
'యడ్యూరప్ప రాకకు బీజేపీ గ్రీన్ సిగ్నల్'
బళ్లారి: మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప బీజేపీలోకి రావడం నూటికి నూరు పాళ్లు ఖాయమని, ఆయన్ను పార్టీలోకి చేర్పించుకునే విషయంపై బీజేపీ హైకమాండ్ నేతలు అంగీకారం కూడా తెలిపారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. యడ్యూరప్ప కూడా బీజేపీలోకి రావడానికి సుముఖత చూపారని, రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన రాకను స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు.
యడ్యూరప్ప, శ్రీరాములు పార్టీ నుంచి విడిపోవడంతోనే కాంగ్రెస్‌కు అధికారంలోకి రావడానికి సాధ్యమైందన్నారు. శ్రీరాములును కూడా బీజేపీలోకి పిలిపించుకోవాలని సూచించామని, హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. యడ్యూరప్ప తిరిగి పార్టీలోకి రావడానికి ఎటువంటి డిమాండ్ చేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మేరకు యడ్యూరప్ప కూడా పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడాన్ని యాడ్యూరప్ప స్వాగతించారు. తిరిగి పార్టీలోకి రావడమే తన ఏకైక ఎజెండా అని ఆయన తెలిపారు. గత సంవత్సర కాలం నుంచి యడ్యూరప్ప బీజేపీ నుంచి విడిపోయి కర్ణాటక జనతా పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.