోజనం ఐదేళ్ల ప్రణాళిక అమలుకు కేంద్రం సిద్ధం డ్వామా పీడీ శ్రీరాములు కంఠారం(కొయ్యూరు) ప్రతి ఇంటా మహిళలు వ్యక్తిగత మరుగుదొడ్లను విధిగా నిర్మించుకుంటేనే, ఆ ఇంటికి సంబంధించి మిగిలిన ఏ అభివృద్ధి పథకానికైనా కేంద్రం నిధులిస్తుందని, లేకుంటే భవిషత్తులో ప్రభుత్వ సాయం అందే అవకాశం లేదని డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములు స్పష్టం చేశారు. మండలంలోని కంఠారంలో నిర్వహించిన సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ 2014-15పై నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రణాళిక అమలుకు జిల్లాలో 20 మండలాలను ఎంపిక చేశారని, ఇందులో మన్యంలోని 11 మండలాలనూ ఎంపిక చేయడం ద్వారా చాలావరకు పేదరిక నిర్మూలన అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 476 పంచాయతీల్లో ఐదేళ్లపాటు ఇది అమలవుతుందన్నారు. అభివృద్ధి పనుల ఎంపిక ఇలా! ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలోనూ మూడు రోజులపాటు సిబ్బంది ఉండి ప్రణాళికలను రూపొందిస్తారని డ్వామా పీడీ శ్రీరాములు తెలిపారు. వాటిని చిత్రాల రూపంలో ఉంచి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. రోడ్లు, భవనాలు, పంట పొలాలకు రోడ్లు లేదా కాలువలు లాంటి వాటిని ప్రణాళికలో పెట్టవచ్చన్నారు. పంచాయతీకి అవసరమైన అన్ని అభివృద్ధి పనులనూ దీనిలో చేర్చవ చ్చన్నారు. వ్యక్తులు, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. బహిరంగ విసర్జన కారణంగా ప్రతి వెయ్యి మందిలోనూ 30 మంది పిల్లలు మరణిస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో చేపట్టాల్సిన పనులను అదనపు పీడీ ఆనందరావు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు గాడిశ్రీరామమూర్తి గ్రామ సమస్యలను వివరించారు. ఎంపీడీవో గోపాలరావు, ఏపీవో పవన్‌కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు మంజే సత్యవతి, సర్పంచ్ గంగాభవాని, గాడి సత్తిబాబు, పైల గంగరాజు, సాంబశివరావు పాల్గొన్నారు. -
అనంతాగ్రహం
‘ప్రకృతి చేస్తున్న ద్రోహం కంటే పాలకుల వంచనతోనే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోంది. 1956లో విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశాం. ఇప్పుడు పాలకుల స్వార్థం వల్ల రాజధాని విజయవాడకు తరలివెళ్లింది. మనకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. ఇంకెంత కాలం ఇలా? అన్నీ కోల్పోయి అనాథలుగా మిగిలిపోవాల్సిందేనా?’ అంటూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన గుంతకల్లు టౌన్: రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు గుంతకల్లు పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉదయాన్నే ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. మధ్యాహ్నం స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడి నుంచి గాంధీచౌక్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, నాయకులు చిరంజీవి, రాము, కిశోర్, పవన్, మురళి తదితరులు పాల్గొన్నారు. కదంతొక్కిన విద్యార్థులు ఉరవకొండ : సీఎం స్వార్థ ప్రయోజనాల కోసమే విజయువాడలో రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారంటూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు గురువారం ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయుం ఎదుట రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయుకులు లాలు, సురేష్, జిలాన్, యుూసఫ్ తదితరులు పాల్గొన్నారు. వీరిని బలవంతంగా పక్కకు నెట్టడానికి పోలీసులు ప్రయుత్నించారు. అరుునా ఆందోళన విరమించకపోవడంతో స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. యూనివర్సిటీ /అనంతపురం టవర్ క్లాక్ : చంద్రబాబు ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించడాన్ని నిరసిస్తూ ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యాన విద్యార్థులు, ఉద్యోగులు గురువారం వర్సిటీ ఎదురుగా అనంతపురం - చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేత జీవీ లింగారెడ్డి మాట్లాడుతూ.. ‘1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై ఐదు రోజుల పాటు చర్చ జరిగింది. ఆనాడు ఓటింగ్‌లో మెజారిటీ శాసనసభ్యుల నిర్ణయం మేరకే రాజధాని ప్రకటన చేశారన్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా చంద్రబాబు నియంత మాదిరిగా అసెంబ్లీలో చర్చ లేకుండానే రాజధానిని ప్రకటించార’ని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో ఒంటెత్తు పోకడలను అవలంబించిన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయిందని, అదే మాదిరిగా వ్యవహరిస్తోన్న టీడీపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఆచార్య ఎన్ఆర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ నది ఒడ్డునే రాజధాని ఉండాలనే నిబంధనేదీ లేదన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరే ఇందుకు తార్కాణమన్నారు. రాజధానిపై ప్రకటనను పునః సమీక్షించుకోవాలని, లేదంటే ఎస్కేయూ వేదికగా గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు మల్లికార్జున, పులిరాజు, క్రాంతికిరణ్, రవి, లాలెప్ప, మోహన్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఎంఏ లక్ష్మణరావు, గోవింద్, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల నిరసన విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ చిరంజీవిరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ ఛార్లెస్ చిరంజీవిరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు నల్ల బ్యాడ్జీలు ధరించి అనంతపురంలోని బళ్లారి బైపాస్ నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం నిర్మించారు. రాజధాని రాయలసీమ హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని చిరంజీవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం ముందస్తుగా భూములు కొనుగోలు చేసిన మంత్రులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని, ఆయన సీమ ద్రోహి అని ‘మన రాయలసీమ’ సంస్థ నాయకుడు జి.నాగరాజు ధ్వజమెత్తారు. రాజధానిపై సీఎం ప్రకటనను నిరసిస్తూ మన రాయలసీమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు దిష్టిబొమ్మతో శవయాత్రగా అక్కడికి చేరుకుని టవర్‌క్లాక్ చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి.. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా బాబు తన నిరంకుశ ధోరణిని వీడలేదని నాగరాజు మండిపడ్డారు. ఐఎన్టీయూసీ నాయకుడు రమణ మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుకు విజయవాడ-గుంటూరు అనుకూలం కాదని చెప్పినా ప్రభుత్వం అక్కడే ఏర్పాటు చేయాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచనన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సమాఖ్య నాయకుడు సాకే నరేష్, మాదిగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు పసులూరి ఓబులేసు, మన సీమ నాయకులు రాంప్రసాద్, నిమ్మల నాగరాజు, రాజమన్నార్, రామ్మూర్తి, కోదండరాం, ఆనంద్, విద్యార్థులు, మాల మహానాడు, దండోరా తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అందరూ బ్యాంకు ఖాతాలు తెరవాలి
బళ్లారి ఎంపీ శ్రీరాములు సాక్షి, బళ్లారి : ప్రధాన మంత్రి నరేంద్ర మో డీ రూ పొందించిన నూతన పథకం ‘జన్- ధన్’ ద్వారా జీరో బ్యాలెన్స్‌తోనే బ్యాంక్‌లో ఖాతాలు తెరవచ్చని, దీన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు పేర్కొన్నారు. స్థానిక అల్లం సుమంగళమ్మ కళాశాలలో జన్-ధన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభిం చిన ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ వినూత్న తరహాలో పథకాలు ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు బీమా కింద ఇస్తుందని గుర్తు చేశారు. ఆడ, మగ అన్న తేడా లేకుండా బ్యాంకు ఖాతా లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బళ్లారి జిల్లాలో ఇంకా బ్యాంకు ఖాతాలు తెరవని వారు ఒక లక్షా 60 వేల మం ది ఉన్నారన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అనిరుద్ద్ శ్రవణ్, జెడ్పీ అధ్యక్షురాలు అనిత, జెడ్పీ సీఈఓ మహమ్మద్ సలాఉద్దీన్, సిండికేట్ బ్యాంకు ప్రముఖులు కుమారగౌడ పాల్గొన్నారు. బ్యాంక్ సేవలు వినియోగించుకోండి దావణగెరె : ప్రజలు జన్ ధన్ ద్వారా ఖాతాను తెరిచి బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లాధికారి ఎస్టీ అంజన్‌కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం నగరంలోని గురుభవనంలో ప్రధాన మంత్రి జన్ ధన్ పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన మాట్లాడారు. జిల్లాలో 193 బ్యాంకులు, 14 డీసీసీ బ్యాంకులు, 6 క్రాస్ కార్డు బ్యాంకులు ఉన్నాయని, ఈ అన్ని సంస్థలు జన్ ధన్ పథకం కింద ఖాతాలు తెరిచేందుకు అనుకూలం కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జన్‌ధన్ పథకం ద్వారా ఖాతాలు ప్రారంభించిన వారికి పాస్‌పుస్తకాలను అందజేశారు. ‘జన్-ధన్’ను సద్వినియోగం చేసుకోండి గంగావతి : ‘జన్-ధన్’ పథకం ద్వారా జీరో అకౌంట్‌తో బ్యాంక్‌లో ఖాతాను ఏర్పాటు చేసుకోవచ్చని, ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీహెచ్ ఏడీబీ బ్యాం క్ మేనేజర్ జనార్ధనరావు సూచించారు. ఈ పథకం ద్వారా ఖాతా ఏర్పాటు చేసుకున్న వారికి గురువారం సాయంత్రం పాసుపుస్తకాలను అందజేసిన ఆయన మాట్లాడారు. ఖాతాలు పొందిన వారు ఆరు నెలల పాటు జమ, ఖర్చు వ్యవహారాలు బ్యాంక్ ద్వారా చేపడితే అనంతరం వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు రుణ సౌకర్యం, రూ. 2 లక్షల ప్రమాద బీమా సదుపాయం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ మేనేజర్ మధుసూధన్‌రావు, గంగావతి డి ప్యూటీ డెరైక్టర్ అనిల్ కుమార్, సిరస్తెదార్ సురాజ్, ఎస్బీహెచ్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ రాఘవేంద్రరావు, బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్య క్షులు ఎస్బీహెచ్ నారాయణరావు పాల్గొన్నారు. -
ఒక్కొక్కరు వంద మందికి గాలం వేయండి
మంత్రి శివకుమార్ బళ్లారి టౌన్ : ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు వంద మంది బీజేపీ కార్యకర్తలకు గాలం వేసి పార్టీలోకి రప్పించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే.శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని రాఘవ కళామందిరంలో వాల్మీకి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో శ్రీరాములు ఒక్కడే వాల్మీకి నాయకుడు కాదన్నారు. మీరంతా మనసు పెడితే మరో పది మంది లీడర్లను తయారు చేసుకోవచ్చన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్వై. గోపాలకృష్ణ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాములు అభివృద్ధి చేసిన దానిపై తాను చర్చించనని, కానీ తనకు నియోజకవర్గం వద్దని రాజీనామా చేసిన తర్వాత మరలా ఆ పార్టీ తరఫున ఎలా అభ్యర్థిని నిలబెట్టారన్నారు. ఎన్వై.హనుమంతప్ప ఆశీస్సుల వల్లే ఆయన ఈ స్థాయికి ఎదిగారన్నారు. ఒకప్పుడు ఆయనను ఇంటి దేవుడిగా కొలిచి నేడు ఆయనపైనే పోటీ చేసి ఓడించే స్థాయికి ఎదిగారన్నారు. తాను ఈ నియోజకవర్గాన్ని ఎన్నికల జరిగేలోగానే ఖాళీ చేస్తామని శ్రీరాములు వ్యాఖ్యనలు చేయడం తగదన్నారు. తాను బళ్లారిలో ఎన్నికల ముగిసేంత వరకు ఉంటానన్నారు. సీఎం సిద్దరామయ్య సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాజీవ్ ఆవాస్ పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 4 లక్షల వరకు ఇవ్వాలని, అందరికీ స్థలాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇది ఎన్నికల హామీ కాదని తమ ప్రభుత్వ ప్రణాళిక అని చెప్పారు. శ్రీరాములు నాడు బీజేపీ నుంచి స్వాభిమానం దెబ్బతినిందని చెప్పి కొత్త పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, సినీ నటి శశికుమార్, ఎమ్మెల్యే అనిల్‌లాడ్, తుకారాం, ఉగ్రప్ప, పార్టీ అభ్యర్థి ఎన్వై.గోపాలకృష్ణ, స్థానిక నేతలు బెస్ట్ రామప్ప, నెట్టి కల్లప్ప, రాంప్రసాద్, జేఎస్.ఆంజినేయులు, వీకే.బసప్ప, హగరి వండ్రి తదితరులు పాల్గొన్నారు. -
అవకాశం వస్తే నాటకాలు వేస్తా : గిరిబాబు
నాంపల్లి: అవకాశం వస్తే నాటకాలు వేసేం దుకు సిద్ధంగా ఉన్నానని సినీనటుడు గిరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో మాధురి ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ అసోసియేషన్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. సినిమాలు, టీవీలు వచ్చాక నాటక రంగం మరుగున పడిందన్నారు. నాటరంగాన్ని అభివృద్ధి చేసేందుకు అం దరూ ముందుకు రావాలన్నారు. తాను నాటక రంగం నుంచే సినిమాల్లోకి వచ్చానన్నారు. అవకాశం వస్తే నాటకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాళ్లపల్లి వేంకట నరసింహారావు పుట్టిన రోజును పురస్కరించుకుని నాటకరంగంలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రతి ఏటా ఒక్కరిని ఎంపిక చేసి నగదు పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారని అన్నారు. ఈ పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి ఎ.విజయలక్ష్మికి అందజేశారు. సభకు అధ్యక్షత వహిం చిన ప్రముఖ రంగస్థల ప్రయోక్త డాక్టర్ చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ మా ధురి ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ అసోసియేషన్‌ను స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత రావి కొండలరావు, సినీ నటులు కాకినాడ శ్యామల, శివపార్వతి, ప్రముఖ కవి దుగ్గిరాల సోమేశ్వరరావు, ప్రముఖులు మొదలి నాగభూషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర మంచి పార్థసారధి రచించిన తల్లా వఝ్జల సుందరం దర్శకత్వంలో రూ పొందించిన ‘వార్నీ! అదా విషయం?’ నాటిక ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. -
శ్రీరాములూ..శ్వేతపత్రం అంటే తెలుసా?
మీరేం అభివృద్ధి పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి కాంగ్రెస్ వల్లే బళ్లారికి స్వేచ్ఛ బీజేపీ అబద్దాల పార్టీ దశలవారీగా హామీలు నెరవేరుస్తున్నాం కాంగ్రెస్‌ను గెలిపిస్తే బళ్లారి రూరల్ సమగ్రాభివృద్ధి ముఖ్యమంత్రి సిద్ధరాయమ్య సాక్షి, బళ్లారి : బళ్లారి జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన బళ్లారి ఎంపీ శ్రీరాములు ముందు శ్వేతపత్రం అంటే ఏమిటో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సూచించారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ఆదివారం ఆయన మోకా గ్రామంలో బహిరంగ సభలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా బళ్లారి గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన శ్రీరాములు వల్లే పదే పదే ఉప ఎన్నికలు వస్తున్నాయన్నారు. అసెంబ్లీలో ఏ ఒక్క రోజూ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించని మీరు గతంలో బళ్లారి నియోజకవర్గానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులోకూడా ఆయన నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. శ్రీరాములు నిలిపిన అభ్యర్థితో అభివృద్ధి జరగదని, తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తాను ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్ర వల్లే బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు నిలిచిపోయినట్లు తెలిపారు. తప్పులు చేసినందుకే గాలి జనార్దనరెడ్డి జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. క్విట్ బీజేపీ, క్విట్ రిపబ్లిక్ ఆఫ్ బళ్లారి అనే పిలుపుతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారని, ఎన్నిక హామీలను దశలవారిగా తీరుస్తున్నామన్నారు. బీజేపీ అపద్దాల పార్టీ అని, ఆపార్టీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. పదే పదే ఉప ఎన్నికలకు కారణమయ్యేవారికి బుద్ధి చెప్పాలన్నారు. తాము కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడటం లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థి ఎన్వై గోపాలకృష్ణ స్థానికేతరుడు కాదని, బళ్లారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ఆయనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారుస్తామని చెప్పారు. కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర, మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం, మంత్రులు డీకే శివకుమార్, పరమేశ్వరనాయక్, శివరాజ్తంగిడిగి, మాజీ మంత్రులు అల్లం వీరభద్రప్ప, దివాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీ కేసీ కొండయ్య, నగర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, ఎమ్మెల్యే అనిల్‌లాడ్, నబీసాబ్, చేనేత వర్గాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డీ.లక్ష్మీనారాయణ, అబ్దుల్ వహాబ్, రాంప్రసాద్, ఉగ్రప్ప, వండ్రీ(వన్నూరప్ప), కాంగ్రెస్ అభ్యర్థిఎన్వై గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేపీఎస్సీ నియామకాల రద్దు మూర్ఖత్వం
బళ్లారి ఎంపీ శ్రీరాములు సాక్షి, బళ్లారి : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌ఎస్) 2011లో నిర్వహించిన పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం మూర్ఖత్వమని బళ్లారి ఎంపీ శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం బళ్లారి తాలూకాలోని సంగనకల్లులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి కేపీఎస్సీలో పాసైతే ఆ పరీక్షలను ఏకంగా రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. 362 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించిన వారు గెజిటెడ్ ఆఫీసర్లుగా నియామకాలు జరుగుతాయని ఆశిస్తే కేబినెట్ సమావేశంలో మొత్తం పరీక్షలను రద్దు చేయడం బాధాకరమన్నారు. ఆ పరీక్షల్లో ఎందరో పేదలు, దళితులు, అగ్రవర్ణాలకు చెందిన నిరుపేద మహిళలు కష్టపడి చదివి పాసయ్యారని, వారందరి జీవితాలను సీఎం నాశనం చేస్తున్నారన్నారు. కేపీఎస్‌సీని స్వయంప్రతిపత్తిగా మార్చాలని రాజకీయ జోక్యం తగదన్నారు. యూపీఎస్సీ మాదిరిగానే కేపీఎస్‌సీని మార్చాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి ఏకంగా పరీక్షలనే రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరుసగా బోరుబావుల్లో పడి చిన్నారులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగా, జెడ్పీ సభ్యుడు రాజశేఖరగౌడ, బీజేపీ నాయకులు రామలింగప్ప పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేసినా ఓబుళేసు గెలుపు తథ్యం కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై. గోపాలకృష్ణ తరుపున సీఎం సిద్ధరామయ్య ఇక్కడ తిష్టవేసి ప్రచారం నిర్వహించినా బీజేపీ అభ్యర్థి ఓబుళేసు గెలువడం ఖాయమని బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు.ఆయన సంగనకల్లు గ్రామంలో ఓబుళేసు తరుపున ఎన్నికల ప్రచారం పాల్గొని,ఇంటింటా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి ఓబుళేసుకు బళ్లారి గ్రామీణ నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయని, తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఓబుళేసు నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకుని, వారికి పనులు చేసి పెట్టారని గుర్తు చేశారు. -
కాంగ్రెస్ టికెట్ కోసం స్థానికేతరుల పోటీ
సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు స్థానికేతరరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెల 21న జరగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఆగస్టు 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. చిత్రదుర్గం మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు శశికుమార్, చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు మాజీ ఎమ్మెల్యే ఎన్వై. గోపాలకృష్ణ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరు స్థానికేతరులే. బళ్లారి గ్రామీణ నియోజకవర్గ టికెట్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని సీఎం సిద్దరామయ్య, కేసీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ల వద్ద తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్వై గోపాలకృష్ణ మొళకాళ్మూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈయన చిత్రదుర్గం మాజీ ఎంపీ, బళ్లారి నుంచి కాంగ్రెస్ తరుపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎన్వై. హనుమంతప్పకు స్వయానా సోదరుడు. ఎన్వై గోపాలకృష్ణతోపాటు సినీ నటుడు, మాజీ ఎంపీ శశికుమార్ కూడా టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలో శ్రీరాములుకు బలమైన క్యాడర్ ఉందని, ఆయన వర్గీయులు ఎవరిని నిలబెట్టినా బీజేపీ సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉంది. అందువల్ల బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ తరుపున పోటీకి నిలబెట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వండ్రీ (వన్నూరప్ప) ఈసారి తనకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. వండ్రీతో పాటు మరో కాంగ్రెస్ నేత రాంప్రసాద్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత, బహిర్గతంగా విభేదాలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఒక వర్గానికి టికెట్ కేటాయిస్తే మరొక వర్గం చెందిన నేతలు మద్ధతు ఇస్తారా? లేదా? అన్నది ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. అయితే లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలా? లేక నాన్‌లోకల్ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కాంగ్రెస్ హైక మాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం
జిల్లా ఇన్చార్జి మంత్రి పరమేశ్వర నాయక్ సాక్షి, బళ్లారి : సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకమని జిల్లా ఇన్చార్జి మంత్రి పరమేశ్వర నాయక్ అన్నారు. ఆదివారం నగరంలోని బీడీఏఏ మైదానంలో మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదికపైకి చేర్చి విలేకరులు కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా జిల్లా అభివృద్ధికి కూడా ప్రజాప్రతినిధులంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా పంచాయతీ కేడీపీ సమావేశంలో ఎంపీ శ్రీరాములు ఎందుకు రాలేదని తాను జెడ్పీ సీఈఓను అడిగానని, అయితే అప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఆయన రాలేకపోయారని తెలిసిందన్నారు. ప్రస్తుతం ఈ వేదికపై శ్రీరాములు కూడా పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. సమాజాభివృద్ధిలో విలేకరుల పాత్ర ఆమోఘమన్నారు. పత్రికలుప్రభుత్వాలను సైతం కూలగొట్టడం తన కళ్లారా చూశానన్నారు. గుండారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పత్రిక ఆయనను ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగేందుకు కారణమైందన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడంలో ఆ పత్రిక పని చేసిందని గుర్తు చేశారు. ఇలా పత్రికలు తలుచుకుంటే ప్రభుత్వాలను సైతం కూలగొడుతాయన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి దాదాపు అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియానే కారణమని పరోక్షంగా విమర్శించారు. ప్రతి రోజు మన దేశంలో నూటికి 70 శాతం మంది ఉదయం మొదలు పేపర్ చూసిన తర్వాతనే దినచర్య ప్రారంభిస్తారన్నారు.ప్రభుత్వ బాధ్యతలను, ప్రజాప్రతినిధుల విధులను ఎప్పుటికప్పుడు గుర్తు చేసేది పత్రికలేనన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, పెండింగ్‌లో ఉన్న పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి వాటిని పరిష్కరించేందుకు పత్రికలు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. రాత్రనక, పగలనక విలేకరులు తమ వృత్తిని కొనసాగిస్తారని కొనియాడారు. విలేకరుల వృత్తి ఎంతో కష్టమైంది విలేకరుల వృత్తి ఎంతో కష్టమైనదని, అయినా సమాజాభివృద్ధి కోసం విలేకరులు ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పుతో ముందుకు వెళుతున్నారని బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు అన్నారు. ఆయన బీడీఏఏ మైదానంలో పాత్రికేయ దినోత్సవంలో మాట్లాడుతూ పత్రికలు నడపడం అంత సులభం కాదన్నారు. అదేవిధంగా విలేకరులుగా పని చేయడం కూడా కత్తి మీద సాములాంటిదన్నారు. రాజకీయ నాయకులకు చుట్టూ కార్యకర్తలు, గన్మెన్లు ఉంటారని, అయితే విలేకరులకు మాత్రం ఎవరూ ఉండరని, అయినా ఒంటరిగానే సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ఎంతో టెన్షన్‌తో పని చేస్తూ వారి కుటుంబాల బాగోగులను కూడా పట్టించుకోరన్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులను సన్మానించారు. తెలుగు, కన్నడ పత్రికలకు చెందిన తిమ్మప్ప చౌదరి, పరుశురాం కలాల్, భీమన్న గజాపుర, పంపాపతి హోతూరు, ఉడెం కృష్ణమూర్తి, ఇమాం గోడేకర్, మంజునాథ్ సాలి తదితరులను సన్మానించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు, విధానపరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగ, ఎమ్మెల్యే అనిల్‌లాడ్, ఉపమేయర్ జయలలిత, బళ్లారి మీడియా క్లబ్ అధ్యక్షుడు మధుసూధన, కార్యదర్శి మంజునాథ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో మళ్లీ రగులుతున్న అసమ్మతి
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని తప్పించాలని డీసీసీ నేతల ఒత్తిడి? సాక్షి, బళ్లారి : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురుకావడంతో ఆ పార్టీ నేతల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. మోడీ ప్రభావంతో బళ్లారి లోక్‌సభ అభ్యర్థి శ్రీరాములు బలమైన నేత కావడంతోనే బీజేపీకి ఘన విజయం లభించిందని పలువురు భావిస్తున్నారు. అయితే బళ్లారి జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్మలాటలు కూడా కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బకు కారణమని ఆ పార్టీలోని నేతలు పేర్కొంటున్నారు. ముందు నుంచి బళ్లారి జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంటూనే ఉంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్ జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న అసమ్మతిని చల్లార్చడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన జిల్లాలో ఒకరిద్దరి మాటలు నమ్ముతూ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పని చేసేది ఒకరైతే, అధికారం చెలాయించేది మరొకరా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించుకుంటున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, కేసీ కొండయ్యల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా బళ్లారి జిల్లాకు ఇద్దరు డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. భౌగోళికంగా దావణగెరె జిల్లాలో ఉన్న హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ రవీంద్ర బళ్లారి జిల్లా గ్రామీణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. బళ్లారి జిల్లా అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జే.ఎస్. ఆంజనేయులు ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారనే పుకార్లు వస్తున్నాయి. అలాగే బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ కూడా అదే బాటలో నడస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయని నేతలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని లోలోన మదనపడుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పరమేశ్వర్ నాయక్‌ను తప్పించకపోతే తాము ఖచ్చితంగా రాజీనామాలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారు ప్రచారం చేశారే కాని కలిసికట్టుగా చేయలేదని కార్యకర్తలు చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడితే ఆ పార్టీ నేతలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన విమర్శలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 15 వేల పై చిలుకు మెజార్టీ లభిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి 24 వేల మెజార్టీ లభించదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క బళ్లారి సిటీ నియోజకవర్గమే కాకుండా సండూరు నియోజకర్గం మినహా మిగిలిన 8 అసెంబ్లీ నియోజవర్గాల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ రావడం గమనార్హం. -
మళ్లీ మినీ సమరం
‘లోక్‌సభ’ బరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ, జేడీఎస్‌ల నుంచి ఒక్కొక్కరు ముందే రాజీనామా చేసిన శ్రీరాములు గెలిచిన వారి స్థానాల్లో ఉప ఎన్నికలు అప్పుడే ఆ స్థానాలకూ అభ్యర్థులు రెడీ జేడీఎస్ నేత కృష్ణప్ప మృతితో గందరగోళం ఆయన గెలిస్తే మళ్లీ తుమకూరు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో, విజేతల జాబితా వెలువడగానే మరో మినీ ఎన్నికల సమరానికి తెర లేవనుంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ. శ్రీరాములు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికల గోదాలో దిగారు. కనుక ఆ స్థానం ఇదివరకే ఖాళీ అయినట్లే. ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే బళ్లారి రూరల్‌ను కలుపుకొని ఏడు స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ, జేడీఎస్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప (శికారిపుర), హెచ్డీ. కుమారస్వామి (రామనగర)లు శివమొగ్గ, చిక్కబళాపురంల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు చెందిన ఏ. మంజు (అరకలగూడు) హాసన, వినయ్ కులకర్ణి (ధార్వాడ) హుబ్లీ-ధార్వాడ, మంత్రి ప్రకాశ్ హుక్కేరి (సదలగ) చిక్కోడి, ఎస్ఎస్. మల్లికార్జున దావణగెరెల నుంచి పోటీ చేశారు. వీరిలో అందరూ గెలుస్తారనే గ్యారంటీ లేకపోయినా, ఇద్దరు లేక ముగ్గురు గెలిచినా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. గెలుపు గ్యారంటీ అనుకుంటున్న అభ్యర్థుల స్థానాల్లో ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేది కూడా నిర్ణయమై పోయిందని చెబుతున్నారు. యడ్యూరప్ప స్థానంలో ఆయన తనయుడు రాఘవేంద్ర, కుమారస్వామి సీటు కోసం ఆయన కుమారుడు నిఖిల్ గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీరాములు స్థానంలో ఆయన సోదరి, ప్రస్తుత ఎంపీ జే. శాంత లేదా రాయచూరు ఎంపీ సన్న ఫక్కీరప్ప పోటీ చేయవచ్చని వినవస్తోంది. మల్లికార్జున్ స్థానానికి ఆయన సోదరుడు బక్కేశ్, ప్రకాశ్ హుక్కేరి సీటు కోసం ఆయన తనయుడు ప్రకాశ్‌లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిస్తే, ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. తుమకూరు నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏ. కృష్ణప్ప బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఒక వేళ ఆయన గెలిచినట్లయితే తుమకూరు లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. -
అతడి వాదానికి ఆలంబన
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్... బడా పారిశ్రామికవేత్తలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఒకటి.ఇంద్ర భవనాలను తలదన్నే ఇళ్ళు.. ఇంటి నుంచి కాలు తీసి కారులో పెట్టడమే తప్ప ఎండ పొడ ఎరుగనివారు ఎందరో అక్కడుంటారు. వ్యాపార లావేదేవీలతో బిజీగా ఉండే ఈ మనుషుల మధ్య సమాజం కోసం ఆలోచించేవారు ఉన్నారనడానికి అతడో ఉదాహరణ. ఎప్పుడూ ఈ ప్రాంతంలో తిరిగేవారికి అతడు సుపరిచితుడే. అప్పుడప్పుడూ వచ్చేవారికి మాత్రం ఆయన చేస్తున్న పని ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. విలాసవంతమైన కార్లలో తిరిగే హోదా ఉన్న ఆ యువకుడు రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తుంటాడు. వాహనదారులను సరైన దారిలో పెడుతూ ట్రాఫిక్ పోలీస్ పాత్ర పోషిస్తాడు. స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తాడు.. నిత్యం సమాజం గురించి ఆలోచించడమే కాదు.. ఆచరణలో చూపించే నాయకుడు. అతడే సురేష్‌రాజు. ‘వాదా’ ఫౌండేషన్ స్థాపకుడు. (వాదా అంటే ‘ప్రమాణం’ అని అర్థం) తాను సంపాదించే రూపాయి సమాజానికి ఉపయోగపడాలని పరితపించే యువకుడు. ఐదేళ్ల క్రితం ఒక్కడితో ప్రారంభమైన ఈ సామాజిక ఉద్యమం ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించింది. ఇందులో ఉన్నవారంతా యువకులే కావడం గమనార్హం. కేవలం ట్రాఫిక్‌పైనే కాకుండా అనాథలు, అన్నార్తులతో పాటు పేద విద్యార్థుల చదువు కోసం, హోంగార్డుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. పీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత నాగరాజు తనయుడు సురేష్‌రాజు లండన్‌లోని లీడ్స్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసి ప్రస్తుతం తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడూ వ్యాపార లావాదేవీలతో బిజీగా ఉండే ఈయన ఐదేళ్ల క్రితం ‘వాదా ఫౌండేషన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యకలాపాలు విస్తరించారు. విద్యాసంస్థల్లో ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమాలు, పాదచారుల హక్కులపై ప్రచారం, ట్రాఫిక్ పోలీసులకు ఆరోగ్య బీమా కల్పించడం వంటి సేవలు చేస్తున్నారు. తన స్నేహితుల సాయంతోను వందల మంది వాలంటీర్లతో తన సేవలను రాష్ట్రమంతా విస్తరించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో ఇరువైపులా ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, ఔటర్ రింగ్‌రోడ్డులో పోలీస్ పెట్రోలింగ్, స్పీడ్‌గన్స్ ఏర్పాటులోనూ ‘వాదా’ సంస్థ విజయం సాధించింది. ఫుట్‌పాత్‌ల ఏర్పాటుకు శపథం ‘ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. టైజం ద్వారా చనిపోయేవారి కంటే ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య దేశంలో వందల రెట్లు ఎక్కువ. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఫుట్‌పాత్ 1.8 మీటర్ల వెడల్పు ఉండాలి. కానీ మన నగరాల్లో చాలాచోట్ల ఫుట్‌పాత్‌లే లేవు. నగరంలో అన్నిచోట్లా పాదచారులు నడవడానికి వీలుండేలా ఫుట్‌పాత్‌లు నిర్మించేవరకు నా జుట్టు కత్తిరించుకోనని ప్రమాణం చేశాను’ అని చెప్పుకొచ్చారు. హోంగార్డుల రక్షణ కోసం... హైదరాబాద్‌లో పనిచేస్తున్న శ్రీరాములు అనే హోంగార్డు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కానీ అతడికి ప్రమాద బీమా లేకపోవడం వల్ల కుటుంబం రోడ్డున పడింది. పోలీసుశాఖ నుంచి నామమాత్రంగానే సాయం అందింది. ఈ ఘటన సురేష్రాజును కదిలించింది. వ్యక్తిగతంగా శ్రీరాములు కుటుంబానికి ఆర్థికసాయం చేయడంతోపాటు, అతని భార్యకు మరలా ఉద్యోగం వచ్చేలా చేశారు. హోంగార్డులకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉండాలని తలచి స్నేహితుల సాయం తీసుకుని కొందరు హోంగార్డులకు బీమా చేయించారు. అందుకయ్యే ఖర్చును భరించారు. పోలీసుశాఖ కోసం పనిచేస్తున్న రాష్ట్రంలోని ప్రతి హోంగార్డుకు ప్రభుత్వమే బీమా చేయించాలని ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ‘మనదేశంలో మొక్కల రక్షణకు, కుక్కల రక్షణకు సొసైటీలు ఉన్నాయి. చివరికి రాళ్ల రక్షణకు ‘రాక్ సొసైటీ కూడా ఉంది. ఈ రాళ్లు మనం నడిచే దారికి అడ్డుపడ్డప్పుడు తొలగించాల్సిందే. కానీ ఇందుకు ఒప్పుకోరు. మనిషి ప్రాణం, జీవితం కన్నా ప్రపంచంలో మరేదీ ఎక్కువ కాదు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అనర్థాలకు కారణం చట్టాలు లేక కాదు.. వాటిని సక్రమంగా ఆచరించకపోవడమే’ అంటారాయన. తాను రోడ్డు మధ్య నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నప్పుడు చూసినవారు ‘ఇతనికి ఇదేం పని’.. అంటూ తక్కువగా చూసినవారు ఇప్పుడు తనతో కలిసి ఉద్యమంలో భాగమయ్యారని ఆనందంగా చెబుతారు సురేష్. తనతో మొదలైన ‘వాదా’ ఉద్యమంలో రాష్ట్రంలో ఎంతోమంది చేరారని, ప్రతి నగరంలోనూ ‘వాదా’ ఉద్యమకారులు ఉన్నారని, తాము చదువుకు దూరమవుతున్న పేద విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాననీ ఆయన చెప్పారు. మెరుగైన సమాజం కోసం సురేష్ లాంటి యువకుడు చేస్తున్న ‘వాదా’ మరింతమందికి స్ఫూర్తినిస్తే అంతకన్నా ఇంకేం కావాలి. - దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి, నానాజీ అంకంరెడ్డి, న్యూస్‌లైన్, హైదరాబాద్ నగరంలో అన్నిచోట్లా నడవడానికి వీలుండేలా ఫుట్‌పాత్‌లు నిర్మించే వరకు జుట్టు కత్తిరించుకోనని సురేష్‌రాజు శపథం పట్టారు. -
నమోను పీఎం చేయాలనే..
బీజేపీలో చేరిన శ్రీరాములు దేశంలో పాలన అస్తవ్యస్తం వంశ పారంపర్య రాజకీయాలను అసహ్యించుకుంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా పలు సేవలు చేశా నా పునరాగమనాన్ని ఎవరూ వ్యతిరేకించ లేదు ఏళ్ల పోరాటాల వల్లే హై-కకు ప్రత్యేక హోదా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీలో చేరినట్లు బీఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, రక్షణ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడాల్సిన అవశ్యకత ఏర్పడిందని చెప్పారు. ఇలాంటి తరుణంలో దేశానికి మోడీ నాయకత్వం అవసరమనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని వివరణ ఇచ్చారు. వంశ పారంపర్య రాజకీయాలను దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే దేశం ముఖ్యం... కనుక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కార్యకర్తలందరూ సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా తాను గతంలో ఎవరూ చేయలేనంతగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని వెల్లడించారు. తాను ఏ సామాజిక వర్గానికో ప్రతినిధిని కానని, అందరూ తన వారేనని అన్నారు. బీజేపీ తనకు బళ్లారి టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేస్తానని తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ సహా పార్టీలోకి తన పునరాగమనాన్ని ఎవరూ వ్యతిరేకించ లేదని చెప్పారు. హైదరాబాద్-కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి నియామకాలు చేపట్టలేదని చెప్పారు. అనేక ఏళ్ల పోరాట ఫలితం వల్లే ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా లభించిందని ఆయన తెలిపారు. సస్పెన్షన్ ఎత్తివేత బళ్లారి ఎంపీ జే. శాంత, రాయచూరు ఎంపీ సన్న ఫక్కీరప్పలపై గతంలో విధించిన సస్పెన్షన్లను ఒకటి, రెండు రోజుల్లో ఎత్తివేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. శ్రీరాములు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలను ప్రవేశ పెట్టారని కొనియాడారు. కాగా బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కొన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ తెలిపారు. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు ఆర్. అశోక్, ఎంపీలు శాంత, సన్న ఫక్కీరప్ప, మొలకాల్మూరు ఎమ్మెల్యే తిప్పేస్వామి, బీదర్ ఎమ్మెల్యే గురుపాదప్ప నాగమారపల్లి ప్రభృతులు పాల్గొన్నారు. -
ఆమోదం
బీజేపీలో బీఎస్ఆర్ సీపీ విలీనం.. కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ప్రజల హితం కోసమే ఈ నిర్ణయం : శ్రీరాములు మోడీని పీఎం చేయడమే లక్ష్యం విలీనం తేదీ ఖరారు కాలేదు పదవుల కోసం బీజేపీలో చేరలేదు అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటా సాక్షి, బళ్లారి : స్వాభిమానం పేరుతో రెండున్నర సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన బీఎస్‌ఆర్‌సీపీ బీజేపీలోకి విలీనం కానుంది. బళ్లారిలో బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ, కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు ఏకగీవంగా తీర్మానించారు. బీఎస్‌ఆర్‌సీపీని బీజేపీలోకి విలీనం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రతినిధి రవీంద్ర రేష్మీ సందేశాన్ని చదివి వినిపించారు. పార్టీ అధినేత బీ.శ్రీరాములు కార్యకర్తలు, నాయకులు చేతులు పెకైత్తి తమ ఆమోదం తెలిపారు. అనంతరం బీ.శ్రీరాములు మాట్లాడుతూ.. దేశ ప్రజల హిత ద ృష్టితో బీఎస్‌ఆర్‌సీపీని బీజేపీలోకి విలీనం చేయడానికి తీర్మానించామన్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి కార్యకర్తలు, నాయకులు ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. అయితే బీజేపీలోకి ఎప్పుడు చేరేది తేదీ ఇంకా ఖరారు కాలేదన్నారు. పదవులకు ఆశపడి తాను బీజేపీలోకి చేరడం లేదన్నారు. యావత్ దేశం నరేంద్ర మోడీ వైపు చూస్తోందని, ఆయనను ప్రధాన మంత్రిని చేయడానికి తాను తిరిగి బీజేపీలోకి చేరుతున్నానని అన్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, అరుణ్‌జైట్లీ తదితర ప్రముఖులందరూ తమను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. తనకు ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి లేదని, అయితే హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. బళ్లారి ఎంపీగా శ్రీరాములు పోటీ : గాలి సోమశేఖరరెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములు పోటీ చేయడం ఖాయమని కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. తామంతా శ్రీరాములు వెంట నడుస్తామని, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని అన్నారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి, శ్రీరాములు కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. సోదరుడు గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. అయితే శ్రీరాములు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. భగవంతుడి కృపతో జూన్ లేదా జూలైలో గాలి జనార్దనరెడ్డి బయటకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఎంపీలు శాంత, సన్న పక్కీరప్ప మాట్లాడుతూ.. యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, విధాన పరిషత్ సభ్యుడు వృత్యుంజయ జినగా, బీఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నేతలు రవీంద్ర రేష్మీ, మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి, మాజీ జెడ్పీ అధ్యక్షురాలు అరుణా తిప్పారెడ్డి, సినీనటి పూజాగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
సొంత గూటికి శ్రీరాములు ..?
సాక్షి, బళ్లారి : బీఎస్ఆర్ సీపీ అధినేత బీ.శ్రీరాములు బీజేపీలోకి చేరనున్నారా..? ఇక్కడి పరిస్థితులు, ఆదివారం కంప్లిలో శ్రీరాములు మాట్లాడిన తీరును బట్టి చూస్తే నిజమే అనిపిస్తోంది. బీజేపీ జాతీయ,రాష్ట్ర నేతలు నుంచి శ్రీరాములును, గాలి వర్గాన్ని బీజేపీలోకి చేర్చుకునేందుకు పచ్చ జెండా ఊపారా? శ్రీరాములు, గాలి శిబిరం కూడా బీజేపీలోకి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారా? పై ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు వెలువడుతున్నాయి. బళ్లారి జిల్లాలో ఏ నలుగురు కలిసినా ఇదే టాపిక్‌పై చర్చించుకుంటున్నారు. ఈ చర్చకు త్వరలో తెరపడనుంది. శ్రీరాములు బీజేపీలోకి చేరేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఎస్‌ఆర్‌సీపీని బీజేపీలోకి విలీనం చేయడం దాదాపు ఖాయమని సంకేతాలు వెలువడుతున్నాయి. 2008 సంవత్సరంలో దక్షిణ భారత దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి యడ్యూరప్పతోపాటు గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు కృషి ఎంతో ఉంది. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా మంత్రిగా ఉన్నప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేసి, అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అ బీజేపీ నుంచి బయటకు వచ్చి బీఎస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేశారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు, యడ్యూరప్ప బీజేపీని వీడటంతో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి ముకుతాడు వేసేందుకు బీజేపీ నుంచి దూరం అయిన ముఖ్య నేతలను తిరిగి ఆ పార్టీ జాతీయ నేతలు ,రాష్ట్ర నేతలు యడ్యూరప్పను బీజేపీలోకి తిరిగి చేర్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కేజేపీని బీజేపీలోకి విలీనం చేయడంతో బీజేపీకి కొండంత బలం చేకూరింది. లింగాయత్ సమాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప బీజేపీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత భయం పుట్టుకుంది. అదే సందర్భంలో మాస్‌లీడర్‌గా గుర్తింపు పొందిన శ్రీరాములు బలమైన వాల్మీకి సమాజానికి చెందిన వాడు. ఆయన బీజేపీలోకి చేరితే గాలి శిబిరం కూడా బీజేపీలోకి చేరుతుంది. దీంతో రాష్ట్ర నేతలు మాజీ సీఎం జగదీష్‌శెట్టర్, ఈశ్వరప్పలు తొలుత పావులు కదిపారు. జాతీయ ఆర్ఎస్ఎస్ సమావేశాలు బళ్లారిలో జరుగుతున్న సమయంలో మాజీ సీఎం జగదీష్‌శెట్టర్ స్వయానా గాలి జనార్దనరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు ఈశ్వరప్ప బళ్లారిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ఆయన స్వయానా శ్రీరాములుతో చర్చలు జరిపి బీజేపీలోకి ఆహ్వానించారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని శ్రీరాములు స్వయంగా కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే శ్రీరాములు కూడా కంప్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీలోకి చేరడం దాదాపు ఖాయమని, కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో శ్రీరాములు , గాలి శిబిరం తిరిగి బీజేపీలోకి చేరడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా బళ్లారిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి ఎంపీ శాంతా, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, మిత్రులు గాలి జనార్దన రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి తదితర పార్టీ నేతలతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో పార్టీ విలీనం గురించి ప్రకటిస్తానని చెప్పడం గమనార్హం. ‘అంబి త్వరలో కోలుకుంటారు’ సాక్షి,బెంగళూరు: శాండిల్‌వుడ్ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్ త్వరలో కోలుకోనున్నారని సింగపూర్‌లోని మౌంట్ఎలిజిబెత్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈమేరకు ఆదివారం అక్కడి ఆస్పత్రి ఒక బులిటెన్ విడుదల చేసింది. శ్వాసకోసం సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను ఉత్తమ చికిత్సకోసం బెంగళూరులోని విక్రం ఆస్పత్రి నుంచి సింగపూర్‌కు తరిలించిన విషయం తెలిసిందే. కోలివుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు గతంలో చికిత్స అందించిన డాక్టర్ శెట్టి నేతృత్వంలోని వైద్య బృందం అంబరీష్‌కు చికిత్స అందిస్తున్నారు. అంబరీష్ వెంట ఆయన భార్య సుమలత, కుమారుడు అభిషేక్ తదితరులు ఉన్నారు. -
స్మగ్లర్ల కోసం ముమ్మరంగా కూంబింగ్
రెల్వేకోడూరురూరల్, న్యూస్‌లైన్: ఎర్రచందనం స్మగ్లర్లకోసం అడవులలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు రాజంపేట సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసరావు తెలిపారు. రైల్వేకోడూరుకు కొత్తగా వచ్చిన 12 మంది ఆర్ముడు పోలీసులకు రైల్వేకోడూరులోని ఫారెస్టు అతిథిగృహంలో సోమవారం ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇటీవల స్మగ్లర్లు ఫారెస్టు అధికారులను కిరాతకంగా చంపారని, వారిని పట్టుకనేందుకు అడవుల్లో జల్లెడ పడుతున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని బలగాలు ఉన్నాయని, సోమవారం కొత్తగా మరో 12 మంది వచ్చారని తెలిపారు. కోడి వెంగమ్మబావి, మెట్లకోన, గంగిశెట్టిబండలు, గుండంపెంట, పాయలబావి, శిలలకోన, బంగ్లాపోడు తదితర ప్రాంతాలలో గస్తీ ముమ్మరంగా సాగుతోందన్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీరాములు పాల్గొన్నారు. -
'యడ్యూరప్ప రాకకు బీజేపీ గ్రీన్ సిగ్నల్'
బళ్లారి: మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప బీజేపీలోకి రావడం నూటికి నూరు పాళ్లు ఖాయమని, ఆయన్ను పార్టీలోకి చేర్పించుకునే విషయంపై బీజేపీ హైకమాండ్ నేతలు అంగీకారం కూడా తెలిపారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. యడ్యూరప్ప కూడా బీజేపీలోకి రావడానికి సుముఖత చూపారని, రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన రాకను స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. యడ్యూరప్ప, శ్రీరాములు పార్టీ నుంచి విడిపోవడంతోనే కాంగ్రెస్‌కు అధికారంలోకి రావడానికి సాధ్యమైందన్నారు. శ్రీరాములును కూడా బీజేపీలోకి పిలిపించుకోవాలని సూచించామని, హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. యడ్యూరప్ప తిరిగి పార్టీలోకి రావడానికి ఎటువంటి డిమాండ్ చేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మేరకు యడ్యూరప్ప కూడా పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడాన్ని యాడ్యూరప్ప స్వాగతించారు. తిరిగి పార్టీలోకి రావడమే తన ఏకైక ఎజెండా అని ఆయన తెలిపారు. గత సంవత్సర కాలం నుంచి యడ్యూరప్ప బీజేపీ నుంచి విడిపోయి కర్ణాటక జనతా పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.