నాకు సీఎం కావాలనే ఆశ లేదు..
– లక్షల కోట్ల నిధులు ఏమయ్యాయి?
– అవినీతిలో నంబర్–1 కాంగ్రెస్ సర్కార్
– కేంద్రం నిధులతో రాష్ట్రం సోకులు
– టికెట్ల పంపిణీ బాధ్యత ఆయనదే
– మాజీ సీఎం యడ్యూరప్ప
బళ్లారి: వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు టికెట్ల పంపిణీ విషయం తన చేతుల్లో లేదని మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ విషయాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. మంగళవారం జిల్లాలోని జన సంపర్క అభియానలో పాల్గొనేందుకు వచ్చిన సందర్బంగా స్థానిక ప్రభుత్వ అతిధిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కొందరు లోక్‌సభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు టికెట్లు ఆశిస్తున్నారని, అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా అమిత్ షాదే తుది నిర్ణయమన్నారు.
ఇప్పటికే సర్వేలు చేస్తున్నారని, సర్వే ఆధారంగా టికెట్ల పంపిణీ జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విజయాల గురించి ప్రజలకు తెలుపుతాం. ఒకే అజెండాతో రాష్ట్ర సంక్షేమానికి ఎవరు పాటు పడతారో వారికే ఓటు వేయాలనే నినాదంతో ఎన్నికలకు వెళతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతుకు కూరుకుపోయారని విమర్శించారు. లక్షన్నర కోట్ల మేర అప్పులు చేసిన సీఎం రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో తెలపాలన్నారు.
తాము ఐదేళ్ల అధికార వ్యవధిలో రూ.46 వేల కోట్ల అప్పులు చేయగా, సిద్ధరామయ్య లక్షా 28 వేల 361 కోట్ల మేర అప్పులు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన లక్ష కోట్ల నిధులతో ఎక్కడెక్కడ అభివృద్ధి చేపట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో కేవలం నీటిపారుదల రంగానికి రూ.36 వేలకోట్లతో మాత్రమే పనులు చేపట్టారని ఆవేద వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత నల్లధనం వెలికితీతకు ఎంతో ప్రయత్నం చేశారన్నారు. యుద్దం లేకుండానే పొరుగు దేశం పాకిస్థాన్ గుండెలో దడ పుట్టించారన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దళితుల సంక్షేమానికి బీజేపీ ఎంతో పాటుపడుతోందని, వారి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో జిల్లాలతోపాటు మొత్తం రాష్ట్రంలో 150 కు పైగా స్థానాలలో బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. సీఎం కుర్చీపూ తనకు ఆశ లేదని, అయితే పార్టీని అధికారంలోకి తేవడమే తేన ముఖ్య ఉద్దేశమన్నారు. ఈశ్వరప్పకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అందర కలిసి కట్టుగా అహర్నిశలు పని చేసి బీజేపీని అధికారంలోకి తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.